Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హిందువునని చాటుకుంటున్న మమత

ఎమ్బీయస్‌: హిందువునని చాటుకుంటున్న మమత

బెంగాల్‌లో బిజెపి ఉత్థానం మమతకు బెంగ పుట్టిస్తోంది. 2014 పార్లమెంటు ఎన్నికలలో 17% ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016 అసెంబ్లీ ఎన్నికలలో వెనకబడి 10% తెచ్చుకుంది. కానీ ఏప్రిల్‌ 2 వ వారంలో తూర్పు మేదినీపూర్‌ జిల్లాలోని దక్షిణ కాంథీ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఉపయెన్నిక ఫలితాలు ఆమెను కలవర పెట్టాయి. 2016లో అక్కడ నుంచి 93 వేల పై చిలుకు ఓట్లతో (53.7%) తృణమూల్‌ అభ్యర్థి దివ్యేందు అధికారి నెగ్గాడు. దరిమిలా అతను తామ్లూక్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపయెన్నికలో నెగ్గి, అసెంబ్లీ సీటుకి రాజీనామా చేయడంతో అక్కడ ఉపయెన్నిక అవసరపడింది.

ఏప్రిల్‌ రెండో వారంలో జరిగిన యీ ఈ ఎన్నికలో మళ్లీ తృణమూల్‌ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య  95 వేల ఓట్లతో, అంటే 55.9% ఓట్ల శాతంతో గెలిచారు. మరి చింత ఎందుకంటే - బెంగాల్‌లో తృణమూల్‌, లెఫ్ట్‌, కాంగ్రెసు, ప్రధానంగా వుండేవి. బిజెపికి పెద్దగా చోటు వుండేది కాదు. ముక్కోణపు పోటీల్లో తృణమూల్‌ సులభంగా గెలిచేది. ఇప్పుడు లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పూర్తిగా దెబ్బ తిని పోయి, ఆ ఓట్లు కూడా బిజెపికి బదిలీ అయిపోయి, బిజెపితో ముఖాముఖీ తలపడే పరిస్థితి వచ్చేస్తుందని మమతకు భయంగా వుంది. ఈ దక్షిణ కాంథీ నియోజకవర్గమే తీసుకుంటే 2016లో లెఫ్ట్‌, కాంగ్రెసులు కలిపి నిలబెట్టిన ఉత్తమ్‌ ప్రధాన్‌ అనే సిపిఐ అభ్యర్థికి 34.2% ఓట్లు, అనగా దాదాపు 60 వేల ఓట్లు వచ్చాయి. తాజా ఉపయెన్నికలో మళ్లీ నిలబడితే అతనికి డిపాజిట్టు కూడా దక్కలేదు. 17,423 ఓట్లు (10.21%) మాత్రం వచ్చాయి. లెఫ్ట్‌తో పొత్తు లేకుండా పోటీ చేసిన కాంగ్రెసుకు 2270 (1.33%) ఓట్లు వచ్చాయి.

ఇదే సమయంలో బిజెపి విపరీతంగా లాభపడింది. 2016లో దాని అభ్యర్థి కమలేశ్‌ మిశ్రాకు 15 వేల ఓట్లు అంటే 8.8% వచ్చాయి. తాజా ఉపయెన్నికలో బిజెపి అభ్యర్థి సౌరీంద్ర మోహన్‌ జానాకు దాదాపు 53 వేల ఓట్లు 31% ఓట్ల శాతం వచ్చి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అంటే లెఫ్ట్‌ ఓటర్లు బిజెపికి మారిపోయారన్నమాట. అలా వేసినా తృణమూల్‌ను ఓడించే స్థాయి బిజెపికి రాలేదు. ఈ ఉపయెన్నికలో యీ ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో దాదాపు 25% తేడా వుంది. దీన్ని అధిగమించడం సులభమేమీ కాదు. అయినా తృణమూల్‌కు దిగులెందుకు?

ఈ నియోజకవర్గంలో 2016-2017 మధ్య లెఫ్ట్‌ 24% ఓట్లు పోగొట్టుకుంది, బిజెపి 22% ఓట్లు గెలుచుకుంది. అంటే యించుమించుగా లెఫ్ట్‌ స్థానంలోకి బిజెపి, బిజెపి స్థానంలోకి లెఫ్ట్‌ వచ్చాయన్నమాట. ఈ పరిణామం లెఫ్ట్‌కు యిబ్బందికరంగా వుండడంతో బాటు, తృణమూల్‌కు కూడా యిబ్బందిగా మారింది. ఎందుకంటే లెఫ్ట్‌తో ఎలా పోరాడి గెలవాలో మమతకు బాగా తెలుసు. కానీ బిజెపిది వేరే రకమైన దాడి. అపరిమితమైన నిధులు, దేశంలో కొత్తగా రూపు దిద్దుకుంటున్న హిందూత్వవాదం, మోదీ-అమిత్‌ల దూకుడు దానికి కలిసివచ్చే అంశాలు.

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో 19% మంది ముస్లిములున్నా ఒక్క ముస్లిముకు టిక్కెట్టు యివ్వకుండా హిందువుల ఓట్లను ఏకీకృతం చేసి బిజెపి గెలవగలిగింది. బెంగాల్‌లో 27% మంది ముస్లిము ఓటర్లున్నారు. వారిని లెఫ్ట్‌, తృణమూల్‌ రెండూ చేరదీశాయి. నిజానికి దేశవిభజన తర్వాత బెంగాల్‌లో మతకలహాలు పెద్దగా జరగలదు. కులస్పృహ కూడా బెంగాలీ సమాజంలో తక్కువే. ఇటువంటి చోట బిజెపి హిందూత్వ స్పృహ తెచ్చిపెట్టి మొత్తం హిందూ ఓట్లతో ఎన్నికలు గెలుద్దామని బిజెపి ప్రయత్నిస్తోంది. 

బిజెపికి ప్రస్తుతం వున్నది యిద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. అయినా బెంగాల్‌ ఎలాగైనా గెలవాలని గట్టిగా సంకల్పించింది. గత ఆరేళ్లలో 50 వేలమంది ఆరెస్సెస్‌ స్వయంసేవకులు బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుకుని పోయారట. ఇటీవలే అనేక పట్టణాల్లో రామనవమి, హనుమాన్‌ జయంతి భారీగా నిర్వహించారు. మామూలుగా దుర్గాపూజ, కాళీపూజ మాత్రమే పెద్ద యెత్తున నిర్వహించే బెంగాల్‌కు యిది కొత్త సంగతి. కానీ బిజెపి, ఆరెస్సెస్‌ దాని అనుబంధ సంస్థలు ఆ ర్యాలీలను విజయవంతం చేశాయి. లెఫ్ట్‌ పార్టీల ర్యాలీల కంటె యీ ర్యాలీలకు ఎక్కువ జనం రావడం బిజెపియేతర పార్టీలకు గుబులు పుట్టించింది. ఆ వూరేగింపుల్లో కత్తులు, ధనుర్బాణాలు ప్రదర్శించారు కాబట్టి ఆయుధచట్టం కింద బిజెపి నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టమని మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించింది.

చేతనైతే కేసులు పెట్టుకోండి, అరెస్టు చేయండి అంటూ బిజెపి నాయకులు ధిక్కరించడంతో తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారేమోనన్న భయంతో వెనక్కి తగ్గింది. రామనవమి, హనుమాన్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించమని తన పార్టీ నాయకులకు కూడా చెప్పింది. కలకత్తాలో కట్‌ఔట్లు వెలిశాయి. రాముడు, హనుమంతుడుతో బాటు మమతా బెనర్జీ ఫోటోలు కూడా వేసి ''రామ్‌కా నామ్‌ బద్‌నామ్‌ న కరో'' అనే నినాదం చేర్చారు. 1970లలో హిప్పీలు మత్తుమందు సేవించి 'హరేరామ, హరేకృష్ణ' అని పాడేేవారు. ఆ పేరుతో సినిమా తీసిన దేవ్‌ ఆనంద్‌ తెరపై హిప్పీల నుద్దేశించి కిశోర్‌ కుమార్‌ స్వరంతో 'రామ్‌కా నామ్‌ బద్‌నామ్‌ కరో' అని పాడాడు. దాన్నే మమత బిజెపి అనుయాయులను ఉద్దేశించినట్లుగా పలికినట్లు అనుకోవాలి. హనుమాన్‌ జయంతి నాడు మమత సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌కు శుభాకాంక్షలు తెలిపింది. చివర్లో జై బజరంగబలి అని చేర్చింది కూడా. గతంలో యివేమీ లేవు. 

మమతా బెనర్జీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే బిజెపి ప్రయత్నాలకు పూరి జగన్నాథాలయం పూజారులు కొందరి నుంచి సహకారం అందింది. 2019 నాటికి బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి నవీన్‌ పట్నాయక్‌ను కలిసి మాట్లాడడానికి మమతా బెనర్జీ ఏప్రిల్‌ మూడవ వారంలో మూడు రోజుల ఒడిశా పర్యటన పెట్టుకుంది. ఏప్రిల్‌ 20 న ఒక పావుగంట జరిగిన ఆ సమావేశానికి రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 18 సాయంత్రం జగన్నాథుని గుడికి వెళతానని వెల్లడించగానే శ్రీ జగన్నాథ్‌ సేవాయత్‌ సమ్మిళని సెక్రటరీ ఐన సోమనాథ్‌ కుంతియా అనే పూజారి ఆమె వస్తే 12 వేల మంది పూజారులు అడ్డుకుంటారని ప్రకటించాడు. ''గోమాంస భక్షణపై నిషేధం విధించకూడదని ఆమె చేసిన ప్రకటన చూశాం.

ముస్లిము పండగ రోజుల్లో ఆమె మసీదుల్లో నమాజు చేస్తూండగా గమనించాం. ఆమె గోమాంసం తినే వుండవచ్చని మా అనుమానం. హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేస్తున్న ఆమెను గుడిలోకి రానీయం.'' అని హెచ్చరించాడు. అనేకమంది పార్టీల నాయకులు తాము హిందువులైనా యితర మతాల ప్రార్థనా స్థలాలకు వెళుతూనే వుంటారు. ప్రార్థనలు చేస్తున్నట్లు అభినయిస్తారు. వారెవ్వరికీ లేని యీ హెచ్చరిక తమ నాయకురాలికి యివ్వడంతో తృణమూల్‌ కార్యకర్తలు తప్పుపట్టారు. పూజారుల్లో కొందరు మాత్రం మమతను ఆహ్వానించారు.

ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతాయనే భయంతో పోలీసులు సోమనాథ్‌ను, మరో ముగ్గురు పూజారులను ముందుగానే అరెస్టు చేశారు. అయినా మమత గుడికి వచ్చినపుడు బిజెపి యువవిభాగం - భారతీయ జనతా యువ మోర్చా - నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అంతకు ముందుగానే మమత చెప్పింది - ''ఏం తినాలో ఏం తినకూడదో తేల్చుకునే ఛాయిస్‌ ప్రజల కుంటుంది అని మాత్రమే చెప్పాను. బీఫ్‌ తినమని ప్రచారం చేయలేదు. బిజెపి ఊరికే దాన్ని రాజకీయం చేస్తోంది.'' అని. ఆందోళనకారులను పోలీసులు తరిమివేశారు. స్వయిన్‌ మహాపాత్ర అనే పూజారి వెంట వుండి గుడిలోకి తీసుకుని వెళ్లగా మమత అరగంట సేపు గుడిలోని వుండి వెళ్లారు. 

ఈ సందర్భంగా ఎకె బిశ్వాస్‌ అనే విశ్రాంత ఐయేయస్‌ అధికారి తరతరాలుగా పూరి జగన్నాథాలయ నిర్వాహకులు ఆడిన రాజకీయ క్రీడలను ఒక వ్యాసంలో వివరించారు. మొఘల్‌ల కంటె ముందు పాలించిన ముస్లిము పాలకులు పూరిలో యాత్రికుల పన్ను విధించారు. అక్బర్‌ దాన్ని ఎత్తివేశాడు, షా జహాన్‌ అదే పద్ధతి కొనసాగించాడు. ఔరంగజేబు మళ్లీ విధించాడు. ఆ తర్వాత హిందూ పాలకులైన పీష్వాలు వచ్చారు. వాళ్లూ ఆ పన్ను వసూలు చేశారు. 1803లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరఫున వెల్లస్లీ సైన్యం ఒడిశాపై దండెత్తి కేవలం 14 రోజుల్లో దాన్ని జయించింది.

పూరికి నాలుగు మైళ్ల దూరంలో సైన్యం విడిది చేసి వుండగా పూరి దేవాలయ అర్చక బృందం సైన్యాధికారిని కలిసి ''జగన్నాథుడు ఒక భక్తుడిపై పూని యికపై ఆలయ నిర్వహణ కంపెనీ వారే నిర్వహించాలని ఆదేశించాడు.'' అని విన్నవించారు. కంపెనీ వెంటనే ఆనందంగా అంగీకరించింది. భక్తులను వర్గాలుగా విడగొట్టి తలా రూ.2 నుంచి రూ.10 వరకు రుసుం వసూలు చేసేది. పూజారులు, ప్రత్యక్ష ఆలయ సిబ్బంది మొత్తం 20 వేల మంది జీతాలిచ్చేది, సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని నిర్వహించేది. 

1806-32 సం||ల మధ్య పూరీ ఆలయంపై సగటున ఏటా రూ.1.12 లక్షలు ఆర్జించింది. ఈ పద్ధతి లాభదాయకంగా వుందనుకుని పూజారులతో, ఆలయనిర్వాహకులతో, స్థానిక రాజులతో లాభాలు పంచుకుంటూ వచ్చింది. తిరుపతి, కాశీపూర్‌, సర్కారా, సంబల్‌, గయ వంటి పుణ్యక్షేత్రాల్లో పన్నులు వసూలు చేసి ఏటా 75 వేల పౌండ్లు లాభాన్ని కళ్లచూసేది. టేకారీ మహారాజా ఏలుబడిలో వున్న గయ విష్ణుపాద ఆలయంపై వచ్చిన ఆదాయంలో 10% రాజాకు పంపేది. ఇంగ్లీషువారితో యిలాటి వ్యాపారబంధం ఏర్పడడం చేత పూజారులు వారిని రక్షించాలని చూసేవారు. 1857లో సిపాయి తిరుగుబాటు వచ్చినపుడు విష్ణుపాద ఆలయ పూజారి బృందం గయ జిల్లా మేజిస్ట్రేటు వద్దకు వెళ్లి ''తిరుగుబాటుదారుల నుండి మిమ్మల్ని, మీ జాతివారిని, ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి మేం 3 వేల మంది లాఠీధారులను సమకూరుస్తాం.

'' అని ఆఫర్‌ యిచ్చారు. ఇలా రాజకీయాలు, ఆలయాల బంధం ఎప్పణ్నుంచో కొనసాగుతోంది. బ్రిటిష్‌ గవర్నరు జనరల్‌గా మౌంట్‌బాటెన్‌ వున్నపుడు, అతను పూరి జగన్నాథాలయానికి వెళ్తే పూజారులు అతన్ని ఘనంగా ఆహ్వానించారు. అతనితో బాటు గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా వున్న ఆంబేడ్కర్‌ కూడా వెళితే హరిజనుడని ఆయన్ని మాత్రం లోపలకి రానీయలేదు. మౌంట్‌బాటెన్‌ గోమాంసం తింటాడని పూరీ పూజారులకు తెలియదా? తెలుసు. కానీ అతను అధికారంలో వున్నాడు. అది చాలు వాళ్లకి. మౌంట్‌బాటెన్‌ను ఆహ్వానించినవారి వారసులు యీనాడు మమతా బెనర్జీకి అభ్యంతరం తెలపడమేమిటి? అని వ్యాసకర్త ప్రశ్నించారు. 

మామూలు యీ ప్రజలకు యీ తర్కాలేవీ బుర్ర కెక్కవు కాబట్టి తనేమీ తక్కువ హిందువును కానని నిరూపించుకోవడానికి మమత చాలా ప్రయత్నాలు చేస్తోంది. తను బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినదాన్నని, బాల్యంలో సంస్కృత శ్లోకాలు అభ్యసించానని చెప్పుకుంటోంది. ఇటీవల తన ఉపన్యాసాల్లో ఉర్దూ కవితలకు బదులుగా సంస్కృత శ్లోకాలు ఉటంకిస్తోంది. తమ రాజకీయ సభలకు గతంలోలా ముస్లిము ఇమామ్‌లను ఆహ్వానించడం మానేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ సాధువులను పిలుస్తోంది. తాజాగా ఏప్రిల్‌ 21న సివిల్‌ సర్వీసెస్‌ డేను ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ రామకృష్ణ మిషన్‌ సాధువులను ఆహ్వానించింది. ''హిందూమతం ప్రేమను పంచమంటుంది.

రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి మహనీయులు ఆచరించిన మతమది. నేను అసలైన హిందువును. బిజెపి హిందూమతానికి ఒక మచ్చ.'' అంది. ఓ పక్క బిజెపిని నిందిస్తూ దాన్ని లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ముడివేస్తోంది. ఇద్దరూ కలిసి బెంగాల్‌కు వ్యతిరేకంగా గూడుపుఠాణీ చేస్తున్నారని ఆరోపిస్తోంది. వామపక్షాలను బెంగాలీలో 'బామ్‌(వామ్‌)' అంటారు. 'దిల్లీ నుంచి బామ్‌ను వెంటపెట్టుకుని రామ్‌ వచ్చాడు' అని యీ మధ్య స్లోగన్‌ యిచ్చింది. పైకి యిలా అంటున్నా బిజెపితో యుద్ధానికి వామపక్షాలు తనతో కలిసి రావాలని ఆశిస్తోంది. ఏప్రిల్‌ 21న జరిగిన తమ పార్టీ సమావేశంలో కొందరు నాయకులతో అంతరంగికంగా మాట్లాడుతూ ''బిజెపి, ఆరెస్సెస్‌ ఎదుగుదల ఎంత ప్రమాదకరమో లెఫ్ట్‌ నాయకులు గుర్తిస్తున్నట్లు లేదు.

వారిలో కొందరితో మీకు పరిచయాలు వున్నాయి కదా, మీ నియోజకవర్గాలకు వెళ్లి వారిని కలిసి నచ్చచెప్పండి, మేలుకొలపండి' అందిట. ఎందుకంటే ఆమెకు తెలుసు తృణమూల్‌ అంటే పడని ఓటర్లు చాలామందే వున్నారు. వాళ్లు యిన్నాళ్లూ ప్రత్యామ్నాయంగా లెఫ్ట్‌ పార్టీల వైపు చూశారు. ఇప్పుడు బిజెపి వైపు మళ్లుతారు. అదే విధంగా బిజెపి అంటే పడని ఓటర్లు లెఫ్ట్‌ను వదిలిపెట్టి, తృణమూల్‌వైపే మొగ్గు చూపుతారు. కానీ లెఫ్ట్‌, కాంగ్రెసులు ప్రాధాన్యం కోల్పోయి ముఖాముఖీ పోటీ జరిగితే తృణమూల్‌కు మెజారిటీ తగ్గడం ఖాయం.

(ఫోటోలు - పూరిలో మమత నిరసన ప్రదర్శనలు, ఇన్‌సెట్‌- బెంగాల్‌లో కత్తులతో రామనవమి ప్రదర్శన)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?