Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మాయమైన కేరళ ముస్లిముల గమ్యం..?

ఎమ్బీయస్‌ : మాయమైన కేరళ ముస్లిముల గమ్యం..?

కేరళ నుంచి 21 మంది మే నెలాఖరు నుంచి మిస్సయ్యారని అందరికీ తెలుసు. ఐసిస్‌లో చేరడానికే వెళ్లారని ప్రస్తుతానికి అనుకుంటున్నా, వీళ్ల వ్యవహారం కాస్త వింతగా వుంది. వీళ్లు  ప్రాణాలకు తెగించి ఆత్మాహుతికి పాల్పడే పేద కుటుంబాలకు చెందిన పాత బస్తీ యువకులు కారు. విద్యావంతులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు. పైగా ఈ 21 మందిలో బాలబాలికలున్నారు, ఆరుగురు ఆడవాళ్లున్నారు, వారిలో ముగ్గ్గురు గర్భవతులు కూడా. ఐసిస్‌ ఆడవాళ్లతో ఎలా వ్యవహరిస్తోందో, బానిసలుగా ప్రకటించి ఎలా అమ్మకానికి పెడుతోందో తెలియని అమాయకులు కారు వీరు. ఎంత మతఛాందసం వుంటే మాత్రం అలాటి చోటికి కుటుంబాలతో ఎలా వెళ్లారు? మగవాళ్లు మతయుద్ధాలలో పాల్గొనాలనుకున్నా, తమకేమైనా అయితే కుటుంబసభ్యుల గతి ఏమౌతుందో వాళ్లు ఆలోచించలేదా? పోనీ ఆడవాళ్లు కూడా మతం పేరుతో మమ్మల్ని ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నా, స్వయం నిర్ణయం తీసుకోలేని పిల్లల మాటేమిటి? వారిని బలిచేసే హక్కు తమకుందని వీళ్లెలా అనుకున్నారు? వీరెవరికీ యిప్పటివరకు క్రిమినల్‌ రికార్డు ఏమీ లేకపోవడం చేత పోలీసులు కాని, యిరుగుపొరుగు గాని వీళ్లను శంకించలేదు. అసలు యిప్పటిదాకా ఇస్లాం ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అనుకున్నారు తప్ప కేరళ వైపు ఎవరూ దృష్టి సారించలేదు. మరి కేరళలో ఎందుకిలా జరిగింది?

సౌఫాన్‌ గ్రూపు అనే అమెరికన్‌ ప్రయివేటు యింటెలిజెన్సు సంస్థ 2015 డిసెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఐసిస్‌లో 86 దేశాలకు చెందిన 27-30 వేల మంది విదేశీ  పోరాటయోధులున్నారు. ఇరాక్‌, సిరియాలలో కొంత భాగాన్ని తన అదుపులో పెట్టుకున్న ఐసిస్‌ అఫ్గనిస్తాన్‌లో కూడా కాలూనింది. తమ నాయకుడు ఆబు బకర్‌ అల్‌ బాగ్దాదీని యీ తరం ఖలీఫాగా ప్రకటించి, ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లిముల నుద్దేశించి సోషల్‌ మీడియా ద్వారా, వివిధ భాషల్లో నడిపే ఆన్‌లైన్‌ మ్యాగజైన్ల ద్వారా, బ్లాగుల ద్వారా సందేశాలు పంపుతున్నారు. వాటి సారాంశం ఒక్కటే 'మీరుంటున్న దారుల్‌ కాఫిర్‌, దారుల్‌ హర్బ్‌ (విశ్వాసహీనుల దేశం, యుద్ధోన్మాదుల దేశం) విడిచి పెట్టి యీ దారుల్‌ ఇస్లామ్‌ (ఇస్లాంను పక్కాగా అవలంబించే దేశం)కు వచ్చేయండి.' అని. ఐసిస్‌ సానుభూతపరులైన 15 మంది కేరళ యువకులు 'ముజాహిర్‌' పేర నడుపుతున్న ఆన్‌లైన్‌ మలయాళీ పత్రికలో యిప్పటికే 39 వ్యాసాలు ప్రచురించారు. ఐసిస్‌ అజమాయిషీలో వున్న ప్రాంతం ఎంత పవిత్రంగా వుందో వర్ణిస్తూ కాఫిర్ల దేశాలలో నివసించేవారు యీ ప్రాంతానికి పవిత్రయాత్ర చేసి తీరాలని ఉద్బోధిస్తున్నారు. ఇప్పుడు మాయమైన వారిలా ఎందరు యీ ప్రచారానికి లొంగారో తెలియదు. 

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిములలో ధనికులు తక్కువ, పేదలు ఎక్కువ. పేద వర్గాల్లో చదువు, ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి తక్కువ. కానీ కేరళలో ముస్లిములు ఏ మాత్రం వెనకబడి వుండరు. ఇతర మతస్తులతో సమానంగా చదువుసంధ్యలు, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, వ్యాపారవాణిజ్యాలు - అన్నీ వున్నాయి. ఇతర ప్రాంతాల్లో ముస్లిముల కంటె వారిలో ప్రగతిశీల భావాలు ఎక్కువ. మహిళలకు విద్యావకాశాలు, స్వేచ్ఛ ఎక్కువ. అందుకే సలాఫీ ఉద్యమాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు మార్చుకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన ముహమ్మద్‌ అబ్ద్‌ అల్‌-వహాబ్‌ అనే అరేబియన్‌ పండితుడు కురాన్‌లో రాసినదాన్ని అక్షరాలా పాటిస్తూ శుద్ధ ఇస్లాంకు కట్టుబడి వుండాలని ప్రచారం చేస్తూ సలాఫీ మార్గం ప్రారంభించాడు. కేరళలో 1922లో ముస్లిం ఐక్య సంఘం అనే పేర సంఘం ఏర్పరచి అన్ని రకాల సిద్ధాంతాల ముస్లిముల మధ్య ఐకమత్యాన్ని సాధించే ప్రయత్నాలు చేశారు. దానిలోనే సలాఫీ (ముజాహిద్‌ అని కూడా అంటారు) మార్గాన్ని అవలంబించేవారు కూడా చేరారు. ఈ ఐక్యసంఘటన లోంచి సలాఫీ సంస్థగా 1950లో కేరళ నడ్వత్తుల్‌ ముజాహిదీన్‌ (కెఎన్‌ఎమ్‌) ఏర్పడింది. దాని నాయకులు చాదస్తాలకు కట్టుబడకుండా ముస్లింలలో మూఢనమ్మకాలు పోగొట్టి, ఆధునికత వైపు మళ్లించి, కేరళ హిందూ సమాజానికి అనువుగా మహిళలకు విద్య గరపి, వారికి హక్కులు కూడా కల్పించి ప్రగతిపథంలో నడిపించారు. 

1990లలో కేరళ నుంచి ఉద్యోగాలకై, వ్యాపారాలకై గల్ఫ్‌ వెళ్లిన మలయాళీ ముస్లిము యువకులు అక్కడున్న సలాఫీ ఉద్యమం తీరుతెన్నులు గమనించి, ఆశ్చర్యపడ్డారు. తమ దగ్గర ఆ పేరుతో ఆధునిక ధోరణులు మప్పుతున్నారని గ్రహించి, అసలైన సలాఫీలో వున్న ఛాందసవాదాన్ని యిక్కడెందుకు అమలు చేయరని కెఎన్‌ఎమ్‌ను ప్రశ్నించసాగారు. 2002 వచ్చేసరికి ఆ సంఘాన్ని చీల్చారు. ఆ చీలికకు నాయకుడు జుబైర్‌ మంకాడా అనే ముస్లిం టీచరు. ముస్లిం మెజారిటీ వున్న మళప్పురం జిల్లాలోని నీలాంబుర్‌లో అతను అసలైన సలామీ విధానం అమలు చేసే ఒక సమూహాన్ని (కమ్యూన్‌) 2007లో తయారుచేశాడు. అక్కడున్న వారు 1400 ఏళ్ల క్రితం మహమ్మద్‌ ప్రవక్త జీవించినంత స్వచ్ఛంగా ఇస్లామిక్‌ పద్ధతిలో జీవించే ఏర్పాట్లు వుంటాయి. కానీ భారతదేశం వివిధ మతాలతో, వివిధ రకాల జీవనవిధానాలతో కూడిన సెక్యులర్‌ దేశం. పోనీ ఏదైనా ముస్లిం దేశానికి వెళదామన్నా అనేక ముస్లిము దేశాలు కూడా కురాన్‌ బోధనలకు అనుగుణంగా పాలన సాగించడం లేదు. ఆధునిక పద్ధతులకు అనుగుణంగా మారాయి. అందువలన ఇస్లాంను తూచా తప్పకుండా, ప్రాచీన పద్ధతిలో అవలంబించే ప్రాంతమో, దేశమో కావాలని వారు ఉవ్విళ్లూరారు. యూదులు తమ మతవిధానాలకు అనువుగా ఇజ్రాయేలును రూపొందించుకున్నట్లు, అచ్చమైన ముస్లిముల కోసం మేం ఇస్లామిక్‌ స్టేట్‌ ఏర్పరుస్తున్నాం, రారండి అంటూ ఐసిస్‌ ఇరాక్‌, సిరియాలలోని కొన్ని ప్రాంతాలలో తన రాజ్యాన్ని స్థాపించి, అందర్నీ ఆహ్వానిస్తోంది. ఇప్పుడు కేరళ నుంచి వెళ్లినవారు అలాటి ఆహ్వానానికి స్పందనగానే వెళ్లారు. వాళ్లను యీ భావజాలానికి మళ్లించి, ఐసిస్‌ నడిపేది స్వర్గసీమ అని వాళ్లను నమ్మించిన దెవరు?

అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లా అనే 30 ఏళ్ల యువకుడు అని అనుమానం. అతను ఒమాన్‌లో కొంతకాలం చదువుకుని, తర్వాత కేరళకు తిరిగి వచ్చి పాలాలో కమ్యూనికేషన్‌ ఇంజనీరింగు చేశాడు. అక్కడే అతనికి సోనియా సెబాస్టియన్‌ అనే క్రైస్తవుల అమ్మాయి పరిచయమైంది. ఇతన్ని ప్రేమించి, మతం మార్చుకుని, ఆయీషాగా పేరు మార్చుకుని పెళ్లాడింది. వాళ్లకు రెండేళ్ల కూతురు కూడా. ఈ లోగా రషీద్‌ ఒమాన్‌లో మంచి వుద్యోగం చేసేవాడు. అది వదిలేసి నాలుగేళ్ల క్రితం కేరళకు తిరిగి వచ్చి ఎర్నాకులంలో ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేయసాగాడు. వాళ్ల నాన్న ఓ లక్ష రూపాయలు యిచ్చి వ్యాపారం ఏదైనా చేసుకో అన్నాడు. కానీ యితను ఉద్యోగం వదిలేసి ఎం ఎం అక్బర్‌ అనే ఆయన నడిపే పీస్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ కాసరగోడు జిల్లాలో నిర్వహించే పీస్‌ ఇంటర్నేషనల్‌ స్కూలులో 30 వేల రూ.ల జీతానికి పని చేయసాగాడు. టీచర్లకు తర్ఫీదు యివ్వడం అతని పని. మల్టీ నేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పని చేసిన అనుభవం వున్న అతని భార్య ఆయీషా కూడా తన ఉద్యోగం మానేసి, అదే స్కూల్లో టీచరుగా చేరింది. వాళ్లతో బాటు అదే పీస్‌ ఫౌండేషన్‌లో ఫాతిమా అనే 23 ఏళ్ల అమ్మాయి, షిహాస్‌ అనే 24 ఏళ్ల అబ్బాయి  పనిచేసేవారు. ఈ ఫాతిమా అసలు పేరు నిమిషా. హిందూగా పుట్టింది. డెంటల్‌ కాలేజీలో చదివేది. 2015 నవంబరులో ఆమె కాలేజీ నుంచి మిస్సయిందని తెలిసి ఆమె తల్లి వెళ్లి రషీద్‌ను అడిగితే ''ఆమె ముస్లింగా మతం, పేరు మార్చుకుంది. పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన 31 ఏళ్ల బెక్సన్‌ విన్సెంట్‌ అనే క్రైస్తవుడు ఇస్లాంలోకి మారి తన పేరు ఈసా అని పెట్టుకున్నాడు. అతన్ని పెళ్లాడింది.'' అని చెప్పాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ మిస్సింగ్‌. ఫాతిమా గర్భవతి కూడా. వాళ్లతో బాటు ఈసా సోదరుడు 26 ఏళ్ల బెట్సన్‌ విన్సెంట్‌ (అతనూ మతం మారి ఎహిసా అయ్యాడు), అతని 22 ఏళ్ల భార్య మెరీన్‌ (మతం మార్పిడి కేసే) అలియాస్‌ మిరియం కూడా మిస్సింగే. 

ఈ ఫౌండేషన్‌లో షిహాస్‌ అనే అతను కూడా వున్నాడన్నాను కదా. అతను బెంగుళూరులో బిబిఏ చదివాడు. వెస్టర్న్‌ మ్యూజిక్‌ అన్నా, వాళ్ల జీవనసరళి అన్నా మహా యిష్టం. అయితే మూడేళ్ల క్రితం ముంబయి వెళ్లి వచ్చిన దగ్గర్నుంచి అదంతా మారిపోయింది. తను ఛాందస ముస్లిములా జీవించడమే కాదు, కుటుంబ సభ్యుల్ని కూడా అలా వుండమని ఒత్తిడి చేయసాగాడు.  పీస్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ వారికి మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూంటాడు. అతని భార్య అజ్మాలా స్పీచ్‌ థెరపీలో డిప్లొమా చేసింది. ఆమె క్కూడా యీ సలాఫీ విధానం నచ్చింది. బురఖా వేసుకోసాగింది. ప్రస్తుతం గర్భవతి. షిహాస్‌ తన అన్న డా|| కెపి ఐజాస్‌ను కూడా దీనిలోకి లాక్కుని వచ్చాడు. ఆయనకు 28 ఏళ్లు. చైనాలో మెడిసిన్‌ చదివి, కాసరగోడ్‌ జిల్లాలోని పడన్నా గ్రామంలో ప్రయివేటు ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని భార్య రిఫీలా డెంటిస్టు. ఇద్దరూ కోళికోడ్‌లోని ఓ హాస్పటల్లో కలిసి పనిచేశారు. వీళ్లకు అయాన్‌ అనే రెండేళ్ల కొడుకున్నాడు. ఆమె మళ్లీ గర్భం ధరించింది. వీళ్లంతా కూడా మాయమైన వారిలో జాబితాలో వున్నారు. షిహాస్‌ అన్నతో బాటు అత్తకొడుకును కూడా ఆకర్షించాడు. అతని పేరు అష్ఫాఖ్‌ మజీద్‌. వయసు 25. బికాం చదివి ముంబయిలో హోటల్‌ నడుపుతున్న తండ్రికి సాయపడుతున్నాడు. అతని భార్య శాంసియాకు 23 ఏళ్లు. కోయంబత్తూరు కాలేజీలో మైక్రో బయాలజీ చదివింది. వారికి ఆయీషా అనే 18 నెలల కూతురు వుంది. వీళ్లంతా మాయమయ్యారు.

వీరితో బాటు మాయమైన మరో కాండిడేటు 23 ఏళ్ల హఫీసుద్దీన్‌. అతనిదీ అదే వూరు. తల్లి యిక్కడే వుంటుంది కానీ అతని తండ్రి అబు ధాబిలో 30 ఏళ్లగా ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌ నడుపుతూంటాడు. హఫీసుద్దీన్‌ అక్కడే టెన్త్‌ క్లాస్‌ పాసయ్యాడు. మూడేళ్ల క్రితం కేరళకు తిరిగి వచ్చి ఐజాస్‌తో స్నేహం కలిశాక అతనిలో మార్పు వచ్చింది. ఇక అక్కణ్నుంచి యింటి సభ్యులను అచ్చమైన ముస్లిములుగా బతకమని పోరు పెట్టడం మొదలుపెట్టాడు. అప్పు తీసుకుని కొన్న కారు వాడడం మానేశాడు. ''అప్పుకు వడ్డీ చెల్లిస్తున్నాం, వడ్డీ యివ్వడం, పుచ్చుకోవడం ఇస్లాంకు వ్యతిరేకం.'' అని సమాధానమిచ్చాడు. ''వ్యాపారం కూడా ఇస్లాంకు వ్యతిరేకమే. నువ్వు అదంతా కట్టిపెట్టి, ఆస్తులన్నీ అమ్మేసి, యింటికి వచ్చి ముస్లింగా బతుకు'' అని తండ్రికి, ''మీరు టీవీలో సినిమాలు చూడడం మానేయండి, అవన్నీ 'హరామ్‌' (నిషిద్ధం)'' అని తల్లిని, సోదరిని హెచ్చరించసాగాడు. ఓ సారి టీవీ కేబుల్‌ కత్తిరించేశాడు కూడా. తను ఉద్యోగం, వ్యాపారం వంటి ఏ పనీ చేసేవాడు కాదు. ఇస్లాం పుస్తకాలు ముందేసుకుని చదువుతూ వుండేవాడు. పెళ్లయితే మారతాడేమోననుకుని పొరుగూరికి చెందిన అమ్మాయితో యీ మార్చిలో పెళ్లి చేశారు. పెళ్లి రోజున గడ్డం గీయను, ఖరీదైన బట్టలు తొడగను అన్నాడు. ఇవన్నీ కుర్రచేష్టలు అనుకుని తలిదండ్రులు అన్నిటికీ తల వూపారు. జూన్‌లో కోళికోడ్‌ కెళ్లి కురాన్‌ అధ్యయనం చేస్తానన్నాడు. చివరకు జూన్‌ నెలాఖరు గాయబ్‌ అయిపోయాడు. ''అల్లా దీవెనలతో నేను నా గమ్యాన్ని చేరాను. ఇది భూతలస్వర్గమే. ఇక్కడ వడ్డీ లేదు, పన్ను లేదు, రాజులు లేరు. నన్ను అనుసరించమని నా భార్యను కోరుతున్నాను.దుష్టశక్తులతో పోరాడుతున్న ఐసిస్‌కు తప్పక జయం చేకూరుతుంది.'' అంటూ తల్లికి ఎస్సెమ్సెస్‌ పంపాడు. 

మాయమైన వారందరూ తమ తల్లితండ్రుల నుంచి వాస్తవాలు దాచారు. వేరే వూరు వెళుతున్నామని అబద్ధాలు చెప్పారు. తమ పిల్లల చాదస్తపు పోకడలను సీరియస్‌గా తీసుకోనందుకు తలితండ్రులందరూ బాధపడుతున్నారు. వాళ్లు ఐసిస్‌లో చేరి వుంటే వారి మొహాలు కూడా చూడమని చెప్తున్నారు. తమను చూసి తక్కిన తలితండ్రులు మేల్కోవాలని పిలుపు నిస్తున్నారు. అదే వూళ్లోంచి జూన్‌ 27న మాయమైన ఫిరోజ్‌ ఖాన్‌ తలితండ్రులు వెంటనే మేల్కొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీస్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌లో గతంలో పని చేసిన ఫిరోజ్‌ కూడా ఐసిస్‌ బాటే పట్టి వుంటాడనుకుని, పోలీసులు అతన్ని ఆచూకీ కోసం వెతికారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా అతను ముంబయి శివార్లలో వున్నాడని కనిపెట్టి పట్టేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పీస్‌ ఫౌండేషన్‌పై గట్టి నిఘా వేశారు. మాయమైన 21 మంది ఐసిస్‌లో చేరడానికి వెళ్లారో లేక అల్‌-కైదాకు చెందిన సిరియా విభాగమైన నస్రా ఫ్రంట్‌లో చేరారో తెలియదు. ఏది ఏమైనా పిల్లలు మతఛాందసం వైపు మరలుతూంటే వారిని ఓ కంట కనిపెట్టడం మంచిదని వీరి తలిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?