Advertisement

Advertisement


Home > Articles - MBS

MBS: అబద్ధపు తీగతో నిజాల డొంక కదిల్చిన ఉండవల్లి

MBS: అబద్ధపు తీగతో నిజాల డొంక కదిల్చిన ఉండవల్లి

రాష్ట్రవిభజన జరిగింది అనేది చారిత్రక సత్యం. ఎలా జరిగింది అనేదే చర్చనీయం. పంపకాలు సరిగ్గా జరగలేదన్నది ఒక కోణమైతే, లోకసభలో బిల్లు పాసు కావడంలోనే వైఫల్యం వుందనేది మరో కోణం. ఎన్నడూ లేనట్లుగా తలుపులు మూసేసి, టీవీలు ఆఫ్‌ చేసి, గందరగోళంలో బిల్లు పాస్‌ చేయడం వలన తెలంగాణ ఆవిర్భావ బిల్లు వివాదాస్పదమైంది. దానిపై ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని అందరూ తప్పుపట్టడంతో రాజ్యసభలో చర్చ జరగనిచ్చారు. అక్కడ బిజెపి పట్టుబట్టడంతో ఆంధ్రకు ప్రత్యేక హోదా, ఆర్థికలోటు భర్తీ వంటి హామీలు యివ్వడం జరిగింది. (వాటి అమలు ప్రస్తుతాంశం కాదు) లోకసభలో కూడా యిలాటి చర్చ జరగనిచ్చి వుంటే, యిరు రాష్ట్రాలకు మరిన్ని రక్షణలు లభించేవేమో! విభజన చట్టం లోపభూయిష్టం అని రెండు రాష్ట్రాలవారూ యిప్పుడు అందరూ అంటున్నారు. అడావుడిగా, అస్తవ్యస్తంగా బిల్లు పాస్‌ చేయడం వలన యిప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలు జుట్టూజుట్టూ పట్టుకుని కొట్టుకుంటూనే వున్నాయి. అలాటి బిల్లు ఎందుకు పాస్‌ చేయవలసి వచ్చింది? తక్కిన పార్టీల మాట వదిలేయండి, ప్రధాన పక్షాలైనా కాంగ్రెసు, బిజెపి బిల్లుకు మద్దతు తెలిపాయని అనుకుంటే వాటి సంఖ్య కూడినా సింపుల్‌ మెజారిటీ వచ్చేస్తుంది. మరి అలాటప్పుడు పార్లమెంటులో యింత అకటావికటంగా ప్రవర్తించడం దేనికి? దాన్ని బయటకు లాగడానికి ఉండవల్లి ప్రయత్నించారు. ''విభజన కథ'' అనే పుస్తకం (నేనింకా చదవలేదు) రాసి, తను సాక్షిగా వున్న అనేక విషయాలు రాశారు. వాటితో పాటు 'నేను ఊహించిన ఘట్టం' అంటూ ఒకటి రాశారు. ఈ భాగం కల్పనే అని ముందుగానే ప్రకటించారు.

ఇది కాస్త వింతగా వుంది. చరిత్రను గ్రంథస్తం చేస్తున్నాను అంటూ మధ్యలో కల్పన రాయడం దేనికి? పాత్రికేయులు అన్ని సందర్భాల్లో అన్ని చోట్లా వుండలేరు. జరిగినది ఎవరి ద్వారానో వింటారు. కానీ చెప్పినవారు తమ పేరు బయటపెట్టవద్దని షరతు విధిస్తారు. అందువలన 'అభిజ్ఞవర్గాల భోగట్టా' అనో, 'పేరు చెప్పడానికి యిష్టపడని వ్యక్తి' అనో, 'తెలిసిన సమాచారం ప్రకారం..' అనో రాస్తారు. ఇవేమీ లేకపోయినా చివరిలో ...ట చేరుస్తారు. ఈయన అటువంటి మార్గాలేవీ ఎంచుకోకుండా ఎకాయెకి కల్పన అని రాసేశాడు. ఆ పుస్తకం విడుదలకు ముందు దానిలో కొన్ని భాగాలు ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. అది చదవనివారి కోసం దాని సారాంశాన్ని యిస్తున్నాను - 

'....కమల్‌నాథ్‌ స్పీకరుతో మాట్లాడి బయటకు వచ్చి తెలంగాణ బిల్లు పాస్‌ కావడం కష్టం అనేశారు. వాళ్లు జైపాల్‌ రెడ్డిగారిని లాక్కుని వచ్చారు. ఆయన స్పీకరు చాంబర్‌లో కూర్చుని కమల్‌నాథ్‌, సుష్మా స్వరాజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు. అనుమానాలు నివృత్తి చేశారు. అయితే స్పీకరు సభలో గొడవ జరుగుతూండగా బిల్లు పాసయిందని ప్రకటించడం ఎలా?' అని సందేహించారు. అప్పుడు జైపాల్‌ 'రూల్‌ 367 (3) ప్రకారం డివిజను జరగకుండా బిల్లు ఆమోదించే అధికారం స్పీకరుకి వుంది.' అన్నారు. స్పీకరు మీరా కుమార్‌ 'డివిజన్‌ జరగకపోయినా హెడ్‌ కౌంట్‌ జరగాలి. సభలో గందరగోళం వుండగా నిలబడినవారి సంఖ్య లెక్కించడం ఎలా?' అని స్పీరు అభ్యంతర పెట్టారు. 'అధ్యక్ష స్థానంలో కూర్చుని ఏం చెప్పినా దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అన్ని సవరణలూ అరగంటలో ఫినిష్‌! బిల్లు పాసయిందని ప్రకటించేయండి. అధికారపక్షం మాట్లాడదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఏమిటి అభ్యంతరం?' అని జైపాల్‌ అన్నారు. 'నియమాల గురించి మాట్లాడే మీరు తెలంగాణ వద్దకు వచ్చేసరికి ఎలా మారిపోయారు?' అని సుష్మ, కమల్‌, మీరా ఆశ్చర్యపడ్డారు. 'మొత్తం ప్రక్రియ టీవీ ద్వారా ప్రపంచం చూస్తూండగా, సెక్రటేరియట్‌ స్టాఫ్‌ ప్రతీదీ రికార్డు చేస్తూండగా యిలా బుకాయించడం ఎలా సాధ్యం?' అన్నారామె. 'మీరు అధ్యక్ష స్థానంలో కూర్చోగానే టీవీ ప్రసారాలు ఆగిపోతాయి. టెక్నీషియన్లు రిపేరు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది.' అని జైపాల్‌ హామీ యిచ్చారు.''

2014 ఫిబ్రవరి 18 న గం|| 2.01 ని||లకు, సరిగ్గా విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైన మరుక్షణం లోకసభలో అమర్చిన 3 ఆటోమెటిక్‌ కెమెరాలు ఒకేసారి హఠాత్తుగా ప్రసారం చేయడం మానేశాయి. తలుపులు మూసేశారు. 4.30 కు బిల్లు పాస్‌ అయిందంటూ సభ్యులు బయటకు వచ్చేశారు. ఆ మధ్య లోకసభలో ఏం జరిగిందో చెప్పాలంటూ స.హ.చట్టం కింద అడిగితే మూడు కెమెరాలు ఒకేసారి, హఠాత్తుగా ప్రసారం చేయడానికి వీల్లేకుండా ఆగిపోయాయని, సభ వాయిదా పడ్డాకనే రిపేరు చేయించి సరి చేశామని సమాధానం వచ్చింది. లోపల ఏం జరుగుతోందో లోకానికి తెలియకుండా వుండడానికే టీవీలు ఆపేశారని తెలుస్తోంది. బిల్లు ఓటింగుకి పెట్టారని తెలిసి దాన్ని వ్యతిరేకించే ఎంపీలు బయట వుంటే వాళ్లు లోపలకి రాకుండా తలుపులు మూసేసి వుంటారు. జైపాల్‌ సలహా మేరకే టీవీలాపేసి, తలుపులు మూసేశారని ఉండవల్లి అనగానే జైపాల్‌ చాలా ప్రశ్నలు ఎదుర్కోవచ్చింది. దాంతో ఆయన దాన్ని ఖండించారు. ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్‌లో  రాధాకృష్ణ ఆదివారం సాయంత్రం 7 నుంచి 9.30 వరకు నిర్వహించిన కార్యక్రమంలో మొదట జైపాల్‌ చేత మాట్లాడించి, తర్వాత ఉండవల్లిని లైనులోకి తెచ్చి మాట్లాడించారు. కాస్సేపటికి పొన్నం ప్రభాకర్‌ వచ్చారు. తర్వాత కోదండరాం, వినోద్‌, జితేందర్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో బిల్లు గురించిన విశేషాలేమీ లేవు. ఉండవల్లి తెరపైకి వచ్చేవరకు జైపాల్‌ చాలా ధాటీగానే మాట్లాడారు. తను బిల్లు గురించి తెరవెనుక చాలా చేశానని, కానీ దాని గురించి బయటకు చెప్పుకోలేదని, అలా చెప్పుకునే స్వభావం తనది కాదని, ఉండవల్లి తక్కిన విషయాలన్నీ కరక్టుగానే రాసినా, స్పీకరు చాంబర్‌లో జరిగినట్లుగా రాసినది మాత్రం అబద్ధమని, ఉండవల్లి ఒక నాటకరచయితలా కట్టుకథ అల్లారని చెప్పారు. 

ఉండవల్లి లైనులోకి వచ్చాక జైపాల్‌ స్థయిర్యం చెదిరింది. అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడంలో తబ్బిబ్బు పడడం స్పష్టంగా గోచరించింది. పొన్నం కానీ, మరొకరు కానీ ఉండవల్లి లేవనెత్తిన ఏ అంశాన్నీ ఖండించలేక పోయారు. వీళ్లు ఏదైనా అడిగితే 'ఆ విషయం పుస్తకంలో రాశాను కదా' అంటున్నారు ఉండవల్లి. జరిగినదేమిటంటే ఉండవల్లి పుస్తకాన్ని రాధాకృష్ణతో సహా ఎవరూ చదవలేదు. జైపాల్‌ మాత్రం 'పూర్తిగా చదివానయ్యా, నీ పుణ్యమాని చాలాకాలానికి తెలుగు పుస్తకం చదివా' అంటున్నారు. 'మీ గురించి రాసినదే చదివారు సార్‌, మొత్తమంతా చదివితే యీ ప్రశ్న అడిగేవారు కారు' అంటారు ఉండవల్లి. మొదటగా ఉండవల్లి స్పష్టం చేసిన విషయాలు - 1) విభజన చారిత్రక సత్యం. దాన్ని ఎవరూ తిరగదోడలేరు. 2) పార్లమెంటులో జరిగినదాన్ని సమీక్షించే అధికారం సుప్రీం కోర్టుకి లేదు. మేం సుప్రీం కోర్టులో కేసు వేసినది ఆ అంశంపై కాదు. 3) బిల్లు సరిగ్గా పాస్‌ కాలేదు. సరైన విధానాలు పాటింపబడలేదు. ఈ విషయాన్ని నేను ఎస్టాబ్లిష్‌ చేయదలచుకున్నాను. పాతగాయాలు రేపడానికి కాదు, యిలాటిది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుని దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి! ఇక ఉండవల్లి లేవనెత్తిన సాంకేతిక అంశమేమిటంటే - రూలు 367(3) ప్రకారం బిల్లు పాసు కావడానికి జరగవలసిన హెడ్‌కౌంట్‌ జరగలేదు అని. 

దాని గురించి చెప్పడానికి ముందు తలుపులు మూసేసి, టెలికాస్ట్‌ ఆపేయడంపై చర్చ జరిగింది. ఆ సలహా నేనిచ్చానని ఉండవల్లి రాసినది కల్పన మాత్రమే అంటారు జైపాల్‌. ఉండవల్లి నడిగితే ''కల్పనే అని నేనే రాశాను కదా, అక్కడ ప్రస్తావించిన కట్టెకాడ్‌ అనే పేరుతో వూరే లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఒకవేళ నేను రాసినది నిజమే అయినా అటువంటి దుర్మార్గపు సలహా తనే యిచ్చానని జైపాల్‌ ఒప్పుకోరనీ మీరు గ్రహించాలి. నిజానికి ఆయన స్పీకరు చాంబర్‌కు వెళ్లిన సంగతి నాకు తెలియనే తెలియదు. ఆ ఘట్టం లేకుండానే పుస్తకం రాసేశాక ఆయనంతట ఆయనే 2015లో ఓ మీటింగులో తను స్పీకరు చాంబర్‌కు వెళ్లి ఒప్పించానని చెప్పుకున్నారు. ఇక స్పీకరు పాత్ర గురించి చెప్పాలంటే దిగ్విజయ్‌ సింగ్‌ వరంగల్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ 'మీకు తెలంగాణ యిచ్చినది ఎవరనుకున్నారు, సోనియా, మీరా కుమార్‌.. ' అంటూ పేర్లు చెప్పారు. స్పీకరుది అంపైర్‌ పాత్ర. క్రికెట్‌లో విజయానికి కారకులుగా అంపైర్‌ని కూడా పేర్కొన్నారంటే అతను పక్షపాతం వహించినట్లు అర్థం వస్తుంది కదా (ఇక్కడ జైపాల్‌ కలగచేసుకుని 'అది ఎన్నికల ప్రసంగం, మరీ లోతుగా అర్థాలు తీయకూడదు' అన్నారు). మరి స్పీకరును పక్షపాతంతో వ్యవహరించేందుకు ఒప్పించే నేర్పు జైపాల్‌కు తప్ప వేరెవరికి లేదు కదా అనుకుని ఆ వూహ చేశాను.'' అన్నారు. 

''లేదు, లేదు రూలు 367(3) గురించి స్పీకరుకి చెప్పాను తప్ప, టెలికాస్ట్‌ ఆపేయమని నేను చెప్పలేదు. ఇక తలుపులు మూయడమంటావా, బిల్లు పాస్‌ చేసేటప్పుడు తలుపులు మూయడం సహజమే కదా..'' అన్నారు జైపాల్‌. ''డివిజన్‌ చేసినప్పుడు తలుపులు మూస్తారు కానీ, యీ బిల్లు విషయంలో డివిజను చేయనప్పుడు తలుపులు మూసేయడం దేనికి?'' అని ఉండవల్లి అడిగినపుడు జైపాల్‌ సమాధానం చెప్పలేకపోయారు. ''టెలికాస్ట్‌ ఆపేయమని మీరు చెప్పకపోతే మరి ఎవరు చెప్పారు?'' అని ఉండవల్లి అడగలేదు. అడిగినా జైపాల్‌ ''అది స్పీకరును, ఆవిడ సిబ్బందిని అడగాలి' అని చెప్పి తప్పించుకుంటారు కాబట్టి! ''స్పీకరుకి ఏ రూలు ప్రకారం పార్లమెంటు నడపాలో సలహా లిచ్చే హేమాహేమీలైన సిబ్బంది వుంది, ఆవిడా అనుభవజ్ఞురాలు, కాంగ్రెసు నాయకుడు కమల్‌ నాథ్‌, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్‌ అందరూ పార్లమెంటు వ్యవహారాల్లో కాకలు తీరిన యోధులే. వారెవరికీ తట్టని 367(3) మీ ఒక్కరికే తట్టిందనుకుందాం. ఆ ముక్క చెప్పడానికి గంట పట్టిందా? గంటసేపు మీరక్కడ ఏం చేశారు?'' అని అడిగారు ఉండవల్లి. 

''దానిలో 40 ని||లు సుష్మ, కమల్‌ల మధ్య సయోధ్య కుదర్చడానికే సరిపోయింది.'' అన్నారు జైపాల్‌. 

''ఇద్దరూ తెలంగాణ బిల్లుకు అనుకూలమే అంటున్నారు. రెండు పార్టీల బలాలు కలిపితే మెజారిటీ ఆటోమెటిక్‌గా వచ్చేసింది అంటున్నారు. అలాటప్పుడు సయోధ్య కుదర్చవలసిన అవసరం ఏమొచ్చింది?''

''బిల్లు ప్రవేశపెట్టాక బిజెపి మోసం చేస్తుందని కమల్‌ భయం. కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని సుష్మ భయం. నేను యిద్దరికీ నచ్చచెప్పాను. సభ సజావుగా జరగనప్పుడు ఓటింగు ఎలా చేపట్టాలని స్పీకరు అడిగారు. 15 మందిని సస్పెండ్‌ చేసినా అంతేమంది వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. డివిజన్‌ ఎలా చేపట్టాలి? అని స్పీకరు అడిగారు. అప్పుడు నేను 367(3) ప్రకారం డివిజన్‌ అక్కర లేకుండా హెడ్‌కౌంట్‌తో బిల్లు పాస్‌ చేయవచ్చని, గతంలో ఉదాహరణ ఒకటి వుందని మీరాకు చెప్పాను. సుష్మ, కమల్‌ లాగే మీరాకు కూడా నా మీద గౌరవం వుండడం చేత నా మాట మన్నించింది.'' అన్నారు జైపాల్‌.

367(3) గురించి ఉండవల్లి వివరణ ఏమిటంటే - మామూలుగా ఎవరైనా ఒక్క సభ్యుడు డివిజన్‌ కోసం అడిగినా డివిజన్‌ ప్రకారం ఓట్లు లెక్కించాలి. అయితే అతను ఫ్రివోలస్‌ రీజన్‌ (పనికిమాలిన కారణం)తో డివిజన్‌ అడుగుతున్నాడని స్పీకరుకి తోస్తే అప్పుడు అది తోసిరాజని హెడ్‌కౌంట్‌తో సరిపెట్టవచ్చు. 1956లో కాంగ్రెసుకు బ్రూటల్‌ మెజారిటీ వుండే రోజుల్లో, 14 మంది సభ్యులు మాత్రమే వున్న ఒక పార్టీ ఎంపీ ఏదో బిల్లుపై డివిజన్‌ అడిగితే 'ప్రతిపక్షాలన్నీ కలిపినా కాంగ్రెసుకున్న ఓట్ల కంటె చాలా తక్కువ కదా' అంటూ స్పీకరు హెడ్‌కౌంట్‌తో కానిచ్చేశారట. ఇప్పుడు ఆ అధికారంతో వ్యవహరించేందుకు మీరా కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. బాగానే వుంది. కానీ యీ బిల్లు విషయంలో సౌగతా రాయ్‌ డివిజన్‌ కోసం అడిగినప్పుడు దాన్ని ఏ విధంగా ఫ్రివోలస్‌ అంటారని ఉండవల్లి ప్రశ్న. ఆయన చెప్పేదాని ప్రకారం ఆ రోజు బిల్లు పాస్‌ అయ్యేటంత మెజారిటీ కాంగ్రెసు, బిజెపిలకు లేదు. పార్లమెంటు అటెండెన్సు రిజిస్టరు తీసుకుని ఎవరెవరు వచ్చారు, వారిలో ఎవరు బిల్లుకు అనుకూలం, ఎవరు ప్రతికూలం అని లెక్కలు వేస్తే బిల్లుకు చాలినంత మంది సమర్థకులు లేరని తేలుతుందని, పార్లమెంటు రికార్డుల్లోంచి ఆ వివరాలన్నీ తీసుకుని పుస్తకంలో రాశానని, కావాలంటే ఛాలెంజ్‌ చేయవచ్చనీ ఉండవల్లి అంటారు. ఆ విషయంపై జైపాల్‌ వద్ద కానీ, పొన్నం వద్ద కానీ సమాధానం లేదు. నేను రికార్డులు చూడలేదని జైపాల్‌ చెప్పుకున్నారు. పొన్నం అసలు ఆ మాటే ఎత్తకుండా ఉండవల్లిని ఆంధ్రలో కాంగ్రెసు బాగు చేసుకోమంటూ ఎత్తిపొడవసాగారు. తెలంగాణ బిల్లు కోసం ఏళ్ల తరబడి కృషి చేసిన వీళ్లిద్దరూ బిల్లుకు అనుకూలంగా ఎందరు ఓటేశారు, ఎవరు వేయలేదు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు అనేది కూడా పట్టించుకోలేదంటే వింతగానే వుంది.

ఉండవల్లి వాదన ప్రకారం ఆ రోజు లోకసభకు 354 మంది ఎంపీలు వచ్చారు. వారిలో కొందరు బిల్లుకు వ్యతిరేకులు. బిల్లు పెట్టామని చెప్పుకుంటున్న కాంగ్రెసు నుంచి 29 మంది, సమర్థించామని చెప్పుకున్న బిజెపి నుంచి 34 మంది సభకు రాలేదు. ఆ రోజు బిల్లు పాస్‌ అయ్యే ఛాన్సే లేదు. ఇటువంటి సున్నితమైన బాలన్సు వున్నపుడు డివిజన్‌ కోరిన సౌగతా రాయ్‌ అభ్యర్థిన ఫ్రివోలస్‌ ఎలా అవుతుంది? స్పీకరు ఒప్పుకుని వుండాల్సింది. ఒప్పుకోకపోవడం ఆవిడ యిష్టం. అయితే కనీసం హెడ్‌కౌంట్‌ చేసి వుండాలి. అది కూడా జరగలేదు అని ఉండవల్లి వాదించారు. 

'హెడ్‌ కౌంట్‌ జరిగింది. బిల్లును వ్యతిరేకించిన ఆడ్వాణీ కూడా పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ బిల్లుకు సమర్థనగా లేచి నిల్చున్నారు' అంటారు జైపాల్‌. 'మీరూ మేమూ బిల్లుకు సమర్థన తెలిపాక హెడ్‌కౌంట్‌ అక్కరనే లేదు అన్నారు సుష్మ' అని పొన్నం మొదట్లో అనేశారు. తర్వాత నాలిక కరుచుకుని 'జరిగింది, జరిగింది, నేనే ప్రత్యేక సాక్షిని. నువ్వు పార్లమెంటు బయట వున్నావు. నీకేం తెలుసు?' అని ఉండవల్లిపై విరుచుకు పడ్డారు. 'పార్లమెంటు రికార్డును ఎడ్‌ వెర్బేటమ్‌ (చెప్పినది చెప్పినట్లుగా) పుస్తకంలో రాశాను, చూసుకోండి' అంటారు ఉండవల్లి. 'నువ్వేం రాస్తే నాకెందుకు? హెడ్‌కౌంట్‌ జరిగింది' అంటూ పొన్నం మొండివాదన మొదలెట్టారు. ఇక ఆయన్ని వదిలేయవచ్చు. జైపాల్‌ మెత్తమెత్తగానే 'రికార్డులో ఏం రాశారో కానీ, హెడ్‌కౌంట్‌ జరిగింది, జరిగింది' అని అనసాగారు.

'హెడ్‌కౌంట్‌ ఎలా సాధ్యపడింది? మేం 79 మంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. ప్రవేశపెట్టడానికి 50 మంది వుంటే చాలు. కావాలంటే లెక్క పెట్టుకోండి అన్నా స్పీకరు సభ డిజార్డరులో వుంది, యీ గలభాలో ఎలా లెక్కపెట్టుకోగలను అంటూ ఆవిడ అనేకసార్లు నిరాకరించారు. 79 మందిని లెక్కపెట్టలేనివారు, ఆ రోజు మాత్రం 236 మందిని లెక్కించడం ఎలా సాధ్యపడింది?' అని ఉండవల్లి అడిగారు. 'ఇలా' అని జైపాల్‌, పొన్నం చెప్పలేకపోయారు. 'జరిగింది, జరిగింది' అని చిలకలా పదేపదే వల్లించారు. జైపాల్‌ 'వ్యక్తిగతంగా బిల్లును వ్యతిరేకించిన ఆడ్వాణీ లేచి నిలబడ్డారు, అది చూశాను.' అని చేర్చారు. 

ఆడ్వాణీ లేచి నిలబడి వుండవచ్చు. కానీ వందలాది మందిని ఎలా లెక్కించగలిగారు? అన్న ప్రశ్నకి వాళ్ల దగ్గర సమాధానమే లేదు. దీన్ని ప్రేక్షకుల మెదళ్లలో బాగా ఎక్కించగలిగారు ఉండవల్లి. ఆ తర్వాత 'హెడ్‌కౌంట్‌ జరిగిందని మీరంటున్నారు. కానీ సవరణలు ప్రతిపాదించిన ఒవైసీ 'హెడ్‌కౌంట్‌ చేయండి, చేయండి' అని కోరిన సంగతి రికార్డయింది కదా. హెడ్‌కౌంట్‌ జరిగి వుంటే ఆయన ఎందుకు అడుగుతాడు?' అని యింకో ప్రశ్న లేవనెత్తారు. దానికి మళ్లీ సమాధానం లేదు. 'ఒవైసీ చెప్పినది నేను వినలేదు, అంతా గందరగోళంగా వుంది, ఏమీ వినబడలేదు' అన్నారు జైపాల్‌. 'అదే నేను చెప్పేదీ, అంత గందరగోళంలో హెడ్‌కౌంట్‌ ఎలా సాధ్యం?' అన్నారు ఉండవల్లి మళ్లీ. 'జరిగింది, జరిగింది' అన్నారు జైపాల్‌ మళ్లీ. కాస్త ఆగి 'ఒవైసీ ప్రతిపాదించినది సవరణలు కదా. ఒరిజినల్‌ బిల్లుకు మాత్రం హెడ్‌కౌంట్‌ జరిగింది.' అన్నారు.

అక్కడ యిక్కడ ఒక విషయం స్పష్టమైంది. బిల్లు ప్రతిపాదన జరిగినప్పుడు హెడ్‌కౌంట్‌ జరిగినట్లు నమోదు చేసినా, సవరణలప్పుడు హెడ్‌కౌంట్‌ కూడా జరగలేదు - అని. ఆ ముక్క జైపాల్‌ అన్నట్లుగా నేను వినలేదు కానీ ఆంధ్రజ్యోతి 26 09 16 సంచికలో యీ చర్చకు అక్షరరూపం యిస్తూ 'తెలంగాణ రుణం తీర్చుకున్నాం' అనే శీర్షిక కింద యిచ్చిన వార్త లో '...సవరణలకు ఓటింగ్‌ కాలేదు. కానీ బిల్లుకు ప్రారంభంలో ఓటింగ్‌ జరిగింది.' అని ఆయన అన్నట్లు రాశారు. ఉండవల్లి మాట్లాడుతూ 'నువ్వు హెడ్‌కౌంట్‌ చేయనక్కరలేదమ్మా, చేసినట్లు నటించు సరిపోతుంది అని మీరు మీరాకు సలహా యిచ్చారు. మొదట్లో అలా చేశారు, తర్వాత అదీ మానేశారు..' అని కూడా అన్నారు. 

మొత్తానికి బిల్లు సవరణలపై - డివిజన్‌ కాదు, హెడ్‌కౌంట్‌ కాదు, ఏ విధమైన ఓటింగు - జరగలేదు అన్న విషయం ఎస్టాబ్లిష్‌ అయింది. అలాటప్పుడు ఆ సవరణలను బిల్లులో చేర్చవచ్చా, లేదా? చేరిస్తే రాజ్యాంగానికి విరుద్ధమా, బిల్లు సక్రమంగా పాస్‌ అయినట్లా కాదా అనే విషయం నాకు తెలియదు. ఉండవల్లి పుస్తకంలో వుందేమో కూడా తెలియదు.

ఏది ఏమైనా సవరణలపై ఓటింగు జరగలేదన్న విషయాన్ని ఉండవల్లి జైపాల్‌ చేత ఒప్పించారు. దీనికి ఉండవల్లి వాడిన అస్త్రం - కల్పన! పోలీసు యింటరాగేషన్‌లో చూడండి 'నువ్వు ఎడం చేత్తో కత్తితో పొడిచావని కళ్లతో చూసిన సాక్షులున్నారు' అని పోలీసు అంటే నేరస్తుడు 'అలా ఎలా చెప్తారండి, నేను కత్తే వాడలేదు, పైగా నాది కుడిచేతి వాటం..' అని దొరికిపోతాడు. అలా ఉండవల్లి 'బిల్లు విషయంలో హెడ్‌కౌంట్‌ కూడా జరగలేదు' అని మొదలుపెడితే జైపాల్‌ చర్చ ముగింపు వచ్చేసరికి '...ప్రారంభంలో జరిగింది కానీ సవరణలకు జరగలేదు' అని చెప్పేశారు. పోలీసు విషయంలో బుకాయింపు అయితే ఉండవల్లి విషయంలో 'నేను వూహించా, కల్పించా' అని చెప్పుకునే లక్ష్యం సాధించారు. 

'గోల్‌మాల్‌ చేయవలసిన అవసరం ఏముంది మాకు? ప్రధాన పక్షాలైన కాంగ్రెసు, బిజెపిలు రెండూ ఒప్పుకున్నాక...' అని తెలంగాణ నాయకులు అనవచ్చు కానీ ఆ నాటి పరిస్థితి అలా లేదన్నమాట సుస్పష్టం. అంత మెజారిటీయే వుంటే అవేళే, అంత గందరగోళ పరిస్థితుల్లో ఎందుకు చేయవలసి వచ్చింది అని ఉండవల్లి కానీ, మరొకరు కానీ అడిగినప్పుడు సమాధానం రానే రాదు. పైగా రాజ్యసభలో చర్చ జరిగింది. సవరణలు ప్రతిపాదించారు. మళ్లీ లోకసభకు పంపి ఆ సవరణలను చట్టంలో చేర్చి మళ్లీ తెప్పించుకోవాల్సి వుంది. కానీ  వెనక్కి లోకసభకు పంపితే యీ సారి బిల్లు వీగిపోతుందని భయపడ్డారు. అందుకే ప్రత్యేక హోదా వంటి అంశాలు ప్రధాని హామీతో సరిపెట్టేశారు. అవి చట్టంలో పెట్టి వుండాల్సింది అని యిప్పుడు సాగదీస్తున్నారు. అవన్నీ చేర్చి లోకసభకు తిప్పి పంపితే అది అక్కడే మురిగిపోయేది. ఇది కాదనలేని సత్యం.  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?