Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : అమిత్‌ షా వైఫల్యం

ఎమ్బీయస్‌ : అమిత్‌ షా వైఫల్యం

పలు రాష్ట్రాలలో జరిగిన ఉపయెన్నికల ఫలితాలు వచ్చాయి . 3 పార్లమెంటు స్థానాలలోనూ యథాతథ స్థితి కొనసాగింది. వాటి గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. అసెంబ్లీ స్థానాల విషయంలోనే అంచనాలు తారుమారయ్యాయి. మొన్న పార్లమెంటు ఎన్నికలలో వీచిన మోదీ హవా యిప్పుడు కానరాలేదు. ఆ మాటకొస్తే మే కు, సెప్టెంబరుకు మధ్య జరిగిన ఉపయెన్నికలలోనూ కానరాలేదు. అయితే యీ సారి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో మోదీ సొంత రాష్ట్రం, అమిత్‌ షా అద్భుతాలు చేశాడని చెప్పుకుంటున్న యుపి వుండడంతో యీ ఫలితాలు ఉలిక్కిపడేట్లు చేశాయి. ఈ రోజు సాయంత్రం మోదీ ప్రధాని అయ్యాక మొదటిసారి గుజరాత్‌ వెళుతున్నారు. విదేశీ ప్రముఖులను ఆహ్వానించబోతున్నారు. రేపు ఆయన పుట్టినరోజు కూడా. ఇలాటి పరిస్థితుల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో 3 బిజెపి నియోజకవర్గాలను క్షీణథలో వున్న కాంగ్రెసు ఎగరేసుకుని పోయిందంటే ఎంత బాధాకరం! మోదీకాని, అమిత్‌ కాని యీ పరిణామం వూహించి వుండరు. ఉంటే యివాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వుండేవారు. దేశవ్యాప్తంగా చావుదెబ్బ తిని, ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెసు, జాతీయ స్థాయిలోనే కాదు, గుజరాత్‌లో సైతం సరైన నాయకత్వం లేని కాంగ్రెసు - ప్రధానిగా మోదీ వెలిగిపోతున్న యీ తరుణంలో, అధికార పార్టీ, ప్రభుత్వం గుజరాతీ నాయకుల గుప్పిట్లో వున్న యీ సమయంలో అక్కడి ఉపయెన్నికలలో మూడో వంతు సీట్లు గెలుచుకోవడమంటే ఎంత యిబ్బందికరం! తప్పంతా ఆనందిబెన్‌దే అనడం అన్యాయం. ఆవిడ స్థానంలో మోదీ వున్నా ఫలితాలు యిలాగే వుండేవేమో! మహా అయితే బిజెపికి 6 బదులు 7 వచ్చేవేమో! ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీకి గతంలో కంటె తక్కువ సీట్లు వచ్చిన మాట మనం మర్చిపోకూడదు. అప్పుడూ కాంగ్రెసు పరిస్థితి యింత అధ్వాన్నంగానూ వుండింది.

ఇక యుపి అయితే మరీ ఘోరం! 11 సీట్లలో బిజెపి 3 గెలిస్తే సమాజ్‌వాదీ 8 గెలిచింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో అమిత్‌ షా ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని క్షాళన చేశాడని, పార్టీని తృణమూలాల నుండి బలోపేతం చేశాడని, చెత్తాచెదారం ఏరి పారేశాడని, పార్టీ యంత్రాంగంలో జవసత్త్వాలు నింపాడని.. చాలా కథనాలు వచ్చాయి. నాతో సహా అందరం నమ్మాం. కానీ యీ ఫలితాలు చూశాక అంత సీను లేదని అర్థమైంది. బ్రహ్మాండమైన శక్తిగా రూపొందించి వుంటే నాలుగు నెలల్లోనే యింత దారుణంగా కూలిపోయి 7 సీట్లు ఎస్పీకి ధారపోసి వుండదు. ఈ నాలుగు నెలల్లో ఎస్పీ పాలనాపరంగా విపరీతంగా పేరు తెచ్చేసుకుంది కాబట్టి, బిజెపి ఏమీ చేయలేకపోయింది అనుకోవడానికి లేదు. రోజూ పేపర్లో ఎస్పీ వ్యతిరేక వార్తలే! అక్కడ అసలు పాలనే లేదని, అరాచకమే ఏలుతోందని మీడియా కోడై కూసింది. తీరా చూస్తే ఎస్పీ పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాక, 7 ఎసెంబ్లీ సీట్లు బిజెపి నుండి గుంజుకుని 8 తెచ్చుకోగలిగింది. బియస్పీ రంగంలో లేదు కాబట్టి, వారి ఓట్లు బిజెపికి కాకుండా ఎస్పీకి పడ్డాయి కాబట్టే యిలాటి ఫలితం వచ్చిందన్నది నిర్వివాదాంశం. జనరల్‌ ఎలక్షన్స్‌ నాటికి కచ్చితంగా యిదే పరిస్థితి వుండదు. త్రికోణపు పోటీ వుంటే బిజెపికి మరి కొన్ని సీట్లు రావచ్చు. అది నివారించడానికి ఎస్పీ, బియస్పీ చేతులు కలిపితే...? అబ్బే, అసాధ్యం! అని కొట్టి పారేయలేం. బిహార్‌లో లాలూ, నితీశ్‌ చేతులు కలిపి బిజెపిని కంగు తినిపించలేదా! యుపిలో బిజెపిని కట్టడి చేయడానికి ఎస్పీ, బియస్పీ ఒకప్పటి మైత్రీబంధాన్ని పునరుద్ధరించినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఎమర్జన్సీ తర్వాత ఇందిరా గాంధీకి అడ్డుకట్ట వేయడానికి సోషలిస్టు పార్టీ తనకు సిద్ధాంతరీత్యా చుక్కెదురైన జనసంఘ్‌ (బిజెపి పూర్వరూపం)తో చేతులు కలిపి జనతా పార్టీగా ఏర్పడింది. కాంగ్రెసు అంటేనే మండిపడే చరణ్‌ సింగ్‌, పుట్టు కాంగ్రెస్‌ వాదులైన మొరార్జీ దేశాయ్‌తో, జగ్జీవన్‌రామ్‌తో, బహుగుణతో చేతులు కలిపారు. ఉనికికే ముప్పు వచ్చిన వేళ వీళ్లు సిద్ధాంతాలు గాలికి వదిలేస్తారు.

బిజెపి పాలిత రాజస్థాన్‌లో ఫలితం మరీ దారుణంగా వచ్చింది. 4 సీట్లకు ఉపయెన్నికలు జరిగితే కాంగ్రెసు 3 బిజెపి స్థానాలను ఎగరేసుకుని పోయింది. అక్కడా కాంగ్రెసు పార్టీ నాయకత్వం బలహీనంగా వుంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అంతలోనే యింత మార్పా? ఈ నాలుగు నెలల్లో వసుంధరా రాజె చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలూ ఏమీ లేవే! మరి దీని భావమేమి? మెదక్‌ పార్లమెంటు ఉపఎన్నికలో కాంగ్రెసు రెండో స్థానంలో వుండగా, బిజెపి దాని కంటె 30 వేల ఓట్లు తక్కువ తెచ్చుకుని మూడో స్థానంలో వుండడం కూడా పార్టీకి అనుకూలంగా లేదు. తెలంగాణ కాంగ్రెసు అంతఃకలహాలతో కొట్టుమిట్టులాడుతూండగా, తెలంగాణ బిజెపి కలిసికట్టుగానే వుంది. తెలంగాణ బిజెపి నాయకులకు మోదీ గవర్నరు పదవి, కమిటీలలో పార్టీలో ముఖ్యమైన పదవి యిచ్చినా యిదీ పరిస్థితి. బిజెపికి ఊరట కలిగించే అంశం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో అడుగు పెట్టడం. తక్కువ మార్జిన్‌తోనైనా తృణమూల్‌ను ఓడించి, ఒక సీటు కైవసం చేసుకుంది. 

ఈ ఫలితాలు ఏం చెప్తున్నాయి? ఒకటి - పార్లమెంటు ఎన్నికలో మోదీ విజయం వన్‌టైమ్‌ ఎఫయిర్‌. ఆ విజయంలో సింహభాగం మోదీదే కానీ బిజెపిది కాదు. సేనాపతి కబంధహస్తాల్లో యిరుక్కుపోయిన చవటరాజులా మన్‌మోహన్‌ సింగ్‌ కనబడడం చేత, దేశాన్ని పాలించవలసినవాడు మొనగాడై వుండాలని దేశప్రజలు గాఢంగా వాంఛించిన కారణంగా మొండిమనిషిగా కనిపించిన మోదీకి ఓట్ల వర్షం కురిసింది. యువత, మధ్యతరగతి అంతా అతని వెంట నిలిచారు. సంకీర్ణ ప్రభుత్వమైతే మన్‌మోహన్‌లా రాజీ పడే అవసరం పడుతుందన్న భయంతో మోదీ నాయకత్వంలోని పార్టీకి ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఆ విజయం చూసి మురిసిన బిజెపి పార్టీ, దాని అభిమానులు మన పార్టీ విధానాలను ప్రజలంతా ఆమోదించేశారని అనుకుని తమ పాత హిందూత్వ విధానాలను బయటకు తీసి, ఉపయెన్నికలలో భంగపడ్డారు. ఈ భంగపాటుకు బాధ్యత వహించవలసినది పార్టీ అధ్యకక్షుడైన అమిత్‌ షా. మోదీ, అతనూ కలిసి పార్టీలో వేరే ఎవరికీ వాయిస్‌ లేకుండా చేశారు. వాజపేయి మార్కు ఉదారవిధానాలను పాతర వేసి, ఆడ్వాణీ వంటి పాత నాయకత్వాన్ని అటకెక్కించి, కులతత్వాన్ని ఎదిరించడానికి మతతత్వమే సరైన ఆయుధమని ఎంచి, దానితోనే ముందుకు పోవాలని చూశారు. హిందీ, హిందూత్వలను జోరుగా అమలు చేయబోయారు. అవి ఉత్తరభారతంలోనే పారలేదు. దక్షిణాన, తూర్పున అస్సలు పారవు. ఇప్పటికే తమిళనాడులో బిజెపి భాగస్వామ్య పక్షాలు హిందీని రుద్దడంపై మండిపడుతున్నాయి. బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో ప్రతీ అంగుళం కక్షుణ్ణంగా తెలుసుకున్న అమిత్‌ షా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచార సారథిగా నియమించి పార్టీని ముంచాడు. పార్లమెంటు ఎన్నికలలో అమిత్‌ కూడా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా బిజెపికి (..సారీ మోదీకి) ఓట్లు రావడంతో అదే విధానాన్ని ఆదిత్యనాథ్‌ ద్వారా కొనసాగించాడు. ఇప్పుడు ఆ విధానం చీదేసింది. అప్పుడు మోదీ వెనుక నిలిచిన యువత, యిప్పుడు ఎస్పీకి ఓటేసింది. 'లవ్‌ జిహాద్‌' అంటూ బిజెపి నాయకులు చేసిన హంగామా హిందూ ఓటర్లను భయపెట్టలేదు. ఇప్పుడు విశ్లేషకులు యోగి ఆదిత్యనాథ్‌నే తప్పుపడుతున్నారు. ఆయన మాత్రం 'నన్ను పూర్తిగా తిరగనీయలేదు, లేకపోతేనా..' అంటున్నాడు. పూర్తిగా తిరిగి వుంటే ఆ మూడు సీట్లు కూడా రాకుండా పోయేవేమో తెలియదు. 

ఈ ఉపయెన్నికలు మోదీ 100 రోజుల పాలనపై రిఫరెండం అనడానికి లేదు. ఇది కేంద్రవిధానాలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ఎన్నికలు కావు. విధానాల పరంగా ఎన్‌డిఏ, యుపిఏ పద్ధతులనే అవలంబిస్తోంది. కాపిటలిస్టులను, బహుళజాతి సంస్థలను నెత్తిన పెట్టుకుంటోంది. సామర్థ్యం విషయంలో తేడా వుండవచ్చు. మోదీ తప్ప తక్కిన మంత్రులెవరూ హైలైట్‌ కావటం లేదు. ఎటు చూసినా మోదీయే కనబడుతున్నారు. మంచైనా, చెడైనా ఆయనకే ఆపాదించాలి. ఇప్పటిదాకా పెద్దగా పొడిచేసినదీ లేదు, మరీ పాడు చేసినదీ లేదు. అవి చేస్తాం, యివి చేస్తాం అన్న ప్రకటనల కేముంది, అవన్నీ జరిగాకనే సమీక్షించుకోవాలి. ఈ ఎన్నికలు బిజెపి పార్టీ విధానాలపై తీర్పు వంటివి. వాజపేయి తరహా ఇన్‌క్లూజివ్‌ పాలిటిక్స్‌ (అన్ని వర్గాలనూ కలుపుకుని పోయే రాజకీయాలు) అభిలషణీయం తప్ప, వర్గీకరణలు మంచివి కావని ఓటరు బుద్ధి చెప్పినట్లయింది. తమకు ఎదురు లేదని, ఏం చేసినా ప్రజలు ఆమోదిస్తారని బిజెపి భావిస్తే పొరబాటని తేలింది. 

జాతీయ స్థాయిలో కూలబడినా ప్రాంతీయ స్థాయిలో కాంగ్రెసు బలం నశించలేదని చెప్పాలి. 32 సీట్లలో 7 సీట్లు గెలవడం సాధారణ విషయం కాదు, వాటిల్లో 3 గుజరాత్‌లో...! ఆంధ్రలో టిడిపి తన స్థానాన్ని నిలుపుకుంది. వైకాపా పోటీ చేయకుండా పరువు కాచుకుంది. కాంగ్రెసు పోటీ చేసినా 20% ఓట్లు తెచ్చుకుంది. ఆంధ్రలో కాంగ్రెసు వున్న పరిస్థితికి అది ఎక్కువ కాదూ!? టిడిపి విజయాన్ని బిజెపి తన ఖాతాలో వేసుకోలేదు. బిజెపి మరీ దూకుడుగా వెళితే ప్రతిపక్షాలు చేతులు కలిపి దాని ఆట కట్టించగలవని బిహార్‌, యుపి ఉపయెన్నికలు చెప్పాయి. భాగస్వామ్య పక్షాలతో కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కూడా బిజెపి గ్రహించాలి. ఇప్పటివరకు మహారాష్ట్రలో శివసేన కూటమిలో ద్వితీయస్థానంలో వుంటూ దాని కంటె తక్కువ సీట్లు తీసుకుంటూ వచ్చిన బిజెపి పార్లమెంటు ఎన్నికల తర్వాత తన బలం పెరిగిందంటూ శివసేనతో సమానంగా సీట్లు అడిగింది. ఇదిగో, యీ ఫలితాలు చూపించి 'ఆ హవా మోదీని ప్రధాని చేయడంతో ఆవిరై పోయింది. మీ పార్టీ బలం యింతే సుమా!' అని శివసేన వాదించబోతోంది. ఈ ఫలితాలు అమిత్‌ షా దూకుడుకి అడ్డుకట్ట వేస్తాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వంలో సర్వం తానై మోదీ వ్యవహరిస్తూండగా, పార్టీలో సర్వం తానై అమిత్‌ అమితాధికారాలు చెలాయిస్తున్నాడు. ఇతర నాయకులందరూ తగ్గి వున్నారు. ఫలితాలు అనుకూలంగా వచ్చి వుంటే మరింత తగ్గేవారు. ఇలా వచ్చాయి కాబట్టి ధిక్కరిస్తారు. ఇది ప్రత్యక్షంగా అమిత్‌ను, పరోక్షంగా మోదీని బాధిస్తుంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?