Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కీర్తిశేషులు బాలమురళీకృష్ణ

ఎమ్బీయస్‌: కీర్తిశేషులు బాలమురళీకృష్ణ

బాలమురళీకృష్ణగారు ఇవాళ (2016 నవంబరు 22) వెళ్లిపోయారు. కర్ణాటక సంగీతంలో శిఖరసమానుడైన మహానుభావుడు. చైల్డ్‌ ప్రాడిజీ. బాల్యంలో మేధావిగా వున్న చాలామంది  పెద్దయ్యాక ప్రతిభ కనబర్చడం మానేస్తారు. కానీ ఆయన చివరిదాకా జీనియస్‌గానే వున్నారు. ఆయన గాయకుడే కాదు, వాద్యకారుడు, సంగీతకారుడు, గేయరచయిత కూడా. కొత్తరాగాలు సృష్టించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు.

సాధారణంగా పండితులు జనసామాన్యానికి దూరంగా, కొంతమందికి మాత్రమే నచ్చేట్లా వుంటారు. కానీ యీయన ఆకాశవాణి ద్వారా లలితసంగీతాన్ని జనసామాన్యంలో తీసుకెళ్లారు. విజయవాడ, మద్రాసు, హైదరాబాదు కేంద్రాలలో సంగీత శాఖలో ప్రొడ్యూసర్‌గా పనిచేసి 1950, 60 దశకాల్లో దేవులపల్లి, అడవి బాపిరాజు, బసవరాజు, వింజమూరి శివరామారావు, సినారె, దాశరథి వంటి ఎందరో కవులు రాసిన లలిత గీతాలకు, సంగీత నాటికలకు, రూపకాలకు సంగీతాన్ని సమకూర్చారు. కొన్నిటిని ఆయనే పాడారు. తక్కినవి యితరులచే పాడించారు.

ప్రతిభావంతులలో అహంకారం, యితర కళాకారుల పట్ల అసూయ వుంటూండడం చూస్తాం. కానీ బాలమురళి అనేకమంది ప్రతిభామూర్తులతో కలిసి పనిచేశారు. ఎవరితోనూ తగవులు పడలేదు. ఎంతోమందికి తన విద్య పంచారు. దశాబ్దాలుగా ప్రజలను అలరిస్తున్న మోస్ట్‌ పాప్యులర్‌ కార్యక్రమం ''భక్తిరంజని''ని మొదలుపెట్టింది ఆయనే. 

మనకాలం నాటి వాగ్గేయకారుడు ఎవరంటే బాలమురళీ పేరే ప్రథమంగా తడుతుంది. ఆయన కీర్తనలు, వర్ణాలు, జావళీలు, తిల్లానాలు, లలిత గీతాలు రాశారు. తెలుగునాటే కాదు, తమిళనాట కూడా - ఆ మాట కొస్తే అక్కడే ఎక్కువ - ప్రసిద్ధులు. తెలుగునాట తనకు రావలసినంత పేరు రాలేదన్న కినుక కూడా ఆయన కుంది.

ఎన్టీయార్‌ ఆస్థాన పదవులు రద్దు చేసినపుడు ఆయనకు తిక్కకోపం వచ్చి తెలుగునాట యికపై కచ్చేరీలు చేయనని ప్రకటించారు. కొన్నాళ్లకు కెవి రమణాచారి గారు చాకచక్యంగా యిద్దరి మధ్య మాటలు కలిపి, ఎన్టీయార్‌ చేత ఆయనను ఆహ్వానించేట్లా చేశారు. అంతే బాలమురళి తన ప్రతిజ్ఞ మర్చిపోయారు. ఆయన సుదీర్ఘజీవితంలో ఎన్నో సన్మానాలు, ఎవార్డులు పొందారు. హిందూస్తానీ సంగీతానికై భీమ్‌సేన్‌ జోషికి 'భారతరత్న' ఇచ్చారు కాబట్టి, కర్ణాటక సంగీతంలో తనకూ యిస్తారని అభిమానులతో బాటు ఆయనా ఆశించారు. కానీ అది నెరవేరలేదు. పద్మవిభూషణ్‌ యిచ్చి సరిపెట్టారు. మరణానంతరం యిస్తారేమో చూడాలి. 

శాస్త్రీయ సంగీతకారులకు సినిమాపై చిన్నచూపు వుంటూంటుంది. కానీ బాలమురళికి సినిమాలంటే మోజుంది. పాడడమే కాదు, నటించాలని కూడా సరదా. అది కూడా రకరకాల వేషాలు వేయాలనుకున్నారు. కానీ సంగీత విద్వాంసుడి వేషాలే ఎక్కువ వచ్చాయి. దాంతో విసుగేసింది. సినిమా పరిశ్రమ తనను సరిగ్గా వుపయోగించుకోలేదన్న బాధా ఆయనకు వుండేది. డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి 80 ఏళ్లు నిండిన సందర్భంగా కొందరు పెద్దలు ఆయన పేర అభినందన సమితి అని ఏర్పడి 2010లో ''మధుమురళి'' అనే పేర ఒక సంచిక వెలువరించారు.

ఎచ్‌ఎస్‌వికె రంగారావుగారు ఎడిటరుగా, వరప్రసాద్‌ (శాంతా బయోటెక్నిక్స్‌) చైర్మన్‌గా వ్యవహరించారు. 43 మందితో ఏర్పడిన ఎడిటోరియల్‌ బోర్డులో నేనూ ఒకణ్ని. నిజానికి చాకిరీ చేసినదంతా ఎన్‌వి రమణయ్య (కావలి) మేస్టారే! ఆయన ప్రోద్బలంతో నేను సినిమా రంగంతో బాలమురళి గారి అనుబంధంపై ఒక వ్యాసం రాసి పంపాను. బాలమురళిగారికి ఆ ఆ వ్యాసం బాగా నచ్చిందని మేస్టారు చెప్పారు. బాలమురళి జీవిత విశేషాల గురించి రేపు మీడియాలో మీరు చాలా చదవబోతారు, వినబోతారు. అందుకని ఆ వివరాల జోలికి పోకుండా ఆయనకు  స్మృత్యంజలి ఘటిస్తూ, ఆ నాటి వ్యాసాన్ని కింద యిస్తున్నాను. 

చిత్రసీమలో మురళీరవం

తెలుగువాళ్లకు సంబంధించినంత వరకు సినిమా సర్వకళల సమాహారం. గత ఏభై సంవత్సరాలుగా యీ మాట మరింత 'ఘట్టిగా' చెప్పవచ్చు. పాతరోజుల్లో నవరాత్రి పందిళ్లల్లో  సంగీత కచ్చేరీలుండేవి, కూచిపూడి నృత్యాలుండేవి, పౌరాణిక నాటకాలుండేవి, తోలుబొమ్మ లాటలుండేవి. తర్వాత తర్వాత అవన్నీ పోయి 16 ఎం ఎం స్క్రీన్‌తో సినిమాలు వేయనారంభించారు. ఇప్పుడు వీడియో సిడిలు వచ్చాక మరింత సులభం అయిపోయింది. సినిమాలు లేని చోట సినిమా పాటల 'విభావరులు' ఉంటాయి. సినిమానృత్యాలను అనుకరించే రికార్డింగ్‌ డాన్సులుంటాయి.

నవరాత్రి పందిళ్లు, శ్రీరామనవమి పందిళ్లు ఏడాదికి మూడో నాలుగో. నట్టింట్లో వెలసిన టీవీ సంగతే చూడండి. సంగీతం కానీయండి, నృత్యం కానీయండి, హాస్యం కానీయండి - కార్యక్రమాలన్నీ సినిమా చుట్టూనే పరిభ్రమిస్తాయి. నేటి యువత ఏ విషయాన్నైనా సరే యింటర్నెట్‌ ద్వారానే తెలుసుకుంటున్నట్టు, యిప్పటి ప్రజలకు ఏం చెప్పాలన్నా సినిమా ద్వారానే చెప్పాలి. మన సంస్కృతి పరిరక్షించండి అని చెప్పాలన్నా, మీ పిల్లలకు టీకాలు వేయించండి అని చెప్పాలన్నా ఓ సినిమా యాక్టర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీసుకురావాల్సిందే!

ఈనాటి పరిస్థితుల ప్రకారం - సినిమాకు రాసినవాడే రచయిత, సినిమాల్లో వేసినవాడే నటుడు, సినిమాలో పాడినవాడే పాటగాడు, సినిమాలో ఆడినవాడే ఆటగాడు, సినిమాకు బాణీలు కూర్చినవాడే సంగీతకర్త, కళాభిజ్ఞుడు. సగటు తెలుగువాడికి సినిమాను మించిన కళారూపం తెలియదు, తెలిసినా పట్టదు. 'కన్యాశుల్కం'లో బండివాడిలాటి (కాంగ్రెస్సూ, దేశసేవా ఎలా పోతే వాడికేం? వాడి వూరి హెడ్‌ కనిస్టీపు సంగతి తెలిస్తే చాలు) వాళ్లకోసమే యీ వ్యాసం.

 'బాలమురళిగారు అపర త్యాగరాజు, ఆధునిక వాగ్గేయకారుడు అయితే కావచ్చండి. మాకు తెలియదు. సినిమాల్లో ఏ యే పాటలు పాడారో చెప్పండి. దాన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో మేమే తేల్చుకుంటాం' అంటారు వీళ్లు.

అప్పుడు ''గుప్పెడు మనసు''లో 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా?' విన్నారా? అది పాడినది బాలమురళిగారే'' అని వాళ్లలో ఒకడికి మెల్లగా చెప్తా.

''ఓహ్‌, ఆయనా! హీ యీజ్‌ వండ్రఫుల్‌! ఆయనైతే ''మేఘ సందేశం''లో కూడా ఓ పాట పాడారండీ, 'పాడనా, వాణి..కల్యాణి, సంథింగ్‌, సంథింగ్‌'' అంటూ హమ్‌ చేస్తాడు.

నేను నవ్వుతూ చూస్తాను. అంతలోనే అతను వులిక్కి పడతాడు. ''సార్‌, సార్‌ .. ఈయన ఓ ఫన్నీ సాంగ్‌.. అంటే ఫన్నీ అంటే ఫన్నీ కాదనుకోండి. కాస్త వెటకారంగా ఓ పాట పాడారండి. 'పలుకే బంగారమాయెరా అందాలరామా,.. లక్షాధికారులైనా లవణమన్నామే కానీ..' యూనో యిటీజ్‌ సెటైరికల్‌..''

పక్క కుర్రాడు సిగరెట్టు దమ్ము గట్టిగా పీల్చి ''మామా, యూ ఆర్‌ మిస్టేకెన్‌. అది అందాలరామా కాదు, కోదండరామా... రామదాసు కీర్తన. మా ఫాదర్‌ రోజూ వింటూ వుంటాడు. అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనే ఆయన పాడారు. అది చాలా 'ఫీల్‌'తో వుండే సాంగ్‌. నువ్వేదో ప్యారడీ సాంగ్‌ పాడి...''

మధ్యలో వున్న పిల్లిగడ్డం పిల్లాడు నవ్వాడు. ''బాస్‌, యూ ఆర్‌ డబ్లీ మిస్టేకెన్‌. మంగళంపల్లి అంటే ''ఉయ్యాల జంపాల'' అనే బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలో బాక్‌గ్రౌండులో ఓ పాట పాడారు 'ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు' అని. మంచి హార్ట్‌ రెండింగ్‌ సాంగ్‌లే. వింటే ఏడుపు వచ్చేయాల్సిందే! ఆయన్ను పట్టుకెళ్లి నువ్వు కీర్తనలకు కలిపేయకు..''

గొడవ పెరక్కుండా నేను కలగజేసుకుంటాను. ''కాస్త ఆగండి. ఈ పాటలన్నీ పాడినది ఒకరే..''

సిగరెట్టు అబ్బాయ్‌ ఆశ్చర్యపడతాడు ''మై గాడ్‌! మా ఫాదర్‌ దగ్గర సినిమా క్లాసికల్స్‌ వున్న రికార్డు వుంది. ''నర్తనశాల''లో 'సలలిత రాగ సుధారససారం',   ''కర్ణ''లో 'నీవూ నేనూ వలచితిమి'.. యిలాటివి వున్నాయి. వాయిస్‌ చాలా ఫెమిలియర్‌ అనుకున్నా గానీ ఈ కీర్తనలకూ యీ సినిమా సింగర్‌కు రిలేట్‌ చేయలేదు. అవీ యీయన పాడినవేనా సార్‌?''

నేను తల వూపి జ్ఞానోదయం కలిగించిన సిద్ధపురుషుడి ముద్ర పట్టడానికి తయారవుతూండగానే చెవికి రింగు తగిలించిన కుఱ్ఱాడు భుజాలు ఎగరేశాడు. ''ఐ కాన్ట్‌ బిలీవిట్‌. కర్ణ అంటే శివాజీ గణేశన్‌కి యీయన పాడాడా? ఓకే అది డబ్బింగ్‌ సినిమా అనుకో. కానీ నర్తనశాల!? నర్తనశాల అంటే ఎన్టీయార్‌. ఎన్టీయార్‌కు ప్లేబ్యాక్‌ యిచ్చారా ఈయన!? కమాన్‌..బీ రీజనబుల్‌ యార్‌.''

నాకు ఉడుకుమోత్తనం వస్తుంది. ''శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు'' సినిమాలో 'వసంత గాలికి వలపులు రేగ..' పాట విన్నారా? దానిలో ఎన్టీయార్‌కి పాడలేదా? ''పల్నాటి యుద్ధం''లో 'శీలము కలవారి చిన్నవాడా' అంటూ హరనాథ్‌కి పాడలేదా? ఆ మాట కొస్తే ఆయన సినిమా కెరియర్‌ అక్కినేనికి పాడడంతో ప్రారంభమైంది తెలుసా..?'' అంటూ వాళ్లకు క్లాసు తీసుకున్నాను.

1957లో బాలమురళి మద్రాసు ఆల్‌ ఇండియా రేడియోలో వుద్యోగం చేస్తూ వుండగా ''సతీ సావిత్రి'' సినిమాలో పాడడానికి ఆఫర్‌ వచ్చింది. ఆ సినిమాలో కథానాయికగా చేసిన ఎస్‌.వరలక్ష్మి బాలమురళీకి శిష్యురాలు. ఆమె బలవంతం మీద హీరోకి ఓ పద్యం మాత్రం పాడతానని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ల కోరిక మీద ఎనిమిది పాటలు పాడారు. ఆ సినిమాలో ఒక పాట రాయడంతో బాటు ఓ పాటకి వయొలిన్‌, మృదంగం వాయిస్తూ పాడారు కూడా. సినిమా హిట్‌ అయినా బాలమురళీకృష్ణ నాగేశ్వరరావుకి నేపథ్యగాయకుడిగా కొనసాగలేదు.

దానికి కారణం బాలమురళిగారికి సినిమారంగంపై వున్న చిన్నచూపు అనుకుంటే పొరబాటు. ఆయనకు సినిమా మీడియం బలం తెలుసు. సినిమా పట్ల సరదా కూడా వుంది. ఆయన సినిమాల్లో పాటలు పాడడమే కాదు, సంగీతం సమకూర్చారు, నటించారు కూడా. సినిమారంగం కూడా ఆయనను దూరంగా పెట్టలేదు. ఆయనను అప్పుడప్పుడు వుపయోగించుకుంటూనే వచ్చింది. పౌరాణిక నేపథ్యం వున్న ఉన్న సినిమాలలో ఆయన చేత కనీసం ఓ పద్యమైనా పాడించుకుంటూ వచ్చింది. ఆయన స్థాయి పాట యివ్వగలుగుతున్నాం అన్న ధైర్యం కలిగినప్పుడు ఆయననే పిలుస్తోంది. 

సినిమా గాయకుడిగా, సినిమా సంగీతదర్శకుడిగా ఆయన జాతీయ అవార్డులు అందుకున్న సందర్భాలు వున్నాయి. మొదటిది ''హంసగీతె'' (1975)  దీనిలో జయదేవుని అష్టపదులకు కొత్తరకంగా రాగాలు కట్టాడాయన. ఉదాహరణకి ఒకటి వినండి. కాగా రెండవది ''మధ్వాచార్య'' (1986)కు. రెండూ కన్నడ సినిమాలే! జి.వి.అయ్యర్‌ తీసినవే. వీటితో బాటు ''ఆదిశంకరాచార్య''  (1983)  ''రామానుజాచార్య'' (1989) చిత్రాలకూ సంగీత దర్శకత్వం చేయించుకున్నారు. ఈ సినిమాల్లో బాలమురళి ఎన్నో ప్రయోగాలు చేశారు. ''హంసగీతె''లో అష్టపదులకు కొత్త బాణీలు కట్టారు. ''మధ్వాచార్య''లో ఆరేడు వాయిద్యాలను మాత్రం వుపయోగించి మధ్వాచార్యుల కాలంలో ప్రాచుర్యంలో వున్న సంగీతాన్ని యిచ్చారు. ఒక బెంగాలీ సినిమాలో పాడిన పాటకు జాతీయ అవార్డు వచ్చింది. 

''సంధ్యారాగ'' (1974) అనే కన్నడ సినిమాకి ఉత్తమ సంగీతదర్శకుడిగా ప్రాంతీయ బహుమతి లభించింది. తమిళ సినిమా ప్రేక్షకులు బాలమురళి అనగానే 'ఒరునాళ్‌ పోదుమా' (''తిరువిళైయాడల్‌'' సినిమాలోనిది) పాటను గుర్తు చేసుకుంటారు. అంతేకాదు ''తలైవనుక్కొరు తలైవి'' అనే సినిమా సంగీతదర్శకత్వం కూడా. ''తిరువిలైయాడల్‌'' తీసిన ఎ.పి.నాగరాజన్‌ ''నవరత్నం'' అనే తమిళ చిత్రం ఎం.జి.ఆర్‌ హీరోగా తీస్తూ ఒక పాట పెట్టారు. ఆ పాటలో కర్నాటక, హిందూస్తానీ, పాశ్చాత్య బాణీలతో బాటు స్వచ్ఛమైన జానపద వరస కూడా పాడాలి. ఎం.జి.ఆర్‌. బాలమురళి వద్దకు వచ్చి ఆ పాటకు న్యాయం చేయమని అభ్యర్థించారు. బాలమురళి సరేనన్నారు.

దక్షిణాది భాషాచిత్రాలన్నిటిలోనూ పాటలు పాడడమే కాక, బాలమురళి నటించారు కూడా. ఎవిఎం అధినేత ఎవి మెయ్యప్పన్‌గారితో స్నేహం కారణంగా ఆయన కోరిక మేరకు ''భక్త ప్రహ్లాద'' సినిమాలో నారదుడిగా నటించి, ఎన్నో పాటలు పాడారు. అయితే తర్వాత అనేక సినిమాలలో అటువంటి తరహా పాత్రలే రావడంతో ఆయనకు మొహం మొత్తి నిరాకరించారు. చాలామందికి తెలియకపోవచ్చు - ఆయన ''సంధ్య గిదెన సిందూరం'' అనే మలయాళ సినిమాలో కథానాయకుడిగా నటించారు.

అది ఒక సంగీతదర్శకుడు, అతని శిష్యురాలి చుట్టూ తిరుగుతుంది. డబ్బుకోసం కచేరీలు చేయడం యిష్టపడని ఓ గురువు ప్రతిభావంతురాలైన ఒక శిష్యురాలిని అభిమానించి ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆమె సినిమాల్లో చేరతానంటే ఆస్తి తెగనమ్మి ఆమెను ప్రమోట్‌ చేస్తాడు. ఆమెకు ఓ సంగీతదర్శకుడు సినిమాల్లో అవకాశం యిస్తాడు. ఆమె అతన్ని ప్రేమించి గర్భవతి అవుతుంది. ఈ గురువుకి జ్ఞానోదయమై, పరితపించి, క్రమంగా కృంగి కృశిస్తాడు. శిష్యురాలిగా సీమ నటించగా గురువుగారిగా బాలమురళి వేశారు. 

ఇంతటి బరువైన పాత్రను నటించిన బాలమురళికి సినిమా రంగంపై చిన్నచూపు వుందనుకోవడం సబబు కాదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే - ''మన భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడానికి సినిమా మంచి మీడియం. ప్రజల మీద సినిమా ప్రభావం అధికం. అంచేత శాస్త్రీయ సంగీతం - అది అంత గొప్పగా లేకున్నా - సినిమా ద్వారా అయితే ప్రజలు వింటారు. చూస్తారు. ప్రభావమూ వుంటుంది. సామాన్య ప్రజానీకం కోసం మంచి చిత్రాలు నిర్మించాలి. వాటిల్లో క్రమంగా కొంత సంప్రదాయ ధోరణుల్ని చేర్చాలి.'' 

బాలమురళి గారికి సినిమారంగంపై యింత పాజిటివ్‌ దృక్పథం వున్నా ఆ రంగం - ముఖ్యంగా తెలుగు సినిమారంగం - ఆయన ప్రతిభను పెద్దగా వుపయోగించుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీనికి కారణాలు ఆలోచిస్తే కొన్ని అంశాలు తడతాయి.

సినిమారంగంలో రాజీ పడడం ఎక్కువ. ఎంత ప్రతిభావంతులైనా సరే, తమ స్థాయికి దిగివస్తేనే సినిమా నిర్మాతదర్శకులు సౌకర్యంగా ఫీలవుతారు. సాలూరి రాజేశ్వరరావుగారు ఎంత జీనియస్‌యైనా కానీయండి, నిర్మాత వచ్చి ఫలానా హిందీ ట్యూన్‌ కాపీ కొట్టండి అంటే కొట్టి తీరవలసినదే. ''ఘంటసాలగారూ మీరు భగవద్గీత ఆలపిస్తే ఆలపించవచ్చు. కానీ మా సినిమాలో హీరోది జులాయిపాత్ర. అందుచేత మీరు ఆ రకమైన పాట పాడితీరవలసినదే'' అని దర్శకుడు నిర్బంధిస్తే కాదనలేని పరిస్థితి. 

మీకు ఎన్ని రకాల సంగీతాలైనా రానీయండి, లలితసంగీతకారులుగా ముద్ర పడితేనే మీతో సినిమారంగం 'కంఫర్టబుల్‌'గా ఫీలవుతుంది. శాస్త్రీయ సంగీతకారులుగా ముద్రపడిన వాళ్లంటే సినిమావారికి గౌరవంతో కూడిన బెదురు. సినిమారంగంలోని వ్యక్తులకు తాము ఎటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నామో తెలుసు. శాస్త్రీయ రంగంలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని యిముడ్చుకోలేమనీ తెలుసు. అందుకని వారిని అప్పుడప్పుడు మాత్రమే అరుదుగా వాడుకుంటారు. బడే గులాం ఆలీఖాన్‌, పండిట్‌ రవిశంకర్‌, ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి, ఎమ్మెల్‌ వసంతకుమారి, శీర్కాళి గోవిందరాజన్‌- ఎవరైనా కానీయండి అప్పుడప్పుడు పిలిచి, సత్కరించి, సేవలు వుపయోగించుకుని, మర్యాదగా పంపేస్తూండడమే తప్ప తమలో భాగంగా చేసుకోవడానికి సాహసించలేదు. నాట్యం విషయంలోనూ యిటువంటి వుదాహరణలు కనబడతాయి. గోపీకృష్ణను, రుక్మిణీ అరండేల్‌ను సినిమారంగం హరాయించుకోగలిగిందా?

అదే విధంగా బాలమురళి వంటి తేజోమూర్తిని తెలుగు సినిమారంగం తగుపాటి దూరంలో వుంచే గౌరవించింది. ఎందుకంటే రేడియోల ద్వారా, రికార్డుల ద్వారా బాలమురళీగానం విడిగా అత్యంత ప్రచారం పొంది వున్నది. ఆయన పాడుతుంటే రామారావో, నాగేశ్వరరావో వినబడరు. బాలమురళీయే వినబడతారు. విశ్వనాథ గురించి 'దేశం పట్టని కవి' అన్నట్టు  బాలమురళి 'హీరోలకు పట్టనంత గాయకుడు'. అందుకే ఆయన ''మేఘసందేశం'' సినిమాలో ఆయనే కనబడి పాడుకున్నారు. లేదా ''ఉయ్యాల జంపాల'', ''అందాల రాముడు'', ''గుప్పెడు మనసు'' సినిమాలలో లాగ నేపథ్యగీతాలలో రాణించారు.

ఈ అంశాలు చెప్పేసరికి మా యువమిత్రులు అంగీకరిస్తారు - ''పరిస్థితులు యిలా వున్నపుడు బాలమురళిగారి జీవితంలో సినిమారంగానికి పెద్ద ప్రాముఖ్యత లేదని ఫీలయి లాభం లేదండి. పరస్పర గౌరవం వున్నా కొన్ని 'సంగతులు' ఓ స్థాయికి మించి ముందుకు సాగవంతే!'' అని.  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

(దీనితో యిస్తున్న బాలమురళి రేఖాచిత్రం బాపుగారి సోదరుడు శంకరనారాయణగారు గీసినది. ఫోటో ''సంధ్యాగిందెన సిందూరం'' సినిమాలో సీమ, బాలమురళి) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?