Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 6

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 6

బాపుగారు పెర్‌ఫెక్షనిస్టు. ఏదైనా బొమ్మలో లైన్లు ఎక్కువయ్యాయనిపిస్తే వైట్‌నర్‌తో చెరిపేయకుండా మళ్లీ వేసేవారట. వేసి చూసుకుని, తృప్తి పడ్డాకనే పంపేవారు. బొమ్మ వేసి పంపించాక కూడా దాని గురించి పునరాలోచన వస్తే వెనక్కి తెప్పించేసుకుని మళ్లీ వేసి పంపించేవారు. పంపుతూ ''మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే చెప్తే మళ్లీ ప్రయత్నిస్తాను.'' అనేవారు. ఈ మాట కెరియర్‌ మొదట్లో అనడం కాదు, థాబ్దాలుగా వేసిన తర్వాత కూడా అనేవారు. అసలు వాళ్ల వినయం, ఒకలా చెప్పాలంటే దుస్సహం. బాపురమణలిద్దరూ ఫోన్‌ చేసినపుడు ''నమస్కారమండి'' అని మొదలుపెడతారు. అసలే, అంతటి పెద్దవాళ్లు మనకు ఫోన్‌ చేశారే అని తత్తరపడుతూ వుంటాం. మనం నమస్కారమండీ అంటే ప్రతినమస్కారం చేయడం కాకుండా, వాళ్లే నమస్కారం అంటే  కాస్సేపు నోరు పెగలదు. రమణగారికి యీ విషయం చెప్పాను కూడా. 'ఏమోనండీ, అలా అలవాటైపోయింది' అనేవారు. 

బాపుగారిని మీ గురువు ఎవరండి అనగండి, నిన్న కార్టూన్‌ వేసినవాడి పేరుతో సహా చెప్పేస్తారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ కాదు, ప్రతిభ వున్న అందరినీ ఆయన మెచ్చుకునేవారు. సినిమాల్లో కూడా ఆయన సీనియర్లతో పనిచేశారు, జూనియర్లతో పనిచేశారు, కొత్తవాళ్లతో పనిచేశారు. ఎవరితోనూ పేచీలు రాలేదు. నటీనటులు, కళాకారులు, టెక్నీషియన్లు అందరూ ఆయనను గౌరవించినవారే, ఆయనా అందరినీ గౌరవించారు. ఎవరైనా తన వర్క్‌ గురించి అనవసరంగా విమర్శించినా, సరిగ్గా వాడుకోకపోయినా 'తెలియక చేసి వుంటారండి' అనేవారు. కావాలని చేశారని తెలిస్తే కార్టూన్లు వేసి ఆటపట్టించేవారు. తెలిసీతెలియకుండా కామెంట్లు చేస్తే జోక్‌ వేసి మొహం మాడ్చేవారు. రావి కొండలరావుగారు చెప్పారు - ''ఒకాయన వెంకటేశ్వరస్వామి పాదాలు మాత్రం వేసి యిస్తే తన కంపెనీకి లోగోగా వాడుకుంటానన్నాడట. వేసి యిచ్చాక వేళ్లు చూసి సణిగాడట. బాపుగారు యిలాటి సందర్భాల్లో పాదాల వేళ్లు ఉబ్బెత్తుగా వేస్తారు. ఎందుకు వేయాలో ఆయనకు తెలుసు. వేయించుకున్న వాడికి తెలియకపోతే అడగాలి. కానీ ఆయన 'వేళ్లు కొంచెం వాచినట్టుగా వున్నాయేంటండీ' అన్నాడట. బాపు గారు వెంటనే 'దానికేముందండీ? బూడ్సు తొడిగేద్దాం' అన్నారు ఛెళ్లుమన్నట్లు.''

చిత్రకారుడిగా బాపు స్థాయి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాటిదో తెలుసుకోవాలన్న కుతూహలం నాకుండేది. తెలుగు వాళ్ల నెవర్ని అడిగినా అమ్మాయంటే బాపు బొమ్మలా వుండాలి వంటి పడికట్టు పదాలు వాడుతూ వుంటారు తప్ప నేషనల్‌గా ఆయన స్థానం 3 లేదా 5, 7, 8 ఏదీ చెప్పరు. ఆయన యిలస్ట్రేషన్ల దగ్గర్నుంచి కార్టూన్ల దాకా అనేక రకాలుగా చిత్రాలు వేశారు. నాకు వాటి పరిభాష రాదు కాబట్టి సరైన పదాలు వుపయోగించలేను. 'ఇన్ని వేసిన మీరు లాండ్‌స్కేప్స్‌ వేయలేదా?' అని అడిగితే 'అవి నాకు చాలా యిష్టం. కానీ వెయ్యలేదు' అని జవాబిచ్చారు. ఇలస్ట్రేటర్‌గా ఆయన స్థానం యిది, పెయింటర్‌గా యిది, కార్టూనిస్టుగా యిది.. అని తెలుసుకుంటే బాగుంటుంది కదా. 1995లో ''బొమ్మా బొరుసూ'' తయారుచేసినపుడు యీ సమాచారం సేకరించి యివ్వాలని కోరిక గట్టిగా కలిగింది. జాతీయస్థాయిలో బాపు చిత్రాల గురించి వ్యాసాలేవీ నేను చదవలేదు. అడిగితే తెలుగు చిత్రవిమర్శకులను మాత్రమే అడగాలి. విమర్శకుల్లో సంజీవ్‌దేవ్‌గారిది చాలా ఉన్నతస్థానం. ఆయన రచనా, బొమ్మలు, విమర్శా అన్నీ గొప్పగా వుంటాయి. అప్పటికే ఆయన పెద్దాయన. ఈ ఏడాది ఆయన శతజయంతి. 

ఇక నాకు బాగా తెలిసున్న విమర్శకుడు చలసాని ప్రసాదరావుగారు. ఆయన దగ్గరకు వెళ్లి ప్రశ్నావళి రాసి యిచ్చాను. ఆయన వాటిని తనకు అనువుగా మార్చుకుని యిచ్చిన సమాధానాలు నాకు తృప్తి యివ్వలేదు. మీకు శాంపుల్‌ చూపిస్తాను. ప్రశ్న - ''బాపుకు ప్రత్యేక శైలి వుందా?'' జవాబు - అసలు శైలి అంటే ఏమిటి? చెప్పదలచిన అంశాన్ని ఒక విశిష్టపద్ధతిలో, ఆకర్షణీయంగా చెప్పటం. బాపు బొమ్మలు చూడగానే 'ఇది బాపు బొమ్మలా వుందే' అని మనకు తెలీకుండానే అనుకుంటాం. అదే బాపు ముద్ర. ఇంకో ప్రశ్న - ''బాపు తెలుగువారికి ఆరాధ్యుడు. మరి జాతీయ స్థాయిలో గుర్తింపు వున్నదా?'' జవాబు - ''ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లీషు పత్రికల ద్వారా కూడా ప్రచారంలోకి వచ్చి వుంటే బాపుకి జాతీయస్థాయిలో పేరు వచ్చి తీరేది. ఆర్కే లక్ష్మణ్‌ విద్యావంతులైన భారతీయుల్లో చాలామందికి తెలుసు. తెలుగువారిలో ఎందరికి తెలుసు? సత్యజిత్‌ రాయ్‌ సినిమా డైరక్టరుగా చాలామందికి తెలుసు. కథారచయితగా, చిత్రకారునిగా ఎందరికి తెలుసు? జాతీయస్థాయి గుర్తింపు లేనంత మాత్రాన బాపుకి వచ్చిన నష్టం లేదు.'' ఇవేం సమాధానాలు? ఆయనకు నష్టం లేదని మనం తీర్మానిస్తే సరిపోయిందా? గుర్తింపు వుంటే పద్మ అవార్డులు కురిసి వుండేవి. 

అసలు యిలాటి మూల్యాంకన (యివాల్యుయేషన్‌) బాపుకే యిష్టం లేదని నా అనుమానం. అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలకు శంకు, శ్యాం మోహన్‌ వంటి తెలుగువాళ్లు ఎంట్రీలు పంపి బహుమతులు గెల్చుకున్నారు. బాపు అలాటి ప్రయత్నమే చేయలేదు. ఆయన యిలాటివాటికన్నిటికీ అతీతం, యీయనే వాళ్లకు అవార్డు యివ్వాలి వంటి కబుర్లు మనం అనుకోవచ్చు. అలా చెప్తే పాలగుమ్మి పద్మరాజుగారు తన కథను పంపి ఎవార్డు తెచ్చుకున్నంతమాత్రాన ఆయన తక్కువ రచయిత అనగలమా? జర్మన్‌లు మన వేదాలను మెచ్చుకున్నారన్నా, అమెరికాలో వివేకానందుడికి జేజేలు పలికారన్నా, గాంధీకి ఇంగ్లండ్‌లో ఘనస్వాగతం లభించిందన్నా, బాపు ''సీతాకల్యాణం''కు అంతర్జాతీయంగా అవార్డు లభించిందన్నా సంతోషిస్తాం కదా. అలా చిత్రకారుడిగా కూడా బాపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తే బాగుండేది కదా. కానీ ఆయన పోటీకే వెళ్లందే! ఆయనను నేను చేసిన లిఖితపూర్వకమైన యింటర్వ్యూలో అడిగాను - ''వివిధ దేశాల పత్రికలలో బొమ్మలు చూసి మీరు నిరంతరం నేర్చుకుంటూంటారని అంటారు. అలా నేర్చుకుని వేసిన బొమ్మను ఏ విధంగా ఇవాల్యుయేట్‌ చేసుకుంటారు? ఒరిజినల్‌ ఆర్టిస్టుకి పంపుతారా? మీ మిత్రులు (ఆర్ట్‌ ఫీల్డ్‌లో ఎవరు?) ఎవరికైనా చూపించి అభిప్రాయాలు కోరతారా?'' అని. దానికి ఆయన ''అనేకమంది స్వదేశీవిదేశీ చిత్రకారుల బొమ్మలు చూడడమే నా విద్య. ఎవాల్యుయేషన్‌ అన్నది నా వరకే చేసుకుంటాను. ప్రతి బొమ్మ రమణగారికి చూపిస్తాను.'' అని రాశారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?