Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం- 1

ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం- 1

ఇది బాపుగారి బొమ్మలపై నేను చేసిన వ్యాఖ్యలతో ''హాసం''లో డిసెంబరు 2002 నుండి నడిచిన శీర్షిక. నేను చిత్రకారుణ్ని కాను, చిత్రవిమర్శకుణ్ని కూడా కాను. బొమ్మలు చూసి తోచినదేదో రాశాను. ఎమెచ్యూరిష్‌గానే వుంటుందని గమనించాలి. విజ్ఞులెవరైనా తప్పులు ఎత్తి చూపితే సవరించుకుంటాను. అప్పటికీ యిప్పటికీ నా జ్ఞానం ఏమీ పెరగలేదు. అప్పుడు రాసినదే తిరిగి ''హాసం'' సౌజన్యంతో, బాపుగారికి కృతజ్ఞతలతో అందిస్తున్నాను. 

'చిన్న బొమ్మలు వేయడం, పైగా బొమ్మలకు వ్యాఖ్యానం.. అవసరమా? ఆ బొమ్మలను అలాగే చూసి ఎంజాయ్‌ చేసేటట్లు పెద్దగా వేయవచ్చు కదా!' అని శీర్షిక నడిచేరోజుల్లోనే ఒక పాఠకుడు ఉత్తరం రాశారు. దానికి సమాధానంగా - 'బాపు విశ్వరూపం అన్నాం గానీ బాపు బొమ్మల విశ్వరూపం అనలేదు. బాపు బొమ్మలు అలంకరించని తెలుగుపత్రిక గాని, తెలుగిల్లు గాని లేదు. బాపు బొమ్మలు అందంగా ఉంటాయని వ్యాఖ్యానించి ఊరుకునేవారే ఎక్కువ. అందంగా బొమ్మలు వేసేవారందరూ 'బాపు'లు ఎందుకు కాలేకపోతున్నారో చెప్పే ప్రయత్నమే ఇది. బాపు బహుముఖప్రజ్ఞ, పరిశీలనాశక్తి, విద్వత్తు, అధ్యయనశీలత, నిత్యాన్వేషణ - వీటన్నిటినీ చూపే శీర్షిక ఇది. ఒక్కోసారి ఒక్కో పార్శ్వాన్ని చూపే ప్రయత్నం జరుగుతోంది. ఆ యా బొమ్మల ఒరిజినల్స్‌ అందరూ చూసినవే, భద్రపరచుకున్నవే! అంతస్సూత్రంగా ఉన్న అంశాన్ని ఎత్తిచూపి, గుర్తుకుతేవడానికి గాను ఆయా బొమ్మలు వేయడం జరుగుతోంది. 

ఇక వ్యాఖ్యానాల గురించి - 'హాసం' లక్ష్యమే అది కదా, పాట విని ఆనందించేవారున్నా, ఆ పాట విశేషతను గురించి వివరించి మరింత ఆసక్తి రగిలిస్తున్నాం కదా! అదేవిధంగా ఈ వ్యాఖ్యానాలను చదివినవారు బాపు బొమ్మల అందం చూసి అక్కడే ఆగిపోకుండా, కాస్తంత లోతుగా విశ్లేషించుకుంటూ చూసి మరింత 'ఎప్రీషియేట్‌' చేస్తారని మా ఆశ. ప్రబంధాల ముఖచిత్రాల సంగతే చూడండి. ఎంతమందికి వాటి సబ్జక్ట్‌ గురించి తెలుసంటారు? 

విశ్వరూపం గురించి ప్రస్తావించారు కాబట్టి - దేవుడి విశ్వరూపం పటం చూడండి. ఒక విరాట్‌మూర్తికే అక్కడ ప్రాముఖ్యత. సూర్యుడైనా, చంద్రుడైన, బ్రహ్మైనా, శివుడైనా, పధ్నాలుగు లోకాలైనా - అవన్నీ చిన్న చిన్నగానే కనబడతాయి. ఇక్కడ బాపుగారి ఉపజ్ఞ, మేధయే హైలైట్‌ అవుతున్నాయి.  బొమ్మలు కావు.  

'బాపు అంటే ఒక బాపు కాదు, బోల్డు బాపులు. చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, పబ్లిసిస్టుగా కొన్ని బాపులనైనా చూపాలంటే ఎన్ని పేజీలూ చాలవు. బాపు సప్తతి వేడుక సందర్భంగా బాపు రూపాలు కొన్ని చూపిద్దామని మా తాపత్రయం. బాపు బొమ్మలు నిత్యనూతనంగా ఎందుకుంటాయి? రమణగారు చెప్పినట్టు ఫారిన్‌ వాడి థాట్‌ను యిస్త్రీ చేసి అచ్చ తెలుగైజ్‌ చేయగలరాయన. మళ్లీ సంప్రదాయానికి కట్టుబడుతూనే మోడ్రన్‌గా వుండగలరు. రెండిటిలోను నిష్ణాతులాయన. పూర్తి సంప్రదాయబద్ధంగా తంజావూరు బొమ్మలు వేయగల బాపు సంప్రదాయం, ఆధునికత కలబోసి ఫ్రెంచ్‌వారు కూడా ఆదరించేలా, రామాయణాన్ని బొమ్మల్లో ఎలా అందించారో చూడండి. తన యిష్టదైవం ఆంజనేయస్వామి లీలలు చిత్రీకరించిన రెండు బొమ్మలివిగో - ఉదాహరణకి మొదటి దాంట్లో సముద్రంలో అలలు, చేపల

కేళీవిలాసాలు, రెండో బొమ్మలో మంటల విన్యాసాలు - తోక ఒక బొమ్మకి బోర్డర్‌గా, మరో బొమ్మలో త్రిశూలంగా (ఆయన రుద్రాంశ సంభూతుడుగా) రూపుదిద్దుకున్న వైనం చూడండి. మేం చెప్పినవే చూడాలని లేదు. సిమిట్రీ లాంటి బోల్డు అంశాలు మీకు తడతాయి, నచ్చుతాయి. అవీ చూడండి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?