Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం - 12

తెలుగుభాషకు బాపు చేసిన సేవల్లో ఒకటి అందమైన అక్షరాలు సమకూర్చడం. అంటే అంతకు ముందు అక్షరాలు అందంగా లేవనికాదు. కాస్త స్పెషల్‌గా రాయాలంటే కాస్త తబ్బిబ్బు పడే పరిస్థితి ఉండేది. ఇంగ్లీషులో అయితే ఏ,బి,సి,డిలకు నాలుగురకాలైన బడులు ఉంటాయి. అచ్చులో ఉపయోగించే కాపిటల్స్‌, స్మాల్‌ లెటర్స్‌, తర్వాత వ్రాతలో ఉపయోగించే వంపుల అక్షరాలు, వాటి స్మాల్‌ లెటర్స్‌. వీటిని అనేక పెర్మిటేషన్స్‌, కాంబినేషన్స్‌లో కలిపి రకరకాల అందాలు తేవచ్చు. అక్షరాలను రకరకాలుగా రాసి ఎన్నో రకాల ఫాంట్స్‌ తయారు చేశారు. ఎమ్మెస్‌ వర్డ్‌ లాటి సాఫ్ట్‌వేరు చూస్తే కనీసం ఏబై రకాల ఫాంట్స్‌ కనబడతాయి.

 

భారతీయ భాషల విషయానికొస్తే ఉర్దూ అక్షరాలను అందంగా వ్రాసే అలవాటు కనబడుతుంది. సత్యజిత్‌ రాయ్‌ బెంగాలీ అక్షరాలను చిన్న చిన్న మార్పులతో అందంగా ఎలా వ్రాయవచ్చో  దారి చూపించా డంటారు. సినిమా దర్శకుడు కావడానికి ముందు ఆయన పబ్లిసిటీ ఆర్టిస్టు కదా. సింపుల్‌గా తోస్తూనే ఎలిగెంట్‌గా, ఎట్రాక్టివ్‌ గా ఎలా రాయవచ్చో ఆయన చూపారు.

 తెలుగులో మనకు పెద్ద, చిన్న అక్షరాలు లేవు కాబట్టి అన్నీ ఒకే తీరులో కనబడి కాస్త మొనాటనీ ఉంటుంది. బాపుకు ముందు పత్రికల్లో పని చేసిన ఆర్టిస్టులు అక్షరాలను అందంగా కనిపింప చేయడానికి విపరీతంగా అలంకరించే వారు. హెడింగ్‌ పెట్టాలంటే అక్షరాల చుట్టూ లతలు, పువ్వులూ పెట్టి హంగామా చేశేవారు. చిత్రలేఖనంలో ప్రవేశం ఉంటే తప్ప మామూలువాళ్లకు ఆ రకంగా అక్షరాలు రాయడం సాధ్యపడేది కాదు. 

 

 

 

 

 

 

 

 

 

ఆ దశలో బాపు రంగప్రవేశం చేశారు. మొదట్లో అప్పుడప్పుడు పాతరకంగా రాసినా (రమణ గారి సీతాకల్యాణం కథకు అక్షరాలు రాసిన తీరు, బొమ్మ చూడండి) త్వరలోనే అక్షరాలను పూర్తిగా కాకుండా కొంత రాసి వదిలేసినా తక్కినది స్ఫురించే విధంగా చిత్రలిపి తయారుచేశారు.

పబ్లిసిటీ డిజైన్స్‌ లోనూ, కథల టైటిల్స్‌ రాయడం లోనూ దాన్నే వాడసాగారు. ధైర్యంగా అని ఇక్కడ చేర్చాలి.  ఎందుకంటే సనాతనులు చాలామంది ఈ వంకరటింకర అక్షరాలను చూసి నివ్వెరపోయారు. గోలచేశారు.

దీన్ని అతిశయోక్తిగా భావించేవారికోసం ఓ చిన్న సమాచారం - 'హాసం' పత్రిక నడిచే రోజుల్లో ఓ ఉత్తరం వచ్చింది. బాపుగారు అక్షరాలలో 'సున్న'ను పూర్తిగా వదిలి పెట్టేస్తు న్నారన్న ఫిర్యాదది. మన భారతీయులు ఎంతో కష్టపడి 'సున్న'ను కనిపెట్టి ప్రపంచానికి బహూకరిస్తే బాపుగారి పుణ్యమాని అది కను మరుగయి పోతోందని లేఖా రచయిత  వాపోయారు. భారతీయులు కనిపెట్టింది గణితంలో 'సున్న' అని, బాపు లుప్తం చేస్తున్నది లిపిలో 'సున్న' అని ఆయనకు తట్టలేదు. బాపుస్క్రిప్టుకు ఇంత పేరు వచ్చాక కూడా ఇలాటి విమర్శలు వస్తూ ఉంటే యిక అప్పుడెలా వుండేదో ఊహించవచ్చు.

ఏది ఏమైనా బాపు లైనుతో బాటు లిపి కూడా ప్రజాదరణ పొందింది. బాపుకి విపరీతంగా అభిమానుల్ని సంపాదించిపెట్టిన లైను, లిపి యీ కాలం (1960లు) నాటిదే! బొమ్మలు వేయడం రానివారు కూడా లిపిని అనుకరించగలిగారు. సింపుల్‌గా కనబడుతూనే ఆకర్షణీయంగా కనబడింది ఆ లిపి. మామూలుగా, స్కూలు చెప్పిన ప్రకారం గుండ్రంగా రాస్తే బోసిగా అనిపించే లిపి బాపు స్టయిల్లో రాస్తే అందంగా అనిపించసాగింది.  ఇక ఎక్కడ చూసినా బాపు స్టయిలే. సినిమాలలో క్రెడిట్స్‌ కూడా  బాపుగారి చేత రాయించ సాగారు. కులగోత్రాలు మూడో వారం పోస్టర్‌ డిజైన్‌ చూడండి. ఎంత వినూత్నంగా  వుందో, పైన ఆకులు, కుడి చివర హీరో హీరోయిన్ల రేఖాచిత్రం, కింద లైనులో బాపు లెటరింగ్‌లో చిత్ర విశేషాలు. బస్‌!

బాపు అక్షర శైలికి ఉన్న డిమాండు గుర్తించిన అనూ ఫాంట్స్‌ వారు పదేళ్ళ క్రితం బాపు అక్షరాలను కంప్యూటరీకరించారు. వేరువేరు పేర్లతో లభ్యమయ్యే అవి ఇలా ఉంటాయి.

లిపికి సంబంధించి ఇది ఒక విప్లవమనే చెప్పాలి. ఏ భాషలోనూ ఒక చిత్రకారుడి పేర అక్షరాలు రాసే స్టయిల్‌ పేరుబడడం జరగలేదు. విప్లవమనేది నిరంతరం సాగాలనే బాపు నమ్ముతారు కాబట్టి తన అక్షరాల శైలి మారుస్తూ పోయారు. మీరే చూడండి -

 

 

బొమ్మలలో క్లుప్తత సాధించినట్టే అక్షరాలు రాయడంలో పొదుపు పాటించ సాగారు. క్రమేణా అక్షరాలు మరింత కుంచించు కుని పోయి, ఓ రెండు గీతలు పెడితేనే చాలు ఫలానా అక్షరం అని పాఠకులు పోల్చుకుంటారు అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. దానికి తగ్గట్టే పాఠకులూ మార్చిన ప్రతీసారి ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నారు.

ఉదాహరణకి ఆయన సంతకంలో జరిగిన మార్పులు చూడండి.

కంప్యూటరులో లిపి అందుబాటులో ఉంది కదా అని బాపుగారు స్వయంగా రాయకపోయినా ఫరవాలేదు అన్న పరిస్థితి లేదు. ఆయన పెర్సనల్‌ టచ్‌ ఎప్పటికప్పుడు ఇస్తూనే వున్నారు. అందువల్ల ఆయన చేత స్వయంగా రాయించుకోవాలన్న మోజు ఎప్పటికి పోకుండా ఉంది. అదీ తమాషా!

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

Click Here For Part-9

Click Here For Part-10

Click Here For Part-11

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?