Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బ్రెగ్జిట్‌..? - 1

ఎమ్బీయస్‌ : బ్రెగ్జిట్‌..? - 1

కొద్ది గంటల్లో బ్రిటన్‌లో రిఫరెండమ్‌ ఫలితాలు రాబోతున్నాయి. - 'యూరోపియన్‌ యూనియన్‌లో ఉండుటయా? ఊడుటయా?' అనే విషయంపై నిర్ణయం రాబోతోంది. ఇంగ్లండులోనే రూపుదిద్దుకున్న ''హేమ్లెట్‌'' నాటకంలో నాయకుడు 'టు బి ఆర్‌ నాట్‌ టు బి' అనే మీమాంసలో పడ్డాడు. ఇప్పుడు బ్రిటన్‌ ప్రజలలో హేమ్లెట్లే దాని భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు. కూటమిలో కొనసాగుదామనే వాళ్లను 'రిమైన్‌' గ్రూపుగా, వదిలిపెట్టేద్దామనే వారిని 'లీవ్‌' గ్రూపుగా పిలుస్తున్నారు. లీవ్‌ వారి నినాదాన్ని బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ ఎగ్జిట్‌ అనే రెండు పదాల మేళవింపు) అంటున్నారు. తాజా సర్వేల ప్రకారం రెండు పక్షాలూ యించుమించు సమానబలంలో వున్నారు. అంతరం 1-2% మాత్రమే. ఇలా వూగిసలాడే వారు ఎటు వూగితే అటే మొగ్గు. రేపటికల్లా ఏ సంగతీ తేలిపోతుంది. బ్రెగ్జిట్‌పై, అది మన దేశంపై కలిగించే ప్రభావంపై మన దేశపు మీడియా బాగానే కవర్‌ చేస్తూ వచ్చింది. ఈ విషయంపై పాఠకులలో ఒకపాటి అవగాహన వచ్చే వుంటుంది. అయినా దానిలో యిమిడివున్న అంశాలన్నీ గుదిగుచ్చి ఒకేచోట, ఒకేసారి చెప్పే ప్రయత్నం యిది.

రెండవ ప్రపంచయుద్ధానికి ప్రధాన వేదిక యూరోపే. యుద్ధం వలన సర్వనాశనమైనదీ యూరోపే. మళ్లీ పుంజుకోవడానికి దశాబ్దాలు పట్టింది. అప్పుడు వారిలో ఒక ఆలోచన వచ్చింది -  మనలో మనం కలహించుకోకుండా వ్యాపార, వాణిజ్య బంధాలు పెంచుకుంటే బాగుపడతాం కదాని. యుద్ధంలో బద్ధవైరులుగా వున్న ఫ్రాన్సు, జర్మనీల సారథ్యంలో 6 దేశాలు 1951లో యూరోపియన్‌ కోల్‌ అండ్‌ స్టీల్‌ కమిషన్‌గా ఏర్పడ్డాయి. అది విజయవంతం కావడంతో తక్కినవారిని కూడా కలుపుకుని, మనందరం కలిసి ఒక ఫెడరేషన్‌గా ఏర్పడడం అంతిమలక్ష్యంగా పెట్టుకుని కొద్దికొద్దిగా ఆర్థికపరమైన మినహాయింపులు యిస్తూ క్రమేపీ పౌరులు, వస్తువులు అటూయిటూ సంచరించడానికి ఆంక్షలు లేకుండా చూసుకుంటే అందరం కలిసికట్టుగా పైకి వస్తాం కదా అనుకుంటూ దాన్ని 1957లో యూరోపియన్‌ ఎకనమిక్‌ కమ్యూనిటీ (ఇఎసి) గా మార్చారు. పోల్చి చెప్పాలంటే మన ఇండియా కూడా యూరోప్‌ లాటిదే. అక్కడ దేశాలు, యిక్కడ రాష్ట్రాలు. ఒక్కోరిది ఒక్కో భాష. ఒక్కో చోట ఒక్కో పార్టీ నెగ్గుతోంది. అయినా మన దేశమంతా  ఒకటే కరెన్సీ, రాకపోకలపై ఆంక్షలు లేవు. జనాభాలో యూరోప్‌ కంటె పెద్దదైన ఇండియాను అందుకే ఉపఖండం అన్నారు. యుద్ధంలో పరాజితులైన ఫ్రాన్సు, జర్మనీ ఇఎసిలో ముఖ్యపాత్ర తీసుకుని అనేక యితర దేశాలని చేర్పించాయి. యుద్ధంలో విజేత ఐన బ్రిటన్‌ యీ ప్రయత్నాన్ని చిన్నచూపు చూసింది. అది ఫ్రాన్సు అధ్యక్షుడు షాల్‌ ద గాల్‌ (ఛార్లెస్‌ డీగోల్‌ అని మన మీడియాలో రాస్తారు)ని మండించింది. ఈ సమాఖ్యేదో బాగానే వుంది అనుకుని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ప్రతిఘటిస్తున్నా కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన బ్రిటిషు ప్రధాని హెరాల్డ్‌ మాక్మిలన్‌ 1960లలో బ్రిటన్‌ చేరతానని అడిగినప్పుడు ఆయన వద్దు పొమ్మనడానికి కారణం అదే. ''బ్రిటిషు వాళ్లకు యూరోప్‌ దేశాలతో కలవడం కంటె అమెరికా వెనక్కాల తోకగా వుండడమే మోజు'' అన్నాడు. ఇలా రెండు సార్లు జరిగింది. 

చివరకు 1973లో కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన  బ్రిటన్‌ ప్రధాని ఎడ్వర్డ్‌ హీత్‌, లేబరు పార్టీలో అసమ్మతివాదుల సహాయంతో ఇఎసిలో సభ్యత్వం అడిగి తీసుకుంది. అదీ కూడా అర్ధమనస్కంగానే. ఇప్పటికీ చూడండి ఇయులో అంతా కరెన్సీ యూరో అయితే, బ్రిటన్‌ మాత్రం తన పౌండ్‌ స్టెర్లింగ్‌ కరెన్సీని వదలలేదు. యూరోప్‌లో ఏ దేశం వెళ్లాలన్నా షెంగన్‌ వీసా ఒక్కటి వుంటే సరిపోతుంది. కానీ బ్రిటన్‌కి వెళ్లాలంటే విడిగా వీసా అప్లయి చేయాలి. ఇలాటి భేషజాలతో ఉమ్మడి కుటుంబం ఎలా నడుస్తుంది? పెళ్లి చేసుకున్నాక కూడా కాపురం చేయాలా? విడాకులు పుచ్చుకోవాలా? అనే సందేహం బ్రిటన్లకు. ముఖ్యంగా లేబర్‌ పార్టీకి. అందువలన 1974 ఎన్నికలలో తమను గెలిపిస్తే కూటమిలో వుండే విషయంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని వాగ్దానం చేసింది. నెగ్గాక 1975లో రిఫరెండమ్‌ నిర్వహించింది. 67% మంది వుండాలని ఓటేయడంతో కొనసాగింది. ఉందన్నమాటే కానీ చాలా విషయాల్లో వేరు కుంపటే. 2002లో అందరూ కలిసి యూరో అనే కరెన్సీ పెట్టుకోగా మేం మాత్రం పౌండును వదలం అని చెప్పింది. ఏ సభ్యదేశమైనా ఎప్పుడైనా తప్పుకోవాలనుకుంటే తప్పుకునే సదుపాయం కావాలని 2009లో కోరి సాధించింది. బ్రిటన్‌ ఏమనుకున్నా, ఇఇసి పెరుగుతూ పోయింది. 1990ల నాటికి సభ్యదేశాల సంఖ్య 15కి చేరింది. ఒకటే కరెన్సీ, దేశాల మధ్య వీసా నిబంధనల తొలగింపు, ఎగుమతి, దిగుమతి సుంకాల రద్దు యిలాటి ఎన్నో వెసులుబాట్లు వచ్చాయి. అది పెద్ద వాణిజ్యకూటమిగా ఏర్పడింది. 1992లో మాస్ట్రిక్ట్‌ ఒప్పందం తర్వాత యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు-ఐరోపా కూటమి) ఏర్పడింది. షెంగన్‌ ఒప్పందం యూరోప్‌ దేశాల మధ్య సరిహద్దు ఆంక్షలను సడలించింది. 1991లో రష్యా పతనం తర్వాత అప్పటిదాకా దాని గుప్పిట్లో వున్న తూర్పు యూరోప్‌ దేశాలు బయటకు వచ్చి ఇయులో చేరసాగాయి. సభ్యదేశాల సంఖ్య 15 నుంచి 28కి చేరింది. 

ఐరోపా కూటమి నిర్వహణ గమ్మత్తుగా వుంటుంది. బ్రస్సెల్స్‌లో దానికి పార్లమెంటు వుంది. ప్రతీ సభ్యదేశం దానికి ప్రతినిథులను పంపుతుంది. దాని ఆదేశాలను అందరూ మన్నించాలి. యూరోపియన్‌ కమిషన్‌ కూడా వుంది. సభ్యదేశాల అధినేతలు ఆ కమిషన్‌ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. కూటమి అధికారులు, కమిషన్‌ అధికారులు వ్యవహారాలు చక్కబెడతారు, నియమాలు ఏర్పరుస్తారు. సభ్యదేశాల అధినేతలతో ఏర్పరచిన కౌన్సిల్‌ వీటన్నిటిని పర్యవేక్షిస్తుంది. యూనియన్‌ ఖర్చును సభ్యదేశాలన్నీ కలిసి భరించాలి. ప్రతి దేశం తమ జిడిపిలో కొంత శాతం తమ వాటాగా యివ్వాలి. అంటే డబ్బున్న దేశాలు ఎక్కువగా, పేద దేశాలు తక్కువగా యిస్తాయన్నమాట. ఇది కూడా బ్రిటన్‌ సహించలేక పోయింది. మార్గరెట్‌ థాచర్‌  ప్రధానిగా వుండగా 'మేం చాలా ఎక్కువ యిస్తున్నాం. మాకు రిబేటు యివ్వాలి' అని డిమాండు చేసింది. నిజానికి యూరోప్‌ దేశాల మొత్తం జిడిపిలో ఇయు జిడిపి 2% మాత్రమే! నిజానికి ఇయులో చేరి బ్రిటన్‌ లాభపడింది. కూటమిలో బ్రిటనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. సైనిక శక్తిగా చూస్తే అందరి కంటె పెద్దది. దాని ఎగుమతులలో 50% కూటమిదేశాలకే. అయినా యిప్పుడు బయటకు వచ్చేయాలని ఎందుకనుకుంటోందంటే దానికి ఓ కారణం వుంది.

కూటమిలో రెండో దశ విస్తరణలో చేరిన దేశాలు ఆర్థికంగా బలహీనదేశాలు కావడంతో కూటమికి యిబ్బందులు వచ్చాయి. పాత దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి తక్కినవాటికి భారంగా మారాయి. 2009 నాటి గ్రీసు సంక్షోభం నుంచి ఇయు యిబ్బందులు పడుతోంది. కులం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో ఏదైనా సంఘం ఏర్పడినపుడు దానిలో సమానస్థాయి వున్నవాళ్లుంటేనే సంఘం నడుస్తుంది. మన వూరివాడే కదాని గొప్పవాడు పేదవాడితో కలిసి భోజనం చేయడానికి యిష్టపడడు. ఇక్కడా అదే జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం ఏర్పడిన యూరోప్‌ దేశాల నుంచి ప్రజలు కూటమిలో బాగున్న యితర దేశాలకు వలస పోసాగారు. అలా వలస పోయినవాళ్ల వలన ఆతిథ్యం యిచ్చిన దేశంపై ఆర్థిక భారం పడుతోంది. అక్కడ నిరుద్యోగ సమస్య ఏర్పడుతోంది. 'మీరు మా దేశానికి రావడానికి వీల్లేదు' అనడానికి కుదరదు - ఎందుకంటే వాళ్లు ఇయులో సభ్యులు. మనంమనం ఒకటే అంటున్నారు. ఈ గొడవంతా దేనికి, మీకు మీరే, మాకు మేమే అంటే పోలేదా? అని బ్రిటనులో కొందరు అడగసాగారు. అందుకే యీ ప్రజాభిప్రాయ సేకరణ. ఆరు కోట్ల 40 లక్షల జనాభా వున్న బ్రిటను తన పౌరుల సంక్షేమానికై చాలా ఖర్చు పెడుతుంది. ఈ వలసదారులు వచ్చిపడడంతో స్కూళ్లలో, ఆసుపత్రుల్లో ఎక్కడా చూసినా వాళ్లే. ఖర్చు పెరగడంతో సంక్షేమ పథకాలకు కోత పడి బ్రిటన్‌ పౌరులు కష్టపడుతున్నారు. పైగా శరణార్థులు గత్యంతరం లేక పావలాకు, అర్ధకూ పనిచేయడానికి సిద్ధపడడంతో రూపాయి కూలీ లేకపోతే పనిచెయ్యనని బిగుసుకుని కూర్చున్న బ్రిటిషు పనివాళ్ల నోట్లో కరక్కాయ పడుతోంది. కూటమిలోంచి తప్పించేసుకుంటే యీ వలసదారుల పీడ వదిలిపోతుంది, మన డబ్బులు మనమే అనుభవించవచ్చు అని బ్రిటిషువారి వూహ. 

2004లో తూర్పు యూరోప్‌ దేశాల వలసలు ప్రారంభమయ్యాక కూటమిదేశాల పౌరుల్లో 21 లక్షల మంది బ్రిటన్‌కు వచ్చారు. ఉదాహరణకి పోలండు నుంచి దాదాపు 10 లక్షల మంది బ్రిటన్‌లోకి వచ్చి వుంటారని అంచనా. వీళ్లలో నైపుణ్యం లేనివారే ఎక్కువ. ఇలాటి జనాభా వలన తమ దేశపు సామర్థ్యం ఏమీ మెరుగుపడదు పైగా వున్న సౌకర్యాలనే వాళ్లకు పంచవలసి వస్తోంది. ఇటీవల కాలంలో ఇరాన్‌, సిరియాల నుంచి కూడా వచ్చిపడుతున్నారు. మేం వీళ్లని తీసుకోము అని అంటే కుదరదని బ్రస్సెల్స్‌లో వున్న కూటమి హెడాఫీసు నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఎక్కడో బ్రస్సెల్సులో కూర్చుని మా మీద పెత్తనం చలాయించి మా మెడలు వంచుతారా, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యం ఏలిన తాము యీ రోజు వీళ్లకు తలవొగ్గడమా అని బ్రిటన్‌లోని వృద్ధులు చాలా ఫీలవుతున్నారు. వారందరూ బ్రెగ్జిట్‌కే ఓటేస్తారనంటున్నారు. కాందిశీకుల పేరుతో ఉగ్రవాదులు వచ్చిపడుతున్నారని, వారి వలన దేశంలో శాంతి కరువౌతోందని, పోనీ కదాని రానిస్తే వాళ్లు తమపై దాడులు చేస్తున్నారనీ మరి కొందరు వాపోతున్నారు. 

ఈ సెంటిమెంటు వుపయోగించుకుని ఓట్లేయించుకుంది తీవ్ర రైటిస్టు పార్టీ ఐన యుకె యిండిపెండెంటు పార్టీ (యుకెఐపి). 2010లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వారి అవసరం పడింది. వెళ్లి అడిగితే, 'కూటమిలోంచి బయటకు వస్తామని అంటేనే మీ సంకీర్ణప్రభుత్వంలో చేరతాం' అంది. సరే అంది కన్సర్వేటిప్‌ పార్టీ. అన్నా తాత్సారం చేయడంతో దానిమీద నమ్మకం సడలింది. అందువలన 2015 ఎన్నికల సమయం వచ్చేసరికి కన్సర్వేటివ్‌ పార్టీ నాయకుడు డేవిడ్‌ కామెరాన్‌ తనే యీ ప్రతిపాదన గురించి చెప్పి, మొదట కాందిశీకుల కారణంగా బ్రిటన్‌కు కలిగిన సమస్య గురించి కూటమితో చర్చించి రూల్సు మార్పిస్తానని, అది వీలు కాకపోతే ప్రజాభిప్రాయం సేకరించి అప్పుడు కూటమిలోంచి బయటకు వచ్చే విషయం తేల్చేస్తామని అన్నాడు. బ్రిటన్‌ చేసిన ప్రతిపాదనలకు కూటమి ఒప్పుకోలేదు. అందువలన యిప్పుడు కెమెరాన్‌ తన వాగ్దానం మేరకు జూన్‌ 23 న రిఫరెండమ్‌ నిర్వహిస్తున్నాడు. అయితే కూటమిలోంచి బయటకు వచ్చేస్తే అనర్థం అని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అతని మంత్రివర్గంలోనే 6గురు మంత్రులు బ్రెగ్జిట్‌ అంటున్నారు. లేబరు పార్టీ అధినాయకత్వం రిమైన్‌ అంటోంది కానీ దాని నాయకుల్లో కొందరు విడిపోదామంటున్నారు. 

కూటమిలోంచి విడిగా వెళ్లిపోతే మన సరుకులు వాళ్లు కొనరు కదా, వాళ్ల దగ్గర్నుంచి మనం దిగుమతి చేసుకోవడం కష్టం కదా అంటే 'దాన్దేముంది? అన్ని దేశాలతోనూ విడివిడిగా మళ్లీ ద్వైపాక్షిక ఒప్పందాలు రాసుకుంటాం' అంటున్నారు. ఇప్పుడు ఇండియా, చైనా వంటి దేశాలు ఐరోపా కూటమితో ఒక్క ఒప్పందం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఎగుమతులు, దిగుమతులు, వీసాలు, పెట్టుబడులకు యిచ్చే వెసులుబాట్లు వగైరా విషయాలతో ఇంగ్లండుతో మళ్లీ రాసుకోవాలి. ఇలా ప్రతీ దేశంతో ఇంగ్లండు మళ్లీ ఏర్పాటు చేసుకోవాలి. గ్రీన్‌లాండ్‌ 1982లో ఈయూ నుంచి బయటకు వచ్చి అన్నిదేశాలతో వాణిజ్య ఒప్పందాలను తిరగరాసుకోవడానికి మూడేళ్లు పట్టింది. దాని జనాభా 50 వేలు. అలాటిది యింత పెద్ద ఇంగ్లండు, ఈయులో అతి పెద్ద ఎగుమతిదారైన దేశానికి యీ ప్రక్రియకు మూడేళ్లు నుంచి ఐదేళ్లు పడుతుందని అంచనా. అవన్నీ తేలేవరకూ ఇంగ్లండు అభివృద్ధి డోలాయమానంలో వుంటుందని జనాల భయం. ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌ ఇయు మార్కెట్‌. అది వదులుకోవడం సాధ్యం కాదు. అలా అని గతంలోలా సౌహార్ద్రభావంతో వ్యాపారం కొనసాగించాలంటే సాధ్యపడే విషయం కాదు. వాళ్లని కాదని వచ్చేశాక, వాళ్లు ఉదారంగా ఎందుకుంటారు? ప్రతీదానికీ గీచిగీచి బేరాలాడతారు. ఇవన్నీ ఉత్తుత్తి భయాలని కొట్టిపారేస్తున్నారు బ్రెగ్జిట్‌ వాదులు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?