Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బ్రెగ్జిట్‌..? - 2

ఎమ్బీయస్‌: బ్రెగ్జిట్‌..? - 2

విడిపోదామని అనేవారి వాదన యిలా వుంది - 'ఐరోపా కూటమి బజెట్‌కై బ్రిటన్‌ కితం ఏడాది 13 బిలియన్‌ పౌండ్లు యిచ్చింది, సేవింగ్స్‌ రూపేణా 4.5 బిలియన్‌ పౌండ్లు వెనక్కి వచ్చాయి. మొత్తం మీద 8.5 బిలియన్‌ పౌండ్ల  ఖజానాలోంచి వెళ్లిపోయాయి. కూటమితో తెగతెంపులు చేసుకుంటే యిది మిగులుతుంది. హ్యూమన్‌ రైట్స్‌, కాందిశీకుల పట్ల ఔదార్యం, కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు వంటి విషయాలలో కూటమి విధానాలతో సంబంధం లేకుండా తమంతట తామే విధానాలు రూపొందించుకుని అమలు చేయవచ్చు. నైపుణ్యం లేనివారందరికీ మన దేశం సత్రంగా ఎందుకు మారాలి? వారి కోసం మన ప్రజలను ఎందుకు ఎండగట్టాలి? ఈ బెడద వదిలిపోతే 2030 నాటికి జిడిపి వృద్ధి రేటు 1.6% పెరుగుతుంది. మనందరం కలిసి బ్రిటన్‌కు పూర్వ ఘనత తెచ్చుకోవచ్చు.' ఈ క్యాంప్‌కు ప్రధాన చోదకుడు బోరిస్‌ జాన్సన్‌. కామెరాన్‌కు స్నేహితుడు, పార్టీలో అతనితో పదవులకై పోటీ పడినవాడు. గతంలో లండన్‌ మేయరుగా పనిచేశాడు. 

ఉందామని అనేవారు చెప్పేదిది - 'స్కాట్లండ్‌, ఐర్లండ్‌ ప్రాంతాల వాళ్లు కూడా వుందామనే అంటున్నారు. వారి దృష్టిలో ఇంగ్లండ్‌ వారిపై అత్తగారిలా పెత్తనం చలాయిస్తూ వుంటే బ్రస్సెల్స్‌ అత్తగారికి అత్తగారిలా ఇంగ్లండును అదుపు చేస్తోంది. ఇప్పుడు అత్తగారు స్వేచ్ఛ కోరుకుంటే కోడళ్లగా మనం మాత్రం ఎందుకు కోరుకూడదు అనుకుంటున్నాయి. 2014లో స్కాట్లండ్‌ విడిపోదామంటే ఇంగ్లండు కలిసి వుండాలని పట్టుబట్టింది. ఇప్పుడు తను మాత్రం కూటమిలోంచి విడిపోదామంటోంది. అదెలా? అని వారి ప్రశ్న. బ్రెగ్జిట్‌ నెగ్గితే రెండు మూడేళ్లలోనే స్కాట్లండ్‌ విడిపోతామని, యీసారి మళ్లీ రిఫరెండమ్‌ పెట్టమని డిమాండ్‌ చేయవచ్చు. తాము డైరక్టుగా ఐరోపా కూటమిలో చేరతామని అనవచ్చు. ఐర్లండ్‌ కూడా డిటోడిటో. ఎందుకంటే ఉత్తర ఐర్లండ్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో 34% కూటమికే ఎగుమతి అవుతున్నాయి. కూటమిలోంచి విడివడితే బ్రిటన్‌ ముక్కలయ్యే ప్రమాదం వుంది. 

 కూటమిలో భాగస్వామిగా వుండడం చేత, నైపుణ్యం వున్న యూరోపియన్లు ఎందరో బ్రిటన్‌కి వచ్చి స్థిరపడుతున్నారు. వారి వలన బ్రిటన్‌ లాభపడింది. ఇకపై యీ సౌకర్యం వుండదు. మామూలు పౌరులకు యిచ్చే సౌకర్యాలు కాందిశీకులకు యివ్వటం లేదు. ఈ ఫిబ్రవరిలో చేసిన సవరణల ద్వారా వారికి కొంతకాలం పాటు సంక్షేమ పథకాలు లేకుండా చేయడం జరిగింది. ఎగుమతుల్లో 50% కూటమికి వెళుతున్నాయి. దిగుమతులు 10% మాత్రమే. ఈ బాలన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఎడ్వాంటేజి యికపై పోతుంది. కూటమిలోంచి బయటకు రాగానే 53 రకాల స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు రద్దయిపోతాయి. ఒక్కో దేశంతో యిలాటివి ఎన్నో కుదుర్చుకుంటూ పోవాలి. దానికి ఎంతో సమయం పడుతుంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇండియాతో సహా అనేక దేశాలు బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టాయి. వీటన్నిటికి విఘాతం కలుగుతుంది. జిడిపి వృద్ధి రేటు 2-7% తగ్గుతుంది.'

విడిపోవడం వలన ఇళ్ల ధరలు 10%, జిడిపి 3.6% జీతాలు 2.8%, పౌండ్‌ మారకం విలువ 12% తగ్గుతాయని పరిశీలకుల అంచనా. ఐరోపా కూటమితో వ్యాపారావకాశాలు పోవడం చేత పెద్దపెద్ద కార్పోరేషన్లు బ్రిటన్‌ విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాయని, వాటిని ఆట్టుకోవడానికి పన్నులు తగ్గించవలసి వస్తుందని, దానివలన ప్రభుత్వాదాయం తగ్గిపోతుందని అంటున్నారు. కూటమిలోంచి బయటకు వెళదామని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. బ్రిటన్‌ పతనమైతే ఆలోచన తుడిపేసుకుంటారు. నిలదొక్కుకుంటే వాటికీ ఆశ పుడుతుంది. విడిపోవడం వలన బ్రిటన్‌ శక్తివంతమైన, పారిశ్రామిక దేశంగా అంటే కెనడా కంటె కాస్త మెరుగ్గా తయారు కావచ్చు. కానీ ఐరోపా కూటమిలో దాని పలుకుబడి అంతరిస్తుంది అంటున్నారు కొందరు. ఇన్నాళ్లూ కూటమిలో దానికి చాలా గౌరవం దక్కింది. కామెరాన్‌ యీ రిఫరెండం పెట్టడం వలన యితర సభ్యదేశాలకు మంటగా వుంది. 'ఒకసారి బ్రిటన్‌ బయటకు వెళ్లిపోతే దానితో ఒప్పందాలూ గిప్పందాలూ ఏమీ వుండవ్‌' అని కొందరంటున్నారు. ఇండియా, చైనా, రష్యా, అమెరికా వంటి దేశాలు బ్రిటన్‌తో ఒప్పందాలు తిరగరాసేటప్పుడు బ్రిటన్‌ మార్కెట్‌ సైజును దృష్టిలో పెట్టుకునే బేరాలాడతాయి. ఐరోపా కూటమితో పోలిస్తే బ్రిటన్‌ మార్కెట్‌ చిన్నదే కాబట్టి కూటమికి యిచ్చినన్ని కన్సెషన్లు, డిస్కౌంట్లు బ్రిటన్‌కు యివ్వరు.

కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కూటమిలో వుందామని, లేకపోతే చాలా కష్టాల పాలవుతామని చెప్తూ వుంటే అతని పార్టీ సహచరుల్లో కొందరు విడిపోదామంటున్నారు. లేబరు పార్టీ ప్రధాన నాయకులు కూడా వుందామని అంటూ వుంటే కొందరు నాయకులు విడిపోదామంటున్నారు. లేబరు యూనియన్లలో చాలా భాగం వుండాలనే అంటున్నారు. పెద్ద వ్యాపార సంస్థలు, బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు, మీడియాలో పెద్ద సంస్థలు అన్నీ వుందామనే అంటున్నారు. వర్జిన్‌ గ్రూపు బాస్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ దగ్గర్నుంచి, ద టైమ్స్‌, ద గార్డియన్‌, ద సండే అబ్జర్వర్‌, ద మెయిల్‌ ఆన్‌ సండే, ద సండే టెలిగ్రాఫ్‌ దాకా అన్నీ కలిసి వుందామనే అంటున్నాయి. డైలీ టెలిగ్రాఫ్‌, డైలీ మెయిల్‌, ద సన్‌ మాత్రం విడిపోదామంటున్నాయి. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు విడిపోదామని అనుకుంటున్నారట. 30 ఏళ్లకు లోపున వున్నవారు వుందామంటున్నారుట. మొదటి వర్గం వాళ్లు ఓటేయడానికి తప్పకుండా వెళతారు, రెండో వర్గం వాళ్లు బద్ధకించవచ్చు. 4 కోట్ల 20 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటింగు భారీగా జరిగితే రిమైన్‌ క్యాంప్‌ గెలుస్తుందని అనుకోవాలి. అలా అయితే కామెరాన్‌ కొనసాగవచ్చు. విడిపోవాలనే నిర్ణయం వస్తే అతను రాజీనామా చేయవచ్చు. చేయకపోయినా బలహీనపడి, యితరులు దింపేయవచ్చు. 

బ్రిటన్‌లోని వున్న 30 లక్షల మంది భారతీయ సంతతివారు ఎటు ఓటేస్తారన్నది కూడా ముఖ్యమైన అంశమే. కామెరాన్‌ కాబినెట్‌లో మంత్రిగా వున్న ప్రీతీ పటేల్‌ అనే భారతీయ సంతతి బ్రిటిష్‌ పౌరురాలు బ్రెగ్జిట్‌ క్యాంపులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వలసదారుల గురించి చాలా కఠినంగా మాట్లాడుతోంది. తాము కూడా ఒకప్పుడు వలస వచ్చినా తాము నైపుణ్యం సంతరించుకున్నామని, కొత్తగా తూర్పు యూరోప్‌ నుంచి వస్తున్నవాళ్లకు నైపుణ్యం లేదని, ఇంగ్లీషు కూడా రాదని, తక్కువ జీతాలకు ఎగబడతారని ఎద్దేవా చేస్తోంది. కూటమి నియమాల కారణంగా ఆసియా దేశాల నుండి ఐటి నిపుణులు, యితర స్కిల్‌డ్‌ ప్రొఫెషనల్స్‌ రావడానికి వీల్లేకుండా పోతోందని వాదిస్తోంది. నిజానికి మరే యితర ఐరోపా దేశం కన్నా బ్రిటనే ఇండియన్లకు అవరోధాలు కల్పిస్తోంది.  బ్రిటన్‌కు టూరిస్టు వీసా సంపాదించాలన్నా కష్టంగా వుంటోంది. భారతీయ సంతతికి చెందిన మరి కొందరు అగ్రనాయకులు బ్రెగ్జిట్‌ వాదనతో ఏకీభవించటం లేదు. కీత్‌ వాజ్‌, స్వరాజ్‌ పాల్‌ వంటి వారు కలిసే వుందామంటున్నారు. ఈ రోజు యీ వలస వాదులను పంపేశాక, రేపు ఆసియన్లు మాత్రం ఎందుకు అంటారన్న భయం వుంది. ఎందుకంటే వలస వచ్చిన వారి సంఖ్యను లక్షకు తగ్గిస్తామని బ్రెగ్జిట్‌ వాదులు అంటున్నారు. వారి అంచనా ప్రకారం వారి సంఖ్య ప్రస్తుతం 3.50 లక్షలుంది. వారిలో 1.80 లక్షల మంది యూరోపేతరులు. అంటే ఆసియన్లను కూడా పంపేస్తే తప్ప వారి టార్గెట్‌ అందుకోలేరు. బ్రిటన్‌కు వచ్చిన విదేశీ విద్యార్థులు చదువైపోయిన తర్వాత పనిచేసేందుకు అవకాశం వుండేది. 2012లో ఆ వెసులుబాటు తీసేశారు. ఇలాటివి మరెన్ని వస్తాయో తెలియదు. 

సర్వేల ప్రకారం ఇండియన్లలో 52% మంది కలిసి వుందామనే అంటున్నారట. భారత్‌లో యుకె మూడో పెద్ద పెట్టుబడిదారు. ఐరోపా కూటమిలో అన్నిదేశాలలో కలిపి ఇండియన్లు పెట్టుబడి పెట్టిన మొత్తం కంటె బ్రిటన్‌లో పెట్టినది ఎక్కువ. బ్రిటన్‌కి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఇండియాది మూడో స్థానం. బ్రిటన్‌లో ప్రయివేటు సెక్టార్‌లో ఉద్యోగకల్పనలో టాటాలది ప్రథమ స్థానం. వాళ్లు కూడా బ్రెగ్జిట్‌కు ఓటేయవద్దని తమ ఉద్యోగులకు సలహా యిచ్చారు. బ్రిటన్‌లో 800 ఇండియన్‌ కంపెనీలున్నాయి. తక్కిన ఐరోపా దేశాల్లో 400 కంటె తక్కువ. బ్రిటన్‌లో ఇండియన్‌ కంపెనీల్లో 1,10,000 మంది పనిచేస్తున్నారు. భారతీయ కంపెనీల టర్నోవర్‌ 2015లో 22 బిలియన్‌ పౌండ్లుంటే 2016లో 26 బిలియన్‌ పౌండ్లయింది. ఎచ్‌సిఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి కంపెనీల బిజినెస్‌ 7 రెట్లు పెరిగాయి. బ్రెగ్జిట్‌ జరిగితే యీ అంకెల్లో భారీగా మార్పులు రావడం తథ్యం. చూదాం బ్రిటన్‌ పౌరులు ఏమంటారో! - (సమాప్తం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?