Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బుందేల్‌ఖండ్‌లో వజ్రాల వేట

ఎమ్బీయస్‌: బుందేల్‌ఖండ్‌లో వజ్రాల వేట

రియో టింటో అనే యుకె కంపెనీ 40 దేశాలలో వజ్రాలను వెలికితీసే ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఛత్తర్‌పూర్‌ జిల్లాలోని జారా, సగౌరియా, షెపురా గ్రామాల్లో అటవీప్రాంతాల్లో భూమిలో వజ్రాలు దొరుకుతాయని అది అంచనా వేసింది. 2002లో స్థల పరిశీలన మొదలుపెట్టి, 2004 జనవరిలో ప్రాథమిక కార్యకలాపాలకై ప్రభుత్వ అనుమతి సంపాదించి వజ్రాలు దొరుకుతాయా లేదా అని పరిశీలించింది. దొరుకుతాయన్న ఆశ కలిగి 2006 సెప్టెంబరులో అన్వేషించేందుకు (ప్రాస్పెక్టింగ్‌) లీజు సంపాదించింది. అక్కడి చెట్లపై కోతులు ఎక్కువగా వుండడం చేత దాన్ని 'బందర్‌ ప్రాజెక్టు' అన్నారు. 2008 అక్టోబరులో 'మా అన్వేషణ ఫలించింది. ఇక్కడ 3.74 కోట్ల క్యారట్‌ల కింబర్‌లైట్‌ దొరుకుతుంది, దాన్నుంచి 2.74 కోట్ల క్యారట్‌ల వజ్రాలు తయారవుతాయి. 2 వేల కోట్ల రూ.ల పెట్టుబడి పెట్టి బయటకు తీస్తాం, 800 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా పని కల్పిస్తాం' అని ప్రకటించి ముందుగా 475 హెక్టేర్ల భూమిలో వజ్రాలను వెలికి తీయడానికి, తీసినవాటిని విలువ కట్టడానికి రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టి 2010లో రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తను తవ్వకాలు జరిపేచోట అత్యాధునికమైన సాంకేతికతో మైనింగ్‌ ప్లాంట్‌ కట్టింది. ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ వారు 2013లో ప్రాజెక్టును ఆమోదించారు కూడా. 

2014 వచ్చేసరికి '971 హెక్టేర్లలో తవ్వకాలు జరుపుతాం' అని కంపెనీ అనడంతో ఫారెస్టు ఎడ్వైజరీ కమిటీవారు 2015 నవంబరులో అభ్యంతరాలు లేవనెత్తారు. ఎందుకంటే దాని కోసం 5 లక్షల చెట్లు కొట్టేయాల్సి వస్తుంది, పులులు సంచరించే ప్రాంతం కాబట్టి వాటికి ఆవాసం పోతుంది, రక్షిత అరణ్యప్రాంతాలు నాశనమవుతాయి. తమ ఉపాధి పోతుందని మూడు గ్రామాలలో నివసించే 2 వేల మంది ప్రజలు అభ్యంతర పెడుతున్నారు. వాళ్ల అనుమతి లేనిదే ముందుకు వెళ్లడానికి చట్టం ఒప్పుకోదు. కంపెనీ ప్రతిపాదనను, అటవీశాఖ అభ్యంతరాలను రాష్ట్రప్రభుత్వం 2016లో కేంద్రానికి పంపింది. జులై నెలలో పర్యావరణ శాఖ వేసిన కమిటీ దీనిపై చర్చించింది. ఫారెస్టు రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ యీ ప్రాంతంలో ప్రత్యేక జాతులకు చెందిన బల్లులు, రాబందులు, ఎలుగుబంట్లు, పక్షులు, యింతా యితర ప్రాణులు వున్నాయని, తవ్వకాలకు అనుమతి యిస్తే యివన్నీ అంతరిస్తాయని చెప్పింది. 

విషయం ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలోని ప్రాజెక్టు మానిటారింగ్‌ గ్రూపు వద్దకు చేరేలోపులే రియో టింటో ఈ ఆగస్టులో 'మేం ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాం. 2016 డిసెంబరు లోపున అన్నీ సర్దుకుని వెళ్లిపోతాం.' అని ప్రకటించింది. 'ఈ ఆర్థిక సంవత్సరం తొలి సగంలో మా లాభాలు 47% తగ్గాయి. 12 ఏళ్లల్లో యిలాటి పరిస్థితి రావడం ప్రథమం. అందువలన మా యిన్వెస్టర్లకు సరైన రాబడి వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న తమ ప్రాజెక్టులన్నిటినీ సమీక్షించుకుంటున్నాం, యిక్కడి ఆలస్యాల వలన యీ ప్రాజెక్టు లాభదాయకం కాదని తేల్చుకుని తప్పుకుంటున్నాం' అని కూడా కంపెనీ అంది.

పుష్కరకాలంగా ఇంత పెట్టుబడి పెట్టి, శ్రమించిన కంపెనీ వజ్రాలు బయటపడే తరుణంలో యిలా తనంతట తానే తప్పుకోవడమేమిటాని పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారతదేశాన్ని మైనింగ్‌ హబ్‌గా, ఖనిజాల గనిగా రూపుదిద్దే ప్రయత్నంలో భారతప్రభుత్వం రియో టింటోకు అంతర్జాతీయ ప్రత్యర్థి ఐన ఆంగ్లో అమెరికన్‌ అనే కంపెనీని ఆహ్వానిస్తోందని వార్తలు రావడంతో రియో టింటో యిలా బెదిరింపులకు దిగిందా అనే ప్రశ్న వచ్చింది. ఎందుకంటే వెనుకబడిన బుందేల్‌ఖండ్‌లో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుంది. 

విరమించుకుంటూనే కంపెనీ 'మేము యీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితో యింకో కంపెనీ (థర్డ్‌ పార్టీ)ని భాగస్వామిగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాము.' అంది. ఇది వింతగా లేదా? ఆ కంపెనీ రిలయన్సు కంపెనీ కావచ్చనే మాటా వినబడుతోంది. రిలయన్సు పేరు వినిపించగానే అన్నీ సందేహాలే! రిలయన్సుకు అవకాశం కల్పించేందుకే రియోకు అనుమతులు తొక్కిపెట్టారా? రిలయన్సును ఆంగ్లో అమెరికన్‌కు భాగస్వామిగా తెచ్చి రియోను హడలగొట్టి పంపేస్తున్నారా? పర్యావరణవేత్తలు, గ్రామప్రజల పోరాటానికి దడిసి వజ్రాల వెలికితీత ఆగిందని యిప్పుడు అనుకుంటున్నాం కానీ, రిలయన్సు భాగస్వామ్యంతో ఏదో ఒక కంపెనీ ద్వారా మళ్లీ మైనింగ్‌ ప్రారంభమైతే మాత్రం దీనిలో మోసం వుందనుకోవాల్సి వస్తుంది. రిలయన్సు వస్తుందో రాదో కొన్నాళ్లకు కానీ తెలియదు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?