Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిబిఐ వెర్సస్‌ ఐబి - 2/3

2004, జూన్‌ 15 న ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు రాత్రి 11 గం||లకు గుజరాత్‌ పోలీసు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం - 'అహ్మదాబాదు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌కు ఉదయం 5 గంటలకు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. క్రైమ్‌ బ్రాంచ్‌వారు లష్కరే టెర్రరిస్టులుగా అనుమానించబడుతున్న ముగ్గురు మగవారిని, ఒక మహిళను అహ్మదాబాదు శివార్లలో కోటర్‌పూర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు దగ్గర్లో చంపడం జరిగింది. ఆ నలుగురిలో జిషాన్‌ జోహర్‌, అమ్జాద్‌ ఆలీ అక్బర్‌ అలీ రాణా పాకిస్తాన్‌ పౌరులు. జావేద్‌ షేక్‌ అనే అతను భారతీయుడే. వారికి సాయపడుతున్నాడు. వారితో పాటు వున్న మహిళ ఎవరో తెలియదు. నీలిరంగు ఇండికాలో వారు ముంబయి నుండి అహ్మదాబాదుకు మారణాయుధాలతో, బాంబులతో వస్తున్నారు. 14 రాత్రి వారిని అటకాయించి మర్నాడు ఉదయం 5 గంటల వరకు రెండు రివాల్వర్లు, రెండు ఎకె 56లతో 50 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఆ నలుగురూ మరణించారు. పోలీసులెవరూ చనిపోలేదు, గాయపడలేదు.'  

ఇష్రత్‌ జహాన్‌ తల్లి షమీమా కౌసర్‌ 2004 ఆగస్టులో తన కూతుర్ని బూటకపు ఎన్‌కౌంటర్లో హతమార్చారని ఆరోపిస్తూ, దానిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ గుజరాత్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. దానికి జవాబుగా 2006 జూన్‌లో అహ్మదాబాదు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎసిపి ఎన్‌కౌంటర్‌ సరైనదే అని జవాబిచ్చారు. దానిపై తృప్తి చెందని హైకోర్టు ఎస్‌పి తమాంగ్‌ అనే మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆధ్వర్యంలో న్యాయవిచారణకు ఆదేశించింది. ఈ తమాంగ్‌ రిపోర్టు 2009 సెప్టెంబరు 7 వరకు రాలేదు. అది వచ్చేందుకు నెల ముందు యుపిఏ ప్రభుత్వం షమీమా సిబిఐ విచారణ డిమాండు తోసిపుచ్చుతూ వాళ్లు టెర్రరిస్టులే అంటూ మొదటి ఎఫిడవిట్‌ దాఖలు చేసింది. రిపోర్టు వచ్చాక సెప్టెంబరు 29న రెండో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రెండిటి మధ్య అంతరం ఏమిటి అనేదే ప్రధానాంశం అయింది.

ఇష్రత్‌, తదితరులు టెర్రరిస్టులా కాదా అన్నది ఒక అంశం. జరిగిన ఎన్‌కౌంటర్‌ అసలుదా, బూటకపుదా అనేది మరో అంశం. భారతదేశంలో నకిలీ ఎన్‌కౌంటర్లు కోకొల్లలు. అవతలివాడు నక్సలైటు కావచ్చు, టెర్రరిస్టు కావచ్చు, చట్టం ప్రకారం ఎలా శిక్షించాలో అలాగే శిక్షించాలే కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఆ క్రమంలో వాళ్లు కేవలం టెర్రరిస్టులనే కాలుస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. అనుమానం చేతనో, పొరపాటు వలననో అమాయకులను కూడా కాల్చేయవచ్చు. ఆ తర్వాత వాళ్ల శవాల వద్ద నిషిద్ధసాహిత్యాన్నో, మారణాయుధాలనో పడేసి వాళ్లపై ముద్ర కొట్టేసి తాము చేసినది సవ్యమైనదే అని వాదించవచ్చు. ఎవరు అమాయకుడో, ఎవడు మాయలమారో తేల్చడానికి కోర్టులే ఏళ్లూపూళ్లూ తీసుకుంటాయి. అలాటిది పోలీసులు తామే నింద మోపి, తామే తీర్పు యిచ్చేసి, తామే శిక్ష అమలు చేసేస్తే ఎలా? పోయినవాడి కుటుంబానికి కుటుంబసభ్యుడి ప్రాణనష్టమే కాదు, పరువు నష్టం కూడా జరుగుతుంది.

అహ్మదాబాద్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌పి తమాంగ్‌ తన 247 పేజీల రిపోర్టులో ''ఈ నలుగుర్నీ క్లోజ్‌ రేంజ్‌లో కాల్చారు. ఎంట్రీ వూండ్‌ (గుండు శరీరంలోకి ప్రవేశిస్తూ చేసిన గాయం) కంటె ఎగ్జిట్‌ వూండ్‌ (బయటకు వెళ్లిపోతూ చేసిన గాయం) కంటె చిన్నదిగా వుంది. పోలీసులు 70 బుల్లెట్లు కాల్చామన్నారు. హత్యాస్థలం వద్ద ఒక్క బుల్లెట్టూ కనబడలేదు. కారుని ఎడమవైపు కాల్చామని, టైరును పేల్చేశామనీ, దాంతో అది డివైడర్‌ను కుడివైపు ఢీ కొట్టిందని అన్నారు. అదే నిజమైతే కారు ఎడమవైపుకి తిరగాలి, కానీ కుడివైపుకి తిరిగింది. ఆయుధాలు కాలిస్తే మిగలవలసిన అవశేషాలు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో కనబడలేదు. పోస్టుమార్టమ్‌ రిపోర్టు చూసినా పోలీసులు వాళ్లని వేరెక్కడో చంపి అక్కడకు తెచ్చి పడేసినట్లు, తుపాకులు వాళ్ల దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది. తమ ప్రమోషన్ల కోసం, వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడం కోసం కొందరు పోలీసు అధికారులు చేసిన బూటకపు ఎన్‌కౌంటరు యిది.' అని స్పష్టంగా చెప్పాడు.

సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు ప్రకారం ఆ నలుగురిని ఐబివారు, గుజరాత్‌ పోలీసులు కలిసి జూన్‌ 15 కి ముందే అదుపులోకి తీసుకున్నారు. జిషాన్‌ జోహర్‌ అనే అతన్ని ఏప్రిల్‌ చివరి వారంలో రప్పించి, అహ్మదాబాదులోని ఎస్‌-జి హైవే దగ్గర గోటా హౌసింగ్‌లో 164-165 యింట్లో వుంచారు. అమ్జాద్‌ అలీ అనే అతన్ని మే 26న తీసుకెళ్లిపోయి అహ్మదాబాదు శివార్లలో అర్‌హామ్‌ ఫార్మ్‌హౌస్‌లో దాచి వుంచారు. వీళ్లిద్దరూ పాకిస్తాన్‌ పౌరులు. అలాగే ఇష్రత్‌ జహాన్‌, జావేద్‌ షేక్‌లను వల్సాడ్‌ టోల్‌ బూత్‌ వద్ద జూన్‌ 12 న అదుపులోకి తీసుకుని ఖోడియార్‌ ఫార్మ్‌హౌస్‌లో దాచి వుంచారు. ఐబి, గుజరాత్‌ పోలీసు కలిసి వీరిని హతమార్చారు. దానికి రుజువుగా సిబిఐ గుజరాత్‌ పోలీసు శాఖ నుంచి డిఎస్‌పిగా పనిచేసి రిటైరైన డిఎచ్‌ గోస్వామి స్టేటుమెంటు దాఖలు చేసింది.  - ''2004 జూన్‌ 13 సాయంత్రం 7.30కి 8.30కి మధ్య నేను ఎటిఎస్‌ (యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌)లో పని చేస్తున్న జిఎల్‌ సింఘాల్‌ ఐపిఎస్‌ తో కలిసి జాయింటు కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు పిపి పాండే వుండే బంగళా నెంబరు 15కి వెళ్లాను. అక్కడ ఆయనతో బాటు గుజరాత్‌ డిప్యూటీ ఐజి వంజారా, ఐబి స్పెషల్‌ డైరక్టర్‌ రాజీందర్‌ కుమార్‌ వున్నారు. వాళ్లు లష్కరే ఆపరేషన్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. రాజీందర్‌ కుమార్‌ వంజారాతో ''దీని గురించి ముఖ్యమంత్రితో మాట్లాడండి.'' అన్నాడు. ''నేను తెల్లగడ్డం, నల్లగడ్డం (మోదీ, అమిత్‌ షా)తో మాట్లాడతాను లెండి.'' అన్నాడు వంజారా. మర్నాడు మధ్యాహ్నం సింఘాల్‌తో కలిసి షాబాగ్‌లోని వంజారా ఆఫీసుకి వెళ్లాం. వంజారా ఒక వ్రాతపూర్వకమైన ఫిర్యాదు రాసిన కాగితాన్ని సింఘాల్‌ చేతికి యిచ్చాడు. ముఖ్యమంత్రిని చంపడానికి కొందరు ఎల్‌ఇటి వారు కుట్ర పన్నారని దానిలో వుంది. సింఘాల్‌ దానిలో ఇష్రాత్‌ జహాన్‌ పేరు వుండడం గురించి విభేదించాడు.  డ్రాఫ్టు మారిస్తే మంచిదన్నాడు. కానీ వంజారా 'లేదు, నేను ముఖ్యమంత్రి, హోం మంత్రి ఆమోదం తీసుకున్నాను.' అని గట్టిగా చెప్పాడు.'' గోస్వామి యిచ్చిన ఈ స్టేటుమెంటు చూస్తే హతులను ముందుగా కస్టడీలోకి తీసుకుని తర్వాత వాళ్లను చంపేసి ఎన్‌కౌంటర్‌గా చూపించినట్లు స్పష్టమౌతుంది.  

తమాంగ్‌ నివేదికను ఆమోదిస్తే గుజరాత్‌ పోలీసుల కంటె ఎక్కువ విస్తృతి, సాధనసంపత్తి వున్న ఐబికే ఎక్కువ చెడ్డపేరు వస్తుంది. అందువలన కేంద్రం ఐబిని కాపాడదామని చూసింది. ఇటు గుజరాత్‌ ప్రభుత్వం తన అధికారులను కాపాడుకోవాలని చూసింది. అందుకే తమాంగ్‌ నివేదికపై గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. హైకోర్టు 'మేజిస్ట్రేటు ప్రభుత్వాధికారుల వాదనలు వినకుండానే యిలాటి నిర్ణయానికి రాకూడదు' అంది. అంతటితో ఆగలేదు, తమాంగ్‌పై విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ఛాలెంజ్‌ చేశారు. జస్టిస్‌ అభిలాషా కుమార్‌, జయంత్‌ పటేల్‌ వున్న సుప్రీం కోర్టు బెంచ్‌ హైకోర్టుతో ఏకీభవిస్తూనే ఎన్‌కౌంటరు అసలో, నకిలీయో తేల్చడానికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) ఏర్పాటు చేసింది. (ఆ సిట్‌ 2011లో హైకోర్టుకు యిచ్చిన నివేదికలో అది బూటకపు ఎన్‌కౌంటరని చెప్పింది. 2013 జులైలో సిబిఐ ఫైల్‌ చేసిన చార్జిషీటులో కూడా బూటకపు ఎన్‌కౌంటరే అంది, ఆ విధంగా మేజిస్ట్రేటు తమాంగ్‌ నివేదిక కరక్టే అని తర్వాతి రోజుల్లో తేలింది) 2009 నాటికి హైకోర్టు ఏమని అభిప్రాయపడినా తమాంగ్‌ రిపోర్టు చిదంబరాన్ని మెప్పించింది. 'హతులు టెర్రరిస్టులే అని బల్లగుద్ది చెప్పేసిన మొదటి అఫిడవిట్‌ నాకు చూపించలేదు,  తమాంగ్‌ రిపోర్టు వచ్చాక నాకు సందేహాలు వచ్చి మొదటి దానిలో మార్పులు చేసి, రెండోది దాఖలు చేయించాను' అన్నాడు చిదంబరం. అందుకే 'అతను లష్కరే సానుభూతిపరుడనుకుంటాను' అంటున్నాడు జైట్లే యిప్పుడు. ఇంతకీ రెండు అఫిడవిట్‌లలో ఏముంది? 

గుజరాత్‌ హైకోర్టులో ఆగస్టు 2009లో కేంద్రం హోం శాఖ తరఫున ఆ శాఖ సెక్రటరీ పిళ్లయ్‌ దాఖలు చేసిన మొదటి అఫిడవిట్‌లో (ఇది 2007లో సుప్రీం కోర్టులో యిచ్చినదే) హతులందరూ లష్కరే కార్యకర్తలని (ఆపరేటివ్స్‌), అది అసలైన ఎన్‌కౌంటరే అని రాసి వుంది. వాళ్లు టెర్రరిస్టులని నిరూపించడానికి చూపిన సాక్ష్యం ఏమిటో తెలుసా? అఫిడవిట్‌లోని 8 వ పేరా ప్రకారం - 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేపర్లు తమ 2004 జులై 15 వ సంచికలో లాహోర్‌ నుంచి వెలువడే ఘాజ్వా టైమ్స్‌లోని వార్తను పునర్ముద్రించాయి - ఆ ఘాజ్వా టైమ్స్‌ లష్కరే భావాలను ప్రతిబింబించే మౌత్‌పీస్‌. వాళ్లు రాసినదేమిటంటే - 'ఇండియన్‌ పోలీసులు తన భర్తతో కార్లో వెళుతున్న ఇష్రత్‌ అనే లష్కరే యాక్టివిస్టును చంపి, పరదా  లేని ఆమె శవాన్ని యితర ముజాహిదీన్లతో బాటు నేలమీద పడేసి బహిరంగంగా ప్రదర్శించారు' అని.

 ''...అంతే కాకుండా 2007 మే 2నాటి జమాత్‌ ఉద్‌ దవా (ఇది లష్కరే యొక్క మరొక మౌత్‌పీస్‌) ఒక న్యూస్‌ ఐటెమ్‌ వేసింది. ఇష్రత్‌ను గతంలో లష్కరే కార్యకర్తగా పేర్కొన్నందుకు ఆమె కుటుంబానికి క్షమాపణ చెపుతూ లష్కరే విడుదల చేసిన ప్రకటన అది. ఈ క్షమాపణ ఒక నాటకం.  ఇంకో 16 రోజుల్లో  మే 18 న పిళ్లయ్‌ సుప్రీం కోర్టులో తన అఫిడవిట్‌ దాఖలు చేస్తారని తెలిసి కోర్టును తప్పుదోవ పట్టించడానికి, భారత పోలీసులకు అప్రతిష్ఠ పాలు చేయడానికి చేసిన ప్రయత్నం యిది.'' ఇదీ అఫిడవిట్‌లోని 8 వ పేరా. ఇది ఐబి, గుజరాత్‌ పోలీసు వాదనలకు అనుగుణంగా వుంది సరే కానీ, దీనిలో వాళ్ల టెర్రరిస్టు కార్యకలాపాల ప్రస్తావన ఎక్కడ? ఎన్‌కౌంటరు జరిగిన నెల్లాళ్ల తర్వాత వచ్చిన న్యూస్‌పేపరు కటింగ్స్‌ చూపించి, వాటినే రుజువులనుకోమంటే ఎలా? ఇది కోర్టులో నిలిచే వ్యవహారం కాదని స్వతహాగా లాయరైన చిదంబరానికి తట్టి వుంటుంది. పైగా మేజిస్ట్రేటు తమాంగ్‌ తీర్పు వచ్చాక చిదంబరానికి మరింత జంకు పుట్టింది.

అందుకే ఎందుకైనా మంచిదని రెండో అఫిడవిట్‌ డిక్టేట్‌ చేశాడు. అందరితో చర్చించాక చేశానని, పిళ్లయ్‌తో కూడా మాట్లాడానని చిదంబరం అంటాడు, కాదని పిళ్లయి అంటాడు. ఏది ఏమైనా దానిలో వున్నదేమిటి? మొదటి ఎఫిడవిట్‌లోని 8 వ పేరాలో మేం యిచ్చిన సమాచారం యింటెలిజెన్సు యిన్‌పుట్స్‌ ప్రకారం కాకుండా ఫలానా విధంగా జరిగి వుంటుందని భావించి యిచ్చినది. (The contents of paragraph 8 of the said affidavit did not constitute intelligence inputs and the inference drawn in relation thereto in the subsequent portions of the Affidavit have been needlessly misinterpreted.) దానిలో ఆ అఫిడవిట్‌ తయారుచేసే సమయానికి ఆ హత్యలపై సెక్షన్‌ 176 కింద జ్యుడిషియల్‌ ఎన్‌క్వయిరీ జరుగుతోందని కేంద్రప్రభుత్వానికి తెలియదు. గుజరాత్‌ పోలీసుల చర్యలను సమర్థించడానికి ఆ అఫిడవిట్‌ ఉద్దేశించబడలేదు. నిజనిర్ధారణకై సిబిఐ చేత కాని, మరొక ఏజన్సీ చేత కాని విచారణ జరిపించాలని కోర్టువారు నిర్ణయిస్తే కేంద్రం ఆ తీర్పుకు తలొగ్గుతుంది. (the Central govt was not concerned with the merits of the action taken by the Gujarat polie and anything stated in the affidavit was not intended to support or justify the action of the state police.  If, on a proper consideration of the facts it is found that an independent inquiry and investigation has to be carried out, by the CBI or otherwise, the Union of India would have no objection to this and would abide by the decision of the Hon’ble court.))

ఇక్కడ మనం గమనించవలసిన దేమిటంటే - రెండో అఫిడవిట్‌లో హతులు టెర్రరిస్టులా కాదా అన్నదానిపై ఏ నిర్ధారణా లేదు. మా దగ్గర ఆ మేరకు సమాచారం లేదు, సిబిఐ చేత విచారణ జరిపించమంటే జరిపిస్తాం అనే హామీ మాత్రమే వుంది. అరకొర సమాచారంతో, న్యూస్‌ పేపరు రిపోర్టులపై ఆధారపడి, సిబిఐ విచారణకు అభ్యంతరం తెలుపుతూ పిళ్లయ్‌ రాసిన మొదటి అఫిడవిట్‌ కంటె యిది బాధ్యతతో రాయబడింది. చిదంబరం దీన్ని సెప్టెంబరులో సబ్మిట్‌ చేయించాడు. దీన్ని పట్టుకునే యిప్పుడు చిదంబరంపై వివాదం చెలరేగుతోంది. ఆలోచించి చూస్తే నాకు చిదంబరం ప్రవర్తనలో ఆక్షేపణీయమైనది ఏమీ కనబడటం లేదు. తమాంగ్‌ ఎత్తి చూపిన సాక్ష్యాధారాల బట్టి చూసినా, పోలీసులెవరూ గాయపడలేదన్న విషయం గుర్తించినా ఇది బూటకపు ఎన్‌కౌంటరు అనే అనుకోవచ్చు. 

ఎన్‌కౌంటరు బూటకం కావచ్చు కానీ కనీసం మగవాళ్లు ముగ్గురూ లష్కరే కార్యకర్తలై వుండడం బూటకం కాకపోవచ్చు. వారి తరఫున ఎవరూ గట్టిగా వకాల్తా తీసుకుని మాట్లాడటం లేదు. జావేద్‌ షేక్‌ తండ్రి చెప్పినది నిజమే అనుకున్నా, అతను ఆ సమయంలో పాకిస్తాన్‌లో కాకుండా కేరళలోనే వున్నా అతని జాతివిద్రోహ కార్యకలాపాల గురించి తండ్రికి తెలిసి వుండకపోవచ్చు.  సజీదా అనే అమ్మాయిని పెళ్లాడడం కోసం అతను ముస్లిముగా మారాడు. 2003లో దుబాయికి, 2004లో ఒమాన్‌కు వెళ్లాడు. దుబాయిలోనే అతనికి మతోన్మాదం నూరిపోశారని సజీదా పోలీసులకు చెప్పిందట. ఏది ఏమైనా అతను పోలీసు రికార్డుల్లో వున్నాడు. ముంబయి, పుణెలలో నాలుగు పోట్లాట (అసాల్ట్‌) కేసుల్లో బుక్కయ్యాడు. ఒమాన్‌లో వుండగా అమ్జాద్‌ అలీ పరిచయమయ్యాడు. సిబిఐ చార్జిషీటు ప్రకారం అమ్జాద్‌ అలీ రాణా పాకిస్తాన్‌లో భాల్వాల్‌ తహసీల్‌కు చెందినవాడు. అతనే జావేద్‌ను జీషాన్‌ జోహార్‌కు పరిచయం చేశాడు. జీషాన్‌ పాకిస్తాన్‌లోని గుజ్రన్‌వాలా కు చెందినవాడు. 2003లో శ్రీనగర్‌ వద్ద సరిహద్దు దాటుతూ పోలీసులకు దొరికాడట. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?