Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిబిఐ వెర్సస్‌ ఐబి - 3/3

కొన్ని కథనాల ప్రకారం యీ ముగ్గురు మగవాళ్లూ టెర్రరిస్టులు కారు. స్మగ్లర్లు, దొంగ నోట్ల పంపిణీదారులు. మన కరెన్సీని పాకిస్తాన్‌లో ముద్రించి ఇండియాలో చలామణీ చేస్తున్నారని ఎప్పణ్నుంచో రిపోర్టులు వస్తున్నాయి కదా, వీళ్లూ అలాటి బాపతే. ఈ జావేద్‌ షేక్‌పై ఆ మేరకు గతంలో కేసు కూడా వుంది. అతని దగ్గర అసలు పేరుతో ఒకటి, ముస్లిము పేరుతో మరొకటి రెండు పాస్‌పోర్టులున్నాయట. ఇలాటి దంధా చేసేవాళ్లతో పోలీసులు షరీకై వుంటారు. ఎక్కడో వాటాల దగ్గర తేడా వచ్చి వుంటుంది. లేపేసి వాళ్ల మీద టెర్రరిస్టు ముద్ర కొట్టి వుంటారు. బిల్డర్లను బెదిరించి డబ్బులు గుంజే బ్యాచ్‌తో ఆ వ్యాపారం చేయించినంత కాలం చేయించి, వాళ్లు దగా చేస్తున్నారన్న అనుమానం రాగానే యిదే రకమైన ముద్ర కొట్టి చంపేసిన ఘటనలూ విన్నాం. 

ఇక ఇష్రత్‌ దగ్గరకు వస్తే వాళ్లది బిహారుకు చెందిన కుటుంబం. మహారాష్ట్రకు వలస వచ్చి ఠాణే జిల్లాలో ముంబ్రాలో నివసిస్తున్నారు. తండ్రికి కనస్ట్రక్షన్‌ కంపెనీ వుండేద. 2002లో పోయాడు. తల్లి ఫార్మా పాకేజింగ్‌ యిండస్ట్రీలో పనిచేసేది. వాళ్లిద్దరికీ ఏడుగురు పిల్లలు. ఇష్రత్‌ రెండో సంతానం. కుటుంబపోషణకై చదువుతో బాటు ఎంబ్రాయిడరీ వర్కు, పిల్లలకు ట్యూషన్లు చెప్పడాలు చేసేది. జావేద్‌ వద్ద డబ్బుకోసం ఉద్యోగానికి చేరింది. ఇష్రత్‌ తల్లికి యీ ఉద్యోగం యిష్టం లేదు. అందువలన 2004 జూన్‌ 11న ఇష్రత్‌ తల్లికి చెప్పకుండా యింట్లోంచి బయలుదేరింది. ఆ రోజు నాసిక్‌కు చేరాక బస్సు స్టాండ్‌ బయట వున్న పబ్లిక్‌ ఫోన్‌ బూతు నుండి తల్లికి ఫోన్‌ చేసింది. ''జావేద్‌ అంకుల్‌ యింకా రాలేదు.'' అంది. కాస్సేపటికి మరో సారి కాల్‌ చేసి ''జావేద్‌ అంకుల్‌ వచ్చాడు కానీ ఎవరో కొత్తవాళ్లతో వచ్చాడు'' అని భయపడుతూ చెప్పి, మధ్యలోనే కట్‌ చేసింది. ఇదీ ఇష్రత్‌ తల్లి కథనం. జావేద్‌ తండ్రి కథనం, ఇష్రత్‌ తల్లి కథనం, సిబిఐ, సిట్‌ కథనాలు చేర్చి చూస్తే జావేద్‌కు ఏదో చెప్పి వంజారా అతన్ని అహ్మదాబాదుకి రప్పించి కొంతకాలం బందీగా వుంచాడనే అనిపిస్తుంది. ఆమెను మానవబాంబు అనుకోవడం కష్టం. టెర్రరిస్టు (లేదా స్మగ్లరు - ఎలా అనుకుంటే అలా) వద్ద ఉద్యోగిని మాత్రం అయి వుండవచ్చు. పేదరికం వలన రిస్కు తీసుకుని వారితో తిరిగి ఓ బూటకపు ఎన్‌కౌంటరులో ప్రాణాలు విడిచింది. 

ఎవరైనా జర్నలిస్టు అడవుల్లోకి వెళ్లి మావోయిస్టులతో యింటర్వ్యూ తీసుకుంటున్నా డనుకోండి. అప్పుడు పోలీసులు కాల్పులు జరిగితే అతనూ పోతాడు. అతనిపై మావోయిస్టు అనో మావోయిస్టు సానుభూతిపరుడనో, కొరియర్‌ అనో, కిడ్నాప్‌ కాబడినవారి తరఫున వచ్చిన మధ్యవర్తి అనో ముద్ర పడవచ్చు. కానీ మావోయిస్టే అని గట్టిగా చెప్పడం కష్టం. ఇష్రత్‌ది కూడా అలాటి కేసే కావచ్చు. ఆమె మోదీని చంపడానికి వచ్చిన మానవబాంబు అని ఐబి, గుజరాత్‌ పోలీసులు చెపుతున్నది నమ్మాలంటే దాన్ని వారు నిర్ద్వంద్వంగా నిరూపించాలి. మహారాష్ట్ర పోలీసులు కూడా తమ రికార్డుల్లో ఆమె నేరచరిత్ర లేదన్నారు. అది లేకపోవడం చేతనే ఇష్రత్‌ అంత్యక్రియలకు 10 వేల మంది సాధారణ ప్రజలు హాజరయ్యారు. మహారాష్ట్ర మైనారిటీ కమిషన్‌ విచారణ డిమాండ్‌ చేసింది. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిబిఐ విచారణ కోరతానన్నాడు. ఇష్రత్‌ టెర్రరిస్టు కాదని సిట్‌ అంది. సిబిఐ కోర్టులో జులై 2013లో చార్జిషీటు దాఖలు చేసినపుడు తమను టెర్రర్‌ లింకుల గురించి విచారించమని గుజరాత్‌ హైకోర్టు కోరలేదని, ఎన్‌కౌంటరు నికార్సయినదా, బూటకపుదా అనే అడిగారని బూటకపుదని తమ అభిప్రాయాన్ని చెప్పింది. ''సిబిఐ అలా చెప్పిన మూడేళ్ల తర్వాత కూడా నేరారోపణ జరగలేదు. విచారణ ప్రారంభం కాలేదు. ఎందుకు?'' అని ఇష్రత్‌ తల్లి తరఫున వాదిస్తున్న వకీలు వృందా గ్రోవర్‌ అడుగుతోంది. 

ఇష్రత్‌ గురించి అందరికీ వచ్చిన అనుమానమే జికె పిళ్లయికి కూడా వచ్చింది. 2013లో సిబిఐ చార్జిషీటు ఫైల్‌ చేసినప్పుడు అతను ''నేను ఇష్రత్‌కు 'బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌' (సందేహలాభం) యిస్తాను.  ఎందుకంటే ఆమెకు వ్యతిరేకంగా తిరుగులేని (కన్‌క్లూజివ్‌) సాక్ష్యం లభించలేదు.'' అన్నాడు. అదే పిళ్లయ్‌ యిప్పుడు చిదంబరంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. రెండో అఫిడవిట్‌ తనకు చూపించలేదని, అది రాజకీయ కారణాలతో తయారుచేశారని, ఐబి నుంచి హోం శాఖ నుంచి యిన్‌పుట్స్‌ (సమాచారం) ఏదీ తీసుకోకుండా తయారు చేశారని చెపుతున్నాడు. దాని పట్ల అభ్యంతరాలుంటే అప్పుడే చెప్పవచ్చు కదా అని అడిగితే 'చెప్పి వుండాల్సింది' అని వూరుకున్నాడు. అప్పుడు చెప్పకపోవడానికి, యిప్పుడు చెప్పడానికి కారణం ఒక్కటే - అప్పుడతను యుపిఏ ప్రభుత్వంలో ముఖ్యమైన ఉన్నతాధికారి. ఇప్పుడతను ఎన్‌డిఏకు అత్యంత ఆప్తుడైన అడానీ గ్రూపులో డైరక్టరు! ప్రస్తుత వుద్యోగం వలననే పిళ్లయి మాటల విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. 

''చిదంబరం అఫిడవిట్‌లో తప్పేముంది? ఇష్రత్‌కి బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ యిస్తానని మీరు మూడేళ్ల క్రితం అన్నారు కదా'' అని  పిళ్లయ్‌ని మీడియా అడిగితే 'ఆ సందర్భం వేరు' అంటూ '..యిప్పటికీ లష్కరేలో ఇష్రత్‌ సభ్యత్వం గురించి గట్టిగా ఏమీ చెప్పలేమనే అంటాను. అయితే ఆమె అవివాహిత అయి వుండి జావేద్‌ షేక్‌తో బాటు రాత్రుళ్లు హోటళ్లలో బస చేయడం, రిజిస్టర్లో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అని పేర్లు రాయించడం సవ్యంగా లేదు (సమ్‌థింగ్‌ ఎమిస్‌).  నా ఉద్దేశంలో ఏదో పొరపాటు జరుగుతోందని ఆమెకు తెలిసే వుంటుంది. బహుశా ఆమె కవర్‌ (నేరస్తులు తాము సాధారణ పౌరులమని చూపించుకోవడానికి ఉపయోగపడేవారు) కావచ్చు.'' అన్నాడు. ఈ వాదన నమ్మదగినదిగా వుంది. ముగ్గురు మగవాళ్లు టెర్రరిస్టులయి వుండవచ్చు. తోడుగా ఒక మామూలు ఆడపిల్ల కూడా వుంటే కుటుంబసభ్యులు కాబోలు అనుకుని పోలీసులు వదిలేస్తారనే అంచనాతో ఇష్రత్‌కు ఉద్యోగం పేరుతో వెంట తిప్పుతూ వుండవచ్చు. ఆమెకు వీళ్ల విషయం చూచాయగా తెలిసినా డబ్బు కోసం వీళ్ల వెంట తిరగడానికి ఒప్పుకుని వుంటుంది. దానికి ప్రాణాలతో మూల్యం చెల్లించింది. కానీ మనపాటికి మనం ఏదో అనేసుకుని తృప్తి పడితే చాలదు కదా, తక్కినవాళ్లు టెర్రరిస్టులు అని, యీమె సహాయకురాలని సాక్ష్యాలతో కోర్టును ఒప్పించాలి. ఐబి అటువంటి పని ఏమీ చేయలేదు. అనుమానం చేతనో, సమాచారం లభించో వాళ్లను కస్టడీలోకి తీసుకుని విచారణ సమయంలోనే వాళ్లను కాల్చివేశారు. వాళ్ల దగ్గర్నుంచి రాబట్టిన సమాచారం ఏమిటో బయటపెట్టడం లేదు.

పిళ్లయిలాగే ప్లేటు ఫిరాయించిన యింకో అధికారి ఆర్‌విఎస్‌ మణి. ఈయన హోం శాఖలో అండర్‌ సెక్రటరీగా చేశాడు. ఈయనది మరీ ఓవరాక్షన్‌. రెండో అఫిడవిట్‌పై సంతకం పెట్టమని, సబ్మిట్‌ చేయమని సిబిఐ, సిట్‌ తనను ఒత్తిడి చేసి, వెంటాడి, వేధించాయట. (ప్రెషర్‌డ్‌, ఛేజ్‌డ్‌, టార్చర్‌డ్‌) 'సిట్‌ చీఫ్‌ సతీశ్‌ వర్మ సిగరెట్లతో నా ప్యాంటు కాల్చి నన్ను హింసలు పెట్టాడు' అని చెప్పుకున్నాడు. అండర్‌ సెక్రటరీ స్థాయి అధికారిని యిలాటి హింస పెడతారని ఎవరైనా నమ్మగలమా? నిజంగా అలా జరిగితే ఆయన వెంటనే రాజీనామా చేసి బయటకు రావాలి. అప్పుడు నోరు విప్పే గట్స్‌ లేకపోతే యిప్పుడెలా వచ్చాయి? యుపిఏ పోయి ఎన్‌డిఏ వచ్చిందనా? ఈ కేసు విచారణలో వుండగానే కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం మారితే యీ స్టేటుమెంటు కూడా చుట్ట కాల్చి యిప్పించారని చెపుతాడా? యుపిఏ ప్రభుత్వంలో యీయన అంత చేతకాని దద్దమ్మలా, సిట్‌ చీఫ్‌ చేత పాంటు కాల్పించుకునే స్థితిలో వుండేవాడా?

గుజరాత్‌ ఎటిఎస్‌లో వున్న జిఎల్‌ సింఘాల్‌ తనకు గుజరాత్‌ డిజిపి పిపి పాండేకు జరిగిన సంభాషణను టేప్‌ చేసి, సిబిఐకు సబ్మిట్‌ చేశాడు. దాని సారాంశం యిది - పాండే - ''కేంద్ర హోం శాఖ తరఫున గుజరాత్‌ హైకోర్టులో సబ్మిట్‌ చేసే అఫిడవిట్‌పై సంతకం చేయడానికి రేెపు ఢిల్లీ నుంచి అండర్‌ సెక్రటరీ (ఆర్‌విఎస్‌ మణి) వస్తున్నాడు. అభిచందానీ (అడ్వకేట్‌) ద్వారానే సబ్మిట్‌ చేస్తాడు. మణిని జాగ్రత్తగా హేండిల్‌ చేయమని అభిచందానీకి చెప్పు. పని సరిగ్గా చేస్తే అతన్ని హైకోర్టు జడ్జి చేస్తామని చెప్పు.'' దీన్ని బట్టి తెలిసేదేమిటి? మణి లాకాయిలూకాయి మనిషి కాదు, రెండో అఫిడవిట్‌ తమ వాదనకు వ్యతిరేకంగా వుండకూడదని గుజరాత్‌ పోలీసులు సకలయత్నాలు చేశారు. 

సుప్రీం కోర్టు ఆదేశించినా సిట్‌ ఏర్పాటు అంత సులభంగా సాధ్యపడలేదు. దానిలో పని చేయడానికి ఆఫీసర్లను సేకరించడం కష్టమైంది. బిజెపి పాలిత రాష్ట్రాల వారు తమ ఆఫీసర్లను పంపలేమన్నారుట. చివరకు కేంద్రం అధీనంలో వున్న అధికారులతో, కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో పనిచేసే అధికారులతో సిట్‌ కర్నేల్‌ సింగ్‌ అనే ఆయన ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆయనను మిజోరామ్‌ నుంచి రప్పించారు. నాలుగు టీముల్ని తయారుచేసి శ్రీనగర్‌, ఢిల్లీ, లఖనవ్‌, నాసిక్‌లకు పంపి ఇష్రత్‌ టెర్రరిస్టు లింకుల గురించి వాకబు చేయించాడు. ఆయన ఎయిమ్స్‌లో పని చేసే డా|| టిడి డోంగ్డా, సిఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి డా|| రాజీందర్‌ సింగ్‌లతో ఫోరెన్సిక్‌ టీము ఏర్పరచాడు. 

''సిఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుడు ఎన్‌కౌంటరు అసలైనదే అని రిపోర్టు యిచ్చినా సిట్‌కు తర్వాత అధిపతిగా వచ్చిన సతీశ్‌ వర్మ దాన్ని పక్కకు పెట్టేశాడు. ఎందుకు?'' అని అడుగుతున్నాడు ఐబి స్పెషల్‌ డైరక్టర్‌ రాజీందర్‌ కుమార్‌. యుపిఏ ప్రభుత్వం తనను బలి పశువును చేసిందని అనే అధికారుల్లో అతనూ ఒకడు. 2015 ఫిబ్రవరిలో ''గుజరాత్‌లోని సీనియర్‌ కాంగ్రెసు నాయకుడే సిబిఐ చేత కుట్ర చేయిస్తున్నాడు. ఇష్రత్‌ కేసులో మోదీని యిరికిస్తే నాకేవేవో యిస్తామని ఆశ పెట్టారు.'' అని చెప్పుకుంటున్నాడు. అతనూ, ఐబి చీఫ్‌ అసిఫ్‌ ఇబ్రహీమ్‌ - ''2004 ఫిబ్రవరిలో  లష్కరే టెర్రరిస్టు అయిన ఎహసాన్‌ ఇలాహీ అనే అతన్ని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కాల్చి చంపారు. ఆ సంఘటన ఆధారంగా ఐబి విచారణ సాగించి జావేద్‌ పథకాన్ని కనుగొంది. గుజరాత్‌ పోలీసులకు ఉప్పందించింది. అతని వాదన ప్రకారం - అమ్జాద్‌ అలీ రాణా పాకిస్తాన్‌ నుంచి సరిహద్దు దాటుతూండగా కాల్పులకు గురయ్యాడు, అతని గాయాలకు చికిత్స జరిగింది. ఎన్‌కౌంటరు జరిగేందుకు ముందు రోజు టెర్రరిస్టులు పాకిస్తాన్‌కు 23 కాల్స్‌ చేశారు.  హతులను ఎక్కడో చంపి అక్కడకు తీసుకుని వచ్చి పడేశారని సిబిఐ వాదించేది తప్పని సూరత్‌లోని శక్తి మోటార్స్‌ వర్క్‌షాప్‌లోని మోటార్‌ మెకానిక్‌ మనోజ్‌ కుమార్‌ యిచ్చిన స్టేటుమెంటు చూస్తే తేటతెల్లమౌతుంది. 2004 జూన్‌ 14న సాయంత్రం 6.30కు తన వద్దకు నీలం ఇండికాలో ఒక మగ, ఒక ఆడమనిషి వున్నారని వాళ్లు ఇంజన్‌ ఆయిలు, ఫిల్టర్‌ మార్పించుకున్నారని అతను చెప్పాడు.'' అని వాదిస్తారు. 

సిబిఐ విచారణను ఐబి అడుగడుగునా అడ్డుకుంటూనే వుంది. ''ఐబి ఆఫీసర్ల టూరు రికార్డులు యిమ్మనమని మేం కోరినా వాళ్లు యివ్వలేదు. అవి నాశనమై పోయాయని చెప్పారు. వారి సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డులు యిమ్మనమన్నాం. అవీ యివ్వలేదు.'' అంటున్నాడు ఒక సిబిఐ అధికారి. ఐబి శాఖ సిబిఐ డైరక్టరు రంజిత్‌ సిన్హాపై ఒత్తిడి తెచ్చింది. అతను తన జూనియర్లతో ''ఐబి అధికారుల పేర్లు ప్రస్తావించకుండా వుండే వీలుందా?'' అని అడిగాడట. ''ఇది ఐబితో కలిసి చేసిన జాయింటు ఆపరేషన్‌ అని అరెస్టయిన గుజరాత్‌ పోలీసులు చెపుతున్నపుడు ఐబి అధికారులను మాత్రం వదిలేయడం ఎలా కుదురుతుంది? ఎన్‌కౌంటరు అసలైనదే అని ప్రకటిస్తేనే అందర్నీ బయటపడేయవచ్చు కానీ ప్రతికూలసాక్ష్యాలు యిన్ని కనబడుతున్నపుడు అలా చేయడం సాధ్యమా?'' అని జూనియర్లు అడిగారట. సిబిఐకు డైరక్టరుగా, ఐబికి జాయింటు డైరక్టరుగా పనిచేసిన ఆర్‌కె రాఘవన్‌ మార్చిలో ''హిందూ''లో వ్యాసం రాస్తే సిబిఐ, ఐబిలలో ఎవరి వాదన కరెక్టో రాస్తారనుకున్నాను. ఆయన రెండిటిలోనూ పనిచేశాడు కాబట్టి ఎటూ తేల్చకుండా రెండు కలిసి పనిచేయాలి అంటూ సంపాదకీయంలా రాశాడు.  

ఐబి ఏం చెప్పినా, సిట్‌ 2011లో గుజరాత్‌ హైకోర్టుకు సబ్మిట్‌ చేసిన రిపోర్టులో అది ఫేక్‌ ఎన్‌కౌంటరే అని చెప్పింది. అప్పుడు హైకోర్టు కేసును సిబిఐకు అప్పగించింది. సిబిఐ అదే అభిప్రాయానికి వచ్చింది. 20 మంది అధికారులపై నేరాలు మోపింది. మరో రెండేళ్లు పోయాక 2013లో మరో 7గురిపై చేసింది. హతుల శరీరాల్లో దొరికిన తుపాకీ గుళ్లకు, కాల్పుల్లో వుపయోగించామని చెప్పిన తుపాకీలకు పోలిక లేదట. గుజరాత్‌ పోలీసులను అరెస్టు చేయించాక 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయాల్సిన సిబిఐ అలా దాఖలు చేయకపోవడంతో వాళ్లందరికీ బెయిలు దొరికింది. సిబిఐ ఎందుకలా చేసింది? ఐబి హోం శాఖపై తీసుకుని వచ్చిన ఒత్తిడా? అలా అయినా సిబిఐ 2014 ఫిబ్రవరి వచ్చేసరికి నలుగురు ఐబీ అధికారులపై కూడా అభియోగాలు చేసింది. బూటకపు ఎన్‌కౌంటరు జరిపిన ఐబి అధికార్లను ప్రాసిక్యూట్‌ చేయడానికి సిబిఐ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. 

కానీ యుపిఏ ప్రభుత్వం ఆ అనుమతి యివ్వలేదు. అయినా సిబిఐ వారికి వ్యతిరేకంగా సప్లిమెంటరీ చార్జిషీటు ఫైల్‌ చేసింది. ఇష్రత్‌, జావేద్‌లను ఐబి అధికారులు ముంబయిలో అదుపులోకి తీసుకుని, అక్కడే ఒక 'సేఫ్‌ హౌస్‌'లో నిర్బంధించి గుజరాత్‌ పోలీసులకు అప్పగించారని, అలా చేసిన నలుగురు ఐబి ఆఫీసర్లకు ప్రతికూలంగా సాక్ష్యాలు సేకరించామని సిబిఐ అంటోంది. ఆ నలుగురిలో ఐబి స్పెషల్‌ డైరక్టరు రాజీందర్‌ కుమార్‌ కూడా వున్నాడు. తక్కినవారు పి మిత్తల్‌, ఎంకె సిన్హా, రాజీవ్‌ వాంఖాడే. తమ 1500 పేజీల చార్జిషీటులో కాల్పులు జరిగినపుడు చూసిన ప్రత్యక్షసాక్షుల సాక్ష్యాలు కూడా వున్నాయిట. వారిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతి యిచ్చి వుండకూడదని అసిఫ్‌ ఇబ్రహీమ్‌ అంటాడు. ఆయన 2013 జూన్‌లో ప్రధానికి కార్యాలయానికి, హోం శాఖకు ''ఇష్రత్‌ లష్కరే కార్యకర్త అని, మోదీని, ఆడ్వాణీని చంపడానికి సమకట్టిందని ఐబి దగ్గర బోల్డు సాక్ష్యం వుంది'' అని చెప్పాడు. మరి అంత సాక్ష్యం వుంటే విదేశీ పత్రికల రిపోర్టులు, డేవిడ్‌ హెడ్లీ సంభాషణపై ఆధారపడడం దేనికో అర్థం కాదు. 

 డేవిడ్‌ హెడ్లీ ప్రకటన రాగానే గుజరాత్‌ ప్రభుత్వం హమ్మయ్య అనుకుంది. కేంద్రంలో బిజెపి వచ్చిన దగ్గర్నుంచీ గుజరాత్‌ ప్రభుత్వం కేసులో యిరుక్కున్న పోలీసు అధికారులు ఒకరొకరిని వదిలేస్తోంది. మళ్లీ ఉద్యోగాల్లో నియమిస్తోంది. ప్రమోషన్లు యిస్తోంది. పిపి పాండేను 2015 ఫిబ్రవరిలో బెయిలు మీద బయటకు వచ్చిన మూడు రోజులకే ఉద్యోగంలో నియమించి అతన్ని జైలుకి పంపిన సతీశ్‌ వర్మకు వ్యతిరేకంగా పెట్టిన కేసుకి యిన్‌చార్జిగా నియమించింది. ఇక కేంద్ర హోం శాఖ ఐబి అధికారులను ప్రాసిక్యూట్‌ చేయడానికి సిబిఐకు అనుమతి నిరాకరించింది. సిబిఐ స్వతంత్రించి ముందుకు వెళ్లలేదన్నది సర్వవిదితం. సిబిఐ 2014లో అహ్మదాబాదు కోర్టులో వేసిన కేసు పెండింగులోనే వుంది. గతంలో అయితే ఐబి, సిబిఐ కొట్లాడుకుంటూ వుంటే కేంద్రం ఎటు చెప్పాలో తేల్చుకోలేకపోయింది. ఇప్పుడు మోదీ ప్రధానిగా వచ్చాక ఐబికి బలం పెరిగింది ఎందుకంటే దానితో పాటు సహనిందితురాలిగా వున్న గుజరాత్‌ పోలీసు వ్యవస్థను కాపాడడానికి మోదీ నిశ్చయించుకున్నారు. అందువలన సిబిఐ ఏమీ చేయలేదు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న నమ్మకం లేదు. 

విషయాలన్నీ చదివాక నాకు తోచినది (మీకు మరోలా తోచవచ్చు) - ముగ్గురు మగవాళ్లు టెర్రరిస్టులో కాదో కానీ సంఘవ్యతిరేక శక్తులే. ఇష్రత్‌కు వారి సంగతి తెలిసి కూడా వారితో పాటు తిరిగి నేరంలో పాలు పంచుకోకపోయినా ఆక్యుపేషనల్‌ హజార్డ్‌గా ప్రాణం పోగొట్టుకుంది. అది బూటకపు ఎన్‌కౌంటరే! ఐబి, గుజరాత్‌ పోలీసులు చేసినది ఆ విషయంలో తప్పే. సంఘవ్యతిరేక శక్తులను (బహుశా టెర్రరిస్టులను) బహిరంగంగా అరెస్టు చేసి, వారి ద్వారా రహస్యాలు లాగి, మరిందరు టెర్రరిస్టులను బంధించే బదులు వీరిని నిర్బంధించి చంపేశారంటే ఏదో మర్మం వుంది. ఆ మర్మమేమిటో కనుగొని ఐబిపై పైచేయి సాధిద్దామని సిబిఐ ప్రయత్నించింది కానీ కేంద్రం దాన్ని అప్పుడు కానీ, యిప్పుడు కానీ ముందుకు సాగనీయటం లేదు. అది పంజరంలో చిలక అని మరొక్కమారు రుజువైంది. - (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?