Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం - వేట - 3

ఎమ్బీయస్‌ : సినీమూలం - వేట - 3

హీరో తన వద్ద వున్న వజ్రాలను ఆశపెట్టి శత్రువులు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు. ఆ తర్వాత సుమలతను రక్షించి, నాదీ, మీ నాన్నగారిదీ పగ తీర్చుకుని ఐశ్వర్యం నీకు అప్పగించి వెళ్లిపోతానని చెప్పాడు. తర్వాత నూతన్‌ప్రసాద్‌ నడిపే బ్యాంకుకి వెళ్లి కోటి రూపాయలు డిపాజిట్‌ చేసి అతని నమ్మకాన్ని చూరగొన్నాడు. పోలీస్‌ సెక్యూరిటీ కావాలంటూ రంగనాథ్‌తో పరిచయం పెంచుకున్నాడు. సుమలతను ప్రిన్సెస్‌ ఆఫ్‌ యానాంగా పరిచయం చేసి ఆమె వద్ద 100 ఎకరాల అభ్రకం గనులున్న భూమి వుందని నూతన్‌ప్రసాద్‌కి చెప్పాడు. నూతన్‌ప్రసాద్‌ కస్టమర్ల డబ్బుతో భూమి కొనేశాడు. తీరా చూస్తే అది స్మశానం. ఊళ్లోవాళ్లు తన్నబోయారు. కస్టమర్లు తమ డిపాజిట్లు వెనక్కి యిమ్మనమని మీద పడ్డారు. 'వాళ్ల నుండి నిన్ను రక్షిస్తాను రా' అంటూ హీరో అతన్ని బంధించాడు. తనెవరో చెప్పాడు. డబ్బు కోసమే కదా యిన్ని పాపిష్టి పనులు చేశావ్‌, డబ్బు తిను అంటూ బలవంతంగా తినిపించాడు. తినలేక అతను చచ్చిపోయాడు.

పుస్తకంలో యీ పాత్ర పేరు డాంగ్లర్‌. అతను బాంకు నడుపుతూ, షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. సైనికాధికారి కొడుక్కి తన కూతుర్ని యిద్దామనుకున్నాడు. హీరో ఇతనికి హితైషిగా నటిస్తూ, యితని భార్యకు అక్రమంగా పుట్టినవాణ్ని  గొప్పింటివాడిగా పరిచయం చేసి, అల్లుడిగా చేసుకోమని సలహా చెప్పాడు. అంతేకాదు, తప్పుడు సమాచారాన్ని పంపించి షేర్‌మార్కెట్లో నష్టం వచ్చేట్టు చేశాడు. డాంగ్లరూ, సైనికాధికారీ కలహించుకునేట్టు చేశాడు. ఇతనిద్వారా అతని పరువు తీయించాడు. తర్వాత కొంతకాలానికి అక్రమసంబంధం విషయం బయటకు వచ్చేట్టు చేసి, యితని మానమర్యాదలు లేకుండా చేశాడు. దాంతో డాంగ్లర్‌ 50 లక్షల ఫ్రాంకులతో పారిపోతే రోమ్‌లో తన అనుచరులైన దొంగలతో పట్టించాడు. వాళ్లు ఖైదు చేసి డబ్బు లాక్కోకుండా 'కోడిమాంసం కావాలంటే లక్ష ఫ్రాంకులు, నీళ్లు కావాలంటే పాతికవేలు' యిలా డిమాండ్‌ చేశారు. డబ్బుకు, ప్రాణానికి లంకె అయిన యిలాటివాడు నానాయాతన పడతాడు. చివరిలో హీరో అతన్ని క్షమించి వదిలేస్తాడు. ఇతను సర్వనాశనం అయిపోయి, అకాల వృద్ధాప్యం తెచ్చుకుంటాడు.

ఇక న్యాయాధికారి వంతు. విప్లవకారుడైన అతని తండ్రి ఎన్‌కౌంటర్‌లో పోయాడు. గుర్తుపట్టమని పిలిస్తే నా తండ్రి కాదు పొమ్మనమన్నాడు. కానీ వూరంతా పోస్టర్లు వెలిశాయి - ఈ బ్రిటిష్‌ న్యాయాధికారి తండ్రి ఓ విప్లవకారుడు అని. ఎవరో వెనక్కాల వుండి యిదంతా చేయిస్తున్నారు అనుకున్నాడు. అంతలో అతనికో వుత్తరం వచ్చింది అడవిలోకి వస్తే వారెవరో తెలుస్తుందని. పుస్తకంలో యిలా వుండదు. ఈ న్యాయాధికారి రెండో భార్యకు హీరో విషప్రయోగం నేర్పుతాడు. ఆమె సవతి కూతుర్ని, ఆమె తాత, అమ్మమ్మలను చంపేసి ఆస్తి కాజేద్దామని వాళ్లను విషంతో చంపేస్తుంది. అది బయటపడుతుంది. ఊళ్లో అల్లరి అవుతుంది. పైగా డాంగ్లర్‌ భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నది యీ న్యాయాధికారే అన్న విషయం కూడా బయటకు వచ్చింది. దాంతో అతని పరువు పోతుంది. అతని భార్య తన కొడుక్కి విషం యిచ్చేసి, తనూ తాగేసింది. ఇతనికి పిచ్చి ఎక్కింది. 

తెలుగు సినిమాకు వస్తే - ఈ సంఘటనలతో మెయిన్‌ విలన్‌కు అనుమానం వచ్చింది. గవర్నరువద్దకు వెళ్లి అతను యిచ్చిన పరిచయపత్రం గురించి అడిగాడు. అతను యిది నేను రాసినది కాదు, ఫోర్జరీ అన్నాడు. దాంతో యీ మలబారు రాజా బోగస్‌ అని తెలిసిపోయింది. ఇంతలో ఓ వుత్తరం వచ్చింది. ఫలానా అడవికి వస్తే నిజానిజాలు తెలుస్తాయని. పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఇవతల హీరో, అతని వద్ద వుంటున్న సుమలత ఆఖరిపోరాటానికి సిద్ధమయ్యారు. సంగతి తెలిసి జయప్రద కొడుకుతో సహా అడవికి వచ్చేసింది. పుస్తకంలో యిలా వుండదు. సైనికాధికారి గ్రీసురాజును మోసగించిన విషయం పత్రికలలో వచ్చేట్టు చేశాడు హీరో. అతని కొడుకు తండ్రికి అవమానం జరిగిందని బాధపడి హీరోతో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు అతని తల్లి హీరో వద్దకు వెళ్లి పుత్రభిక్ష పెట్టమని అడిగింది. అతను సరేనంటూనే వీళ్లంతా తనను ఎలా మోసగించారో చెప్పాడు. ఆమె కొడుక్కి అంతా చెప్పింది. కొడుకు తండ్రిని అసహ్యించుకుని, ఆస్తిపాస్తులు వదిలేసుకుని తల్లితో సహా వూరు వదలి వెళ్లిపోయాడు. భార్యాబిడ్డలిలా చేయడంతో అవమానపడి సైనికాధికారి హీరో వద్దకు వెళ్లి ఎందుకిదంతా చేశావు? అని అడిగాడు. తనెవరో చెప్పాడు హీరో. సైనికాధికారి యింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలుగు సినిమాలో జయప్రదకు హీరో చచ్చిచపోయాడని చెప్పినందుకు భర్తను అసహ్యించుకుని, తన కొడుకు నీకు పుట్టినవాడే, వాణ్ని తీసుకుని పారిపో అని ఉత్తరం రాసి హీరోకి పంపింది. అది విలన్‌ చేతపడింది. అప్పుడతను కసితో భార్యను చంపేశాడు. హీరో విలన్‌ను చంపేసి, బిడ్డను రక్షించాడు.  హీరోపై ఆశలు పెంచుకున్న సుమలత అతనికి దగ్గరయింది. ఈ సుమలత పాత్ర పుస్తకంలో ఎలా వుంటుందంటే - ఆమెను తన ఓడ యజమాని కొడుక్కి యిచ్చి పెళ్లి చేయాలని హీరో అనుకున్నాడు. కానీ అతను న్యాయాధికారి పెద్ద భార్య కూతుర్ని ప్రేమించాడు. న్యాయాధికారి కుటుంబాన్ని యావత్తూ నాశనం చేద్దామనుకున్నా అతనికోసం  ఆ అమ్మాయిని బతికించి పెళ్లి చేశాడు హీరో. ఇక ఈ అమ్మాయిని తన కూతురిగా స్వీకరిద్దామనుకుంటే వయసులో తేడా వున్నా నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో అంది. సరేనని ఆమెను పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టో. తెలుగు సినిమాలో సుమలత హీరోపై ఆశలు పెంచుకున్నట్టు మధ్యలో డ్రీమ్‌ సాంగ్‌ ద్వారా సూచించారు. 

నిజానికి కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టో వంటి బృహద్గ్రంథాన్ని తెర కెక్కించడం సాహసమే. కానీ మన పరిమితుల మేరకు చాలా బాగా ఎడాప్ట్‌ చేశారనే చెప్పాలి. హీరోగా చిరంజీవి చాలా పవర్‌ఫుల్‌గా నటించారు. (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?