Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - అక్కాచెల్లెలు - 2/2

పాపం యిదంతా హీరోకి తెలియదు. తను గౌరవింటే జడ్జి హంతకుడని తను వేలెత్తి చూపకుండా ఆయనంతట ఆయనే బయటపడతాడేమోనని యితని ఆశ. చివరకి కోర్టు రూములో ఓ డ్రామా ఆడాడు. నాకో వుత్తరం వచ్చింది. గ్లాసు మీద వేలిముద్రలు అతనివేట. అతను సాక్షిట. కోర్టులోనే వున్నాడట. ఐదు నిమిషాలు టైమిస్తున్నాడట. హంతకుడు తనంతట తానుగా బయటపడకపోతే తనే బయటపెట్టేస్తాడట. అలా అని వాచీ పట్టుకుని దాని కేసి చూస్తూ నిలబడ్డాడు. ఐదు నిమిషాలు పూర్తి కావస్తూండగా, నానా పల్సికర్‌ (ముద్దాయి) నేనే హంతకుణ్ని అని అరిచేడు. ఇలా కథ అడ్డం తిరగడంతో హీరో బిత్తరపోయాడు. తర్వాత విడిగా వెళ్లి అడిగితే హీరోయిన్‌ సాక్షిని కొనేసిందని అర్థమైంది. ఇక దాంతో వుండబట్టలేక పోయాడు. ఇక యీ జడ్జి ఎప్పటికీ బయటకు రావటం లేదని, తనే నిండు కోర్టులో అతనిపై ఆరోపణ చేశాడు. 'నువ్వే హంతకుడివి. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని' అని.

అంతే, జడ్జి సస్పెండయ్యాడు. కొత్త జడ్జి వచ్చాడు. ఆయనెవరో కాదు, ఈ జడ్జితో పందెం వేసిన జస్టిస్‌ ఝా. తను హత్య చేసి తప్పించుకోగలనన్న ధైర్యంతో జడ్జి యీ హత్య చేశాడా అన్న అనుమానం ఆయనకూ వచ్చింది. అశోక్‌కుమార్‌ తన కేసు తనే వాదించుకోసాగాడు. దురదృష్టవశాత్తూ పరిస్థితులు జడ్జికి ప్రతికూలంగా వున్నాయి. ఆయన కొడుకు సేఠ్‌ వద్ద అప్పుచేశాడు. కూతురు సాక్షిని కొనే ప్రయత్నం చేసింది. ఆయన తన డైరీలో ఛాలెంజ్‌ గురించి రాసుకున్నాడు. అన్నీ వెలుగులోకి వచ్చినా ఆయన నేరం ఒప్పుకోలేదు. లాయర్ను ఎదురు ప్రశ్నించసాగాడు. 'ప్రియురాలి కోసం నువ్వే చంపావేమో? సేఠ్‌ ఖాళీ ప్రామిసర్‌ నోటు వుత్తినే నీ చేతిలో పెట్టాడంటే ఎలా నమ్మాలి?' అని. దాంతో హీరో బిత్తరపోయాడు. మీరు నేరం ఎందుకు ఒప్పుకోరు పప్పా, అని ఏడ్చాడు. నా నెత్తిమీద చేయిపెట్టి ప్రమాణం చేయి అన్నాడు జడ్జి. చేశాడు హీరో. 'ఇక నా డిఫెన్సులో నేను చెప్పుకునేది ఏమీ లేదు' అన్నాడు జడ్జి నిస్పృహతో. 

ఇక కేసు ముగింపుకు వచ్చింది. జ్యూరీ కూడా జడ్జిగారే గిల్టీ అంది. ఆ దశలో కొత్త సాక్ష్యం ప్రవేశపెట్టబడింది. అశోక్‌కుమార్‌ పోలికలతో వున్నతని శవం! అతను హీరో కారు దొంగిలించి పారిపోతూ యాక్సిడెంటులో చనిపోయాడు. చనిపోతూ యిచ్చిన కన్ఫెషన్‌లో తను సేఠ్‌ను ఎందుకు చంపాడో చెప్పాడు. దాంతో జడ్జిగారు విడుదలయ్యాడు. అయితే అప్పుడు అతను ఒక వుపన్యాసం యిచ్చాడు. సాక్షుల సాక్ష్యంపై ఆధారపడి ఉరిశిక్ష విధించడం ఎంత ప్రమాదమో చెప్పాడు. కళ్లు కూడా మోసం చేస్తాయని తెలిసింది కదా. నిజాయితీపరుడైన హీరో నోరు విప్పితే నిర్దోషినైన నేను ఉరికంబమెక్కుతాను. నోరు విప్పకపోతే మరో నిర్దోషి ఆ దొంగ ఉరికంబమెక్కుతాడు. చదువుకున్న నా కూతురు కూడా తన ప్రియుడే హత్య చేశాడనుకుని ఆ దొంగ ఉరికంబ మెక్కుతున్నా నోరు తెరవలేదు. తీరా తెరిస్తే అబద్ధాలు చెప్పింది. చదువుకున్నవారే, సంస్కారవంతులే యిలా వుంటే యిక మామూలు మనుష్యుల పరిస్థితి ఎలా వుంటుంది. ఇలాటి కూటసాక్ష్యాలపై ఆధారపడి మనం వురిశిక్ష వేసేస్తే ఎలా? తర్వాత నిజానిజాలు బయటకు వస్తే తప్పు సవరించుకోలేం కదా! ప్రాణం యివ్వగలిగిన వాడు, తీసుకోగలిగినవాడు ఆ పైవాడే. మనకు ఆ హక్కు లేదు. అంటాడు. అశోక్‌ కుమార్‌ ఆ స్పీచి అదరగొట్టేశారు. ఇదీ హిందీ సినిమా. 

ఇక తెలుగు సినిమాకు వస్తే - దీనిలో హీరో నాగేశ్వరరావు జడ్జిగారు. ఆయనకు యింకా పెళ్లి కాలేదు. ఆయనకో తల్లి, లా చదువుతున్న తమ్ముడు కృష్ణ వున్నారు. గుమ్మడి వాళ్ల యింటిని ఎప్పటినుండో ఆశ్రయించుకుని వుంటున్న గుమాస్తా. జానకి ఓ పేదరాలు. గుమ్మడికి బంధువు. పెళ్లి చేసుకోకుండా చెల్లి విజయనిర్మల కోసం త్యాగాలు చేస్తూ వుంటుంది. చెల్లిని లా చదివించి లాయర్ని చేయాలని ఆమె పట్టుదల. ఆ చెల్లెలు జడ్జిగారి తమ్ముడు కృష్ణను ప్రేమించింది. పట్నంలో చదువుతోంది. పరీక్షలకోసం డబ్బు కావాలని అక్కకు రాసింది. అక్క యిల్లు అమ్మేసి, కూలిపని చేసి చెల్లెలికి డబ్బు పంపించింది. చివరకి యిదంతా తెలిసి చెల్లి బాధపడింది. అక్క పెళ్లి చేసుకుని సుఖపడాలని కోరుకుంది. ఆ సమయంలో జడ్జిగారు అక్కను పెళ్లి చేసుకుంటానని గుమ్మడి ద్వారా ప్రతిపాదన పంపారు. ఆమెకు చదువు రాకపోయినా, త్యాగశీలత చూసి చేసుకుంటానన్నారు. అక్క వద్దంది. నువ్వు జడ్జి గారిని చేసుకుంటే నా కెరియర్‌కు లాభదాయకం అని చెప్పి చెల్లి ఒప్పించింది. అక్క అన్నగారిని పెళ్లి చేసుకుంటే తను తమ్ముణ్ని చేసుకుందామని చెల్లి అనుకుంది.

తెలుగులో ఇంత బిల్డప్‌ ఎందుకంటే - హిందీలో జడ్జిగారిని బయటపెట్టడానికి హీరో మథన పడడానికి కారణం - ఆయన మీదనున్న గౌరవం. తనకు కాబోయే మావగారవడం. అంతే! ఇక్కడ సెంటిమెంటు పాలు పెంచారు. ఇక్కడ హత్య చూసేది విజయనిర్మల. బావగారు చేస్తూండగా చూసింది. ఆ విషయం బయటపెడితే అక్కగారి మాంగల్యానికి ఎసరు పెట్టినట్టే. అది కూడా ఎలాటి అక్క! తనకోసం సర్వస్వం త్యాగం చేసిన అక్క! చివరకు తెగించి న్యాయం కోసం హిందీలో హీరో లాగానే విజయనిర్మల బావగారిపై నేరం మోపింది. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో వాదించింది. ఇలాటి పరిస్థితిలో అక్క ఏం చేయాలి? తన చెల్లెలు కేసులో నెగ్గాలని ఆశీర్వదించాలా? లేక తన పసుపుకుంకుమలు నిలవాలి కాబట్టి ఓడిపోవాలని కోరాలా? అదీ డైలమా. దీనికి తోడు హిందీలో లేని యింకో మలుపు. విజయనిర్మలకు ప్రతిగా జడ్జిగారి తమ్ముడు, ఆమె ప్రియుడు అయిన కృష్ణ ఆమెను కోర్టులో ఢీకొనడం. ఇవి మనవాళ్లు కొత్తగా పెట్టిన మెలికలు. సరే యింతకీ హత్య ఎలా జరిగిందో చూదాం.

ఊరవతల ప్రేమికులైన కృష్ణ, విజయనిర్మల విహరిస్తూండగా విజయనిర్మల ఓ హత్య జరగడం చూసింది. నాగేశ్వరరావులా వున్న ఓ వ్యక్తి ఒకమ్మాయిని టైతో వురి వేసి చంపేశాడు. కృష్ణకు చెపితే అతనూ చూడబోయేటంతలో ఎవరూ కనబడలేదు. శవమూ కనబడలేదు, హంతకుడూ కనబడలేదు. అయితే ఆ పాటికి విజయనిర్మలకు నాగేశ్వరరావు ఎలా వుంటాడో తెలియదు. పెళ్లిలో కాబోయే బావగారిని చూసి తెల్లబోయింది. నీ భర్త ఖూనీకోరు, పెళ్లాడవద్దు అని అక్కకు చెప్పింది. 'ఈ దశలో పెళ్లి ఆగిపోతే నీ పెళ్లి ఎఫెక్ట్‌ అవుతుంది. నీకోసం త్యాగం చేస్తానంది' అక్క. విజయనిర్మల సందేహం విని కృష్ణ 'నువ్వు పొరబడుతున్నావ్‌. మా అన్న అలాటివాడు కాదు.' అన్నాడు. ఈ విషయం తేలేదాకా మన పెళ్లి జరగదని ఆమె అంది. 

హిందీలో లాగానే యిక్కడా జడ్జిగారి పోలికలతో ఇంకో వ్యక్తి వున్నాడు. అతను దుర్మార్గుడు. అతనూ, జడ్జిగారూ ఒకరే నేమో అని ప్రేక్షకుడికి అనుమానం కలిగించేట్లు కొన్ని సీన్లు పెట్టి కన్‌ఫ్యూజ్‌ చేశారు. అందువలన మనం విజయనిర్మలతో ఐడెంటిఫై అవుతాం. పద్మనాభం గుమ్మడి కొడుకు. ఫోటోగ్రాఫర్‌. రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి పందిట్లోనే  పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. అవేళ విజయనిర్మల చూసిన హత్య తాలూకు శవం శోభ అనే అమ్మాయిది. ఆమె విజయలలిత చెల్లెలు. అక్క లాగే డాన్సర్‌. ఓ ఫోటోసెషన్‌లో పద్మనాభానికి పరిచయమై పెళ్లి చేసుకోమని వెంటపడింది. ఇతను కాదన్నాడు. ఆమె చనిపోగానే యితన్నే అనుమానించారు పోలీసులు. అసలు దోషి ఐన జడ్జి తప్పించుకుని, పద్మనాభం వంటి అమాయకుడు యీ కేసులో యిరుక్కోవడంతో విజయనిర్మల భరించలేకపోయింది. సొంతంగా యిన్వెస్టిగేషన్‌ ప్రారంభించింది. చనిపోయిన శోభ అక్క విజయలలిత యింటికి వెళితే అక్కడ బావగారు అని ఆమె అనుకునే అతను కనబడ్డాడు. పైగా యిద్దరు డాన్సర్‌లతో అతని ఫోటో కనబడింది. ఇక బావగారే దోషి అని నిర్ధారించుకుని పద్మనాభానికి డిఫెన్సు లాయరుగా సిద్ధమైంది. అన్నగారి తరఫున వాదించడానికి కృష్ణ సిద్ధమయ్యాడు.

తను సేకరించిన విషయాలు చెప్పి విజయనిర్మల అక్కతో నీ భర్త చెడ్డవాడని వాదించింది. కాదు, దేవుడని అక్క వాదించింది. ఈ ఘర్షణ చేతనే యీ సినిమాకు అక్కాచెల్లెలు అని పేరు పెట్టారు. దీనిలో చట్టం గురించి పెద్దగా చర్చించలేదు. సెంటిమెంటల్‌ సినిమాగానే తీశారు. నిజానికి ఆ రెండో నాగేశ్వరరావు విలన్‌. జడ్జ్జి నాగేశ్వరరావుకి తమ్ముడు. వీళ్లిద్దరి నాన్నగారు ఓ జడ్జి. ఆయన ఓ కేసులో ఒకతనికి శిక్ష వేశారు. అతని తండ్రి పగతో తమ్ముణ్ని ఎత్తుకుపోయి చెడ్డవాడిగా మార్చాడు. అతని స్థానంలో గుమ్మడి అనాథాశ్రమం నుండి ఓ కుర్రాణ్ని తీసుకుని వచ్చి భర్తీ చేయడంతో యీ విషయం మరుగున పడింది. ఆ కుర్రవాడే కృష్ణ. రక్తసంబంధం లేకపోయినా అతను జడ్జిని కాపాడదామని చూస్తే అతని పోలికలతో వున్న అసలు తమ్ముడు అతన్ని అప్రతిష్టపాలు చేద్దామని చూశాడు. ఇతని వేషం వేసుకుని బయట అత్యాచారాలు చేయడమే కాదు, శోభను హత్య చేయడమే కాదు, జడ్జి గారి యింట్లో చొరబడి దొంగతనం చేసి, జడ్జి భార్యను కొట్టి, తల్లిని తోసేసి - అసలు జడ్జిమీద యింట్లోవాళ్లకు కూడా అనుమానం వచ్చేట్టు చేశాడు. 

అయితే యితను యిలా యింట్లో ఆగడం చేసే సమయంలో జడ్జిగారు పోలీసు కస్టడీలో వున్నారని తెలిసిన కృష్ణ దీనిలో ఏదో మర్మం వుందని గ్రహించి విలన్‌ను వెంటాడి, పట్టుకుని కోర్టుకి లాక్కుని వచ్చాడు. ఈ లోపున కోర్టులో జరగవలసినదంతా జరుగుతోంది. అమాయకుడైన జడ్జిపై ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. చివరకు  రెండవ నాగేశ్వరరావు తన తప్పులు ఒప్పుకోవడంతో విషయాలు తేటతెల్లమయ్యాయి. పోలికలు ఒకేలా వుండడం వలన అందరూ ఏ విధంగా పొరబడ్డారో అర్థమైంది. అందరూ జడ్జిగారికి క్షమాపణ చెప్పుకోవడం, జడ్జిగారు విజయనిర్మల న్యాయబుద్ధిని మెచ్చుకోవడం, కృష్ణ, విజయనిర్మల పెళ్లిచేసుకోవడంతో సినిమా పూర్తయింది. చూశారుగా, 'అక్కా చెల్లెలు' సినిమా 'కానూన్‌' సినిమా వలన ఏ మేరకు యిన్‌స్పయిర్‌ అయిందో! ఇలాటి సెంటిమెంట్లు, కమ్మర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోతే తెలుగు సినిమా ప్రేక్షకుల తలకు ఎక్కదన్న కాలిక్యులేషన్‌తో హిందీ సినిమా చుట్టూ కథ పెంచుకుంటూ వచ్చి వుంటారు. (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?