Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం- ఆలీబాబా 40 దొంగలు- 1

మన వాళ్లు సినిమాలు తీసినపుడు కథల గురించి అన్వేషిస్తారు. ఆ అన్వేషణలో పురాణాలు, జానపద గాథలు, యితరభాషా చిత్రాలు ఏవీ వదలరు. మన జానపద గాథలే కాదు, యితరదేశాల జానపదగాథలను కూడా తరచి చూస్తారు. అరేబియా దేశపు గాథలైన అరేబియన్‌ నైట్స్‌ కథల పుట్ట. అవి అనేకభాషల్లోకి అనువదించబడింది. వాటిలో ఒక కథే ఆలీబాబా 40 దొంగలు. ఆ కథ ఆధారంగా తమిళంలో 1956లో ''ఆలీబాబావుమ్‌ నాప్పదు తిరుడర్‌గళుమ్‌'' అని మోడర్న్‌ థియేటర్స్‌వారు గేవాకలర్‌లో తీశారు. ఎంజీయార్‌, భానుమతి హీరో హీరోయిన్లు. దాని ఆధారంగా, కథ చాలా మార్చుకుంటూ తెలుగులో 1970లో ''ఆలీబాబా 40 దొంగలు'' సినిమా ఎన్టీయార్‌, జయలలితలతో విఠలాచార్య దర్శకత్వంలో తీశారు. ఒరిజినల్‌ కథ పోను పోను ఎలా మారుతూ వచ్చిందో చూదాం.

అరేబియన్‌ నైట్స్‌ ప్రకారం - ఆలీబాబా కథలో అతను దొంగల గుహ కనిపెట్టేనాటికే వివాహితుడు. అతనికి  తన తెలివితేటలతో అడుగడుగునా సహాయపడిన మార్జియానా అతని అన్నగారి యింట్లో పనిమనిషి. కరక్టుగా చెప్పాలంటే బానిస. ఇలా చూపిస్తే మన ప్రేక్షకులు మెచ్చుతారా చెప్పండి. అందుకని తమిళ సినిమాకు వచ్చేసరికి మార్జియానాను హీరోయిన్‌ చేశారు. అందువలన ఆలీబాబాను అవివాహితుణ్ని చేసి ఆమెను పరదేశం నుండి బతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చి యితన్ని ప్రేమించిన యువతిగా చూపించారు. ఇక తెలుగు సినిమాలో అయితే ఆమెను  హీరోని ప్రేమించిన దొంగల నాయకుడి కూతురుగా మార్చేశారు. విలన్‌గా మరోణ్ని తయారుచేశారు. హీరోయిన్‌ రోడ్డుమీద ఆడుతూ వుండగా తమిళ సినిమా ప్రారంభమౌతుంది. 

భానుమతి పేరు మార్జియానా. పర్షియా దేశస్తురాలు. ఆస్తి పోగొట్టుకుని దేశద్రిమ్మరిగా మారి, నౌకరు దౌలత్‌ను వెంటబెట్టుకుని బాగ్దాద్‌ వచ్చింది. రోడ్డుమీద ఆడిపాడి పొట్టపోసుకుంటోంది. ఆ వూరికి అమీర్‌ - కాశిం ఖాన్‌. అతని సైనికులు ఈమెను బలవంతంగా తీసుకెళ్లబోయారు. కానీ కాశిం తమ్ముడు ఆలీబాబా (ఎమ్జీయార్‌) వాళ్లను ఎదిరించి ఆమెను కాపాడాడు.హీరోయిన్‌ అతనంటే మనసు పడింది. అమీర్‌ మనుష్యులు వెంటాడడంతో హీరోయిన్‌ హీరో ఆశ్రయం కోరింది. హీరో చెల్లెలు, ఆమె తమ తమ కథలు చెప్పుకున్నారు. అమీరైన కాశింకు డబ్బు పిచ్చి. భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమ్ముడైన ఆలీబాబాను, చెల్లెలైన ఆయేషాను దూరంగా నెట్టేసి, వేరే చోట వుండమన్నాడు. భార్యకు మితిమీరిన అహంభావం. మార్జియానాను రక్షించిన ఆలీబాబాను ఎలాగైనా శిక్షించాలని ఆమె పట్టుబట్టింది. కానీ యింకా సందర్భం కుదరలేదని అన్నగారు ఆపి వుంచాడు.

ఓరోజు హీరో, దౌలత్‌ యిద్దరూ అడవికి వెళితే అక్కడ దొంగల గుంపు రావడం కనబడింది. నాయకుడితో కలిపి 40 మంది దొంగలు. వాళ్లు ఓ గుహముందు నిలబడి ఓ మంత్రం చదివితే గుహ తలుపు తెరుచుకుంది. పని ముగించుకుని మరో మంత్రం చదివితే మూసుకుపోయింది. వాళ్లు వెళ్లాక వీళ్లు వెళ్లి బోల్డునగలు, వరహాలు మూటలకు ఎత్తుకుని, గాడిదలపై వేసుకుని యింటికి తెచ్చారు. ఆలీబాబా కథలో అందరికీ గుర్తుండేది యిదే దృశ్యం - దొంగలగుహ ముందు మంత్రం చదివితే తలుపు తెరుచుకోవడం! తమిళ సినిమా దర్శకనిర్మాత సుందరం హేతుబద్ధమైన మార్పు ఒకటి చేశారిక్కడ. ఆ మంత్రం చదవడం ఓ కమాండ్‌ వంటిదన్నమాట. అది విని పక్కనున్న బానిసలు కొందరు ఓ చక్రాన్ని తిప్పుతారు. అప్పుడు తెరుచుకుంటుంది. ఈ అంశం అరేబియన్‌ కథలోనూ లేదు, తెలుగులోనూ లేదు. అసలు ఆలీబాబా కథ ఒరిజినల్‌ అరేబియన్‌ నైట్స్‌లో ఎలా వుంటుందంటే - అతనూ, అతని అన్న తండ్రి నుండి వచ్చిన కొద్దిపాటి ఆస్తిని తగలేస్తారు. అయితే అన్నకు డబ్బున భార్య, మార్కెట్లో దుకాణమూ వుండడం వలన అతని స్థితి బాగానే వుంటుంది. ఆలీబాబా భార్య బీదది కాబట్టి యితనికి గడవడం కష్టంగానే వుంటుంది. ఓ రోజు అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లి యీ గుహ చూస్తాడు. తను ఒక్కడే వెళతాడు. కూడా ఎవరూ వుండరు.

ఇక తెలుగు వెర్షన్‌లో ఎలా చూపించారంటే దొంగలనాయకుడు మిక్కిలినేని వూళ్లు దోచుకున్న డబ్బంతా గుహలో దాస్తూ వుంటాడు. ఓ రోజు వాళ్లు ఎత్తుకొచ్చిన పెట్టెలో ఓ పాప కనబడితే ముచ్చటపడి ఆమెను పెంచి పెద్ద చేసి మార్జువానా అని పేరు పెడతాడు. ఆమెనే జయలలిత. నాయకుడి అసిస్టెంటు సత్యనారాయణకు ఆమె అంటే యిష్టం. కానీ ఆమెకు అతనంటే యిష్టం లేదు. ఊళ్లలో డాన్సులు చేస్తూ ఏ వూరు కాస్త పచ్చగా వుందో చూడాలన్న ప్లానుతో వాళ్లు ఆలీబాబా వూళ్లో డాన్సు చేస్తూండగా హీరో ఆమె కంట పడతాడు. అతని సాహసం చూసి వెంటనే యిష్టపడుతుంది. తమిళ సినిమాలో లాగానే తెలుగు హీరోకి కూడా పెళ్లి కాలేదు. డబ్బున్న అన్నా, వదినా వున్నారు కానీ చెల్లెలు లేదు. తల్లి వుంది.

ఆలీబాబా అన్న కాశిం (నాగభూషణం) వ్యాపారస్తుడు. తమిళ సినిమాలో లాగ అధికారి కాదు కానీ ఊళ్లో పెద్దమనిషి. తమ్ముడు ఆలీబాబా (ఎన్టీయార్‌) వొట్టి సోమరి. అన్నగారికి తమ్ముడంటే యిష్టమే కానీ వాణ్ని బాగు చేయాలని మందలిస్తూ వుంటాడు. వదిన (సూర్యకాంతం)కి మరిదిని, అతన్ని వెనకేసుకుని వచ్చే అత్తగారి (హేమలత)నీ చూస్తే రుసరుస. కట్టెలు కొట్టుకురమ్మనమని అడవికి పంపితే ఆలీబాబా మార్జియానాతో పాటలు పాడి వచ్చాడు. గొడ్డలి పారేసుకున్నాడు. తిట్టిపోసి, వేరు కాపురం పెడితే తప్ప బుద్ధి రాదని వేరే వుండమన్నారు. చివరకు హీరో పక్కింటివాడి గొడ్డలి అరువు పట్టుకొచ్చి అడవికెళ్లి గుహ చూశాడు. కథలో లాగే యింటికి డబ్బు తెచ్చాడు. 

మూటలతో మొహిరీలు తెచ్చిపడేశాడు కాబట్టి కొలవడానికి కుంచం కావలసి వచ్చింది. తల్లి వెళ్లి వదిన గారి వద్ద అరువు అడిగింది. ఆవిడ కుతూహలం కొద్దీ కింద చింతపండు పెట్టి యిచ్చింది. ఒరిజినల్‌ కథలో త్రాసుకి మైనం పూసి యిస్తుంది. తెలుగిల్లు కాబట్టి చింతపండు పెట్టారు. కుంచం తిరిగి యిచ్చినపుడు వదిన మొహిరీ చూసింది. భర్తకు దాన్ని చూపించి ఆలీబాబా ఐశ్వర్యానికి కారణం కనుక్కోమంది. ఇద్దరూ వీళ్లింటికి వచ్చినపుడు పోయిన గొడ్డలి బదులు హీరో పక్కింటివాడికి గుప్పెడు వరహాలు యివ్వడం చూశారు. వచ్చిన డబ్బుతో అన్నగారి చేతులమీదుగా సత్రాలు కట్టించి, అన్నదానం చేయించాడు ఆలీబాబా. అన్నగారు రొక్కించి అడిగితే ఫలానా చోట గుహ వుందని కూడా చెప్పేశాడు. దాంతో అన్నగారు అక్కడికి ప్రయాణం కట్టాడు.

నిజానికి ఒరిజినల్‌లో ఆలీబాబు దానాలు గట్రా చేసేయడు. డబ్బు జాగ్రత్తగా దాచుకుని కొద్దికొద్దిగా ఖర్చు పెట్టుకుంటాడు. తమిళ సినిమాలో యీ దానాల వలన అన్నగారికి అనుమానం వస్తుంది. రహస్యం కనుక్కుందామని విందుకు పిలిచాడు. విందులో అన్నా, వదినా నైస్‌గా మాట్లాడారు. అమాయకుడైన హీరో అన్నగారికి రహస్యం చెప్పేశాడు. చెప్పగానే అన్న యితన్ని ఖైదు చేయించబోయాడు. తన మీద హత్యాప్రయత్నం చేయబోయాడని అబద్ధపు ఆరోపణ చేశాడు. అప్పుడు హీరోయిన్‌ నాకు యితనిమీద కసి వుంది, నేనే చంపుతానంటూ చాకు చేతపట్టుకుని నృత్యం చేస్తూ మధ్యలో ట్రిక్‌ చేసి హీరోని విడిపించేసింది. అతను ఫైట్‌ చేయసాగాడు. ఇక్కడ ఫైటింగ్‌ అవుతూండగానే అన్నగారు ఆత్రంగా గుహవైపు పరుగుతీశాడు. వదినకు ప్రమాదవశాత్తూ కత్తి గుచ్చుకుంది. తన కుట్రకు తనే బలైంది. ఇది తమిళసినిమాలో చేసిన మార్పు.

గుహకు వెళ్లిన అన్నగారు మంత్రం చదివి లోపలకు వెళ్లాడు కానీ అక్కడ డబ్బు చూసి మతి పోగొట్టుకుని బయటకు వచ్చే మంత్రం మర్చిపోయాడు. దొంగలు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అతని శరీరాన్ని ఖండఖండాలు చేశారు. ఆలీబాబా వెళ్లి అతని దేహాన్ని తీసుకొచ్చాడు. అతని చావు గురించి ఎవరికీ అనుమానం రాకూడదు. అంత్యక్రియలు సరిగ్గా జరగాలి. మార్జియానా ఓ దర్జీని డబ్బు ఆశ చూపించి కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చింది. అతని చేత చీకట్లోనే శవాన్ని కుట్టించింది. జబ్బు చేసి చచ్చిపోయాడని ప్రచారం చేశారు. జాగ్రత్తగా ఖననం చేశారు. అన్నగారి చావు వరకు అరేబియన్‌ కథలో లాగే చూపించారు. అన్న చావు తర్వాత ఒరిజినల్‌లో అయితే ఆలీబాబా 40 రోజుల సంతాపం పూర్తయాక వదినగారిని వివాహమాడతాడు. తన అన్నగారి కొడుక్కి అన్నగారి దుకాణం అప్పగిస్తాడు. మన సినిమాల్లో అలాటి పని చేయడు. తమిళ సినిమాలో ఐతే అన్న చావు తర్వాత ఆలీబాబా అతని స్థానంలో అమీర్‌ అవుతాడు. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?