Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - ఆలీబాబా 40 దొంగలు- 2

ఎమ్బీయస్‌: సినీమూలం - ఆలీబాబా 40 దొంగలు- 2

తెలుగు వెర్షన్‌లో అన్న చావడు. దొంగలగుహలో అతన్ని ఎంత తన్నినా తన తమ్ముడి పేరు చెప్పడు. విలన్‌ సత్యనారాయణ అతన్ని  తీసుకుని మిక్కిలినేని యింటికి తీసుకువచ్చి అక్కడ చిత్రహింసలు పెడుతూండగా అతని ఆచూకీ తెలుసుకుని హీరో అక్కడకు చేరాడు. వాళ్లతో ఫైట్‌ చేశాడు. వాళ్లు అక్కణ్నుంచి పారిపోవడానికి హీరోయిన్‌ సాయపడింది. దాంతో కోపం వచ్చిన విలన్‌ హీరోయిన్‌ను కాల్చబోగా అడ్డుపడిన మిక్కిలినేనికి గుండు తగిలి చనిపోయాడు. అన్నగారిని యిల్లు చేర్చాక హీరో మళ్లీ అక్కడకు వచ్చి హీరోయిన్‌ను విలన్‌ బారినుండి కాపాడి తన యింటికి చేర్చాడు. అన్నగారికి వైద్యం చేసి మామూలు మనిషిని చేయడానికి వైద్యుడు అల్లు రామలింగయ్యకు కళ్లకు గంతలు కట్టి తీసుకుని వచ్చాడు. అన్నగారు బాగుపడ్డాడు. ఇదంతా తెలుగు సినిమాలో పెట్టిన కథ.

ఇక దొంగల రియాక్షన్‌ చూద్దాం. గుహలోనుండి శవం మాయం కావడంతో వాళ్లకు అనుమానం పట్టుకుంది. తమ గుహ ఆచూకీ తెలిసున్నవాడి గురించి పత్తేదారీ మొదలెట్టారు. ఒరిజినల్‌ కథలో ఓ దొంగ బజారుకెళ్లి షాపులన్నీ తిరగేస్తాడు. ఈ దర్జీ మసకచీకట్లో కుడుతూండడం చూసి 'నీకు కళ్లు కనబడతాయా?' అని అంటే 'ఈ మధ్యే కటికచీకట్లో ఓ శవం కుట్టాను' అని నోరు జారతాడు. అతన్ని పట్టుకుని కళ్లకు గంతలు కట్టి తీసుకెళితే ఇదే యిల్లు అంటాడు. అప్పుడు దొంగ తలుపుమీద ఓ మార్కు పెడతాడు. మార్జియానా అది చూసి పక్కనున్న యిళ్లన్నిటికీ అదే మార్కులు పెడుతుంది. దాంతో దొంగ కనుక్కోలేకపోతాడు. మరుసటిరోజు యింకో దొంగ వస్తాడు. వాడికీ యిదే అనుభవం. వాళ్లిద్దరినీ శిక్షించి దొంగల నాయకుడు యీసారి తను స్వయంగా బయలు దేరతాడు. తమిళ సినిమాలో మొదటిసారే నాయకుడు బయలుదేరతాడు.

అనుకోకుండా వచ్చి పడిన డబ్బుతో దర్జీ ఓ నాట్యశాలలో ఎంజాయ్‌ చేస్తూ దొంగలనాయకుడి కంటపడ్డాడు. శవం కుడితే వెయ్యి వరహాలు వచ్చాయన్నాడు దర్జీ. ఓహో అని వూరుకుని అవాళే దర్జీ యింటికి వచ్చిపడి, బెదిరించి తనకు డబ్బిచ్చినవాళ్లని చూపమన్నాడు. ఇంటికి గుర్తు పెట్టి వచ్చా, రండి చూపిస్తా అన్నాడు దర్జీ. సినిమాలో కళ్లకు గంతలు కట్టడం లేదు. దర్జీయే అతి తెలివితేట లుపయోగించి ఇంటూ మార్క్‌ పెట్టాడు. తెలుగు సినిమాలో వైద్యుడూ అంతే, దారంతా ముగ్గు పోసుకుంటూ వచ్చాడు. ఏది ఏమైనా మార్జియానా తీసుకున్న జాగ్రత్త వలన యిల్లు కనుక్కోలేకపోయారు. తమిళ సినిమాలో విలన్‌ ఐన దొంగల నాయకుడు దర్జీని తన గుహకు తీసుకెళ్లి కత్తులబోనులో పెట్టి హింసించి ఈ మధ్య అమాంతం డబ్బు సంపాదించిన వారెవరు? అంటే ఆలీబాబా అంటాడు. ఇక ఆలీబాబా యింటిమీద పడ్డాడు, విలన్‌. ఒరిజినల్‌ కథలో అయితే దొంగలనాయకుడు దర్జీ చూపించిన యింటిపై గుర్తులు పెట్టకుండా బాగా గుర్తుకు పెట్టుకుని వచ్చాడు.

తెలుగులో విలన్‌ అత్తర్‌ సాయిబు వేషంలో వూరంతా తిరిగాడు. హీరోయిన్‌ అతని కంట పడింది. ఆమె కోసం ఊరిపై దాడి చేయబోయాడు. కానీ హీరో వుపాయంతో పశువుల కొమ్ములకు, చెట్ల కొమ్మలకు దివిటీలు కట్టి దొంగలను హడలగొట్టాడు. అదంతా హీరో బలగమే అనుకుని బెదిరిన విలన్‌ యిక మారువేషంలో రావాలని అనుకున్నాడు. పీపాల్లో తన అనుచరులను దాచి హీరో యింటికి తీసుకుని వచ్చాడు. ఆలీబాబా అనగానే గుర్తుకు వచ్చే మరో సంఘటన యిది. విలన్‌ తను నూనె వ్యాపారి అని చెప్పుకుంటూ  ఆలీబాబా యింటికి వస్తాడు. 39 పీపాల్లో తన అనుచరులను దాచి, చప్పట్లు తట్టినపుడు రమ్మనమని చెప్తాడు. ఒరిజినల్‌ అరేబియన్‌ కథ ప్రకారం నాయకుడు తెచ్చినవి 37 పీపాలు. దీపాలలో నూనె కోసం మార్జియానా ఒకటి తీయబోతే దానిలో మనిషి వున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఓ పీపాలో వున్న నూనె బాగా కాచి మరగించి అన్నిటిలోనూ పోసేస్తుంది. అందరూ కిక్కురుమనకుండా చచ్చిపోతారు. అర్ధరాత్రి నాయకుడు వాళ్లను లేపి యిల్లు దోచుకుందామని చూస్తే అన్నీ శవాలే. దాంతో అతను గోడ దూకి పారిపోతాడు. తర్వాత కొన్నాళ్లకి వేషం మార్చుకుని బజార్లో షాపు పెడతాడు. ఆలీబాబా అన్న కొడుకుతో స్నేహం చేసి అతను విందుకి పిలిస్తే యింటికి వస్తాడు. ఉప్పు వేయకుండా భోజనం తయారుచేయమంటే మార్జియానాకు అనుమానం వస్తుంది. విందు తర్వాత డాన్సు చేస్తూ చేస్తూ అతన్ని చంపేస్తుంది. 

తమిళ సినిమాలో ఈ రెండూ కలిపేశారు. పీపాలు పట్టుకుని వచ్చినపుడు విలన్‌ పీపాలో వాళ్లతో మాట్లాడుతూండడం హీరోయిన్‌ కంటపడింది. తన పనివాడిని చేత వాటిని కొండమీదనుండి దొర్లించేసింది. తను హీరోయిన్‌ విలన్‌ ముందు డాన్సు చేస్తూ అతన్ని పొడిచేయబోతుంది. అప్పుడు అతను అనుచరుల కోసం చప్పట్లు తడతాడు. పనివాడు వచ్చి అందరూ చచ్చిపోయారని చెప్తాడు. తెలుగులో అయితే నాయకుడు నూనె వ్యాపారిగా వచ్చినది ఆలీబాబా అన్న యింటికి. ఆలీబాబా తల్లి హీరోయిన్‌ను నూనె తీసుకురమ్మనమని అంటే ఆమె పీపాలో మనుష్యులు వున్న సంగతి గుర్తించింది. తను వెళ్లి విలన్‌ముందు డాన్సు చేస్తూండగా గంట కొట్టినపుడల్లా ఆలీబాబా పీపాలను కిందకు దొర్లించేస్తాడు. 

ఒరిజినల్‌ కథలో దొంగలనాయకుణ్ని మార్జియానా యింట్లోనే పొడిచేస్తుంది. ఆలీబాబా కోపం తెచ్చుకుంటే వచ్చిన అతిథి దుస్తులు వెతికమంటుంది. వాటిల్లో కత్తి చూసి అతను నిజం గ్రహిస్తాడు. కానీ సినిమాలో క్లయిమాక్స్‌ గుహలో పెడదామనే అనుకున్నారులా గుంది. దొంగలనాయకుడు హీరోయిన్‌ను గుహకు ఎత్తుకుని వచ్చి కత్తులబోనులో బంధించి హింసించాడు. హీరో వచ్చి విలన్‌తో కత్తుల వంతెనపై యుద్ధం చేశాడు. మార్జియానాను కాపాడి పెళ్లాడాడు.

సినిమా చివర్లో తమిళ హీరో, తెలుగుహీరో దొంగల డబ్బును ఉదారంగా ప్రజలందరికీ పంచేశారు. అరేబియన్‌ కథలో ఆలీబాబా యిలాటి పని చేయడు. దొంగల నాయకుణ్ని చంపి తనను రక్షించిన మార్జియానాకు బానిసత్వం నుండి విముక్తి ప్రసాదించి తన అన్నగారి అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత దొంగల గుహకు అప్పుడప్పుడు వెళ్లి డబ్బు తెచ్చుకుంటూ వుంటాడు. తన తర్వాత పిల్లలకు, మనుమలకు ఆ మంత్రం నేర్పి తరతరాలుగా ధనికులుగా వుండేట్లు చేస్తాడు. తమిళ సినిమాలో ఓ విశేషం ఏమిటంటే - హీరోకు ఎ.ఎం.రాజా పాడగా దర్జీ వేషం వేసిన తంగవేలుకు ఘంటసాల పాడడం. తెలుగు సినిమా మూలకథకు చాలాదూరంగా వెళ్లిపోయి విఠలాచార్య మార్కుతో తయారైంది. ఇదీ ''ఆలీబాబా 40 దొంగలు'' సినిమా అసలుకథ. (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?