Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - బంగారుబాబు - 1/2

ప్రముఖురాలైన ఒక అమ్మాయి తనెవరో చెప్పుకోకుండా ఒక సామాన్యుడి యింటికి వచ్చి తలుపు తట్టిందనుకోండి. ఆమె ఎవరో తెలియని అతను ఆమెను ఒక సామాన్యురాలనుకునే ట్రీట్‌ చేస్తాడు. 'మా యింటికి ఎందుకు వచ్చావ్‌? వెళ్లు వెళ్లు' అంటాడు. ప్రేక్షకుడికి తెలుసు - ఆమె ఎవరో! అందువల్ల అతనికి యిదంతా తమాషాగా వుంటుంది. ఇలాటి థీమ్‌ మీద ''రోమన్‌ హాలిడే'' వచ్చింది. రోమ్‌కు అధికారిక పర్యటనకోసం వచ్చిన బ్రిటిష్‌ యువరాణి ఒకరోజు అనుకోకుండా జేబులో చిల్లిగవ్వ లేని పేదరాలిగా ఓ అమెరికన్‌ జర్నలిస్టుకి పరిచయమవుతుంది. ఒకరోజు అతనితో మామూలు యింటిపక్క అమ్మాయిలా స్కూటర్‌మీద తిరుగుతుంది. సంతకి, బోటు మీద పార్టీకి వస్తుంది. అలాగే 'ఇట్‌ హేపన్‌డ్‌ వన్‌ నైట్‌' సినిమా. దాన్నే హిందీలో ''చోరీ చోరీ''గా తీశారు, రాజ్‌ కపూర్‌ నర్గీస్‌లతో. ఇలాటి థీమ్‌తోనే బెంగాలీలో ఓ సినిమా తయారైంది. ''నాయికా సంగ్బాద్‌'' (1967) అని. ఓ సినిమాతార అనుకోని పరిస్థితుల్లో దీనావస్థలో ఓ మారుమూల ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌లో దిగి స్టేషన్‌మాస్టర్‌ యింటికి చేరుతుంది. అదెలా జరుగుతుందంటే - 

ఊర్మిళ అనే బెంగాలీ అమ్మాయి బొంబాయి సినిమారంగంలో హీరోయిన్‌గా రాణించింది. ఆమె నటించిన ''అమర్‌ దీప్‌'' అనే సినిమా హిట్టయ్యి, ఆ సందర్భంగా హీరోయిన్‌తో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారు. డైరక్టర్‌ ముఖర్జీ కాస్త గర్విష్టి. తనెంత కష్టపడి ఆమెను, కెరియర్‌ను తీర్చిదిద్దాడో, ఆమె భవిష్యత్‌ ప్రణాళిక లేమిటో అతను చెప్పుకున్నాడు. తర్వాతి సినిమా తన డైరక్షన్‌లోనే ఆమె హీరోయన్‌గా కలకత్తా పరిసరాల్లో తీయబోతున్నారని చెప్పాడు. అందరూ కలిసి కలకత్తాకు రైల్లో బయలుదేరారు. 

హీరోయిన్‌ చాలా మంచిది. అహంభావం లేదు. అందరితో కలిసిపోతుంది. రైలు ప్రయాణంలో కాస్సేపు పేకాట ఆడుకుంది. తన లేడీ ఎటెండెంట్‌ భారీకాయురాలవడంతో ఆమెకు లోవర్‌ బెర్త్‌ యిచ్చి తను పై బెర్త్‌పై పడుక్కుంది. పక్కబోగీలో అందరూ డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈమెకు అర్ధరాత్రి మెలకువ వచ్చింది. పక్కబోగీలో పాటలు వినబడుతున్నాయి. ఏమిటిదంతా అని బోగీ అటెండెంటును అడిగితే 'డాన్సులు చేస్తున్నారు, కావాలంటే మీరూ వెళ్లండి' అని చెప్పాడతను. తనూ వెళ్లి చూద్దామనుకుంది. రైలు దిగింది. పక్కబోగీ చేరేలోపున రైలు కదిలిపోయింది. ఆమె పరిగెత్తి పట్టుకోబోయి చెప్పు తెగి, రాయి గుద్దుకుని కింద పడిపోయింది. రైలు వెళ్లిపోయింది.

ఈ విధంగా కథానాయిక  అనుకోకుండా రైలు దిగవలసి వచ్చింది. అక్కణ్నుంచి దగ్గర్లో వున్న స్టేషన్‌ మేస్టర్‌ యింటికి వెళ్లింది. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యింట్లోంచి పారిపోయి వచ్చానని చెప్పుకుంది. అతనే హీరో. బ్రహ్మచారి. ఇక కథ ఎలా రసవత్తరంగా వుంటుందో వూహించుకోవచ్చు. ఈ కథతో 'అజ్‌నబీ' అనే హిందీ సినిమా రాజేశ్‌ ఖన్నాతో తయారైంది. 'సుమతి ఎన్‌ సుందరి' అని తమిళంలో శివాజీ గణేశన్‌తో తయారైతే తెలుగులో దాని ఆధారంగా కొంత మార్చుకుని కథ కల్పించి విబి రాజేంద్రప్రసాద్‌గారు ''బంగారు బాబు'' అనే సినిమా 1972లో తీశారు. ఆయనదే దర్శకత్వం కూడా. దానిలో హీరోయిన్‌ (వాణిశ్రీ) ఇలా యాక్సిడెంటల్‌గా దిగిపోదు. ఆమె ఆంధ్రదేశంలోనే అప్పటికే పేరు మోసిన సినిమా తార - వాణి అని. ఆమెకు తల్లి తండ్రీ పోయారు కానీ అన్నగారు జగ్గయ్య వున్నాడు. ఆయన డాక్టర్‌. 

ఈవిడ సినిమా తార కావడానికి మేనమామ నాగభూషణం సాయం చేశాడు. ఇప్పుడు కూడా డేట్స్‌ అవీ చూస్తూ వుంటాడు. అతనే విలన్‌. అతనూ, ఆతని అక్క, అంటే హీరోయిన్‌ పిన్ని ఎస్‌ వరలక్ష్మి కలిసి యింట్లో డబ్బు కొట్టేస్తూ వుంటారు. సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని స్థిరపడదామని వాణిశ్రీ కోరిక. చేసుకునే మాటయితే నన్నే చేసుకోమని నాగభూషణం పట్టుదల. వాణిశ్రీ ఛత్‌ పొమ్మంటుంది. జగ్గయ్య కూడా నాగభూషణాన్ని హెచ్చరిస్తూ వున్నాడు. ఇలాటి పరిస్థితిలో ఓ సినిమా షూటింగ్‌కై రైల్లో ఊటీకి వెళ్లవలసి వస్తుంది. అక్కడ తనను కిడ్నాప్‌ చేసి, బలవంతంగా పెళ్లి చేసేసుకుందామని నాగభూషణం ప్లాను. అతనూ, మేనేజర్‌ తాగి పెళ్లి ప్లాను గురించి మాట్లాడుతూంటే వాణిశ్రీ అనుకోకుండా వింది. వాళ్లను తప్పించుకోవాలని, ఎక్కడో రైలు సిగ్నల్‌ పడి ఆగిన చోట పెట్టెతో సహా దిగిపోయింది. 

బెంగాలీ ఒరిజినల్‌లో హీరోయిన్‌ పాత్రధారిణి అర్చనా భౌమిక్‌. రైలు తప్పిపోవడంతో బాటు వర్షం కూడా పడసాగింది. ఈమె వర్షంలో తడిసిపోయి దగ్గర్లో వున్న రైల్వే స్టేషన్‌కి వెళ్లింది.  అది ఒక హిల్‌ స్టేషన్‌ లాటిది. జనసమ్మర్దం తక్కువగా వున్న వూరు. రైళ్లు పెద్దగా ఆగవు. స్టేషన్‌ గదులకు తాళం వేసి వుంది. రైల్వే క్వార్టర్స్‌లో దీపం వెలుగుతోంది. లోపల్నుంచి పద్యపఠనం వినబడుతోంది. వెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసినది హీరో ఉత్తమ్‌కుమార్‌. స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. లోపల కూర్చుని పద్యాలు చదువుకుంటున్నాడు. ఆడపిల్ల ఒకత్తీ వుంది కదా, లోపలకి రమ్మనడానికి జంకాడు. కానీ బయట వర్షం చూసి, జాలిపడి లోపలికి రమ్మన్నాడు. 

ఆమె హిందీ సినిమా హీరోయిన్‌ అని అతనికి తెలియదు. గాయం తగిలిన ఆమె పాదానికి మందు వేశాడు. ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? అని అడిగి, స్టేషన్లో పడుక్కో లేకపోయావా? సరే ఎలాగూ వచ్చావు, వర్షం కదా, యిక్కడే వంటింట్లో పడుక్కో అన్నాడు. కానీ అక్కడ బొద్దింకలు. ఇక హాలు మధ్యలో బట్టల స్టాండు పెట్టి తను కింద పడుక్కుని ఆమెను మంచం మీద పడుక్కోమన్నాడు. స్టేషన్‌లో హీరోకింద పనిచేసే పనివాడు పొద్దున్నే పాలు పట్టుకుని వచ్చాడు. ఈమెను చూసి స్టేషన్‌ మేస్టారి భార్య అనుకున్నాడు. ఊళ్లో పెద్దాయన పహాడీ సన్యాల్‌కి చెప్పి వస్తానని వెళ్లాడు. ఇప్పటిదాకా బ్రహ్మచారి అనుకుంటున్న ఉత్తమ్‌కి పెళ్లయిందని విని పహాడీ సన్యాల్‌ దంపతులు వెంటనే వచ్చేశారు కూడా. ఈ లోపున హీరోయిన్‌ హీరోకి చెప్పేసింది యిలా కన్‌ఫ్యూజన్‌ వచ్చిపడిందని. 

బెంగాలీ ఒరిజినల్‌లో హీరో గురించి మనకు చాలా తక్కువ తెలుసు. సినిమా రెండో భాగంలో అతను పెద్ద కుటుంబానికి చెందినవాడని, బాగా చదువుకున్నవాడనీ, కానీ ప్రశాంతత కోరి యిలాటి చిన్న వూళ్లో వుద్యోగానికి వచ్చేడనీ తెలుస్తుంది. అతని కుటుంబసభ్యులెవర్నీ చూపించలేదు. అయితే తెలుగులో హీరో నాగేశ్వరరావుకి చాలా పాత్ర వుంది. అతని పేరుమీదనే సినిమా టైటిల్‌ పెట్టారు. సినిమా అతని దగ్గరే మొదలెట్టారు. అతని కుటుంబాన్ని చూపించారు. తండ్రి యస్వీ రంగారావు పేదవాడు. కానీ మాటమీద నిలబడేవాడు. చెల్లెలు జయంతి గుడ్డిది. ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ సంబంధం ఏదీ కుదరటం లేదు. ఇతను కష్టపడి డబ్బులు దాచి, ఆమెకు పెళ్లి చేయాలి. 

ఇతను రామభక్తుడు. ఆడవాళ్లంటే ఆమడ దూరంలో వుంటాడు. పాపం అమ్మాయి వర్షంలో వచ్చింది కదాని ఆశ్రయం యిచ్చాడు. సినిమాలు చూసే అలవాటు యితనికే కాదు, వూళ్లో ఎవరికీ లేనట్టుంది. ఈమె తెలుగు హీరోయిన్‌ ఐనా వీళ్లెవరూ గుర్తు పట్టరు. మర్నాడు పొద్దున్న పాలు పట్టుకొచ్చినవాళ్లు యీమెను మేస్టారి భార్య అనుకోవడం, వూళ్లో పెద్దమనిషి దంపతులు ''మిస్సమ్మ''లో రంగారావు దంపతుల్లా హడావుడి చేయడం జరుగుతుంది. ఆ పెద్దమనిషి పాత్రను బెంగాలీలో పహాడీ సన్యాల్‌ వేస్తే తెలుగులో గుమ్మడి వేశారు. బెంగాలీలో 'స్టేషన్‌ మాస్టారు బ్రహ్మచారి కదా, పెళ్లి ఎప్పుడైంది?' అని ఆశ్చర్యపడతారు. 

కానీ తెలుగులో దానికి ఓ భూమిక ఏర్పరచారు. గుమ్మడికి తన కూతుర్ని హీరోకి యిచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. కానీ ఆమెను పెళ్లాడదామనుకున్న అతని మేనల్లుడు కెవి చలం హీరో వద్దకు వచ్చి కావాలని తికమకగా మాట్లాడి కన్‌ఫ్యూజ్‌ చేసి గుమ్మడి వద్ద మాట్లాడిస్తాడు. దాంతో గుమ్మడి హీరోకి పెళ్లయిందనే తప్పు అభిప్రాయానికి వస్తాడు. అందువలన యిప్పుడు వాణిశ్రీ అతని భార్య అంటే సులభంగా నమ్మాడు. మిస్సమ్మలోలా హీరో, హీరోయిన్లకు శోభనం గదిలోకి ఏర్పాటు చేసి లోపలకి పంపారు. 

బెంగాలీ ఒరిజిన్‌లో యింత చొరవ తీసుకోరు. మధ్యాహ్నం జీపు యిచ్చి ఆమెను వూరు తిప్పమన్నారు. రాత్రి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. నీ భార్య చేసిన వంటకం బాగుందని హీరోని మెచ్చుకున్నారు. ఆమె చేత పాట పాడించారు. 500 రూ.లు బహుమతి యిచ్చారు. పహాడీ సన్యాల్‌ భార్య హీరోయిన్‌ను పాపిటలో సిందూరం లేదేం అని అడిగితే ఆమె ఏదో చెప్పేసింది. హీరోయిన్‌ మంచి హుషారుగా వుంది. ఆమెకి యిదంతా ఓ తమాషాగా వుంది. ఆమె ఎవరో అక్కడెవరికీ తెలియదు. ఎక్కడో హిందీ సినిమాలో నటించింది. ఈ మారుమూల ఎవరు గుర్తుపడతారు? 500 రూ.లు బహుమతి యిస్తే అదే అపురూపం అన్నట్టు తీసుకుంది. 

ఇంటికి వచ్చాక ఉత్తమ్‌ చెప్పాడు - నువ్వు రేపో మాపో వెళ్లిపోయాక నాకున్నాయి కష్టాలు. ఎలా సర్ది చెప్పుకోవాలో ఏమో అని. 'ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవాలని నేను వచ్చేశాను. వెళ్లిపోతాను లెండి' అంది. ఆ రాత్రి ఆమె కోరికపై అతను పాట పాడాడు. మర్నాడు మార్నింగ్‌ వాక్‌లో అతని కోరికపై ఆమె పాట పాడింది. బెంగాలీ సినిమాలో ఆమె తన సినీజీవితంతో విసిగిపోయిన సంఘటనలు ఏమీ పెట్టలేదు. కానీ తెలుగులో హీరోయిన్‌ను గ్లామర్‌ బాధితురాలిగా చూపించారు. ఆమె ఒక గాజుల షాపు వద్దకు వెళితే ప్రజలు రాళ్లేసి కొట్టారు. వాళ్లలో ఒకడు ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటార్రా? అని హేళన చేశాడు. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?