Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం - బంగారుబాబు - 2/2

తెలుగులో హీరోయిన్‌ బెంగాలీ హీరోయిన్‌ కంటె పాప్యులర్‌ కాబట్టి గుమ్మడి కూతురు చేత 'నువ్వు సినిమా స్టార్‌లా వున్నావ'నిపించారు. దానిపై శోభనం గదిలో హీరో నిలదీశాడు కూడా. నువ్వెవరు? హీరోయిన్‌ అంటున్నారే అని. నా కంటె వయసులో చాలా పెద్దవాడైన మేనమామ పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడన్న నిజం చెప్పింది కానీ సినిమాస్టార్‌నని చెప్పలేదు. ఇక్కడ అందరూ ఆమెను మామూలు గృహిణి అనుకుంటున్నారు. తను కూడా అలాగే వుంది. వంట వండి పెట్టింది, బట్టలు కుట్టింది. హీరో ఆమెకు తడికలతో స్నానాల గది కట్టాడు. ఆమె అదృష్టానికి తోడై వంతెన పడిపోయి రైళ్లు వారం రోజులు ఆగిపోయాయి. హీరో కూడా ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. కానీ బయటపడలేదు. 

బెంగాలీ ఒరిజినల్‌లో కూడా రోమన్‌ హాలీడే సినిమాలో లాగ, హీరోయిన్‌ అతి సామాన్యురాలిలా హీరోతో జాతర కెళ్లింది. అటూ సరదాగా తిరిగింది. గాజులు వేయించుకుంది, వీధిగాయకుల పాటలు వింది, చిలకజోస్యం చెప్పించుకుంది. హీరోకి కూడా ఆమెపై మమకారం పెరిగింది. ఆట పట్టిద్దామని పడిపోయినట్టు నటించి, ఆమె తన పాదం చూడబోతూ వుంటే లేచి కౌగలించుకున్నాడు. వీళ్లిద్దరూ యిలా తిరిగేస్తూ వుంటే అందరూ చూస్తూ వూరుకుంటారా? ఊళ్లో వాకబులు మొదలయ్యాయి. అసలు మేస్టారికి ఎప్పుడు పెళ్లయింది? ఎన్నడూ చెప్పలేదేం అంటూ. అయింది పోవోయ్‌ అని హీరో దబాయించేశాడు. 

అక్కడ హీరోయిన్‌ తాలూకు సినిమా మనుష్యులు ఈమెకోసం వెతుక్కుంటున్నారు. ఎవరైనా కిడ్నాప్‌ చేశారేమోనని నిర్మాత, దర్శకుడు హడిలి ఛస్తున్నారు. బెంగాలీలో పోలీసు కంప్లయింట్‌ యిచ్చారు కానీ సినిమా స్టార్‌ అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాటి పరిస్థితిలో ఉత్తమ్‌ కుమార్‌ పేపర్లో ఆమె ఫోటో చూశాడు. ఈమె ఫలానా అని తెలిసింది. ఏదో కారణంపై యిలా వచ్చేసిందని అర్థం చేసుకున్నాడు. తనతో నిజం చెప్పనందుకు కోపగించుకున్నాడు. ఆమెతో చెప్పకుండా ఆ సినిమా కంపెనీవాళ్లకు టెలిగ్రాం యిచ్చాడు. ఆ రాత్రే పహాడీ సన్యాల్‌ వాళ్లింట్లో ఓ పార్టీలో హీరోయిన్‌ చక్కగా పాట పాడింది. అందరూ శభాషన్నారు కానీ హీరో ఉదాసీనంగా వున్నాడు. ఇంటికి వచ్చాక ఆమె అడిగింది - ఎందుకంత నిశ్శబ్దం అని. నువ్వు గెస్ట్‌వే కానీ పర్మనెంట్‌గా యిక్కడ వుండేదానివి కాదు కదా అన్నాడు విషాదంగా. 

మర్నాడు ఆమె డైరక్టర్‌ ముఖర్జీ దిగాడు. హీరో అతన్ని వెంటపెట్టుకుని యింటికి తీసుకెళ్లాడు. డైరక్టర్‌ ఆమెను కసిదీరా తిట్టి, రా పోదాం అన్నాడు. ఆమె హీరో మొహం కేసి ి దీర్ఘంగా చూసింది. సంగతి గ్రహించుకుంది. అతనికి కోపం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంది. విధి లేక డైరక్టర్‌తో బయలుదేరింది. స్టేషన్‌లో రిపోర్టర్లు ఆమెను, హీరోను ప్రశ్నలడగబోయారు కానీ వీళ్లు జవాబివ్వలేదు. ఆమె రైలెక్కాక హీరో సాగనంపడానికి రాలేదు. బాధతో తన రూములోనే వుండిపోయాడు. రైలు కదిలాక ఆమెకు తెలిసి వచ్చింది. తనకు కావలసినది యిలాటి సాధారణ జీవితమే కానీ గ్లామర్‌ ప్రపంచం కాదని! అంతే చెయిన్‌ లాగి రైలు ఆపి హీరో దగ్గరకు వచ్చి కౌగిలిలో యిమిడిపోయింది. బెంగాలీ సినిమా యిక్కడితో అయిపోయింది. 

తెలుగులో బోల్డంత కథ కల్పించారు. వంతెన బాగుపడి రైళ్లు కదలడం ఆరంభించాక హీరోయిన్‌ తను వెళ్లిపోతానని డ్రామా ఆడి హీరో చేత ప్రేమ బయటపెట్టించింది. నా చెల్లెలి పెళ్లి అయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటానని రామాయణంపై ప్రమాణం చేశాడతను. ఇంతలో హీరో చెల్లి కుదిరినట్టు ఉత్తరం వచ్చింది. డబ్బు కావాలంటే హీరోయిన్‌ తన నగలు, డబ్బు యిచ్చింది. స్టేషన్‌దాకా వచ్చి దింపింది. అక్కడే విలన్‌ కంటపడింది. 

నిజానికి హీరోయిన్‌ కోసం సినిమా యూనిట్‌ అంతా గాలిస్తూనే వుంది. కథ మార్చేద్దామని నిర్మాత అన్నా డైరక్టర్‌ వొప్పుకోలేదు. పోనీ హీరోయిన్‌ను మార్చేసి మా అమ్మాయిని తీసుకోండి అని ఓ పక్క పిన్ని నిర్మాతలను పోరుతోంది. నాగభూషణం ఆ రైలు రూట్‌లో వూళ్లన్నీ తిరుగుతున్నాడు. అలా తిరుగుతూండగానే రైల్లోంచి వాణిశ్రీని చూశాడు. రైలు దిగి, అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ సాక్షి రంగారావుతో మాట్లాడి ఆమె స్టేషన్‌ మాస్టర్‌ పెళ్లాంగా చలామణీ అవుతోందని తెలుసుకున్నాడు. సాక్షి రంగారావు ఆమె ఫలానా అని విలన్‌కి చెప్పేడు కానీ హీరోపై వృత్తిపరమైన కోపంతో  హీరోయిన్‌ను ఎలెర్ట్‌ చేయలేదు.

చెల్లి పెళ్లి చేద్దామని యింటికెళ్లిన హీరోకి షాక్‌ తగిలింది. కావలసినది డబ్బూ దస్కం కాదు, నీ త్యాగం అన్నాడు తండ్రి. పెళ్లికొడుకు కుంటి చెల్లెల్ని నువ్వు చేసుకుంటేనే నీ చెల్లి పెళ్లవుతుందన్నాడు. కానీ యిప్పటికే యింకో అమ్మాయికి మాట యిచ్చేసేను, తప్పను అన్నాడు హీరో. తండ్రి కోపగించుకుని యింట్లోంచి తరిమేశాడు. ఇంటికి వచ్చి వాణిశ్రీ వద్ద బాధపడ్డాడు. నా కారణంగా చెల్లి పెళ్లి చెడిపోయిందని. అతను స్టేషన్‌కి వెళ్లగా చూసి నాగభూషణం రౌడీలతో ఆమెను కిడ్నాప్‌ చేయబోయాడు. హీరో వచ్చి ఫైట్‌ చేసి కాపాడాడు. కాపాడాక తెలిసింది - ఆమె సినిమా హీరోయిన్‌ అని. తనకు యిన్నాళ్లూ అబద్ధం చెప్పినందుకు మండిపడ్డాడు.

ఇక్కణ్నుంచి హీరో చాలా తిక్కతిక్కగా ప్రవర్తిస్తాడు. తనకు అబద్ధం చెప్పిందన్న కోపం ఒకవైపు, ఆమె ప్రేమను మరవలేకపోవడం మరోవైపు. చాలా గందరగోళపడి, యీ పరిస్థితుల్లో ఉద్యోగం సరిగా చేయలేక రాజీనామా చేశాడు. ఇంటికి వెళ్లాడు. తండ్రి పోయాడు. పోతూ పోతూ చెల్లి బాధ్యతను అప్పగించాడు. ఆపరేషన్‌ చేస్తే కళ్లు వస్తాయని డాక్టర్‌గారు చెప్పారట. డబ్బు కూడబెట్టి ఆపరేషన్‌ చేయించాలని హీరో పంతం పట్టాడు. చెల్లితో సహా పట్నానికి వచ్చాడు. ఉద్యోగం దొరక్కపోతే రిక్షా తొక్కాడు. పైస పైసా కూడబెడుతున్నాడు. తన కారణంగా పెళ్లి చెడిపోయిన చెల్లికి ఎవరి సహాయం లేకుండా కళ్లు తెప్పించాలని అతని దీక్ష. అందుకే హీరోయిన్‌ సహాయం చేయబోయినా తిరస్కరించాడు.

హీరోయిన్‌ యింటికి తిరిగి వచ్చేసరికి ఆమె పిన్ని డబ్బుతో సహా వుడాయించబోతోంది. ఆమెను యింట్లోంచి పంపించేశారు కానీ మేనమామ మాత్రం వదల్లేదు. స్వార్థం కొద్దీ యిల్లు పట్టుకుని వేళ్లాడుతున్నాడు. తన కారణంగా నిర్మాతలకు నష్టం కలగకూడదన్న వుద్దేశంతో చేతిలో వున్న సినిమాలన్నీ అతి త్వరగా పూర్తి చేస్తానని హీరోయిన్‌ నిర్మాతలకు చెప్పింది. పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తానని తనతో పనిచేసే హీరోలందరికీ చెప్పింది. ఈ సందర్భంలో అనేకమంది హీరోలను గెస్ట్‌లుగా చూపించారు సినిమాలో. రాజేశ్‌ ఖన్నా కనబడే సీనులో దర్శకనిర్మాత రాజేంద్రప్రసాద్‌ డైరక్టర్‌గా కనబడతారు కూడా. 

హీరో వద్ద పనిచేసే రాజబాబు, రమాప్రభ పెళ్లి చేసుకున్నారు. హీరో హీరోయిన్లు విడిపోయాక వాళ్లు చెరొకరితోనూ వచ్చేశారు. రాజబాబు ద్వారా హీరో ఆచూకీ తెలుసుకున్న వాణిశ్రీ, హీరో చెల్లెలు జయంతిని కలిసింది. తను ఫలానా అని చెప్పుకుంది. మొహమాటపెట్టి కళ్లడాక్టరు వద్దకు తీసుకెళ్లింది. అతను వేరెవరో కాదు, గతంలో జయంతి కళ్లు పరీక్షించి ఆపరేషన్‌ చేస్తే వస్తాయని చెప్పిన డాక్టరే, పైగా హీరోయిన్‌ అన్నగారు జగ్గయ్య. మందులు రాసిచ్చి, క్రమం తప్పకుండా వేసుకుంటే ఆపరేషన్‌ చేస్తానన్నాడు. కానీ యీ లోపునే హీరోకి యీ విషయం తెలిసి తిట్టిపోశాడు. నీకోసం డబ్బు దాస్తున్నానని తెలియదా? నా కిష్టం లేనివాళ్ల దగ్గర సహాయం తీసుకోవాలా? అని. తనే డాక్టరు వద్దకు తీసుకెళ్లాడు. అదే డాక్టర్‌ వద్దకు! అప్పుడు జగ్గయ్య హీరోని మందలించాడు - మరీ బెట్టు చేయకు, నా చెల్లి ప్రేమను గుర్తించు అన్నాడు. 

హీరోయిన్‌ నటించే ఆఖరి సినిమా, ఆఖరి సీను హెలికాప్టర్‌లో ఫైట్‌. తనను ఎలాగూ పెళ్లి చేసుకోనప్పుడు చంపేస్తే మంచిదనుకున్నాడు నాగభూషణం. అక్కడ పెట్టవలసిన ఉత్తుత్తి టైంబాంబ్‌కు బదులు నిజం టైంబాంబ్‌ పెట్టించాడు. అది రమాప్రభ వింది. జగ్గయ్యకు చెప్పింది. సరిగ్గా అప్పుడే జగ్గయ్య జయంతి కళ్ల ఆపరేషన్‌కై వెళుతున్నాడు. అతను కంగారు పడుతూ వుంటే అతనితో 'మీ చెల్లిని కాపాడే భారం నాది, మా చెల్లికి కళ్లు తెప్పించే భారం మీది' అన్నాడు హీరో. షూటింగు స్పాట్‌ దగ్గరకు పరిగెత్తాడు. హెలికాప్టర్‌లో ఫైటింగ్‌ జరిగింది. హీరో హీరోయిన్ను రక్షించాడు. ఇవతల అతని చెల్లెలికి కళ్లు వచ్చాయి. హీరోకి హీరోయిన్‌పై కోపం పోయింది. డాక్టర్‌గారు పేషంటును పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇలా కథ సుఖాంతం. 

బెంగాలీ ఒరిజినల్‌లో కథాంశాన్ని తీసుకుని దానికి రెండింతలు చేర్చి తెలుగు సినిమా తయారుచేశారు. అక్కడ హీరో హీరోయిన్ల కుటుంబాలు కనబడవు. ఇక్కడ వాళ్లందరినీ కలపడంతో తెలుగువాడి భోజనంలా సినిమా సుష్టుగా తయారైంది. పాటలు కూడా చాలా హిట్‌ అయ్యాయి. బెంగాలీ సినిమాకు సంగీతం యిచ్చినది హేమంత్‌ కుమార్‌ అయితే తెలుగు సినిమాకు కె వి మహదేవన్‌! (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

Click Here For Part -1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?