Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: మోసగాళ్లకు మోసగాడు- 1

జవాబులు - ''ఇద్దరు మిత్రులు'' వ్యాసం కింద వ్యాఖ్యలు చూశాను. జానపదాలు సీరీస్‌ రాసినప్పుడూ యివి అవసరమా అని కొందరు అడిగారు.  ఇది సాంఘిక చిత్రం. ఇప్పుడూ అడుగుతున్నారు. పాత సినిమా అని అభ్యంతరం చెప్పేవాళ్లు గుర్తుంచుకోవాల్సింది, ఏ తరం సినిమాలకు ఆ తరం ప్రేక్షకులు, పాఠకులు వుంటారు. వాళ్లకు ముందు తరం సినిమాలన్నీ బోరు, తర్వాతి తరం సినిమాలన్నీ వేస్టు. 1950ల నాటి సినిమాల గురించి 2015లో చెపితే రిసెర్చి అంటారు. 2045లో చెపితే వాటికి డాక్టరేట్లు యిస్తారు. పాతది కాబట్టి అక్కరలేదనుకుంటే వేల సంవత్సరాల నాటి రామాయణం గురించి ప్రసంగాలు, ప్రవచనాలు మానేయాలి. సినిమా కాబట్టి రామాయణంతో పోల్చకూడంటారేమో, కొంతమందికి పురాణాల కంటె సినిమాలే ఎక్కువ ఆసక్తికరం. నేను సినిమాల్లో కథాకల్పన రీతి గురించి చర్చిస్తున్నాను. ఆ కళ చిరంజీవి. ఆ కళను అభ్యసిస్తే రేపటి సినిమాలకు కూడా పనికి వస్తుంది. హోటల్‌ కెళితే మెన్యూలో ఓ ఏభై ఐటమ్స్‌ కనబడతాయి. వాటిలో మనకి ఏది నచ్చుతుందనిపిస్తుందో అదే తింటాం. అన్నీ తినాలన్న రూలు లేదు. బట్టలషాపుకి వెళితే కనబడినవన్నీ కొనం. ఒక్కో కలర్‌ కాంబినేషన్‌ చూసి 'యిదెవడు కొంటాడ్రా బాబూ' అనుకుంటాం. కానీ దాన్నే ఎగబడి కొనేవాళ్లుంటారు. లోకో భిన్న రుచిః అని అందుకే అంటారు. మనదే గొప్ప టేస్టు, మిగతాదంతా చెత్త అనుకోవడం సబబు కాదు.

ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు తీయాలనే తపనే మన దర్శకనిర్మాతలను ముందుకు నడిపిస్తుంది. మొదట్లో పౌరాణికాలు, తర్వాత జానపదాలు, ఆ తర్వాత సాంఘికాలు, మధ్యలో చారిత్రకాలు, విదేశీ బాణీకి మళ్లాక జేమ్స్‌బాండ్‌ టైపు సినిమాలు.. ఇలా వెళుతున్న దారి హఠాత్తుగా మలుపు తిరిగింది. ''మోసగాళ్లకు మోసగాడు'' అనే కౌబాయ్‌ టైపు సినిమాతో! హీరో కృష్ణ అంతకుముందు ఓ సాంఘిక చిత్రం నిర్మించి నష్టపోయి, ఈ వెస్టర్న్‌ సినిమా తీశారు. ఈ వెస్టర్న్‌ సినిమాలు, ఆ వేషభాషలూ మన వాతావరణానికి సంబంధించినవి కావు. కానీ వాటిని మనవాళ్లకు నప్పేట్లా, నచ్చేట్లా తీయడంలోనే వుంది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఆరుద్ర గారిది. 'బొబ్బిలియుద్ధం జరిగిన తర్వాత ఫ్రెంచ్‌వాళ్లు, ఇంగ్లీషువాళ్లు, నవాబులు, పాలెగాళ్లు ఒక్కోరు ఒక్కోలా దోచుకుంటున్నపుడు అరాచకం ప్రబలిన రోజుల్లో...' అంటూ కథాకాలాన్ని సెట్‌ చేసి, పాత్రలకు జీన్స్‌ తొడిగేసి, గుఱ్ఱాలు ఎక్కించేసి, తుపాకులు పట్టించేశారు. ''మోసగాళ్లకు మోసగాడు'' సినిమాలో అనేక కౌబోయ్‌ సినిమాలనుండి దృశ్యాలు తీసుకున్నారు. కానీ ప్రధానంగా ఆధారపడినది - ''గుడ్‌ బాడ్‌ అండ్‌ అగ్లీ'' అనే సినిమామీద! చివర్లో ''మెకన్నాస్‌ గోల్డ్‌'' సినిమా దృశ్యాలు తీసుకున్నారు. స్త్రీపాత్రలు, సెంటిమెంట్లు జోడించారు. ఇంగ్లీషు సినిమాలో మూడు ప్రధానపాత్రలు. గుడ్‌ అంటే హీరో, బాడ్‌ అంటే విలన్‌, అగ్లీ అంటే రెండిటి లక్షణాలూ కలగలిపిన వ్యక్తి.. ఆ పాత్రల సంగతి చూద్దాం.

గుడ్‌  - ఇతనే హీరో. ధైర్యసాహసాలున్నవాడు. కావాలని ఎవరికీ అపకారం చేయడు. మరి సంపాదన ఎలా అంటే దానికో మార్గం వుంది. అగ్లీతో చేతులు కలిపి టక్కరితనంతో ఆర్జిస్తుంటాడు., బాడ్‌ - ఇతను విలన్‌. తన స్వార్థం కోసం ఎవరినైనా చంపుతాడు. ఒక బ్యాంకు దోపిడీదారు నిధి ఎక్కడ దాచాడో కనుగొనడానికి తిరుగుతున్నాడు., అగ్లీ -  హీరోలాగ ధైర్యసాహసాలున్నవాడే. కానీ నేరస్తుడు. హంతకుడు. చట్టానికి దొరక్కుండా తప్పించుకుని తిరిగేవాడు. స్వభావరీత్యా టక్కరి. జిత్తులమారి. ఈ అగ్లీ అన్ని రకాల నేరాలు చేసి వున్నాడు అతన్ని పట్టి యిస్తే 2000 డాలర్లు బహుమతి అని ప్రకటించింది ఓ వూరు. ఈ హీరో అతన్ని పట్టుకెళ్లి అప్పగించి ఆ డబ్బు పుచ్చుకుంటాడు. ఆ తర్వాత ఉరి తీసేసమయంలో అతన్ని తప్పించేస్తాడు. తర్వాత మరో వూళ్లో యిదే డ్రామా. ఆ డబ్బు యిద్దరూ పంచుకుంటూ వుంటారు. అయితే పోనుపోను పంపకాల్లో తేడాలు వచ్చాయి. ఉరికి వేళ్లాడేవాణ్ని కాబట్టి నాకు ఎక్కువ వాటా కావాలని అగ్లీ పేచీ పెట్టాడు.  అప్పుడు హీరో 'నీ రేటు మూడువేల డాలర్ల కంటె పెరిగేట్టు లేదు. ఇది నేను వుంచేసుకుంటాను' అని తీసుకెళ్లి ఓ నిర్జనప్రదేశంలో వదిలిపెట్టాడు. '70 మైళ్ల దూరంలో వూరుంది. అక్కడదాకా నడుచుకుంటూ పో' అని శిక్ష వేశాడు. 

తెలుగులో హీరో (కృష్ణ), అగ్లీ (నాగభూషణం) కథను యిలాగే దింపేశారు. అయితే అగ్లీకి యింత శిక్ష వేయడానికి హీరోకి ఓ కారణం కల్పించి హీరోయిజం కాపాడారు. అగ్లీ రెండు వాటాలు ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే హీరో అలా చేస్తాడు. తెలుగు హీరో కాబట్టి యిలాటి మార్గం పట్టడానికి కూడా జస్టిఫికేషన్‌ చూపించారు. అతను కొత్వాల్‌గా వుండే రోజుల్లో ఓ రాజబంధువును బంధిస్తే రాజు బంధుప్రీతితో అతన్ని వదిలేశాడు. ఇతనికి కోపం వచ్చి యిలా మారాడు. ఇలా సంపాదించిన డబ్బు పేదలకు పంచేస్తూ వుంటాడు. మూలంలో లేని మార్పు యింకోటి పెట్టారు. హీరోకి హీరోయిన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, హీరో అంటే పడిచచ్చి అతనిచేత తిరస్కరింపబడిన వ్యాంప్‌ పాత్ర కూడా పెట్టారు. 

ఒరిజినల్‌ సినిమాలో వెతికే నిధి విలువ రెండు లక్షల డాలర్లు. అది బంగారం రూపంలో ఓ స్మశానంలో దాచి వుంది. జాక్సన్‌ అనే వాడు ఓ బ్యాంకును దోచి అ బంగారాన్ని అక్కడ దాచాడు. ప్రస్తుతం కార్సన్‌ అనే మారుపేరుతో మసలుతున్నాడు. ఇప్పుడు అతను పెట్టుకున్న మారుపేరు ఏమిటో తెలుసుకుందామని విలన్‌ అనేకమందిని అడుగుతున్నాడు. అవసరం తీరాక వాళ్లని చంపేస్తున్నాడు. తెలుగు సినిమాలో నిధికి చాలా కథ కల్పించారు. అది ఓ సంస్థానాధీశుడిది. శత్రువుల బారినుండి రాష్ట్రఖజానాను కాపాడుకోవడానికి ఓ యిద్దరు విశ్వాసపాత్రమైన ఉద్యోగులు అవన్నీ ఓ గుహలో పెట్టి తలుపులకు తాళాలూ అవీ వేశారు. మొత్తం ఐదు తాళంచెవులు. నిధి దాచి ఆ ఉద్యోగులు తిరిగి వచ్చేసరికి కోట పరాధీనమై పోయింది. పరిస్థితి చక్కబడ్డాక ఆ సంస్థానాధీశులకు నిధి అప్పగిద్దామని అనుకున్నారు వారిద్దరూ. వారిలో ధూళిపాళ వద్ద  తాళం చెవులు వున్నాయి. కాకరాలకు దారి తెలుసు. ఇద్దరూ కలిస్తేనే నిధికి చేరగలరు. ఈ నిధి కథను సాక్షి రంగారావు అందరికీ కథలు, కథలుగా చెప్తూ వుంటాడు. అందువలన అందరికీ ఆసక్తి. ఈ తాళంచెవుల కోసమే ధూళిపాళను చంపేశారు సత్యనారాయణ గ్యాంగ్‌. అతని కుమార్తె విజయనిర్మలను వ్యాంప్‌ జ్యోతిలక్ష్మి చంపబోయింది. ఈ పరిస్థితిలో హీరో ఆమెను కలిసి ఆత్మరక్షణకై ఆయుధాలు కాల్చడం నేర్పాడు. కానీ తాళంచెవులు మాత్రం ధూళిపాళ యింట్లో లేవు. 

ఇంగ్లీషు సినిమాకు వస్తే - హీరో ఎక్కడో వదిలిపెట్టేసినా అగ్లీ నానాకష్టాలు పడి ఓ తుపాకీషాపువాణ్ని దోచుకుని బయటపడ్డాడు. హీరోమీద పగతో అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతనున్న లాజ్‌మీదకు తన మనుష్యులను పంపాడు. కానీ నిత్యం ఎలర్ట్‌గా వుండే హీరో వాళ్లను కాల్చేశాడు. కానీ అగ్లీగారి రాజమార్గం ఆయనకు వుంది. కిటికీ ద్వారా వచ్చి హీరోను ఉరి వేయబోయాడు. అంతలో బిల్డింగ్‌ పడిపోయింది, హీరో పారిపోయాడు. తెలుగులో యిలాగే వుంది కానీ బిల్డింగ్‌ కూలిపోవడం వంటి కాకతాళీయమైన సంఘటన కాకుండా హీరోయిన్‌ వచ్చి రక్షించినట్టు కల్పించారు. జోడీ లేని ఇంగ్లీషు సినిమా హీరోకు ఆ సౌలభ్యం లేదు. ఎట్టకేలకు అగ్లీకి హీరో దొరికాడు. తనలాటి యింకోణ్ని రక్షిస్తూ వుంటే పట్టుకుని నిర్దయగా లాక్కుని వెళ్లాడు. ఎండలో, ఎడారిలో నడిపించాడు. నీళ్లు ఒక్క చుక్క కూడా పోయలేదు. తన కళ్లెదుటే చావాలని అతని పగ. తెలుగులో యిదంతా పెట్టి యిక్కడ అతనికి వాంప్‌ జ్యోతిలక్ష్మి కూడా తోడయినట్లు చూపించారు. ''ఎలాగుంది అబ్బాయా'' అనే పాట కూడా పెట్టారు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?