Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం- రాజూ పేద- 2

కథలో యీ దశలోనే రాజుగారు చనిపోవడం జరుగుతుంది. ఆయన అంత్యక్రియల కాలం పూర్తయాక యువరాజుకి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ లోపున యువరాజు స్థానంలో వున్న పేదవాడు కొన్ని కేసులు విచారించడం, అనవసర ఖర్చు తగ్గిద్దామని చూడడం యివన్నీ చేస్తాడు. తెలుగు సినిమాలో అనారోగ్యం పాలైన రాజు కొడుకుని పిలిచి అతనితో పన్నుల వ్యవస్థ గురించి చర్చించడం చూపారు. రచయిత పినిశెట్టి చక్కటి సంభాషణలు రాశారు.  రాజు కొడుకు తెలివితేటలకు ముచ్చటపడుతున్నాడు కానీ మధ్యమధ్యలో నేను యువరాజును కాను అంటూ మాట్లాడే మాటలు అతన్ని కలవరపరుస్తున్నాయి. పైగా అతన్ని ఎంత తరచి అడిగినా తను గతంలో యిచ్చిన రాజముద్ర గురించి చెప్పలేకపోతున్నాడు. ఆ రాజముద్ర ఏమైందంటే - యువరాజు పేదవాడి బట్టలు వేసుకున్నాక బయటకు వెళుతూ వెళుతూ ఓ కోతి బొమ్మలో దాచాడు. ఆ విషయం రాజమహల్లో ఎవరికీ తెలియదు. ఆ రాజముద్ర కనబడలేదు. దాని గురించి అడిగినప్పుడల్లా యువరాజు వేషంలో వున్న పేదవాడు తెల్లమొహం వేస్తున్నాడు. ఇక్కణ్నుంచి తెలుగులో కథ మార్చేశారు. 

రాజాజ్ఞ మేరకు ఓ రోజు ఎంత వెతికినా కనబడకపోవడంతో విలన్‌ ఆర్‌.నాగేశ్వరరావుకి అనుమానం వచ్చింది. నిలదీశాడు. పేదవాడు తన అడ్రస్‌ చెప్పేశాడు. ఇతన్ని అడ్డు పెట్టుకుని నాటకం ఆడవచ్చని విలన్‌ అనుకున్నాడు. వెళ్లి సుబేదారును బెదిరించాడు. నువ్వు ఆ రోజు బయటకు నెట్టేసింది అసలు యువరాజునే. వాడు తిరిగి వస్తే నీ పని ఆఖరే అని. ఏం చేయమంటారన్నాడు సుబేదారు. 'పేదవాడి తండ్రిని వెతికి పట్టుకో. యువరాజు ఆచూకీ తెలుస్తుంది. వాణ్ని ఖతం చేస్తే నిన్ను సేనాపతిని చేస్తా' అని ఆశపెట్టాడు. విలన్‌ అంచనా కరక్టే. యువరాజు ఎన్టీయార్‌ వద్దనే బందీగా వున్నాడు. తల్లి గంజి పోసింది. అది తాగాక యువరాజుకు పేదల కష్టాల పట్ల అవగాహన కలిగింది. సుబేదారు పేదవాడి తండ్రి ఎన్టీయార్‌ను వెతుకుతూ అతని దగ్గరకే వచ్చి వాకబు చేశాడు. ఎన్టీయార్‌ సుబేదారుకంటె తెలివైన వాడు. బురిడీ కొట్టి పంపించేశాడు. రాజు అనారోగ్యం ముదిరింది. తన తదనంతరం తన పిల్లవాడి బాగోగులు చూసుకోవడానికి విక్రమ్‌ పనికి రాడని అంటూ వేరేవారి పేరు ప్రకటించే లోపునే రాజు మరణించాడు. ఇక విక్రమ్‌కు అడ్డు లేదు.

పుస్తకంలో వున్న కథ గురించి కాస్త చెప్పుకుందాం. పేదవాడి తండ్రి యువరాజును ఎత్తుకుని పారిపోయాడని చెప్పాను కదా, అతన్ని దొంగను చేయబోయాడు, ముష్టివాణ్ని చేయబోయాడు. మనవాడు దేనికీ లొంగలేదు. పారిపోయి ఒకళ్లింటికి వెళితే పనివాడిగా వుద్యోగం యివ్వబోయారు. అక్కరలేదని పారిపోయాడు. చివరికి అతను యువరాజే అని నమ్మినవాడు ఒక్కడు దొరికాడు. అతను రాజుగారిమీద పగబూనిన ఓ ఉన్మాది. అతను యితన్ను చంపబోయాడు. కానీ సమయానికి పేదవాడి తండ్రి వచ్చి విడిపించి మళ్లీ దొంగల ముఠాకు చేర్చాడు. దుర్మార్గమైన పన్నుల విధానం వలననే సమాజంలో దొంగలు తయారవుతున్నారని యువరాజు గుర్తించాడు. అక్కణ్నుంచి తప్పించుకుని వస్తూండగా మైల్స్‌ హెండన్‌ అతన్ని రక్షించి తనతో తీసుకెళ్లాడు. 

అక్కడ పరిస్థితంతా మారిపోయింది. అతని తమ్ముడు యితని ప్రియురాలిని పెళ్లాడి యితని ఆస్తంతా కొట్టేశాడు. ఇతను రాగానే యితను అన్నగారి పేరుతో వచ్చిన మోసగాడని చెప్పి జైల్లో పెట్టాడు. న్యాయవ్యవస్థ అంతా లోపభూయిష్టం. శిక్షలు తీవ్రం. కోడిపెట్ట దొంగిలిస్తే ఉరిశిక్ష. మైల్స్‌కి గుదిబండ శిక్ష వేశారు. అతనితో వున్న యువరాజుకి వేసిన శిక్ష కూడా మైల్సే అనుభవించాడు. అతని మంచితనానికి యువరాజు చలించిపోయాడు. నిన్ను ప్రభువును చేస్తానన్నాడు. మైల్స్‌ నవ్వుకున్నాడు. ఈ లోపున యువరాజు స్థానంలో వున్న పేదవాడు తనకు లభించిన అధికారంతో ప్రజలకు మంచి చేయడం మొదలుపెట్టాడు.  క్రూరశాసనాలను రద్దు చేశాడు. శిక్షలు తగ్గించాడు. ఖైదీలను విడిపించాడు. అధికారపత్రాలను జాగ్రత్తగా చదివి సంతకం పెట్టేవాడు. ఆ స్థానంలో స్థిరపడ్డాడు. తన కుటుంబం గుర్తుకు వచ్చినా మర్చిపోవడానికి ప్రయత్నించేవాడు. ఈ పంజరంలోంచి బయటపడలేమని,  పడితే యిన్నాళ్లూ దొంగనాటకం ఆడినందుకు వురి తీస్తారని గ్రహించాడు. 

తెలుగు సినిమాలో యీ ఘట్టాలూ లేవు, యీ మెంటల్‌ కాంప్లికేషన్సూ లేవు. అతను చివరిదాకా మామూలువాడిగానే వున్నాడు. ఇక్కణ్నుంచి కథలో చాలా మెలికలు పెట్టారు. అనుకోకుండా పేదవాడి తల్లీ అక్కా కోటముందుకు వచ్చారు. పేదవాడు నేను ఫలానా అని చెప్పి లోపలకి తీసుకెళ్లాడు. ఇది విలన్‌ పథకాలకు విఘాతం. ఇతన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి కీలుబొమ్మగా వాడుకోవడానికి అమ్మను, అక్కను బంధించాడు. ఇవతల ఎన్టీయార్‌ యువరాజును దొంగల మధ్యకు తీసుకెళ్లాడు. వాళ్లు కోటకు కన్నం వేద్దామనుకున్నారు. యువరాజు తనకు ఖజానా ఎక్కడుందో తెలుసన్నాడు. ఆ విధంగానైనా కోటలో తన మందిరానికి వెళదామని...! ...వెళ్లాడు కూడా. అక్కడ పేదవాడు యువరాజును గుర్తించి బతిమాలాడు, వచ్చి తనను విముక్తుణ్ని చేయమని. కానీ విలన్‌ అడ్డుపడ్డాడు. అసలైన యువరాజును గుర్తించనట్టుగా నటించి బంధించబోయాడు. కానీ ఎన్టీయార్‌ యువరాజును రక్షించి తీసుకుపోయాడు. రేలంగి యింట్లో నేలమాళిగలో దాచాడు కూడా. అయినా యువరాజు వూరుకోలేదు. ఆ రోజే పట్టాభిషేకం. వెళ్లి తన స్థానం తిరిగి సంపాదించుకోవాలని సుబేదారును ఆర్డరేశాడు. కానీ సుబేదార్‌ విలన్‌ ఆర్‌. నాగేశ్వరరావు మనిషి కదా. యువరాజును తీసుకెళ్లి చంపేయబోయాడు. యువరాజు పరిస్థితి గమనించాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సుబేదార్‌ చలించిపోయాడు. ఇంతలో ఎన్టీయార్‌ వచ్చి సుబేదారుతో ఫైట్‌ చేశాడు. సుబేదారు చనిపోతూ యితను యువరాజేనని చెప్పాడు. అప్పుడు ఎన్టీయార్‌, అతనితో బాటు సాటి దొంగలు యువరాజుకు న్యాయం చేద్దామని కోటకు బయలుదేరారు.

పుస్తకంలో యిలా వుండదు. మేనమామ, సుబేదారు కుట్ర చేయడం వుండదు. మైల్స్‌ దండన తర్వాత యిద్దరూ కలిసి లండన్‌ వస్తారు, పట్టాభిషేకానికి అక్కడ యువరాజు ఒక్కడే సభామండపానికి వస్తాడు. ధైర్యంగా తన హక్కుల కోసం ప్రశ్నిస్తాడు. అప్పటిదాకా పేదవాడు డోలాయమాన స్థితిలో వుంటాడు. అతను అప్పటికే అధికారం మత్తులో పడ్డాడు. పట్టాభిషేకానికి వూరేగింపులో వస్తూవుంటే పాత స్నేహితులు కనబడితే మొహం తిప్పుకున్నాడు. తల్లి తనను గుర్తుపట్టి దగ్గరకు వచ్చినా స్పందించలేదు. తర్వాత తన కంటె నీచుడు లేడని ఫీలయ్యాడు. రాజసంరక్షకుడితో 'ఆమె నా తల్లి' అన్నాడు. 'హారి భగవంతుడా, తగ్గిపోయిందనుకున్న ఉన్మాదం మళ్లీ తిరగబెట్టిందే' అనుకున్నాడతను. 

కానీ ఎప్పుడైతే యువరాజును చూశాడో అతని సందిగ్ధం అంతా తొలగిపోయింది. యువరాజు తన స్థానాన్ని పొందడానికి ఎంతో సాయపడ్డాడు. పుస్తకంలో అతనికి అడ్డుపడిన వారు ఎవరూ లేరు. కానీ తెలుగు సినిమాలో యీ ఘట్టం అలాగే చూపిస్తూ, విలన్‌ మధ్యలో అడ్డుపడడం, చివర్లో చంపబోవడం పెట్టారు. యువరాజుకి అండగా ఎన్టీయార్‌ నిలబడ్డట్టు చూపించారు. అప్పుడు రాజగురువు రాజముద్ర ఎక్కడునిదో చెప్పగలవా? అని అడిగాడు. పేదవాడు సభాముఖంగా తన కథ చెప్పాడు. అప్పుడు యువరాజు తన గదిలోకి వెళ్లి కోతిబొమ్మ నుంచి రాజముద్ర తీసుకుని వచ్చాడు. అప్పుడు విలన్‌ అతనిపై కత్తి విసిరాడు. ఎన్టీయార్‌ అతనితో తలపడ్డాడు. చివరకు కథ సుఖాంతమైంది. తనకు సాయపడిన పేదవాడి కుటుంబాన్ని, రేలంగిని యువరాజు ఆదుకున్నాడు. 

సినిమా యిక్కడ ముగుస్తుంది. నవలలో ఇంకాస్త రాశారు. తన అనుభవాలతో పేదల కష్టాలను గ్రహించిన రాజు తప్పులు ఎలా సవరించాడో, మంచివారిని ఎలా సత్కరించాడో రాశారు. మైల్స్‌ హెండన్‌ను ప్రభువు చేశాడు. పేదవాడి తండ్రి కనబడకుండా పోయాడు. కానీ పేదవాడు రాజమిత్రుడు అనే బిరుదుతో చాలాకాలం బతికాడు. సలహాదారుగా వున్నాడు. 

ఈ తమాషా కథను ప్రపంచమంతా ఆదరించింది. తెలుగులో సినిమాగా తీసినప్పుడు కూడా బాగా తీశారు. కాస్త రాజకీయ కుట్రలూ, కూహకాలూ కలిపి కథను రక్తి కట్టించారు. ధూర్తుడైన పేదవాడి తండ్రిగా ఎన్టీయార్‌, వృద్ధరాజుగా ఎస్వీయార్‌, కుటిలుడైన రాజబంధువుగా ఆర్‌. నాగేశ్వరరావు పోటీపడి నటించారు. బాలనటుడు సుధాకర్‌ రెండు పాత్రల్లోనూ బాగా నటించారు. (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?