Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌ - ఆదుర్తి దురదృష్టం

జవాబులు - ''లవకుశ''లో పాట ప్రస్తావించినపుడు పల్లవి మార్చి రాయడం పొరపాటు. ఆ చిత్రనిర్మాణసమయంలో పుల్లయ్యగారు అస్వస్థులయ్యారు తప్ప మరణించలేదు. తప్పులకు క్షంతవ్యుణ్ని. 

వహీదా రెహమాన్‌ నటించిన తెలుగు సినిమా ''బంగారు కలలు'' సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు. ఆయన తెలుగువాడే అయినా ''మూగమనుసులు'' సినిమాను ''మిలన్‌'' (1967) గా రీమేక్‌ చేస్తూ ఎల్‌.వి.ప్రసాద్‌గారు హిందీ సీమకు తీసుకెళ్లి పరిచయం చేయడంతో అక్కడా బాగా వెలిగారు. 1967లో రిలీజైన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. హీరోగా వేసిన సునీల్‌ దత్‌కు సుబ్బారావు బాగా నచ్చారు. 

తన స్వంత బ్యానర్‌ 'అజంతా ఆర్ట్‌స్‌' పేర ఓ సినిమా తీసిపెట్టమని కోరారు. ''కుమరి పెణ్‌'' అనే ఓ తమిళ సినిమా. దాన్ని  మల్లెమాల ఎమ్మెస్‌రెడ్డిగారు ''కన్నెపిల్ల'' అనే పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. దాన్ని హిందీలో ''మన్‌ కా మీత్‌'' (1968) అనే పేరుతో ఆదుర్తి హిందీలో తీశారు. లీనా చందావర్కార్‌కి అదే తొలి సినిమా. వినోద్‌ ఖన్నాకు పేరు తెచ్చిన తొలి సినిమా కూడా. ఆ తర్వాత ''డోలీ'' (1969) అనే యింకో సినిమా రాజేశ్‌ ఖన్నా, బబితాతో బహార్‌ ఫిలింస్‌ వారికి తీశారు. తర్వాత 1970లో  ''సత్తెకాలపు సత్తయ్య''ను హిందీలో  వినోద్‌ ఖన్నా, భారతి, మెహమూద్‌, పద్మినిలతో ''మస్తానా'' పేరుతో ప్రేమ్‌జీ అనే నిర్మాతకు తీస్తూ తనే దర్శకనిర్మాతగా ''దర్పణ్‌'' (1970) అని సునీల్‌ దత్‌, వహీదా రెహమాన్‌లతో తీశారు. ''మస్తానా'' ఆడింది. ''దర్పణ్‌''  దెబ్బతింది.  ఇలా ఎగుడు దిగుడుల మధ్య వుండగా ఆదుర్తి తన జీవితంలో ఓ పెద్ద తప్పటడుగు వేశారు.

''దర్పణ్‌'' అప్పుల వ్యవహారం ఫైనలైజ్‌ చేసుకుందామని మద్రాసునుండి బొంబాయికి విమానంలో బయలుదేరాడాయన.  మధ్యలో విమానం ట్రబులిచ్చి హైదరాబాదులో దింపేశారుట. హైదరాబాదులో ఎందుకు ఆగిందా అనుకుంటూండగానే అప్పటికప్పుడు ఓ ఆలోచన వచ్చింది. ''పూలరంగడు'' హిందీలో తీస్తే..? అనుకున్నారు ఆదుర్తి. వెంటనే దుక్కిపాటి వారి వద్దకు వెళ్లి ''పూలరంగడు'' హిందీలో తీయడానికి రైట్స్‌ యివ్వండి'' అన్నారట. ''తీసుకో, నీకు వేరే యిచ్చేదేముంది. తీసి సక్సెసయ్యాక మిగతా సంగతులు చూసుకుందాంలే'' అన్నారట దుక్కిపాటి వుదారంగా. 

దుక్కిపాటి వారిని అడగడానికే విధి నన్ను హైదరాబాదులో దింపిందేమో అనుకుని మురిసిపోయారు ఆదుర్తి. ధైర్యంగా దాన్ని ''జీత్‌'' (1972) పేరుతో రణధీర్‌ కపూర్‌, బబితలతో స్వంతంగా హిందీలో తీశారు. ''పూలరంగడు'' సూపర్‌ హిట్‌ కానీ అది హిందీలో ఫెయిలయింది. మరింత దెబ్బ తిన్నారు. విమానాన్ని హైదరాబాదులో దింపిన విధి గేమ్‌ప్లాన్స్‌ వేరేలా వున్నాయని తర్వాత అర్థమైంది ఆదుర్తికి! 

ఇది విడుదలయ్యే లోపున వీనస్‌ కృష్ణమూర్తి గారికి ''రఖ్‌వాలా'' (1971) అని యింకో రీమేక్‌ సినిమాను ధర్మేంద్ర, లీనా చందావర్కార్‌, వినోద్‌ ఖన్నాలతో తీశారు. అదేదో కాస్త ఆడింది. దాంతో ''ఇన్సాఫ్‌'' అని ప్రాణ్‌, వహీదా రెహమాన్‌, తనూజాలతో ఆయనకే యింకో సినిమా తీశారు. అది పోయింది. ఈ రెండిటి మధ్యలో తెలుగులో అన్నపూర్ణావారికి తీసిన ''విచిత్రబంధం'' ఆడింది. స్వంత బ్యానర్‌లో ''మాయదారి మల్లిగాడు'' తీస్తే అదీ బాగా ఆడింది. ఓహో యీయన స్ట్రీక్‌ బాగుందిరా అనుకుని 1973లో ఇంకో ఆఫర్‌ వచ్చింది - ''దాగుడు మూతలు'' హిందీలో తీయమని. ధర్మేంద్ర, సైరా బానులతో హర్‌గోబింద్‌ అనే ఆయన ''జ్వార్‌ భటా'' (1973) అనే పేరుతో తీశాడు. అది ఫెయిలయింది. తర్వాత వడ్డె శోభనాద్రి, ఎయస్‌ఆర్‌ ఆంజనేయులు కలిసి ''సున్‌హరా సంసార్‌'' (1975) అనే పేరుతో 'పండంటి కాపురం''  రీమేక్‌ సినిమా తీసిపెట్టమన్నారు. రాజేంద్ర కుమార్‌, హేమా మాలిని, మాలా సిన్హాలతో తీశారు. అది పెద్దగా ఆడలేదు. ఇలా హిందీ సీమలో అనేకమందితో సినిమాలు తీసినా ఆదుర్తి, సునీల్‌ దత్‌ చాలా ఆత్మీయంగా వుండేవారుట. వారిద్దరినీ కలిపి అప్పట్లో ''స్క్రీన్‌'' పత్రిక ఓ సారి 'సునీల్‌రావ్‌ అండ్‌ సుబ్బాదత్‌' అని చమత్కరించింది.  

************

సునీల్‌ దత్‌ గురించి చెప్పాలంటే - అతని కొడుకు ''ఖల్‌ నాయక్‌'' సంజయ్‌ దత్‌ కారణంగా అందరి నోళ్లలోనూ నానినా  సునీల్‌ దత్‌ చాలా పెద్దమనిషి, మంచి మనిషి, సంఘసేవకుడు. అతని గురించి చెప్పగానే మొదటగా అందరూ అనేది - ''మదర్‌ యిండియా'' (1957) సినిమాలో ఓ అగ్నిప్రమాదంలో రక్షించినందుకే కృతజ్డతాభావంతో తన కంటె ఓ ఏడాది చిన్నవాడు, తనకంటె చాలా తక్కువ స్టార్‌ అయిన సునీల్‌ను నర్గీస్‌ అతన్ని పెళ్లి చేసుకుందని! జరిగిందేమిటంటే - 

మెహబూబ్‌ ఖాన్‌ తన యాక్టర్లమధ్య సాన్నిహిత్యం పెంచడానికి పిక్నిక్స్‌ ఏర్పాటు చేసేవాడు. రాజేంద్ర కుమార్‌, సునీల్‌ దత్‌ యిద్దరితోనూ నర్గీస్‌ స్నేహంగా వుండేది. ఇలా వుండగా గుజరాత్‌లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సినిమాలో ఓ గడ్డిమేటులో సునీల్‌ దత్‌ను పడేసి నిప్పు ముట్టించేస్తారు, అతని చేష్టలతో విసిగిపోయిన గ్రామస్తులు. కానీ తల్లి నర్గీస్‌ మంటల్లో లోపలికి పరుగుపెట్టి కొడుకుని రక్షించుకుంటుంది. ఆ సీను తీస్తూండగా గాలి దిశ మారి నర్గీస్‌ మంటల్లో చిక్కుకుపోయింది. అందరూ కంగారు పడుతూండగా సునీల్‌ గబగబా మంటల్లోకి ఉరికి నర్గీస్‌ను బయటకు తీసుకుని వచ్చాడు. నర్గీస్‌కు గాయాలు తక్కువగానే తగిలాయి కానీ, సునీల్‌కి ఒళ్లు బాగానే కాలింది. నర్గీస్‌ ఆసుపత్రిలో దివారాత్రాలు వుండి సునీల్‌కు సేవ చేసింది.

ఈ సంఘటన జరగగానే వెంటనే యిద్దరూ పెళ్లిమండపంలోకి వెళ్లిపోయారనుకుంటే పొరబాటే! ఇది జరిగాక కొన్నిరోజులకు బొంబాయిలో షూటింగు జరుగుతూండగా సునీల్‌ చాలా ఖిన్నుడై వుండడం గమనించి సంగతేమిటని అడిగింది నర్గీస్‌. బాగా రొక్కించగా 'మా అక్కయ్య రాణితో నేను వుంటున్నాను కదా. ఆమెకు టిబి. వైద్యానికి డబ్బు లేదు. వాళ్లకో చిన్నపిల్ల. దానికీ యీ రోగం సోకుతుందేమోనని భయం.' అన్నాడు సునీల్‌. ఇది వినగానే నర్గీస్‌ షూటింగు నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. అతని ఫ్లాట్‌కి వెళ్లి సునీల్‌ అక్కను తన ఫ్యామిలీ డాక్టరు వద్దకు తీసుకెళ్లింది. మేనకోడలిని తన యింటికి తీసుకుపోయింది. 

దీని తర్వాత రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగింది. రాణి ఫ్లాట్‌కి నర్గీస్‌ వచ్చి కబుర్లు చెపుతూండేది. ఓ రోజు బాగా పొద్దుపోయాక నర్గీస్‌ను కారులో యింటికి దింపుతూ సునీల్‌ ''నన్ను పెళ్లాడతావా?'' అని అడిగాడు. నర్గీస్‌కు అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏదో ఆవేశంలో అంటున్నాడేమో అనుకుని మర్నాడు అతని చెల్లితో మాట్లాడింది. సునీల్‌ పంజాబీ బ్రాహ్మణుడు. నర్గీస్‌ ముస్లిమ్‌. పైగా పాటలు పాడే ఆమె కూతురు. రాజ్‌ కపూర్‌తో ఆమె ప్రేమ పురాణం జగమంతా ఎరిగిన సత్యం. అయినా సునీల్‌ సిద్ధపడ్డాడు. సునీల్‌ తల్లి కూడా యీ కోడల్ని ఆమోదించింది. రాణి ద్వారా తన అంగీకారాన్ని సునీల్‌కి తెలిపింది నర్గీస్‌!  

(ఫోటోలు - 1) ఆదుర్తిని కష్టాలపాలు చేసిన ''జీత్‌'' సినిమా, 2) సునీల్‌కు ఆసుపత్రిలో సేవ చేస్తున్న నర్గీస్‌ 3) సునీల్‌, సంజయ్‌, నర్గీస్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

mbsprasadgmail.com

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?