Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీ స్నిప్పెట్స్‌ - బలవంతపు దర్శకుడు

సినీ స్నిప్పెట్స్‌ - 26లో సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్‌  ''సరాగం'' (సత్యనారాయణమూర్తి, రామారావు, గంగాధరం అనే ముగ్గురు చిత్రకారులు తమ పేరులో మొదటి పేర్లు కలిపి స్థాపించిన సంస్థ)లో చేరేవరకూ రాసి మరో సంఘటనకు వెళ్లిపోయాను. ఆయన స్వతంత్రంగా డిజైనర్‌గా ఎదిగిన సంగతి ఆసక్తికరంగా వుంటుంది. సరాగంలో వుండగా 8 నెలల పాటు జీతం లేకుండా పని చేయాలని కాంట్రాక్టు. ఇంటి దగ్గర్నుంచి నెలకు 40 రూ.లు వచ్చేది. దానిలోనే సరిపెట్టుకోవాలి. ఓ నెల అదీ రాలేదు. దాంతో యీయన పదిరోజులు పస్తు వుండవలసి వచ్చింది. సంగతి తెలిసి సరాగం వాళ్లు ఆ నలభై మేమే యిస్తామన్నారు. ఎందుకంటే అప్పటికే లెటరింగులో యీయన ప్రావీణ్యం వాళ్లు గమనించారు. ఆ ఆఫీసులో తొమ్మిది నెలలు గడిచాక ఓ వాస్తు పండితుడు వచ్చి సరాగం భాగస్వాముల్లో ఒకరైన గంగాధరంతో ''మీ ఆఫీసు ఎదురుగదిలోకి మార్చుకోండి. బిజినెస్‌ బాగుంటుంది.'' అని చెప్పిపోయాడు. అప్పట్లో బిజినెస్‌ డల్‌గా వుండడంతో ఆ మాట గంగాధరం మనసులో నాటుకుపోయింది. కానీ తక్కిన యిద్దరూ వద్దన్నారు. అప్పణ్నుంచి వాళ్ల మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. క్రమేపీ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం మానేశారు. ఆ పరిస్థితిలో అక్కడుంటే నలిగి పోవాల్సి వస్తుందని యీయన కేతా గారి దగ్గరకు వచ్చేశారు. ఆయన 80 రూ.ల జీతం యిస్తూ ''లెటరింగ్‌కి వేరేవాళ్లున్నారు. నువ్వు డిజైనింగ్‌ చూడు.'' అన్నారు. కేతాగారు యీయనను సొంత బిడ్డలా చూసుకుంటూ పని బాగా నేర్పించారు.  

ఓ రోజు సరాగం టీములోని గంగాధర్‌ కేతా వద్దకు వచ్చి ''నేను విడిగా వచ్చేశాను గురువుగారూ, మీరు ఈశ్వర్‌ను నాకు యిచ్చేస్తే మేం యిద్దరం కలిసి కొత్తగా ఆఫీసు పెట్టుకుంటాం'' అన్నారు. ''నా దగ్గరున్న ఏడుగురిలో ఎవరినైనా యిస్తాను కానీ అతన్ని యివ్వను'' అని కేతా కచ్చితంగా చెప్పడంతో గత్యంతరం లేక ''గురువుని మించిన శిష్యుడు'' నుంచి గంగాధర్‌ ఒంటరిగానే తన పేరుతో పోస్టర్లు డిజైన్‌ చేయడం మొదలుపెట్టారు. కేతా వద్ద పనిచేస్తూ ఈశ్వర్‌ పెయింటింగు సెక్షన్‌లో ఆరితేరారు. ''మహామంత్రి తిమ్మరసు'', ''అమరశిల్పి జక్కన''. ''పాండవ వనవాసం'' వంటి సినిమాల్లో ఈశ్వర్‌ అప్పటివరకు తెలుగువారికి పరిచయం లేని కొత్త తరహా పెయింటింగు పరిచయం చేశారు. కన్నడ సినిమాలకు కూడా వేయసాగారు. నాలుగున్నరేళ్లు పోయేసరికి ఆయన జీతం 500 రూ.లయ్యాయి. సడన్‌గా కేతాగారిలో అనూహ్యమైన మార్పు చూశారు ఈశ్వర్‌. మనసు బాధపడి ''ఇక నేను వెళ్లిపోతానండీ'' అన్నారు ఓ రోజు. కేతాగారు అవాక్కయి పోయి వెళ్లవద్దని, ఎంత జీతమైనా తీసుకోమని బలవంత పెట్టారు. అయినా యీయన తెగించి బయటకు వచ్చి 1967లో ఈశ్వర్‌ పేరుతో పోస్టర్లు వేయడం ప్రారంభించారు. డిజైనర్లకు స్టిల్‌ ఫోటోగ్రాఫర్లతో బాగా పరిచయాలుంటాయి. మరో యిద్దరితో కలిసి 'కల్పనా ఎడ్వర్‌టైజింగ్‌ ఏజన్సీ' నడిపే సీనియర్‌ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషణ్‌తో యీయనకు బాగా పరిచయం ఏర్పడింది. వాళ్లకు మోడరన్‌ థియేటర్స్‌ వారి వర్క్‌ వస్తే యీయన్ని పిలిచారు.

అదే సమయంలో బాపు-రమణల ''సాక్షి'' పూర్తయింది. భూషణ్‌ యీయన్ని బాపు వద్దకు తీసుకెళ్లారు. బాపు ''మీ దగ్గర కంప్రెషర్‌, స్ప్రే గన్‌ వున్నాయా?'' అని కనుక్కుని 'ఇదీ లోగో, రేపు మీ ఆఫీసుకి వచ్చి కాంపోజిషన్స్‌ అన్నీ స్కెచ్‌ గీసిస్తాను. కన్వెన్షనల్‌ టైపులో కాకుండా కాస్త డిఫరెంట్‌ కలర్‌ స్కీములో చేయండి.' అన్నారు. ఈయన చేసిన వర్క్‌ బాపుకి బాగా నచ్చింది. ''సాక్షి''కి చేసిన పోస్టరు డిజైన్లు విజయా నాగిరెడ్డి గారిని మెప్పించాయి. అప్పుడాయన ''రామ్‌ ఔర్‌ శ్యామ్‌'' సినిమా తీస్తున్నారు. దిలీప్‌ కుమార్‌ రికమెండ్‌ చేస్తే ''గంగా జమునా'' సినిమాకు అద్భుతమైన పోస్టర్లు చేసిన మెగానీ అనే బొంబాయి ఆర్టిస్టుకి పోస్టర్‌ డిజైన్‌ వర్క్‌ యిచ్చారు. ఆయన మద్రాసు వచ్చి తాజ్‌ కోరమాండల్‌లో మకాం పెట్టి రెండు నెలలుండి వర్కు చేసి యిచ్చాడు. కానీ వాటిలో దిలీప్‌, వహీదాల పోలికలు లేవని నాగిరెడ్డిగారికి, వారి అబ్బాయిలకు అసంతృప్తి. ఈశ్వర్‌ని పిలిపించి అవి చూపించి ''మీరేమైనా ప్రయత్నించగలరా?'' అని అడిగారు. పోలికలు లేకపోయినా మెగానీ వేసిన పోస్టర్లలో పెయింటింగ్‌ స్టయిల్‌, కలర్‌ స్కీము అద్భుతంగా వున్నాయని ఈశ్వర్‌ ఫీలయ్యారు. రాత్రంతా కూర్చుని దిలీప్‌, వహీదాల పెయింటింగ్‌ పూర్తి చేసి పొద్దున్న కల్లా పోస్టర్‌ డిజైన్‌ తయారుచేసి చూపించారు. నాగిరెడ్డి కుమారుడు వేణుగోపాల రెడ్డి మంచి ఆర్ట్‌ క్రిటిక్‌. వాళ్ల ప్రసాద్‌ ప్రాసెస్‌లో చాలా సంవత్సరాలుగా హిందీ సినిమాల పోస్టర్లు ప్రింటు అవుతూండడం వలన ఎవరి పెయింటింగు స్టయిల్‌ ఎటువంటిదో బాగా తెలుసు. బొంబాయి పోస్టర్లు ఆయిల్‌ పెయింటింగులో చేస్తారు. దక్షిణాది వాళ్లు తీసే హిందీ సినిమాలలో మాత్రమే వాటర్‌ కలర్స్‌ వాడతారు. మెగానీ ఆయిల్‌ పెయింటింగు స్టయిల్లో ఈశ్వర్‌ వాటర్‌ కలర్స్‌తో వర్క్‌ చేయడం చూసి వాళ్లు ఆనందభరితులయ్యారు. మొత్తం పోస్టర్ల వర్కంతా యీయనకే అప్పచెప్పారు.

ఆ పోస్టర్లు హిట్‌ కావడంతో రామానాయుడుగారు నాగిరెడ్డి గారి అబ్బాయిలతో కలిసి తీసిన ''పాపకోసం'' సినిమా పోస్టర్ల పని కూడా ఈశ్వర్‌కే వచ్చింది. దానిలో బ్రష్‌ వాడకుండా ప్యాలెట్‌ నైఫ్‌ వర్క్‌ చేశారు. ఆ పోస్టర్లకు విపరీతంగా పేరు రావడంతో ఆ సంగతి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌స్‌కు చేరింది. ఇప్పటి హీరోలు సూర్య, కార్తీల తండ్రి, స్వయంగా నటుడు, చిత్రకారుడు అయిన శివకుమార్‌కు యీ సంగతి తెలిసి ప్రసాద్‌ ప్రాసెస్‌కు వెళ్లి డిజైన్స్‌ అన్నీ చూసి చాలా మెచ్చుకున్నాడు. ఇక అప్పణ్నుంచి రామానాయుడుగారి సినిమాల వర్కంతా యీయనకు రాసాగింది. ఆయన తీసిన హిందీ సినిమాల వర్క్‌ కూడా. జెమినీ వాసన్‌ ''మనుషులు మారాలి'' సినిమా తీస్తూ మంచి డిజైనర్‌ పేరు చెప్పమంటే నాగిరెడ్డి గారబ్బాయి యీయన పేరు రికమెండ్‌ చేశారు. అప్పుడు వాసన్‌ పిలిపించి స్వయంగా మాట్లాడి పని యిచ్చారు. దాని హిందీ వెర్షన్‌కు కూడా ఈశ్వరే వేశారు. ఇలా దినదిన ప్రవర్ధమానం అయ్యారు. కానీ ఎదిగే దశలోనే ఓ పొరపాటు చేశారు. దాని ఫలితం అనుభవించారు కూడా.

ఈశ్వర్‌ సరాగం కంపెనీలో పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరకు హనుమంతు అనే ఒకతను వస్తూ పోతూ వుండేవాడు. అతని స్వగ్రామం ఏలూరు. నాటకాల్లో వేస్తూ సినిమా ఛాన్సు కోసం మద్రాసుకి తరచుగా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా వీళ్ల ఆఫీసుకి వచ్చి బాతాఖానీ కొట్టేవాడు. ఈశ్వర్‌కు మరో ఫ్రెండున్నాడు - కైలాసం అని. మద్రాసులోనే ఉద్యోగం చేస్తూ వుండేవాడు. వీళ్లిద్దరికీ పడేది కాదు. 'హనుమంతు ఒట్టి కబుర్లపోగు, నీకెక్కడ తగిలాడు' అనేవాడు. 'నమ్మకస్తుడు, స్నేహపాత్రుడు, అప్పుడప్పుడు వార్తలు మోసుకొస్తూ వుంటాడు, నష్టం ఏమీ లేదులే' అనేవారు ఈశ్వర్‌. కొన్నాళ్లకు హనుమంతుకు నిర్మాత కావాలనే కోరిక పుట్టింది. నటుణ్ని ఎలాగూ కాకపోయానని గ్రహించి ''రెండున్నర లక్షల్లో, లో బజెట్‌లో సినిమా తీసేస్తాను. ''సాక్షి''లా మొత్తమంతా ఔట్‌డోరే.'' అనసాగాడు. కథల గురించి వెతుకుతూ, వెతుకుతూ ఈశ్వర్‌ ఎప్పుడో ఓ పత్రిక కోసం రాసిన కథానిక అతని దగ్గర వుండిపోతే దాన్ని బయటకు తీసి మళ్లీ చదివి 'ఇది నాకు కరక్టుగా సరిపోతుంది. దాసం గోపాలకృష్ణ చేత ట్రీట్‌మెంట్‌ చేయిస్తాను' అన్నాడు. ఈశ్వర్‌ సరేనన్నారు. కొన్నాళ్లు హోటల్లో సిటింగ్స్‌ వేసి కథని సీన్స్‌తో సహా రాయించుకుని వచ్చి వినిపించాడు. డైరక్టరు కోసం వెతికాడు. దాసరి నారాయణరావు సరేనన్నారు కానీ కాస్త ఆగమన్నారు. అప్పటిదాకా ఆగలేక హనుమంతు ఎవరైనా కొత్త డైరక్టరుతో తీద్దాం అన్నాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి సినిమాలకు అసోసియేట్‌గా చేసిన భీమలింగం అనే ఆయన్ని ఈశ్వర్‌ పరిచయం చేశారు. ఆయన చర్చల్లో కూర్చుని, కథకు ఓ రూపాన్ని తీసుకుని వచ్చారు. నటుల కోసం హనుమంతు వైజాగ్‌ వెళ్లి రంగస్థల నటుల్ని ఎంపిక చేసుకుని వచ్చాడు. అడ్వాన్సులు యిచ్చాడు. 

సినిమా తీస్తానని చెప్పి తన అన్నగారి నుంచి తెచ్చిన 80 వేల రూ.లను హనుమంతు యీ ప్రయత్నాలకు ఖర్చు పెట్టేశాడు. ఇకపై పెట్టుబడి పెట్టేందుకు ఫైనాన్షియర్ల కోసం వెతుకుతున్నాడు. ''స్టార్‌ కాస్ట్‌, పేరున్న టెక్నీషియన్లు లేని సినిమాకు ఎవడయ్యా డబ్బు పెట్టేది? నిన్ను అడ్డు పెట్టుకుని నిర్మాత కావాలని చూస్తున్నాడు. జాగ్రత్త'' అని కైలాసం హెచ్చరించాడు. అదే జరిగింది. ''ఫైనాన్షియరు నడిగితే ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్లు యిస్తే వాటి మీద యిస్తానంటున్నాడు. మనకు ఫైనాన్స్‌ లక్ష చాలు, సబ్సిడీ మరో లక్ష వస్తుంది. సరిగ్గా సరిపోతుంది. నీ ప్రాపర్టీ డాక్యుమెంట్లు పెడితే సబ్సిడీ రాగానే వెనక్కి తీసేసుకోవచ్చు.'' అని హనుమంతు ఈశ్వర్‌ను కన్విన్స్‌ చేశాడు. ఈయన తన యింటి పత్రాలు తనఖా పెట్టాడు. డబ్బు తీసుకున్నాక రెండు రోజులకు హనుమంతు డైరక్టరు భీమలింగంతో గొడవ పెట్టుకుని అతన్ని తీసేశాడు. ''ఈ కథ నీదే కనక నువ్వే డైరక్టు చేయ్‌. లేకపోతే మొత్తం ప్రాజెక్టు కాన్సిల్‌ చేస్తాను. రెండు రోజుల్లో షూటింగ్‌. ఔట్‌డోర్‌ యూనిట్‌కు అడ్వాన్సు యిచ్చేశాను.'' అని ఈశ్వర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తన ఆస్తి పత్రాలు యిరుక్కున్నాయి కాబట్టి అనుభవం లేకపోయినా, యిష్టం లేకపోయినా బలవంతంగా ఈశ్వర్‌ మెగాఫోన్‌ పట్టవలసి వచ్చింది.

ఇక దాంతో పరిశ్రమలో విమర్శలు వచ్చాయి. ''బొమ్మలు వేసుకోక డైరక్షన్‌ ఎందుకు? సినిమా తీసి కోట్లు ఆర్జిద్దామనా?'' అని వెక్కిరించారు. భీమలింగం అంటే యిష్టం వున్న   ఒక పేరు మోసిన కళాదర్శకుడు అతను ప్రాజెక్టులోంచి బయటకు వెళ్లడానికి ఈశ్వరే కారణమనుకుని కోపం పెంచుకుని యీయన వ్యాపారానికి గండి కొట్టాడు. ఈయన వద్ద పనిచేసే యిద్దరు ఆర్టిస్టులను తనవైపు తిప్పుకుని ఓ కంపెనీ పెట్టి, యీయన క్లయింట్ల నందరినీ తన వశం చేసుకున్నాడు. ఈశ్వర్‌ నలభై రోజుల్లో సినిమా షూటింగు పూర్తి చేసి  ''అయినవాళ్లు'' అని పేరు పెట్టి అమ్మజూపారు. జిల్లాకు నలభైవేల చొప్పున నాలుగైదు ఆఫర్లు వచ్చినా హనుమంతు కొమ్మెక్కి కూచున్నాడు. ఫస్ట్‌ కాపీ వచ్చాక చూస్తే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ధైర్యం చేసి సొంతంగా రిలీజ్‌ చేస్తే రెండు వారాలే ఆడింది. ఈ విషయాలన్నీ ''సినిమా పోస్టర్‌'' ఆత్మకథా గ్రంథంలో రికార్డు చేసిన ఈశ్వర్‌ ''నటీనటులందరూ కొత్తవాళ్లు కావడంతో, ఏ సీన్‌ సరిగా పండకపోవడంతో సినిమా చాలా పేలవంగా తయారైంది. గోపాలకృష్ణ రాసిన డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే సరిగా అవగాహన చేసుకోవడానికి నాకు రెండు రోజుల టైము చాలలేదు.'' అని నిజాయితీగా ఒప్పుకున్నారు. డిస్ట్రిబ్యూటర్‌ ఎనభైవేల అడ్వాన్సు యిచ్చాడు. ఆ మేరకు కలక్షన్‌ రాగానే ప్రింట్స్‌ మూలపడేశాడు. సబ్సిడీ కోసం హనుమంతు మూడు నెలలు హైదరాబాదులో మకాం పెడితే ఆ ఖర్చూ ఈశ్వర్‌దే. చివరకు పలుకుబడి వుపయోగిస్తే సబ్సిడీ లక్ష వచ్చింది. అయితే దానిలో హనుమంతు సగం డబ్బు తన అన్నయ్యకు యిచ్చేసి, ఈశ్వర్‌ చేతిలో తక్కినదే పెట్టాడు. అప్పుడు కానీ అతని నమ్మకద్రోహం యీయనకు అర్థం కాలేదు.

ఫైనాన్షియర్‌ వద్ద అప్పు వడ్డీతో సహా లక్షన్నర అయింది. ఈ ఏభై వేలు పోగా లక్ష అప్పు మిగిలింది. జరిగిన మోసం గ్రహించిన ఫైనాన్షియర్‌ ఈశ్వర్‌పై గౌరవంతో ''మీరు నెలకు పదివేల చొప్పున పదినెలల్లో అప్పు తీర్చేస్తే యికపై వడ్డీ అడగను.'' అని వెసులుబాటు యిచ్చాడు. ఈశ్వర్‌ చేతిలో గతంలో వుండే క్లయింట్లు యిప్పుడు కొత్త కంపెనీకి వెళ్లిపోయారు. యాడ్‌ ఏజన్సీ వ్యాపారం దెబ్బ తింది. అప్పుడు ఈశ్వర్‌ తమిళ పరిశ్రమలో వర్కు సంపాదించుకున్నారు. ఆ ఏడాది తమిళపరిశ్రమే ఆయన్ని అదుకుంది. ఈ లోగా పోటీగా పెట్టిన కంపెనీ మూతపడింది. ఈశ్వర్‌ క్లయింట్లు మళ్లీ ఆయన వద్దకు వచ్చారు. గ్రహణం వీడాక 1976 నుంచి ఈశ్వర్‌ పుంజుకున్నారు. 24 ఏళ్ల పాటు అవిరామంగా ముందుకుముందుకు సాగారు. ఈ ఉదంతంలో తెలుసుకోదగినది ఏమిటంటే - సినీనిర్మాణం కానీ, దర్శకత్వం కానీ పైకి కనబడేటంత సులభం కాదు. ఎందరో నటీనటులు, టెక్నీషియన్లు నిర్మాతలుగా మారి దెబ్బ తిన్నారు. వారి కథలు అప్పుడప్పుడు చెప్పుకుంటూందాం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?