Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌ - నిర్మాతగా సావిత్రి

డివి నరసరాజుగారు సీనియర్‌ సినిమా రచయిత. పెద్దపెద్ద సినిమా కంపెనీలకే రాసేవారు. చాలా డిసిప్లిన్‌తో పనిచేస్తూ, స్క్రిప్టు మొత్తం రాసి యిచ్చేవారు. బౌండ్‌ స్క్రిప్టు లేనిదే షూటింగు మొదలుపెట్టకూడదని అనుకునే పాతతరం సినిమా కంపెనీలు ఆయనను పిలిచేవి. ఆయన కెరియర్‌ చాలా దశాబ్దాలపాటు సాగింది. అనేక రకాల సినీమనుష్యులను చూసి, వారి స్వభావాలు కాచి వడపోసిన మనిషి. తన అనుభవాలతో ''తెర వెనుక కథలు'' అనే పుస్తకాలలో రాశారు. సినీనిర్మాణం చాలా కష్టమని అనేక ఉదాహరణలతో సహా రాశారు. కేవలం నిర్మాతలు అవుదామనే ఉద్దేశంతో వచ్చినవారు ఒక రకం. నటీనటులుగా, టెక్నీషియన్లుగా వచ్చి నిర్మాణంలోకి దిగినప్పుడు జయాపజయాల బట్టి కామెంట్స్‌ వుంటూ వుంటాయి. ఎల్‌ వి ప్రసాద్‌ నటుడిగా, దర్శకుడిగా వచ్చి నిర్మాత అయ్యారు. సక్సెసయ్యారు. ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుని నిర్మాణంలో దిగి, కొన్ని విజయవంతమైన సినిమాలు తీసినా, తర్వాతి సినిమాలు ఫెయిలవడంతో ''ఎందుకండీ యీయనకు ప్రొడక్షన్‌? హాయిగా దర్శకుడిగా మంచి సినిమాలు తీసి తృప్తిపడక..'' అన్నారు కొందరు. గొప్ప నటిగా తారాపథంలో వున్న సావిత్రి నిర్మాతగా మారతానంటే వద్దని వారించిన వైనం నరసరాజు రాశారు. సావిత్రి జీవితగాథను ''మహానటి సావిత్రి'' పేర గ్రంథస్తం చేసిన పల్లవి మరి కొన్ని  వివరాలు రాశారు.

సావిత్రి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ''చిన్నారి పాపలు''. మహిళలే భాగస్వాములుగా ''శ్రీ మాతా ప్రొడక్షన్స్‌ లి.'' అనే సినిమా కంపెనీని 1967లో నెలకొల్పారు. మొత్తం 12 మంది. వీరమాచనేని సరోజినీదేవి అనే ఆవిడ ఆ కంపెనీని ఆర్గనైజ్‌ చేశారు. ఆవిడ రంగస్థల నటీమణి. తనతో బాటు నాటకాల్లో వేసి, సినిమాల్లోకి హీరోగా వచ్చి, కొంతకాలం వెలిగి, విరమించుకుని వెళ్లిపోయిన రామచంద్ర కాశ్యప అనే నటుణ్ని ఆ కంపెనీకి సహాయకుడిగా, సలహాదారుగా తీసుకుందామె. ఈ సినిమా కథ ఆమెదే. దర్శకత్వం, సంగీతదర్శకత్వం, నృత్యదర్శకత్వం, కళాదర్శకత్వం అందరూ మహిళలే చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. సావిత్రిని దర్శకత్వం చేయమని అడిగారు. సంస్థలో వున్నవాళ్లందరూ పెద్దమనుషుల భార్యలే కాబట్టి సావిత్రి వూగిసలాడింది. డైరక్షన్‌ ఒప్పుకున్నాక మీరూ, మీ అమ్మగారూ భాగస్వాములుగా చేరండి అన్నారు. 

నరసరాజు గారి చేత రాయించుకుంటేనే తొలి దర్శకత్వం సక్సెసవుతుందని సావిత్రి అనుకుంది. ఓ రోజు సరోజిని, రామచంద్ర కాశ్యపలను వెంటపెట్టుకుని నరసరాజు గారింటికి వచ్చింది.  ''నేను పిక్చర్‌ డైరక్టు చేస్తున్నాను. మీరు డైలాగ్స్‌ రాసి పెట్టాలి.'' అంది. 

''మీ సినిమాలో భాగస్తులే కాక, టెక్నీషియన్లు కూడా ఆడవాళ్లే కదా! డైలాగ్స్‌ కోసం నా దగ్గరెందుకు వచ్చావ్‌? నన్న కూడా మీలో జమ చేసేశావా?'' అని జోక్‌ చేశారాయన.

సావిత్రి నవ్వుతూనే ''నేను పిక్చర్‌ డైరక్టు చేస్తున్నానంటే అందరూ 'దీని మొఖం! దీనికి డైరక్షన్‌ ఏం తెలుసు' అని ఎద్దేవా చేస్తున్నారు. ఏం తెలుసో చేసి చూపిస్తానని, ఛాలెంజ్‌గా తీసుకున్నాను. బాగా తీయాలంటే ముందుగా రాసి యిచ్చే మీలాటి వాళ్ల స్క్రిప్టు చేతిలో వుండాలి. ''గుండమ్మ కథ'' స్క్రిప్టు చక్కన్నగారు యిస్తే చదివాను. నాకు కూడ అలా రాసి యివ్వండి. బాగా శ్రద్ధ పెట్టి పిక్చర్‌ తీస్తాను.'' అంది.

నరసరాజుగారికి రాయడం యిష్టం లేదు. సాకు కోసం వెతుకుతూ ''షూటింగు ఎప్పుడు మొదలుపెడతారు?'' అని అడిగి 'విజయదశమి' అనగానే 'నేను రెండు పిక్చర్లు ఒకసారి రాయనని తెలుసు కదా. ప్రస్తుతం ఫలానా వాళ్ల కమిట్‌మెంట్‌ వుంది. అది ఆలస్యమైనా ఫర్వాలేదంటే మీకు రాయవచ్చు. అడిగి చెప్తాను.'' అన్నారు.

''అహ, వీల్లేదు, ఎలాగైనా ఎడ్జస్టు చేసుకుని నాకు రాసి పెట్టాలి'' అని సావిత్రి గోముగా అని ''రేపు యీ టైముకి మీ యింటికి వస్తాను. వాళ్లను కనుక్కుని చెప్పండి'' అని రిక్వెస్టు చేసింది.

''నువ్వు రానక్కరలేదు. డైరక్టరువి కదా, నేనే నీ దగ్గరకి రావాలి. రేపు సాయంత్రం నాలుగున్నర కల్లా వస్తాను.'' అన్నారు నరసరాజు.

''సరే, యీ లోపల యీ స్టోరీ సినాప్సిస్‌ కాస్త చదవండి. రఫ్‌గా సీనిక్‌ ఆర్డరు కూడా వేశాం.'' అని చెప్పి సావిత్రి వెళ్లిపోయింది.

మర్నాడు నరసరాజుగారు మూడున్నరకే సావిత్రి యింటికి వెళ్లారు. నిద్ర పోతున్న ఆమె కంగారుగా వచ్చి ''అయ్యో, నాలుగున్నరకు వస్తానన్నారనుకున్నా'' అంది. ''నాలుగున్నరే చెప్పాను. కావాలనే ముందుగా వచ్చాను. వాళ్లిద్దరూ వచ్చేందుకు ముందే నీతో మాట్లాడదామని..'' అన్నారీయన. ''ఈ పిక్చర్‌కు మాత్రం నన్ను వదిలేయ్‌'' అని చెప్పారు. 

ఆమె నిర్ఘాంతపోయి, ఎందుకంది. ''నీకు సినిమా నిర్మాణంలో అనుభవం లేదు. నాకూ లేదు కానీ ఆప్తమిత్రులు భాగస్వాములుగా సినిమా మొదలుపెట్టిన సందర్భాల్లో కూడా సినిమా పూర్తయ్యే సరికి మాటలు కూడ లేనంతగా విరోధులయిపోతున్నారు. ఇగో సమస్యలొస్తాయి. పైగా - అనకూడదు కానీ - మీరంతా ఆడవాళ్లు!'' అన్నారు నవ్వుతూనే.

''వాళ్లందరితో మీకు పని లేదు. ఈ ప్రొడక్షన్‌ నాది. అన్నీ నేనే చూసుకుంటాను. నా మొహం చూసి మీరు రాసి పెట్టాలి.'' అని సావిత్రి గట్టిగా ఒత్తిడి చేసింది.

''శకునపక్షిలా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవద్దు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వు చిత్రనిర్మాణంలో దిగడం నా కిష్టం లేదు. పార్ట్‌నర్‌షిప్‌లు సవ్యంగా నడవవు. ఈ సారి నువ్వు సొంతంగా సినిమా తీసుకో. ఎన్ని పనులున్నా సర్దుబాటు చేసుకుని నీకు నచ్చేట్లుగా రాసి యిస్తాను.'' 

''ఇది నా సొంతంతో సమానమేనని చెప్తున్నానుగా''

''.. కానీ సొంతం కాదుగా!?''

ఇంతలోనే సరోజిని, కాశ్యప వచ్చారు. సావిత్రి తేరుకుని ''రండి, రండి, టైమ్‌ చాలదు, కమిట్‌మెంట్స్‌ వున్నాయంటున్నారు నరసరాజుగారు.'' అంది.

దీ

నరసరాజుగారు చెప్పినా సావిత్రి ''చిన్నారి పాపలు'' స్క్రిప్టు ముళ్లపూడి వెంకట రమణగారి చేత రాయించుకుని, జగ్గయ్య, జానకి,  జమున, రంగారావు, రేలంగిలను ముఖ్యపాత్రల్లో తీసుకుని షూటింగు మొదలుపెట్టింది. ఎందుకంటే 1967లో నిర్మాణంలో వున్న సినిమాలు ''బాంధవ్యాలు'', ''మూగజీవులు'', ''ఉమ్మడి కుటుంబం''. ''తల్లిప్రేమ''. హిందీలో ''బలరామ్‌ శ్రీకృష్ణ''. తను హీరోయిన్‌గా వేసే పీరియడ్‌ ముగిసిపోయిందని ఆమెకు తోచింది. బిజీగా వుండాలంటే కొత్తగా వచ్చిన డైరక్షన్‌ మార్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. 1967 అక్టోబరు 12 న తొలి షాటు. సావిత్రి డైరక్షన్‌లోకి, ప్రొడక్షన్‌లోకి దిగడం తన కిష్టం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన భర్త జెమినీ గణేశ్‌ ఆమె కోరిక మేరకు ముహూర్తం షాటుకి క్లాప్‌ మాత్రం యిచ్చాడు. తర్వాత ఏం జరుగుతోంది? ఎంత ఖర్చు చేస్తోంది? ఏమీ పట్టించుకోలేదు. తను చెప్పినా సావిత్రి వినదని తెలుసు. ఆమె కర్మానికి ఆమెనే వదిలేశాడు. 

సావిత్రికి క్రమేపీ భారం పెరిగిపోయింది. హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌కి స్వయంగా వెళ్లి షాపింగ్‌ చేసింది. 14 మంది షేర్‌హోల్డర్స్‌ వున్నా నిర్మాణానికి డబ్బు చాలలేదు.  కంపెనీలో తక్కిన భాగస్తుల వద్ద ఆస్తులున్నా స్టార్లు లేని సినిమా ఆడుతుందో లేదోనని జంకి పెట్టుబడి పెట్టలేదు. ఫైనాన్షియర్లను తీసుకుని వస్తే ''మీ మిగతా భాగస్వాముల ఆస్తులు వాళ్ల పేరున లేవు, భర్తల పేర వున్నాయి. వాళ్ల పేరు మీద డబ్బివ్వం. మీరొక్క సంతకం చేస్తే ఫైనాన్స్‌ చేస్తాం.'' అన్నారు వాళ్లు. సంతకం చేయకపోతే సినిమా ఆగిపోతుందన్న భయంతో సావిత్రి సంతకం పెట్టేసింది. రెండు మూడు షెడ్యూల్స్‌ జరిగాక, వాహినీ స్టూడియోలో ఓ సారి నరసరాజుగారు కనబడితే సావిత్రి దూరం నుంచే ''మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయ్‌! తరువాత చెప్తాను'' అని చెయ్యి వూపి వెళ్లిపోయింది.

తర్వాత ఓ రోజు చక్రపాణి గారి కోసం వచ్చి ఆయన గదిలో నరసరాజుగారు ఒంటరిగా కనబడితే చెప్పుకొచ్చింది. ''అక్షరాలా మీరు చెప్పినట్లే జరుగుతున్నాయి. పనీపాట లేకుండా యీ భాగస్తులు వచ్చి సెట్లో కూర్చుని నేను వాళ్లకి మర్యాదలు చెయ్యలేదని అలుగుతున్నారు. 'ఎవరొచ్చినా నీతోనే మాట్లాడుతున్నారు కానీ మాతో ఎవరూ మాట్లాడటం లేదు' అని ఫిర్యాదులొకటి. వీళ్ల మొఖాలు ఎవరికి తెలుసు? అయినా దానికి నేనేం చేయను? ప్రొడక్షను, డైరక్షను చూసుకోనా, వీళ్లకు మర్యాదలు చేస్తూ, అలకలు తీరుస్తూ కూర్చోనా? డబ్బు గొడవలు కూడా చాలా చాలా వున్నాయ్‌ లెండి. ఇదంతా ఎందుకు నెత్తిన పెట్టుకున్నానా అనిపిస్తోంది ఒక్కోసారి.'' అని.

 సినిమా పూర్తయి డిస్ట్రిబ్యూటరు కోసం వెతకబోతే ''మిగతా భాగస్తుల సంతకాలు మాకు అనవసరం. మీరు సంతకం చేస్తేనే డబ్బిస్తాం'' అన్నారు. సావిత్రి సొంత పూచీ మీద అగ్రిమెంటు సంతకం చేసి డబ్బు తీసుకుంది. 1968లో పిక్చరు రిలీజైంది. పెట్టుబడిలో నాల్గో వంతు మాత్రమే వెనక్కి వచ్చింది.  అప్పులు తీర్చడానికి బంగారం, సొంత ఆస్తులు అమ్మింది. భాగస్తులందరూ తప్పించుకున్నారు. 

డైరక్షన్‌, ప్రొడక్షన్‌ జోలికి వెళితే లాభం లేదని ఆమె అక్కడితో గ్రహించి వుంటే బాగుండేది. కానీ అహం అడ్డుపడింది. ఏ భాగస్వామీ లేకుండా సొంతంగా సినిమాలు తీయడానికి నిశ్చయించుకుంది. శ్రీ సావిత్రీ ప్రొడక్షన్స్‌ అనే సంస్థ పెట్టి ఇదే సినిమాను తమిళంలో జెమినీ గణేశ్‌, తను, జానకి, వాణిశ్రీలతో ''కుళందై ఉళ్లం'' (1969) అనే పేరుతో తీసింది. అదీ ఆడలేదు. అయితే 1968 నందీ ఎవార్డుల్లో ''చిన్నారి పాపలు'' రెండవ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. దాంతో భజనపరులు చేరి సావిత్రిని ''మీలో పెద్ద డైరక్టరు వున్నారు. మీరు మళ్లీ సినిమా తీయాలి.'' అని ఎక్కవేశారు. 

ఆమె నమ్మింది. ''మూగమనసులు'' సినిమాను తనూ, శివాజీ గణేశ్‌, చంద్రకళలతో ''ప్రాప్తం'' పేర తీసింది. ఖర్చులు విపరీతంగా అయ్యాయి. డబ్బు లేక మొదటి షెడ్యూల్‌ తర్వాత ఆగింది. ఇల్లు అమ్మి, సినిమా మళ్లీ మొదలుపెట్టేలోపున శివాజీవి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఆ ప్రభావం యీ సినిమా మీద కూడా పడింది. పైగా సాంకేతికంగా బాగా లేదనే పేరు వచ్చింది. 

ఆ తర్వాత ఎన్టీయార్‌తో ''మాతృదేవత'' (1969), చలంతో ''చిరంజీవి'' (1969) సినిమాలకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకుంది. నిర్మాతలు వేరే వారైనా సావిత్రి గ్యారంటీ సంతకం పెట్టుకుని యిరుక్కుంది. మాతృదేవత హిట్టయింది. చిరంజీవి పోయింది. అయినా సావిత్రికి తిప్పలు తప్ప, డబ్బు రాలేదు. వాహినీ స్టూడియో పక్కనున్న ఆరెకరాల పొలం అమ్ముకుంది. 

ఇలా డబ్బు పోతున్నా ఆమె సినిమాలు తీస్తూనే పోయింది. జగ్గయ్యతో ''వింతకాపురం'' (1971) తీస్తే అదీ దెబ్బ తింది. ఇంట్లో గొడవలు తోడయ్యాయి. దయనీయ పరిస్థితుల్లో అంతిమ శ్వాస విడిచింది. చివరకు సావిత్రి పేరు చెప్పగానే 'అయ్యో, పాపం' అనే మాట వస్తోంది. కుటుంబ కలహం మాట ఎలా వున్నా సినిమా నిర్మాణంలో దిగకుండా వుంటే యీ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నిట్టూర్పు వస్తుంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?