Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - మనసంతా నువ్వే- 1

ఎమ్బీయస్‌: సినీమూలం - మనసంతా నువ్వే- 1

''మనసంతా నువ్వే''. 2001 నాటి సినిమా. దీనికి ప్రేరణ 1946 నాటి ''అన్‌మోల్‌ ఘడీ'' సినిమాలో కనబడుతుంది. నిర్మాత-దర్శకుడు మెహబూబ్‌ ఖాన్‌ తీసిన ''అన్‌మోల్‌ ఘడీ''లో అలనాటి మేటి సింగింగ్‌ స్టార్స్‌ నూర్జహాన్‌, సురయ్యా నటించారు. తమ పాటలతో సినిమాను అదరగొట్టేశారు. కథానాయకుడు సురేంద్ర. ఆ సినిమా నిర్మాత ఎంఎస్‌ రాజుకు బాగా యిష్టం కాబోలు. ఆ థీమ్‌ను కొద్దిగా తీసుకుని చాలా ట్విస్టులు పెట్టి తను కథ రాసుకుని దాన్ని వి యన్‌ ఆదిత్య దర్శకత్వంలో ''మనసంతా నువ్వే'' తీశారు. ముఖ్యపాత్రల్లో పోలికలు కనబడతాయి సహాయపాత్రలూ అన్నీ మారిపోతాయి. కథాగమనం వేరేలా వుంటుంది.  

హిందీ సినిమాలో చందర్‌, లత అనే పిల్లలు పక్కపక్క యిళ్లల్లో వుంటారు. లత డబ్బున్న ఆఫీసరుగారమ్మాయి. చందర్‌ తల్లి పేద వితంతువు. అయినా యిద్దరి మధ్య మంచి స్నేహం. హిందీ సినిమాలో 'ఉడన్‌ ఖటోలే మేఁ' పాటలో పాప బగ్గీలో వెళుతూవుంటే వెనక్కాల చక్రం దొర్లించుకుంటూ పిల్లాడు వస్తాడు. తెలుగు సినిమాలో 'తూనీగా తూనీగా' పాటలో పాప జీపులో వెళుతూవుంటే వెనక్కాల చక్రం దొర్లించుకుంటూ పిల్లాడు వస్తాడు. కొన్నాళ్లకు లత తండ్రికి బొంబాయి బదిలీ అయి వెళ్లిపోతూ తన స్నేహితుడికి గడియారం బహుమతిగా యిచ్చింది. హీరో వూళ్లోనే వుండిపోయాడు. తెలుగు సినిమాలో గడియారం యిచ్చి వెళుతుంది. అయితే యింకో యాంగిల్‌ ఒకటి పెట్టారు - ప్రతీ యేడూ హీరోయిన్‌ పుట్టినరోజున వాళ్ల వూరైన అరకు వచ్చి గుళ్లోని ఆంజనేయుడికి నైవేద్యం పెట్టాలని! తెలుగులో హీరోయిన్‌ వెళ్లిపోయిన కొన్నాళ్లకు హీరో తల్లి చనిపోయింది. హీరో రైల్వే స్టేషన్‌లో యిడ్లీలు అమ్ముకుంటూ వుంటే అతనికి అనుకోకుండా చంద్రమోహన్‌ కుటుంబం పరిచయమయ్యింది. వాళ్లు అతని పేరును 'చంటి' నుండి 'వేణు'గా మార్చారు. స్వంత కొడుకుగా చూసుకున్నారు. వాళ్ల అమ్మాయిని స్వంత చెల్లెలుగా చూసుకున్నాడితను. పెద్దయ్యాక హీరో ఉదయకిరణ్‌ అయ్యాడు. వైజాగ్‌లో తండ్రి ఆడియోషాపులో కూడా వుంటూ సాయపడుతున్నాడు. పన్నెండేళ్లుగా ప్రతీ ఏడాదీ అరకు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తున్నాడు కానీ హీరోయిన్‌ మాత్రం ఏ ఏడాదీ రాలేదు. 

హిందీలో హీరో పాత్రధారి సురేంద్ర. తల్లి కష్టం మీద అతను పెరిగి పెద్దవాడయ్యాడు. తన బాల్యస్నేహితురాలు లతకోసం అన్వేషిస్తూనే వున్నాడు. బొంబాయి నుండి రేణు అనే ఆమె రాసే కవితలంటే అతనికి చాలా యిష్టం.  అ రేణు ఆమె తన కవితల్లో చందర్‌, లతల స్నేహం గురించి రాస్తూ వుంటుంది. ఆమెను చేరుకుంటే లత ఆచూకీ తెలుస్తుందని అతని ఆశ. నిజానికి రేణూ కలంపేరుతో కవితలు రాసేది అతని స్నేహితురాలు లతే. పాత్రధారిణి నూర్జహాన్‌. బొంబాయి వెళితే రేణుని కలవవచ్చు. అయితే బొంబాయి వెళ్లడం ఎలా? ఆ అవకాశం అతని క్లాస్‌మేట్‌ ప్రకాష్‌ ద్వారా వచ్చింది. పాత్రధారి మురాద్‌. అతను బొంబాయిలో వుంటాడు. డబ్బున్నవాడు. ఇతనికోసం ఓ మ్యూజిక్‌ వాయిద్యాల షాపు పెట్టి రమ్మన్నాడు. ఓ రోజు ఆ షాపుకి సితార్‌ రిపేరు చేయించుకోవడానికి బసంతి అనే అమ్మాయి వచ్చింది. పాత్రధారిణి సురయ్యా. ఆమె హీరోయిన్‌కి స్నేహితురాలు. ఇతన్ని చూసి మోజుపడింది. కానీ యితను స్పందించడం లేదు. 

తెలుగులో కూడా సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర వుంది. పేరు శ్రుతి. ఆమె స్వాతి పత్రిక ఎడిటర్‌ శివరామ్‌ కూతురు. ఈటీవీలో రిపోర్టరు. హీరో ఆమె వెహికల్‌ గుద్దేయడంతో పరిచయం అయింది. మొదట్లో కాస్త పోట్లాట అయినా క్రమంగా అతని మంచితనం గ్రహించి దగ్గరైంది. కానీ హిందీలో లాగానే హీరోకి తన బాల్యస్నేహితురాలి మీదనే ఆరాధన. ఈమెను పట్టించుకోలేదు. ఈమె హీరోయిన్‌కు మొదటినుండీ స్నేహితురాలు కాదు. అసలు హీరోయిన్‌ యిక్కడ వుంటేగా స్నేహం చేయడానికి! ఆమె మలేసియాలో బంధువుల యింట్లో వుండి చదువుకుంటోంది. వాళ్లబ్బాయి సిజ్జూ యీమెను చేసుకుందామనుకున్నాడు కానీ యీమె తన బాల్యస్నేహితుడు చంటి గురించి కలలు ంటూ వుండడంతో తన ఆశను చంపుకున్నాడు. హీరోయిన్‌ యిండియాకు వస్తూనే తన పుట్టినరోజున అరకులోని ఆంజనేయుడి గుడికి వెళ్లి నైవేద్యం పెట్టింది. కాస్సేపు వేచిచూసి తిరుగురైలు ఎక్కింది. హీరో కాస్త ఆలస్యంగా వెళ్లి హీరోయిన్‌ వచ్చి వెళ్లిందని తెలుసుకుని మిస్సయినందుకు చాలా బాధపడి వైజాగ్‌కు తిరిగి వచ్చేశాడు.

హీరోయిన్‌ పాత్రధారిణి రీమా సేన్‌. మలేసియాలోని బావ ఆమెకు ఫోన్‌ చేసి అడిగాడు - మీ చంటి దొరికాడా? అని. 'మా కథను సీరియల్‌గా రాసి స్వాతి పత్రికలో వేయిస్తాను. చదివి అతను ఎక్కడున్నా వస్తాడు. ఈ రోజుల్లో చదివేవాళ్లు తక్కువనుకో. 10% ఛాన్సే. అయినా ప్రయత్నిస్తాను' అంది. ఆమె రాసిన సీరియల్‌ను స్వాతి పత్రికవాళ్లు యాక్సెప్ట్‌ చేశారు. తన అసలు పేరు 'అను' అయినా హిందీలో లాగానే తన కలం పేరు రేేణూ అని పెట్టుకుంది. ఆమె సీరియల్‌కి విపరీతంగా ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. హీరో చెల్లెలు వాళ్లలో వీర ఫ్యాన్‌. అందరికీ చదివి వినిపిస్తూ వుంటుంది. మన హీరో చదవనూ చదవడు. వినిపించినా విననూ వినడు. 

హిందీలో హీరో యిలాటివాడు కాడు. రేణూని కలిసి తన స్నేహితురాలి గురించి అడుగుదామనే వుద్దేశంతో ఎడిటర్‌ద్వారా ఆమెకు వుత్తరం రాశాడు. హీరోయిన్‌ అతన్ని ఓ పార్కుకి రమ్మనమంది. తన స్నేహితురాలు సురయ్యాను వెంటపెట్టుకుని వెళ్లింది. వీళ్లకు పార్కులో వేరేవాడు తగిలాడు. హీరో పార్కులో వేరేచోట వున్నాడు. సురయ్యా వెళ్లి అతన్ని పట్టుకుంది. అతను బెదిరి పారిపోతూ తన గడియారం పోగొట్టుకున్నాడు. సురయ్యాకు అది దొరికింది.

తెలుగులో కూడా హీరో గడియారం పోగొట్టుకున్నాడు. దానికి ముందు ఓ పార్టీలో అతనూ, హీరోయిన్‌ కలిశారు. ఆమె సీరియల్‌ వేసే స్వాతి పత్రిక ఫంక్షన్‌లో సైడ్‌ హీరోయిన్‌ అతన్ని పరిచయం చేసింది. కాస్సేపటికి అతని గడియారం మోగింది. ఆ శబ్దం విని హీరోయిన్‌ వెతుక్కుంది కానీ ఎక్కణ్నుంచి వచ్చిందో తెలియలేదు. ఓ రోజు రాత్రి హీరో తాగి వుండగా జేబులోంచి వాచీ పడిపోయి సైడ్‌ హీరోయిన్‌కి దొరికింది. మర్నాడు ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కనబడిన హీరోయిన్‌కు హీరో తన బాయ్‌ఫ్రెండని, అతనే యీ గడియారం యిచ్చాడని చెప్పింది.

గడియారం పోగానే హీరోకి మతిపోయింది. తెగ వెతుక్కున్నాడు. తర్వాత గుర్తు వచ్చింది. సైడ్‌ హీరోయిన్‌ వద్దకు వెళ్లి వెనక్కి తీసుకుంటూ దాని కథ చెప్పాడు. ఆ విషయాన్ని ఆమె హీరోయిన్‌కి చెప్పేటంతలో ఆమె ఒక చర్చలో పాల్గొంటూ మగాళ్లంతా దుర్మార్గులని మాట్లాడింది. అది విని సైడ్‌ హీరోయిన్‌ అంది - అందరూ అలా వుండరు. హీరో నా బాయ్‌ఫ్రెండని చెప్పినది తప్పు. ఎవరో చిన్నప్పటి ఫ్రెండు అనూని ప్రేమిస్తున్నాట్ట అని. దానికి తగ్గట్టు హీరో చర్చావేదికలో తన కథ చెప్పి అనూ కోసం వేచి వున్నానన్నాడు. చర్చావేదిక నడుపుతున్న సిరివెన్నెల అడిగాడు - ఆమె ఫలానా అని తెలిశాక గతం చెప్పి ప్రేమించమంటావా? అని. అబ్బే, నేనెవరో చెప్పకుండా ప్రేమికుడిగా మారి ఆమె హృదయం చూరగొని అప్పుడు చెపుతా అన్నాడు హీరో. ఇదంతా విన్న హీరోయిన్‌ తనే ఆ పని చేద్దామనుకుంది. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?