Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 03

కార్మికులు, యజమానులు అందరూ హ్యేపీగా వుంటే వర్గపోరాటం అంటూ యింకా ఏడవడం దేనికి అనుకోవచ్చు. ఈ యజమానులు అందరూ ఒక్కలా వుండరు. ఒకే యజమాని అన్ని చోట్లా ఒకేలా ప్రవర్తించడు. భోపాల్‌లో యూనియన్‌ కార్బయిడ్‌ వ్యవహారం చూశాం. అదే కంపెనీ అమెరికాలో యూనిట్‌లో అయితే అటువంటి ప్రమాదం జరిగి వుండేది కాదు, అక్కడ భద్రతాపరమైన కట్టుబాట్లు చాలా వుంటాయి. ఇండియాకు వచ్చేసరికి యిక్కడి తన సిబ్బంది ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనే రీతిలో వ్యవహరించింది. దానికి కారణం మన చట్లాల్లో లొసుగులు, మన రాజకీయనాయకుల దుర్మార్గం ఎన్నయినా కారణాలు చెప్పవచ్చు. గమనించవలసినది - ఒక కాపిటలిస్టు యొక్క స్వభావం. సాగినచోట లాభార్జన కోసం కార్మికుల ప్రాణాలైనా హరిస్తారు, సాగనిచోట కార్మికుల రక్షణకై ఏర్పాట్లు చేస్తారు. ఒకే కంపెనీ ఒకే నగరంలో విదేశీయులకు ఒకలా జీతం యిచ్చి, స్థానికులకు మరోలా జీతం యిస్తున్న సందర్భాలు కోకొల్లలు. తక్కువ జీతానికి వచ్చేవాణ్ని పెట్టుకుని ఎక్కువ జీతం వచ్చేవాడికి ఉద్వాసన పెట్టడం జరుగుతోంది. 

జపాన్‌లో జీతాలు ఎక్కువగా యివ్వాల్సి వస్తుందంటే అక్కడ యూనిట్‌ మూసేసి కొరియాలో పెడతారు. కొన్నాళ్లకి అక్కడా జీతాలు పెంచమంటే ఆ యూనిట్‌ మూసేసి శ్రీలంకలో పెడతారు. మా నడివయసులో అర్ధాంతరంగా యూనిట్‌ మూసేస్తే మా గతి ఏమిటని కార్మికులు అడిగితే 'మీకోసం మేం నష్టాలు భరించాలా?' అంటుంది యాజమాన్యం. అదే సమయంలో ఉన్నతోద్యోగులకు భారీగా జీతాలు యిస్తుంది. వాళ్లు లాభాలు సంపాదించి పెడతారన్న ఆశతో! లాభార్జనే యజమాని లక్ష్యం. మనకు వచ్చే లాభాల్లో యింత శాతం ఉద్యోగులకు కచ్చితంగా యిద్దాం అనుకోరు. కార్మికులు సంఘటితం అయినప్పుడు ఒకలా, సంఘటితం కానప్పుడు మరోలా జీతాలిస్తారు. మన దేశంలోనే కేరళలో కార్మికుల జీతాలు ఒకలా వుంటాయి, బిహార్‌లో మరోలా వుంటాయి. కేరళలో కార్మికులు సంఘటితం కావడంతో ఆగకుండా యజమానులను వేధిస్తూంటారు కాబట్టి, ఫ్యాక్టరీలు కేరళలో కాకుండా సరిహద్దుల్లో వున్న తమిళనాడులో పెడుతూంటారు. ఆ విధంగా కేరళ పనివారి నైపుణ్యాన్ని వాడుకుంటూనే తక్కువ జీతాలు యిచ్చి ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వుంటారు. 

అంతెందుకు అద్భుతమైన జీతాలిస్తున్నారన్న పేరున్న ఐటీ రంగంలో ఉద్యోగభద్రత ఎంత చెప్పండి. ఏదో ప్రాజెక్టు దక్కుతుందేమోనన్న అంచనాతో అవసరానికి మించి రిక్రూట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత చాలామందిని బెంచ్‌పై కూర్చోబెడతారు. కొన్నాళ్లకు ఆ ప్రాజెక్టు రాదని తెలిశాక వీళ్లంతా దండగ అనుకుని తీసేస్తారు. ఇది ఉన్నతాధికారుల దూరదృష్టిలోపం తప్ప సాధారణ ఉద్యోగుల పొరపాటు కాదు. మార్కెటింగ్‌ డివిజన్‌ వారు తమ కంపెనీని సరిగ్గా మార్కెట్‌ చేయలేక వర్క్‌ తేలేకపోతే దండన పడుతున్నది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు! బెంచ్‌పై వున్నంతకాలం వాళ్లు ఎక్స్‌పీరియన్సు చూపించుకోలేరు. ఆ మేరకు వాళ్లు అనుభవం సంపాదించే అవకాశం పోగొట్టుకున్నట్లే. పైగా చాలా కంపెనీల్లో పనివేళలు స్థిరంగా వుండవు. కొన్నాళ్లు తాపీగా వుంచుతారు, డెడ్‌లైన్‌ వచ్చిందంటే విరామం లేకుండా, అధిక గంటలు పనిచేయిస్తారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవే. వారి బర్న్‌ రేట్‌ విపరీతంగా వుండి నడివయసుకే అకాలవృద్ధాప్యం వచ్చిపడుతుంది. ఉన్నత స్థానాల్లో వున్నవారి తప్పుడు నిర్ణయాల వలన కంపెనీ దెబ్బ తిన్నా, మూతపడినా, టేకోవర్లు జరిగినా కింది స్థాయి ఉద్యోగుల జీవితాలు అతలాకుతలమై పోతాయి. ఏ నోటీసూ లేకుండా నిమిషాల్లో ఉద్యోగంలో నుండి తీసేస్తున్నారు. ఆఫీసులోకి అడుగుపెట్టనీయకుండా అవమానిస్తున్నారు. ఈ అభద్రత వారి మానసిక సమతుల్యతను దెబ్బతీసి గృహస్థ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఎందరో విద్యావంతులు, మేధావులు ఉద్యోగులుగా వున్న ఐటీ రంగంలోనే యాజమాన్యం యిలా యిష్టప్రకారం వ్యవహరించ గలుగుతోందంటే యిక సాధారణ కంపెనీల యాజమాన్యాల సంగతి చెప్పేదేముంది?

ఆర్గనైజ్‌డ్‌ సెక్టార్‌లో వున్న కార్మికుల స్థితి ఒకలా వుంటోంది, అనార్గనైజ్‌డ్‌ (సంఘటితం కాని) రంగంలోని కార్మికుల స్థితి మరోలా వుంటోంది. దేశంలో అత్యధిక కార్మికులకు యూనియన్లు లేవు. యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుండాల్సిందే. అందువలన కార్మికులు యూనియన్‌లా ఏర్పడకుండా వుండడానికి మేనేజ్‌మెంట్‌ శతథా ప్రయత్నిస్తుంది. యూనియన్‌ ఏర్పడితే దాన్ని చీలుస్తుంది. చీల్చలేకపోతే పోటీ యూనియన్‌ పెట్టిస్తుంది. ఆ పోటీ యూనియన్‌ను కార్మికులు ఆదరించకపోతే వున్న యూనియన్‌ లీడర్లను ప్రలోభపెట్టడానికి చూస్తుంది. కార్మికుల పేరు చెప్పుకుని లీడర్లుగా ఎదిగినవారు, యూనియన్‌ తరఫున బోర్డులో డైరక్టర్లుగా వున్నవారు యాజమాన్యానికి లోబడి కార్మికుల పొట్టకొట్టిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలా లొంగని యూనియన్‌ లీడర్లను హత్య చేయించిన మేనేజ్‌మెంట్లూ వున్నాయి. మేనేజ్‌మెంట్‌-యూనియన్‌ మధ్య బంధం ఆలుమగల బంధం లాటిది. ఇద్దరికీ సమానబలం వున్నపుడు తూకం కుదిరి బండి సవ్యంగా నడుస్తుంది. కానీ అలా వుండడం అరుదు. చాలాసార్లు మేనేజ్‌మెంట్‌దే పై చేయి. యూనియన్‌ది పై చేయి అయిన కొన్ని సందర్భాల్లో వాళ్లు యిష్టారాజ్యంగా వ్యవహరించి కంపెనీకి నష్టం కలిగించి మూతపడేట్లా చేసిన సందర్భాలూ చాలా వున్నాయి. కార్మికులలో చురుకుగా వున్నవాళ్లు యూనియన్‌ లీడర్లు అవుతారు, లేదా కొంతకాలానికి సొంతంగా యూనిట్లు కూడా పెడుతూంటారు.  వాళ్లు యజమానులుగా మారాక ఉదారంగా వుంటారన్న గ్యారంటీ లేదు. చాలా సందర్భాల్లో పాత యజమానుల కంటె క్రూరంగా ప్రవర్తిస్తూ వుంటారు. 

కార్మికుల స్వభావం విషయంలో మార్క్‌స్‌ పొరబడ్డారు. కాపిటలిజంలో సంస్కరణల వలన జీవనవిధానం మెరుగుపడిన కార్మికులు తమ కంటె తక్కువ స్థాయిలో వున్న శ్రామిక, కార్మికుల సంక్షేమానికై పోరాడతారని భావించాడు. ఆ విధంగా ఇంగ్లండ్‌లో తొలి కమ్యూనిస్టు విప్లవం వస్తుందని వూహించాడు. కానీ అక్కడ రాలేదు. పరిస్థితి మెరుగుపడిన కార్మికుల వాళ్ల బాగోగులే చూసుకున్నారు కానీ తమకంటె తక్కువ వారి గురించి పట్టించుకోలేదు. పరిస్థితి అధ్వాన్నంగా, దోపిడీ తీవ్రంగా వున్న రాజరికపు రష్యాలో విప్లవం వచ్చింది. ఇది మార్క్‌స్‌ ఎదురు చూడనిది. నిజానికి మార్క్‌స్‌ బతికి వుండి వుంటే తన ఆలోచనలను, ఊహలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వుండేవాడు. ఆయన నమ్మిన డయలెక్టికల్‌ మెటీరియలిజం (గతితార్కిక భౌతికవాదం) సిద్ధాంతం ప్రకారం థీసిస్‌ (ప్రతిపాదన), యాంటీ థీసిస్‌ (దానికి ప్రతికూలమైన ప్రతిపాదన), సింథసిస్‌ (ఆ రెండిటి ఘర్షణ ద్వారా ఉద్భవించిన సమన్వయ సిద్ధాంతం) వుంటాయి. ఈనాటి సింథసిస్‌ కొన్నాళ్లకు థీసిస్‌గా మారుతుంది. దానికి మళ్లీ యాంటీ థీసిస్‌ పుట్టుకుని వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. దీన్ని ఆమోదించకుండా నూరేళ్ల క్రితం మార్క్సిస్ట్‌ సూత్రాలనే యిప్పటికే వల్లించే చాదస్తులు కనబడుతూంటారు. అలాగే లెనినిజం కూడా. ప్రతీ దాన్నీ యివే తూనికరాళ్లతో తూచబోయి వాళ్లు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడంలో పొరబడుతూ వుంటారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?