Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 05

సోషలిజం కాన్సెప్ట్‌ వచ్చాక సహకార పద్ధతి, కో-ఆపరేటివ్‌ సిస్టమ్‌ గురించి ఆలోచనలు చేశారు. నిజానికి అది చాలా మంచి యోచన. పదిమంది కలిసి పని చేసి, పదిమందీ లాభపడవచ్చు. లాభమైనా, నష్టమైనా పంచుకుంటారు. చాలా దేశాల్లో యిది సక్సెసైంది. మన దేశంలో కూడా కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలు, పాల సొసైటీలు, వ్యవసాయ కమిటీలు, కోఆపరేటివ్‌ సూపర్‌ మార్కెట్లు, కోఆపరేటివ్‌ బ్యాంకులు... యిలా చాలా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో యిది విజయవంతంగా నడుస్తోంది. కొన్ని చోట్ల విఫలమైంది. విఫలం కావడానికి ముఖ్యకారణం తెలుసుకోవాలంటే ''ఉమ్మడి గేదె పుచ్చి చచ్చింది'' అనే సామెత గుర్తు తెచ్చుకోవాలి. పక్కవాడు గడ్డి వేస్తాడులే అనుకుంటూ ప్రతీవాడూ పాలు పిండుకుంటూంటే గేదె ఎలా బతుకుతుంది? ఎప్పటికైనా కోపరేటివ్‌ రంగం బలపడినప్పుడే దేశం బాగుపడుతుంది. అయితే ఆ సొసైటీని నడపడానికి ఒక పాలక కమిటీ అంటూ కావాలి. దానిలో స్వార్థపరశక్తులు చొరబడి, తన వాళ్లకు ఋణాలు యిప్పించుకుని, సొసైటీని సొంత ఆస్తులుగా భావించి దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్లకు రాజకీయ పార్టీల మద్దతు వుంటోంది కాబట్టి వాళ్ల ఆటలు సాగి, సొసైటీ కుప్పకూలి, ప్రజలకు సహకారంపై విశ్వాసం పోతోంది. ఇలా ఏ వ్యవస్థ చూసినా అపసవ్యంగానే, లోపభూయిష్టంగానే కనబడుతోంది. దాన్ని నడిపించేవాడి సామర్థ్యంలో, నిజాయితీలో వున్న బలం బట్టి ఒక్కో చోట ఒక్కో వ్యవస్థ బాగా పనిచేస్తోంది. చైనాలో కమ్యూనిజం పేర నడుస్తున్నది కమ్యూనిజం కానే కాదు. వాళ్ల విధానాలు చూస్తే మన దేశంలో కాంగ్రెసు ఏమందో, అక్కడ కమ్యూనిస్టు పార్టీ కూడా అదే చేసింది. తేడా అల్లా వాళ్లు ప్రభావవంతంగా, పక్కాగా చేశారు. అడ్డు వచ్చినవాళ్లను తొలగించేశారు. ఇక్కడ ఏదీ సరిగ్గా చేయక తగలేశారు.  

ప్రపంచంలో ఏ దేశంలోనైనా శ్రామిక, కార్మిక, రైతుకూలీ వర్గాలకు మేలు చేస్తామనే నినాదంతో బడుగు వర్గాల ప్రతినిథిగా కమ్యూనిస్టు పార్టీలు ముందుకు రాగానే, ఆ మార్పు రాకుండా చూడడానికి అనేక పార్టీలు అడ్డు తగులుతాయి. ఇంతకుముందు చెప్పినట్లు అవి రకరకాల, ఆకర్షణీయమైన నినాదాలతో ముందుకు వస్తాయి. కొన్ని మతపరంగా వుంటాయి, కొన్ని సామ్యవాదం పేరు చెప్తాయి, మరి కొన్ని ఎమోషనల్‌ యిస్యూలతో ముందుకు వస్తాయి. ఆ యా పార్టీలకు కొంతకొంతమంది సమర్థకులు వుంటారు. ఓటింగులో వాళ్లకు కూడా గణనీయమైన శాతం వాటా వుంటుంది. ఎన్నికల ద్వారా అధికారంలోకి వద్దామనుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆ యా పార్టీలతో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డెమోక్రాటిక్‌, సోషలిస్టు.. అనే ట్యాగ్‌లు తగిలించుకున్న పార్టీలతో కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలపడం, ఆ తర్వాత కత్తులు దూయడం జరుగుతూనే వుంటుంది. మతాన్ని రాజకీయాలను కలపకూడదని వాదించే కమ్యూనిస్టులో ఒక్కో దేశంలో మతపరమైన పార్టీలతో కూడా పొత్తు కుదుర్చుకుంటూ వుంటారు. మన దేశంలో కూడా కేరళలో ముస్లిం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. దీన్ని సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు ఎలా సమర్థించుకుంటారన్నది ఆసక్తికరమైన విషయం. 

ప్రజాస్వామ్యంలో తగినన్ని సీట్లు రాకపోతే అధికారం కోసం ఎవరైనా ఎవరితోనైనా చేతులు కలుపుతూ వుంటారు. బిజెపికి రామమందిరం, ఆర్టికల్‌ 370 యిత్యాది విషయాలపై కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆ విషయాలలో టిడిపి వారితో ఏకీభవించదు. అయినా యిద్దరూ చేతులు కలిపారు. 2014లో బిజెపికి తగినన్ని సీట్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నానాగోత్రీకులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచ వలసి వచ్చేది. మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి వంటి వారి సాయం తీసుకోవలసి వచ్చేది. వారిలో ఎవరికీ రామమందిరం కట్టాలన్న పట్టుదల లేదు. బలమైన ఒక ఉమ్మడి శత్రువును ఓడించడానికి ఎవరితోనైనా చేతులు కలపాలి, తర్వాత పొత్తులోంచి బయటపడి వీరిని తప్పించి మనం బలపడాలి - అనేది లెనిన్‌ దగ్గర్నుంచి అందరూ ఆచరించే సిద్ధాంతం. 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి, శివసేనతో కలిసి కాంగ్రెస్‌, ఎన్‌సిపిలను ఓడించింది. అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి శివసేన పొత్తులోంచి బయటపడి దాన్ని బలహీనపరచింది. అవసరార్థం గతంలో శత్రువుగా వున్న ఎన్‌సిపి సాయం తీసుకుంది. కొంతకాలానికి ఎన్‌సిపి బలపడితే దాన్ని తగ్గించడానికి మరొకరి సాయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. జార్‌ చక్రవర్తిని గద్దె దింపడానికి అన్ని వర్గాల వారూ కలిసికట్టుగా భుజం భుజం కలిపారు. ఆ తర్వాత వారిలో విభేదాలు వచ్చాయి. బోల్షివిక్‌లు, మెన్ష్‌విక్‌లుగా విడిపోయారు. కొంతకాలానికి బోల్ష్‌విక్‌ విప్లవం జరిగి మెన్ష్‌విక్‌లను మట్టుపెట్టి అధికారంలోకి వచ్చారు. 

దీన్ని మన భారతదేశానికి అన్వయించి చూదాం. ఇంగ్లీషు పాలనకు వ్యతిరేకంగా భిన్న సిద్ధాంతాలున్న రాజకీయ పార్టీలు కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాయి. ఆంగ్లేయులు వెళ్లిపోతే రామరాజ్యం వస్తుందని కొందరు, కార్మికరాజ్యం వస్తుందని మరి కొందరు, అణగారిన కులాలకు మంచి జరుగుతుందని యింకొందరు, పాతకాలం రాజుల, జమీందారుల పాలన మళ్లీ వస్తుందని కొంతమంది, అందరికీ సమానావకాశాలు వస్తాయని మరి కొంతమంది.. యిలా రకరకాల ఉద్దేశాలతో పోరాటం చేశారు. చివరకు కాంగ్రెసుకి అధికారం సిద్ధించింది - ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి, అత్యధికులు దాన్ని బలపరిచారు కాబట్టి. స్వాతంత్య్రం రావడానికి ముందే యిది స్పష్టమైంది. ఎప్పటికైనా ఆంగ్లేయుల నిష్క్రమణ అంటూ జరిగితే ప్రభుత్వాన్ని నడపబోయేది కాంగ్రెసే కాబట్టి దాని విధానాలు తమకు అనుకూలంగా వుండాలని రైటిస్టుల నుంచి లెఫ్టిస్టుల దాకా, మతవాదుల నుండి నాస్తికుల దాకా అందరూ ప్రయత్నించారు. ఆ పార్టీలో చేరో, బయట నుండి ఒత్తిడి చేసో దాని విధానాలు మార్చాలని చూశారు. అందుకే ఏ పార్టీ  నాయకుణ్ని చూసినా మొదట కాంగ్రెసులో చేరి, దాని ద్వారా పేరు తెచ్చుకున్నట్లు కనబడుతుంది. 

గాంధీ నాయకత్వాన కాంగ్రెసు బలపడుతున్న కొద్దీ దానితో ఎలా వేగాలన్న సమస్యే కమ్యూనిస్టు పార్టీని వేధించింది. గాంధీ తర్వాత స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెసుతో ఎలా వ్యవహరించాలన్న అంశమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీని చీల్చింది. అధికారంలో వున్న పార్టీ చీలిందంటే ఒక వ్యక్తి స్వార్థం కారణం కావచ్చు. ప్రతిపక్షంలో వున్న పార్టీ చీలిందంటే అహంకారం కారణం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతికపరమైన సమస్యలతో చీలి 50 ఏళ్ల క్రితం సిపిఎం ఏర్పడింది! ఈ సైద్ధాంతిక సందిగ్ధతకు నేపథ్యమేమిటో తెలుసుకొనకపోతే పార్టీ చీలిక అర్థం కాదు. ఇందుకే యింత విపులంగా చెప్పవలసి వచ్చింది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?