Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : దేవయాని అరెస్టు - 2

ఎమ్బీయస్‌ : దేవయాని అరెస్టు - 2

అందువలన మన దేశపు విదేశాంగ శాఖ ఒక ఉపాయం కనిపెట్టింది. డిప్లోమాట్లకు జీతంలోనే స్పెషల్‌ ఎలవన్స్‌ అని ఏర్పాటు చేసి పనిమనుష్యులకు భారీ జీతాలిచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ పనిమనుష్యులను డిప్లోమాట్లే నియమించుకోవాలి. వాళ్ల మెడికల్‌ ఎలవన్సు, ఇన్సూరెన్సు, ఏడాదికి ఓసారి యింటిక వచ్చేందుకు అయ్యే రాకపోకల ఖర్చులు అన్నీ మన ప్రభుత్వం భరిస్తుంది కానీ వారి జీతభత్యాలతో వారికి సంబంధం లేదు. జీతం బేరసారాలు రాయబారులే చూసుకుంటారు. అది భారతదేశంలో యిచ్చే జీతాల కంటె చాలా ఎక్కువగా వుంటుంది కానీ అమెరికాలో చట్టప్రకారం యివ్వవలసిన దాని కంటె తక్కువగా వుంటుంది. అయితే వీళ్లకు మంచి యింట్లో వుండే వసతి, ఉచితంగా తిండి, వైద్యసదుపాయాలు - యివన్నీ లెక్కవేసుకుంటే  జీతం కంటె ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. కానీ అమెరికన్‌ చట్టప్రకారం చూస్తే వాళ్లకు యివ్వాల్సినంత జీతం యివ్వనట్లే. ఆ మేరకు నేరం చేసినట్లే. 2011లో న్యూయార్క్‌లో పని చేసే ఇండియన్‌ కాన్సల్‌ జనరల్‌ ప్రభు దయాల్‌పై పనిమనిషి తనను సరిగ్గా చూడడం లేదని కేసు పెట్టింది. కేసు చాలాకాలం నడిచి చివరకు కితం ఏడాది ప్రభు దయాల్‌ కోర్టు బయట ఆమెకు పెద్దమొత్తం చదివించుకుని కేసు కొట్టేయించుకున్నాడు. అంతకుముందు కూడా మరో రాయబారి యిలాటి గొడవల్లో చిక్కుకున్నారట.

ఇన్ని తెలిసి దేవయాని మళ్లీ అదే పొరబాటు చేసింది. సంఘటనల క్రమం చూడండి. 2012 శీతాకాలంలో సంగీతా రిచర్డ్స్‌ అనే పనిమనిషి ఢిల్లీలో దేవయాని యింట్లో పనికి చేరింది. కొన్నాళ్లపాటు పని చేసి నన్ను న్యూయార్క్‌కు తీసుకెళ్లరా అని అడిగింది. అక్టోబరులో సంగీత వీసా కోసం దేవయాని అప్లికేషన్‌ పెట్టింది. ఇలా పెట్టేటప్పుడు ఆమె కొన్ని తప్పులు చేసింది. సంగీతకు గంటకు 9.75 డాలర్ల జీతం (అమెరికా చట్టాల ప్రకారం కనీస జీతం) యిస్తానని ఆమె వీసా అప్లికేషన్‌లో రాసింది. అయితే గంటకు 3.1 డాలర్ల జీతానికి సంగీతతో వేరే ఒప్పందం రాయించుకుంది. దాన్ని బయటపెట్టలేదు. 'వీసా అధికారులు అడిగితే నా జీతం 9.75 డాలర్లు అని చెప్పు' అని సంగీతకు చెప్పింది. అనగా సంగీత చేత అబద్ధమాడించింది. ఇప్పుడు దేవయాని లాయరు ఏమంటున్నాడంటే 'అబ్బే వీసా అప్లికేషన్‌లో దేవయాని తన జీతం రాస్తే, దాన్ని పనిమనిషికి యిచ్చే జీతంగా అమెరికా అధికారులు పొరబడ్డారు' అంటున్నాడు. ఇదేదో తికమకగా వుంది. పనిమనిషికి యిచ్చే కనీస వేతనం, డిప్యూటీ కాన్సల్‌ జనరల్‌కి యిచ్చే జీతం ఒకటే వుంటుందా? ఒకదాన్ని చూసి మరొకటి అని భ్రమపడే ఛాన్సుందా? మా తరఫునుండి అలాటి పొరబాటు ఏమీ జరగలేదు  అని అమెరికన్‌ అధికారులు ఖండించారు. దేవయాని నోరు విప్పి చెప్పేదాకా యివేమీ కచ్చితంగా మనకు తెలియవు. 

ఈ ఒప్పందం ప్రకారం నవంబరు 24 న సంగీత అమెరికాలో అడుగుపెట్టింది. వచ్చిన నెల్లాళ్లకే సణుగుడు మొదలుపెట్టింది. వారానికి 40 గంటల కన్నా ఎక్కువ పని చేయించకూడదని కానీ యీవిడ ఎక్కువ పని చేయిస్తోందని, పరిస్థితులు దుర్భరంగా వున్నాయనీ ఢిల్లీలో వున్న మొగుడు ఫిలిప్‌కు ఫిర్యాదు చేసింది. దేవయాని వెర్షన్‌ వేరేలా వుంది - సంగీత వేరే యిళ్లల్లో కూడా పని చేసుకుంటానందట. అది చట్టవ్యతిరేకం అని చెప్పి దేవయాని ఒప్పుకోలేదట. అందుకే సంగీత గొడవ చేసిందట. ఇలా ఆర్నెల్లపాటు యాగీ చేసి చేసి చివరకు జూన్‌ 23 న దేవయాని యింట్లోంచి సంగీత వెళ్లిపోయింది. ఎక్కడకు? అది యిప్పటిదాకా తెలియటం లేదు. అమెరికా వంటి ఖరీదైన దేశంలో సంగీత వంటి స్థాయి మనిషి విడిగా, వేరే ఆదాయం లేకుండా బతకగలదా? ఆమె వెళ్లి తమ వద్ద ఫిర్యాదు చేయగానే న్యూయార్కులోని ఫారిన్‌ మిషన్‌ యిదే సందని సంగీతకు ఆశ్రయం కల్పించి వుండవచ్చు. అమెరికాలో శాశ్వతనివాసం ఏర్పరచుకోవడానికి సంగీత వేసిన పథకం యిది అనుకోవచ్చు. ఆమెకు అమెరికన్‌ ప్రభుత్వం సాయపడుతోందన్నది నిర్వివాదం. ఒక పనిమనిషికి యింత పలుకుబడి ఎక్కణ్నుంచి వచ్చింది? ఆమె అత్తమామలు మనదేశంలోని అమెరికా రాయబారి కార్యాలయ ఉద్యోగుల వద్ద పనిచేస్తున్నారట. ఎవరైనా వచ్చి తమ దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటానంటే అడలి చచ్చే అమెరికా యీమెకు మాత్రం కన్సెషన్‌ ఎందుకు యిచ్చినట్టు? భారతదేశపు అధికారిని అవమానించే అవకాశం వచ్చి ఒళ్లో పడుతున్నందుకు!

సంగీత వెళ్లిపోయిన మర్నాడే దేవయాని అదే ఆఫీసుకి సమాచారం అందించి ఆమె ఆచూకీ కనిపెట్టమంది. వాళ్లు యిప్పటిదాకా స్పందించలేదు. జులై నెల వచ్చేసరికి ఒకావిడ తను సంగీత లాయరునంటూ దేవయానికి ఫోన్‌ చేసింది - 'ప్రభు దయాల్‌ తరహాలో తనకేదైనా భారీగా ముట్టచెప్పి కేసు తప్పించుకుంటావా, లేక పరిణామాలు ఎదుర్కొంటావా?' అని. తను చేసినది అమెరికన్‌ చట్టాల ప్రకారం నేరం అని తెలిసినా దేవయాని బెసకలేదు. అఫెన్సు మార్గంలో వెళదామనుకుంది. సంగీతపై ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. నగలు కూడా పోయాయని రాసిందనుకుంటా. పనిలో పనిగా అమెరికన్‌ అధికారులకు సంగీత తనను వేధిస్తోందని ఓ ఫిర్యాదు రాసి పడేసింది. జులై 8 న లాయరు ఆఫీసులో సంగీత, దేవయానితో చర్చలకు దిగి 10 వేల డాలర్లు పరిహారంగా ఇమ్మంది. దానికి తోడు పాస్‌పోర్టు, అమెరికాలో స్థిరనివాసానికి వీసా కావాలంది. అప్పటిదాకా ఆమెకు వున్నది పనిమనుషులకు యిచ్చే పాస్‌పోర్టు. అది తాత్కాలికమైనదే. ఇప్పుడు అమెరికాలో నివాసం కావాలని యివి కావాలంది. యజమాని పెట్టే బాధలు భరించలేకపోతే భారతదేశానికి తిరిగి వెళ్లి పోయేందుకు సాయపడమనాలి కానీ యిదేం కోరిక? 

ఈ వరస చూడగానే భారతదేశం సంగీత పాస్‌పోర్టు రద్దు చేసేసింది. జులై 19 న సంగీత భర్త ఫిలిప్‌ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ వేశాడు - తన భార్యను వేధించినందుకు దేవయానికి శిక్ష వేయాలని, తన భార్యను వెనక్కి క్షేమంగా రప్పించేయాలనీ. కోర్టు పిటిషన్‌ కొట్టేసింది. ఆ తర్వాత ఫిలిప్‌ అమెరికన్‌ కోర్టులో యిలాటి పిటిషన్‌ వేయడానికి ప్రయత్నించాడు. అలాటి ప్రయత్నాలు చేయడానికి వీల్లేదంటూ సెప్టెంబరు 20 న ఢిల్లీ హై కోర్టు ఇంజంక్షన్‌ యిచ్చింది. నవంబరు 19 న సంగీతను అరెస్టు చేయడానికి ఆదేశాలు యిచ్చింది కూడా. 

భారతదేశంలో యిలా అంతా దేవయానికి అనుకూలంగా జరుగుతూండగా అక్కడ అమెరికాలో దీనికి వ్యతిరేకంగా సంగీతకు అనుకూలంగా, దేవయానికి ప్రతికూలంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సంగీతకు రక్షణ కల్పించడమే కాక, ఆమె కుటుంబ సభ్యులను (భర్త, పిల్లలు) భారత్‌నుండి డిసెంబరు 10 న అమెరికాకు రప్పించింది. ఎందుకట? దేవయానిపై అమెరికా ప్రభుత్వం పెట్టిన కేసులో వాళ్లు ముఖ్యసాకక్షులట. కేసు ఏమిటి? సంగీత చేత వీసా అధికారికి అబద్ధం చెప్పించిందని, వీసాలో అబద్ధపు సమాచారం యిచ్చిందని, సంగీత చేత ఎక్కువ గంటలు పనిచేయించిందనీ! ఇవేమీ సంగీత భర్త, పిల్లలు ప్రత్యక్షంగా చూడలేదు. ఇక వారు సాకక్షులు ఎలా అవుతారు? మహా అయితే ఫోన్లో సంగీత ఏడ్చింది అని చెప్పగలుగుతారు. ఆ మాత్రం దానికి వాళ్లను ఢిల్లీనుండి తరలించి, అమెరికాలో యిల్లరికపు అల్లుళ్లలా చూడాలా? వాళ్లను తెప్పించిన రెండు రోజులకు దేవయానిని అరెస్టు చేసింది. ఆ తర్వాతి సంగతులు అందరికీ తెలిసినవే. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?