Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : దేవుడి ప్రమేయం ఎంతవరకు? - 3

కెసియార్‌ యీ తరహాలో ఆలోచించరు. అన్ని మతాలూ కవరయ్యాయా లేదా, అన్ని కులాలూ కవరయ్యాయా లేదా యిదే దృష్టి. మళ్లీ హైదరాబాదును సైన్సుకి కేంద్రంగా చేస్తాం, ఆధునికతకు నిలయంగా చేస్తాం అని ఉపన్యాసాలు దంచుతారు. మంత్రతంత్రాలు, పూజాపునస్కారాలపై బాబు కంటె కెసియార్‌కు ఎక్కువ పట్టు వున్నట్టుంది. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు తీరాలంటే యిద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించాలని పట్టుబట్టి గవర్నరు గారు ఓచోట కూర్చోబెడితే 'అవన్నీ సరే గానీ, మీ రాజధాని అమరావతి వద్ద పెట్టుకోండి. వాస్తుప్రకారం మంచిది.' అని కెసియార్‌ బాబుకి సలహా యిచ్చారట. ఎవరికి మంచిది? అని బాబు అడిగారో లేదో కానీ బాబు అక్కడే రాజధాని పెట్టాలని మహేష్‌ బాబు లెవెల్లో కమిటై పోయి యిక కాంప్రమైజ్‌ కావటం లేదు. (దస్తూరీ స్వహస్తం అన్నట్లు యీ కొటేషన్‌ ఆయనదే!) 

జోస్యాలు వ్యక్తిగత స్థాయిలో ఓ మేరకు ఫలించవచ్చు కానీ దేశస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఫలించటం లేదు. ఇక వాస్తు అయితే మరీనూ. మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన కాలం నుండీ పేపర్లో చదువుతున్నాను - వచ్చిన ప్రతీ ముఖ్యమంత్రీ వాస్తుప్రకారం తన ఆఫీసుకు, అధికారిక నివాసానికి మార్పులు చేస్తూనే వున్నారు. అయినా అనేకమందికి పదవులు పోయాయి. మంత్రులూ అదే వాస్తు దోవ పట్టారు. వాళ్లూ యింటిదోవ పట్టారు. గత పాతికేళ్లగా సామాన్య జనం కూడా ఈశాన్యం, వాయువ్యం అంటూ మొదలుపెట్టారు.  వాస్తు తెలియని గేస్తు కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లాలికి తలనొప్పి వస్తే వాస్తుకు లింకు పెట్టి బెడ్‌రూమ్‌లో బీరువాకు స్థానభ్రంశం కల్పిస్తున్నారు. వాస్తును యింతలా పాటిస్తున్నారు కదా, గత పాతికేళ్లలో తెలుగువాళ్ల జీవితాల్లో కష్టాలు తొలగిపోయాయా? జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోందా? లేదే! బతుకులు దుర్భరమై పోయాయనే కదా, ఋణమాఫీలు, ఆసరాలు, పింఛన్లు, ఆరోగ్యశ్రీలు, రూపాయికి కిలో బియ్యాలు.. యిత్యాది సంక్షేమ పథకాల అవసరం పడుతోంది. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. కొందరు చదువుకున్నారు, బాగుపడ్డారు నిజమే. జనాభాలో వారి శాతం ఎంత? ఎక్కువమంది జీవితం ఎలా వుంది అన్నది గమనిస్తే వాస్తును పాటించి బావుకున్నది లేదని గుళ్లలో నిత్యం పెరుగుతూన్న రద్దీ చూస్తే తెలుస్తుంది. కొందరు ఇండియాకే వాస్తు సరిగ్గా లేదని చెప్తున్నారు. అందుకని ఏం చేయాలో మరి! ఈశాన్యం కాస్త కోసేసి చైనాకు యిచ్చేసి, వాయువ్యాన్ని పెంచుకోవడానికి పాకిస్తాన్‌ ఆక్రమిద్దామా?

ఆంధ్ర రాజధాని విషయంలో బాబు చాలా మూర్ఖపు పట్టుదలతో వెళుతున్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టు పక్కన పడేశారు, కేంద్రం సలహాలు వినడం లేదు, దొనకొండలో పెడితే ఎవరి భూములూ తీసుకోనక్కరలేదు కదా అంటే వినలేదు, నూజివీడు వద్ద దేవాలయ భూములున్నాయి అవి తీసుకుని గుడికి నష్టపరిహారం వాయిదాల్లో యిచ్చినా ఫరవాలేదు కదా అంటే వినలేదు, మెట్ట భూములతో సరిపెట్టుకోండి మూడు పంటలు పండే వ్యవసాయభూముల జోలికి వెళ్లనేల అంటే వినలేదు, ఇష్టపడి వచ్చిన వాళ్ల దగ్గర భూమి తీసుకుని పని మొదలుపెడితే తక్కినవాళ్లలో నమ్మకం చిక్కి, వాళ్లంతట వాళ్లే ముందుకు వస్తారేమో, యీ లోపున వాళ్లని ఒత్తిడి చేయడమెందుకు అంటే వినటం లేదు. ఇంత భల్లూకపు పట్టుకు కారణం వాస్తుపై ఆయనకు వున్న పిచ్చి అంటున్నారు. కావచ్చు. లేకపోతే లోకరీతికి యింత భిన్నంగా వెళతారా? 

కేంద్రం వద్దకు వెళ్లి వచ్చేనెల జీతాలకు డబ్బు లేదంటారు, ప్రజల వద్దకు వచ్చి రంగుల రాజధాని బొమ్మ చూపిస్తారు, రైతుల వద్ద తీసుకున్న భూమిలో ప్రభుత్వపు వాటా కమ్మర్షియల్‌ స్పేస్‌ను అప్పుడే వేలం వేస్తున్నారట. ఆ తర్వాత ప్రమోటర్లు, చివర్లో రైతులు అమ్ముకోబోతే అంత డిమాండ్‌ వుంటుందా? అన్న ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. పైసా పెట్టుబడి లేకుండా యిప్పుడు గాల్లో చూపించి అమ్మేస్తారు సరే, కేంద్రం నిధులివ్వకపోతే ఎలా కడతారు? ఏం కడతారు? సంక్రాంతి పండగపూటా యింట వుండకుండా బాబు ఢిల్లీలో తిరిగినా ప్రత్యేక హోదా ప్రకటన రాలేదు, పన్నుల రాయితీ హామీ కూడా రాలేదు. హుదూద్‌ వలన 60 వేల కోట్ల నష్టమైందని యీయన చెపితే ఏమీ పరిశీలించకుండా మోదీ హామీ యిచ్చిన వెయ్యి కోట్లలో కూడా యింకా రావలసినది వుందని బాబే చెప్తున్నారు. ఇక రాజధానికి ఏ మేరకు తేగలుగుతారు? ఇప్పుడు తలపెట్టిన వేలానికి స్పందన వుంటుందా? కెసియార్‌ క్రమబద్ధీకరణ పథకం విఫలమైంది. ఉచితంగా చేయించుకోవడానికి ఎగబడ్డారు కానీ డబ్బులు కట్టమంటే 5% కూడా ముందు రాలేదు. అక్కడా కమ్మర్షియల్‌  స్పేస్‌ కొనడానికి ఎవరూ రాకపోతే ఆంధ్ర ప్రభుత్వం పరువు పోదా? 

సంక్రాంతి కోళ్లపందాల వలన ఎన్ని కుటుంబాలు నాశనం అయి వుంటాయో! జూదం ఎప్పుడూ మంచిది కాదు. గెలిచినవాడు ఒకడుంటే పోగొట్టుకున్నవాళ్లు పదిమంది వుంటారు. ఓడే కొద్దీ కసి పెరుగుతుంది. సభ్యసమాజం సిగ్గుపడవలసిన కోళ్లపందాలను కోస్తా నాయకులు పంతం పట్టి ఆడించుకున్నారు. వారిలో అధికార పక్ష సభ్యులు అందరి కంటె ముందున్నారు. అందరూ సాయం పట్టి గతంలో కంటె ఎక్కువ ప్రాంతాలకు జూదాలను విస్తరింపచేశారు. ఇలాటి వికృత హింసాక్రీడను సంప్రదాయం పేరు చెప్పి బలపరిచారు. ఇప్పుడు రాజధాని నిర్మాణంలోని అస్తవ్యస్తతను వాస్తు పేరుతో సమర్థిస్తున్నారు. నాయకులీ రీతిగా వుంటే ప్రజలకు సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ ఎలా అలవడుతుంది? బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకున్నాకనే బాబుకు వాస్తుపై మోహం పెరిగిందని మరొక పరిశీలన. టిడిపి ఆఫీసు గేటు మార్పించిన తర్వాత అధికారం చేజిక్కడంతో వాస్తుపై నమ్మకం పెరిగి వుంటుంది.

అధికారపక్షం యిలా వున్నపుడు (ఏ మాట కా మాట చెప్పాలంటే వాస్తుని నమ్మి యిక్కడే రాజధాని అంటున్నాను అని బాబు బాహాటంగా ప్రకటించలేదు) ప్రతిపక్ష నాయకుడు భిన్నంగా కనబడితే సమాజంలో మేధావి వర్గాలైనా వూరడిల్లుతాయి. కానీ జగన్‌ చూడబోతే దేవుడి లీల, పండితుల జోస్యం అంటూ ఆ గారడీలో పడి కొట్టుకుంటున్నారు. అలాటి నమ్మకాల వలన ప్రయోజనం వుంటుందా అనే ప్రశ్నకి శ్రీలంక ఎన్నికల ఫలితాల గురించి జనవరి 10 న రాసిన ''సాక్షి'' ఎడిటోరియల్‌లో సమాధానం దొరుకుతుంది - 'రాజపక్సకు సంఖ్యాశాస్త్రంపై అపారమైన నమ్మకం. ఇటు సంవత్సరమూ, అటు తేదీ తన అదృష్ట సంఖ్య 8 కి సరిపోయేలా వున్నాయి కనుక.. జనవరి 8 న ఎన్నికలు జరిగేలా ఆయన చూశారు. అన్నీ సరిపోయినా అధికారపీఠం అందుకోవడానికి తప్పనిసరైన జనం మద్దతు మాత్రం ఆయనకు లేకుండా పోయింది. ఇందుకు రెండే కారణాలు - ఆయన కుటుంబ పాలన, దానితో పెనవేసుకుని పోయిన అవినీతి.' (సమాప్తం) -

 ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?