Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎమర్జన్సీ ఎట్‌ 40 - 16

జోషి నాయకుడయ్యాక కమ్యూనిస్టు పార్టీ ఆలోచనావిధానం మార్చుకుంటూ తీర్మానం చేసింది - 'ఎప్పటికైనా విప్లవమార్గంలోనే సమసమాజస్థాపన జరుగుతుంది. అయితే ప్రజలు ప్రస్తుతానికి విప్లవానికి తయారుగా లేరు. నెహ్రూ ఆదర్శాల మత్తులో కాంగ్రెసు గురించి భ్రమల్లో మునిగివున్నారు. అందువలన ప్రస్తుతానికి హింసా మార్గాన్ని వాయిదా వేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలలో పాల్గొని, ప్రజలకు మరింత చేరువై, మన విధానాలు వారికి ఆమోదయోగ్యం అయ్యాక అప్పుడు విప్లవపథం పట్టాలి.' అని. దానికి అనువుగా తెలంగాణ పోరాటాన్ని విరమించారు. 1952లో జరగబోయే తొలి ఎన్నికలలో పాల్గొంటామని ప్రకటించారు. నెహ్రూ దాన్ని స్వాగతించి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తేశాడు. 1952 ఎన్నికలలో సోషలిస్టు పార్టీ దేశమంతా పోటీ చేస్తే కమ్యూనిస్టులు తమకు బలం వున్న చోట మాత్రమే పోటీ చేశారు. పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ పేర హైదరాబాదులో పోటీ చేశారు. 61 లోకసభ స్థానాల్లో పోటీ చేసి 23 గెలిచి ప్రధాన ప్రతిపక్షం అయ్యారు.  తెలంగాణ పోరాటవీరుడు రావి నారాయణరెడ్డికి నెహ్రూ కంటె ఎక్కువ మెజారిటీ వచ్చింది. 1957 ఎన్నికలలో 27 సీట్లు గెలిచారు. కేరళ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సంపాదించి ప్రపంచంలోనే తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచారు. దేశం మొత్తం మీద ప్రతి అసెంబ్లీలోనూ ప్రాతినిథ్యం సంపాదించారు. దేశం మొత్తం మీద లోకసభ ఓట్లలో వారికి 9% ఓట్లు వచ్చాయి. 1962 నాటికి అది 10% అయింది. 29 సీట్లు వచ్చాయి. ఆ పాటికి ఆంధ్ర, కేరళ, బెంగాల్‌లలో అది బలమైన ప్రతిపక్షంగా ఏర్పడింది. కానీ నెహ్రూ ప్రభుత్వాన్ని ఎలా నిర్వచించాలో తెలియక గందరగోళ పడడంతో కాంగ్రెసుతో ఎలా వ్యవహరించాలన్న విషయంపై నాయకుల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. 

నెహ్రూ రష్యాతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో 1953 సమావేశంలో 'ప్రభుత్వం విదేశ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తోంది కానీ, అంతర్గత విధానాల్లో బూర్జువా విధానాలు అవలంబిస్తూ సామ్రాజ్యవాదానికి వత్తాసు పలుకుతోంది' అని తీర్మానం చేశారు. భారతదేశం స్వతంత్ర రిపబ్లిక్‌గా ఏర్పడినా, ఆ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ 1956 వరకు అంగీకరించలేదు. 1947లో వచ్చినది సంపూర్ణ స్వాతంత్య్రమే అని కూడా పనిలో పనిగా ఒప్పుకున్నారు. ఆలస్యంగా తప్పులు ఒప్పుకోవడాలు, యిలా సర్టిఫికెట్లు యివ్వడాలు హాస్యాస్పదంగా మారాయి. 1956 తీర్మానంలో కూడా 'ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు రాయితీలు యిస్తోందని' ఆరోపించింది. అందువలన ప్రభుత్వాన్ని 'రియాక్షనరీ'గా పిలవసాగారు. విప్లవం జరిగినప్పుడు దానికి ప్రతిచర్యగా దాన్ని అడ్డుకుని మళ్లీ పూర్వవ్యవస్థను తేవడానికి ప్రయత్నించేవారిని రియాక్షనరీలని అంటారు. ఇప్పటిదాకా భారతదేశంలో విప్లవం కానీ, సోషలిజం/కమ్యూనిజం దిశగా రాజకీయపరివర్తన కానీ జరగలేదు. అలాటప్పుడు దానికి ప్రతిచర్య చేయడానికి ప్రయత్నించే రియాక్షనరీలు వుండే ఆస్కారమూ లేదు. అయినా కమ్యూనిస్టులు యితర పార్టీలన్నిటినీ రియాక్షనరీలు అని నిందిస్తారు. అంతేకాదు, తమలో తాము విభేదించినప్పుడు కూడా ఒక వర్గాన్ని మరో వర్గం ఆ పేరుతో పిలుస్తుంది. 

1958 నాటికి కమ్యూనిజానికి తొలిమెట్టయిన సోషలిజం రావాలంటే శాంతిపథంలో, పార్లమెంటరీ విధానంలోనే ప్రయత్నించాలి అని తీర్మానం చేశారు.  కమ్యూనిజం అనగానే రష్యా, చైనాల్లాగ ఒకే పార్టీ నియంతృత్వ పరిపాలన వుంటుందని, ప్రతిపక్షాలను అనుమతించరని, ఎవరైనా ప్రతిఘటిస్తే అణిచివేస్తారనీ అందరికీ తెలుసు. తాము మాత్రం అలా చేయమనీ, తమ సోషలిస్టు విధానాలను రాజ్యాంగపద్ధతుల్లోనే అమలు చేస్తామని, తమ విధానాలను ప్రతిఘటించే హక్కు ప్రతిపక్షాలకు వుంటుందని, ఏకపక్ష పరిపాలన వుండదని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. 1961 వచ్చేసరికి కాంగ్రెసుతో పోరాటం, సహకారం రెండూ వుంటాయని, దాని సోషలిస్టు కార్యక్రమాల విషయంలో సహకారం, కాపిటలిస్టు కార్యక్రమాలకు విరోధం పాటిస్తామని తీర్మానం చేశారు. కాంగ్రెసులో వున్న ప్రగతికాముకులు, రియాక్షనరీలు కలహించుకుని ఏనాటికైనా పార్టీ చీలుతుందని, తాము అప్పుడు ప్రగతికాముకులతో చేతులు కలపవచ్చని అంచనా వేశారు. ఈ పంథా కమ్యూనిస్టు పార్టీ చీలికకు కారణమైంది. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెసుతో చేతులు కలపకూడదని వాదించే వర్గం నాయకత్వంతో విభేదించసాగింది. (కాంగ్రెసు పట్ల వ్యవహరించిన వలసిన తీరు అనే అంశమే కమ్యూనిస్టు పార్టీ చీలికకు కారణమైందన్న భావాన్ని ఈ సీరీస్‌లో 12 వ భాగంలో వెలిబుచ్చేటప్పుడు కాంగ్రెసుకు బదులుగా ఇందిరా గాంధీ అని పొరపాటుగా రాయడం జరిగింది. తప్పు ఎత్తి చూపిన పాఠకుడికి ధన్యవాదాలు) ఈ వర్గాల పోరుకు అంతర్జాతీయ పరిణామాలు కూడా దోహదం చేశాయి. 

చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పాలన రావడానికి రష్యా అధినేతగా స్టాలిన్‌ ఎంతో సహకరించాడు. మావోకు స్టాలిన్‌పై గౌరవం వుండేది. స్టాలిన్‌ మరణానంతరం రష్యా అధినేతగా వచ్చిన కృశ్చేవ్‌ స్టాలిన్‌ పాలనలోని అకృత్యాలను బయటపెట్టి, స్టాలిన్‌ పరువు తీయడం మావోకు రుచించలేదు. పైగా ఆసియాకు సంబంధించినంతవరకు కమ్యూనిస్టులకు తనే దిక్సూచిగా వుండాలని మావో అనుకున్నాడు. భారతదేశం తమలాగే వ్యావసాయిక దేశం కాబట్టి, పొరుగుదేశం కావడం వలన పోలికలు ఎక్కువ కాబట్టి తమ పద్ధతులే భారత్‌కు అనువైనవని, అందువలన భారత కమ్యూనిస్టులకు దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత, హక్కు తనవేనని మావో ఆలోచన. ప్రపంచంలోని కమ్యూనిస్టు దేశాలన్నిటికీ దీపస్తంభంలా వుండడానికి ప్రణాళికలు వేసుకున్న రష్యన్లకు యిది రుచించలేదు. పైగా తన ఆర్థిక, నైతిక మద్దతుతో అధికారంలోకి వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ తమతో పోటీ పడి మరో అధికారకేంద్రంగా మారడం వారు సహించలేకపోయారు. రష్యా, చైనాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ రష్యా అభిమానులు, చైనా అభిమానులుగా విడిపోసాగింది. (సశేషం) (ఫోటో - మావో, స్టాలిన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?