Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 20

సంఘ్‌ హిందూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవలందించినా సిద్ధాంతాలు అగ్రవర్ణాలను, ధనిక వర్గాలను, ఓ మేర వరకు మధ్యతరగతి వర్గాలను ఆకర్షించినట్లుగా పేదలను ఆకర్షించలేదు. ఆర్థిక విధానాల్లో తమది ఫలానా ..యిజమ్‌ అని సంఘ్‌ చెప్పకపోయినా, ఆచరణలో వాళ్లు ప్రధానంగా రైటిస్టులే. సోషలిజం, ఆర్థిక సమానత వంటి సిద్ధాంతాలను వల్లించరు. కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తారు కాబట్టి ధనికులు దీనికి బాగా విరాళాలిచ్చి మద్దతు యిస్తారు. పైగా స్వదేశీ పరిశ్రమలు వర్ధిల్లాలనే సంఘ్‌ ఆదర్శం వారికి అనువుగా తోస్తుంది. అందువలన సంఘ్‌ అంటే బ్రాహ్మణులు, బనియాలు (వ్యాపారస్తులు) అనే మాట పడింది. అది పేదలను యింకా దూరం చేసింది. సంఘ్‌ హిందీకే ప్రాధాన్యత యివ్వడం చేత హిందీయేతర రాష్ట్రాలలో అది పెద్దగా వ్యాపించలేదు. కొంతకాలానికి సంఘ్‌ యీ లోపాలను గమనించి యితర కులాల వారికి, హిందీయేతర ప్రాంతాల వారికి నాయకత్వాన్ని పంచి వ్యాపించసాగింది. అనుబంధ సంస్థలు అనేకం ఏర్పరచి, హరిజనుల్లో, గిరిజనుల్లో కూడా చొచ్చుకుపోతోంది. ఇది సంఘ్‌ గురించిన క్లుప్త పరిచయం. మన ఫోకస్‌, జనసంఘ్‌, బిజెపిలతో దాని అనుబంధం గురించి కాబట్టి ప్రస్తుతానికి యిది చాలు. 

శ్యామా ప్రసాద్‌ 1929లో బెంగాల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో కాంగ్రెసు సభ్యుడిగా తన రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. శాసనవ్యవస్థల నుంచి తప్పుకోవాలన్న పార్టీ విధానాన్ని అనుసరించి అందరితో బాటు 1930లో రాజీనామా చేశాడు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. బెంగాల్‌లో ఫజుల్‌ హక్‌ ముఖ్యమంత్రిగా ప్రోగ్రెసివ్‌ కొయాలిషన్‌ (ప్రగతి కూటమి) ప్రభుత్వం ఏర్పడినపుడు ఫైనాన్స్‌ మంత్రి అయ్యారు. బెంగాల్‌ మతకల్లోలాలు, ప్రత్యక్ష చర్య పేరిట ముస్లిం లీగ్‌ జరిపిన హింస, నవకాళీ దురంతాలు ఆయన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేశాయి. తూర్పు బెంగాల్‌ నుండి హిందువులు సర్వం కోల్పోయి శరణార్థులుగా రావడం ఆయనను కలచివేసింది. తన పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో చేరారు. 1944లో దానికి అధ్యక్షుడిగా పనిచేశారు కూడా. తొలిదశలో దేశవిభజనను ఆయన వ్యతిరేకించినా, పోనుపోను ముస్లిం మెజారిటీవున్న తూర్పు బెంగాల్‌లో హిందువులు సురక్షితంగా వుండలేరన్న అభిప్రాయం ఆయనలో నెలకొంది. బెంగాలీ హిందువుల సంక్షేమమే ఆయన పరమావధి అయింది.

స్వాతంత్య్రం వచ్చాక అధికారానికి వచ్చిన కాంగ్రెసు పార్టీకి సహకరించి దేశాన్ని పునర్నిర్మించుకోవాలని హిందూ మహాసభ నాయకులు భావించారు.  దానికి తోడు జవహర్‌ లాల్‌ నెహ్రూ యితర పార్టీలకు చెందిన మేధావులను కూడా తన కాబినెట్‌లో సభ్యులుగా వుండమని ఆహ్వానించాడు. ఆంబేడ్కర్‌కు న్యాయశాఖ, సర్దార్‌ బలదేవ్‌ సింగ్‌కు రక్షణ శాఖ, షణ్ముఖం చెట్టికి ఫైనాన్సు శాఖ, జాన్‌ మత్తయ్‌కు రైల్వే, ట్రాన్స్‌పోర్టు శాఖ అప్పగించాడు. వారితో బాటే శ్యామా ప్రసాద్‌కు ఇండస్ట్రీ అండ్‌ సప్లయిస్‌ శాఖ యివ్వడం జరిగింది. హిందూ మహాసభలో తీవ్రభావాలున్న గోడ్సే వంటి సభ్యులకు యిదంతా రుచించలేదు. వాళ్లు హిందూ మహాసభ నుండి తప్పుకుని 1948 జనవరిలో మహాత్మా గాంధీని హత్య చేశారు. ఇది శ్యామా ప్రసాద్‌ జీర్ణించుకోలేక పోయాడు. పార్టీ నుంచి తప్పుకున్నాడు. గాంధీ హత్య తర్వాత హిందూత్వవాదులపై ప్రజాగ్రహం పెల్లుబికింది. దాన్ని చల్లార్చడానికి ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. గోడ్సేకు సంఘ్‌కు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, హత్యకు ముందే హిందూ మహాసభ నుండి అతను వైదొలగినా హిందూ మహాసభ, సంఘ్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాంగ్రెసులో ముస్లిం వ్యతిరేకులు, హిందూ దురభిమానులు చాలామంది వున్నారు. వారికి సంఘ్‌పై సానుభూతి, సహానుభూతి వుంది. అయినా ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితిలో హోం మంత్రి వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ నిషేధించారు. సంఘ్‌ అధినేత ఎమ్మెస్‌ గోల్వాల్కర్‌ను జైల్లో పెట్టారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, హింసకు పాల్పడమని హామీలు యిచ్చిన తర్వాత 1949 జులైలో నిషేధం ఎత్తివేసి ఆయనను విడిచిపెట్టారు. 

విభజన సమయంలో పంజాబ్‌, సింధు ప్రాంతాలలోని హిందువులు తమ ఆస్తిపాస్తులు విడిచిపెట్టి భారతదేశానికి పారిపోయి వచ్చారు. తూర్పు బెంగాల్‌లోని హిందువులలో చాలామంది అలా చేయలేదు. అక్కడే వుండి పరిస్థితులు చక్కబడతాయని ఆశించారు. కానీ స్థానిక ముస్లిములు వారిపై దాడులు జరపసాగారు. వారి ధన, మాన, ప్రాణ సంరక్షణ పాకిస్తాన్‌ ప్రభుత్వ బాధ్యత. వారు దాన్ని సరిగ్గా నిర్వర్తించటం లేదని శ్యామా ప్రసాద్‌ ఫిర్యాదు. వారిని రక్షించడానికి భారతప్రభుత్వం ప్రత్యక్ష చర్య చేపట్టాలని నెహ్రూని కోరారు. కానీ నెహ్రూ విదేశీ వ్యవహారాల్లో అలా జోక్యం చేసుకోలేమని, పాకిస్తాన్‌ ప్రధాని లియాకత్‌ ఆలీ ఖాన్‌తో చర్చలు జరిపి వారికి బాధ్యత గుర్తు చేద్దామని ఆయనకు నచ్చచెప్పబోయారు. శ్యామా ప్రసాద్‌కు అది రుచించలేదు. వాళ్లతో మాట్లాడే పనేముంది, మనమే ఏదో ఒకటి చేయాలి అని వాదించాడు. అది పద్ధతి కాదు అంటూ నెహ్రూ లియాకత్‌తో ఆరు రోజుల చర్చలు జరిపి 1950 ఏప్రిల్‌లో ఒక ఒప్పందానికి వచ్చాడు. లియాకత్‌ను ఆహ్వానించేందుకు ముందు తనను సంప్రదించనందుకు అలిగిన శ్యామా ప్రసాద్‌ కాబినెట్‌ నుంచి రాజీనామా చేశాడు. ఆయనతో బాటు మరొక బెంగాలీ మంత్రి నియోగీ కూడా! వారి రాజీనామాలను నెహ్రూ ఓ పట్టాన ఆమోదించలేదు. కానీ వారు గట్టిగా పట్టుబట్టడంతో వారం రోజుల తర్వాత ఆమోదించాడు. ఈ ఒప్పందం కాగితాల మీదనే వుండిపోయింది కానీ అమలు కాలేదు.  ఇదంతా చూసిన శ్యామా ప్రసాద్‌ ఒక ఏడాది పోయిన తర్వాత హిందువులను రక్షించాలంటే కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా జాతీయ (...హిందూ అని అర్థం చేసుకోవాలి) పార్టీ స్థాపించి తీరాలని నిశ్చయించుకున్నాడు. 

హిందువుల సంక్షేమానికై పనిచేస్తున్న సంస్థలు ఆర్య సమాజ్‌, సంఘ్‌ కాబట్టి తన పార్టీలో పాలుపంచుకోమని ఆహ్వానిస్తూ తన సహచరుడు బలరాజ్‌ మధోక్‌ చేత వారికి ఉత్తరాలు రాయించాడు. ఆర్య సమాజ్‌ పార్టీని ఆహ్వానిస్తూ జవాబు రాసింది కానీ సంఘ్‌ జవాబివ్వలేదు. నిజానికి హిందూ హక్కుల రక్షణ అంశంపై నెహ్రూ కాబినెట్‌ నుంచి రాజీనామా చేసినప్పుడు శ్యామా ప్రసాద్‌కు ఢిల్లీలో సత్కారసభ జరిగినప్పుడు సంఘ్‌ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినా సంస్థ తరఫున యిప్పుడు మాత్రం స్పందన లేదు. నిజానికి తమపై నిషేధం అమలయినపుడు ఏ రాజకీయ పార్టీ తమకు సహాయంగా నిలవకపోవడం సంఘ్‌ను బాధించింది. మనుగడకు రాజకీయ పరమైన మద్దతు అత్యవసరం అని గ్రహించింది. తమంతట తామే ఓ పార్టీ పెడితే మంచిదన్న సలహా కూడా కొందరు కార్యకర్తల నుంచి వచ్చింది. కానీ గోల్వాల్కర్‌ ఆ సలహాను ఆమోదించలేదు. నెహ్రూ సెక్యులర్‌ విధానాలతో విభేదించే కాంగ్రెసు నాయకులు సంఘ్‌ సభ్యులను పార్టీలో చేర్చుకోవడానికి ఉబలాట పడుతున్నారన్న సూచనలు కనబడుతున్నాయి. అదే జరిగితే తాము పరోక్షంగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లో పాలు పంచుకున్నట్లే. దానితో పోలిస్తే శ్యామా ప్రసాద్‌ బలం చాలా తక్కువ. ఆయన రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆయన వెనక ప్రముఖ నాయకులు ఎవరూ నిలవలేదు. ఈ కారణాల చేత సంఘ్‌ నిదానించి పరిస్థితి గమనించడానికే నిశ్చయించుకుంది.

స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1952లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ముందే తన పార్టీ స్థాపించాలన్న తొందరలో శ్యామా ప్రసాద్‌ వున్నాడు. అందువలన తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా ముందుకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు. ఢిల్లీ నుండి కలకత్తా వచ్చి తన కార్యకర్తలతో సంప్రదించి ''ఇండియన్‌ పీపుల్స్‌ పార్టీ'' పేర పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత సంఘ్‌లో కదలిక వచ్చింది. కాంగ్రెసు పార్టీలో అనేక రకాల సిద్ధాంతాలకు చోటుంది. ఎప్పుడు ఎవరిది పైచేయి అవుతుందో ఎవరూ చెప్పలేరు. దానిలోకి వెళ్లి వామపక్షవాదులతో, సెక్యులరిస్టులతో నిత్యం పోరాటం చేయడం కంటె శైశవదశలో వున్న యీ పార్టీలో చేరి దాన్ని సొంతం చేసుకుంటే అచ్చగా యిది తమ సిద్ధాంతాలనే ప్రతిబింబిస్తుంది కదా అన్న ఆలోచన వచ్చింది. శ్యామా ప్రసాద్‌కు కబురు పెట్టారు. తమ మద్దతు కావాలంటే పార్టీకి హిందీ పేరుండాలన్న షరతు విధించారు. ''భారతీయ లోక్‌ సంఘ్‌'', ''భారతీయ జన సంఘ్‌'' అని తమ సంస్థతో ప్రాస కుదిరేట్లు రెండు పేర్లు సూచించారు. హిందువుల రంగైన కాషాయరంగుతోనే పార్టీ పతాకాన్ని రూపొందించాలని చెప్పారు. శ్యామా ప్రసాద్‌ జన సంఘ్‌ పేరు ఎంచుకున్నాడు. కాషాయధ్వజానికి సరేనన్నాడు. పార్టీ గుర్తుగా 'దీపం'ను ఎంచుకున్నాడు. 1951 అక్టోబరు 21న పార్టీ అవతరించింది. శ్యామా ప్రసాద్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన సహచరుడు, జమ్మూ ప్రాంతీయుడు అయిన బలరాజ్‌ మధోక్‌ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సంస్థాగత నిర్మాణంలో పార్టీకి సహాయపడడానికి సంఘ్‌ ముగ్గుర్ని పంపింది. వారు - దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, సుందర్‌ సింగ్‌ భండారీ, భాయ్‌ మహావీర్‌. పార్టీ ఆవిర్భావ సభలో శ్యామా ప్రసాద్‌ ''మా పార్టీ సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిపై, మర్యాదపై ఆధారపడతాయి. మా లక్ష్యం ధర్మరాజ్యం స్థాపించడం.'' అని ప్రకటించారు.  (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?