Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 22

శ్యామా ప్రసాద్‌ ఆకస్మికమృతితో జనసంఘ్‌ నాయకత్వంలో శూన్యత ఏర్పడింది. ఉపాధ్యక్షుడిగా వున్న పండిత్‌ మౌళీచంద్ర శర్మ అధ్యక్షుడయ్యారు.  హిందూ మహాసభ నాయకుడైన దీన్‌ దయాళ్‌ శర్మ కుమారుడాయన. సంఘ్‌కు ఆప్తుడు. నక్సలైట్ల తరఫున పోరాడడానికి వారి సానుభూతిపరులు పౌరహక్కుల సమితులు ఏర్పరచినట్లే సంఘ్‌ నిషేధానికి గురైనప్పుడు యీయన జన అధికార సమితి అనే పేర ఒక సంస్థ పెట్టి వారికోసం అధికారంలో వున్న కాంగ్రెసువారితో రాయబారాలు నడిపాడు. వారిలో రాజేంద్ర ప్రసాద్‌, సర్దార్‌ పటేల్‌ కూడా వున్నారు. చివరకు మధ్య ప్రదేశ్‌ హోం మంత్రిగా వున్న కాంగ్రెసు నాయకుడు డిపి మిశ్రాను మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. తాము రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనమని సంఘ్‌ లిఖితపూర్వకంగా రాసి యిస్తే నిషేధం ఎత్తివేస్తామని కేంద్రం అంది. కానీ సంఘ్‌ అధినేత గోల్వాల్కర్‌ అలా రాయడానికి యిష్టపడలేదు. చివరకు మిశ్రా మధ్యేమార్గం కనిపెట్టాడు. గోల్వాల్కర్‌ ఆ మేరకు మౌళీచంద్రకు లేఖ రాస్తే, అతను దాన్ని కేంద్ర నేతలకు చూపించి నిషేధం ఎత్తివేయించాడు. సార్వత్రిక ఎన్నికలలో ఔటర్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాక పార్టీ వ్యవహారాల్లో ఆసక్తి తగ్గింది. అతని సంగతి తెలిసిన సంఘ్‌ జనసంఘ్‌ పార్టీని తమ చేతుల్లో తీసుకుని వెనకనుండి నడపడానికి యిదే అదననుకుంది. ఎవరెవరికి ఏయే పార్టీ పదవులు కట్టబెట్టాలా జాబితా తయారుచేసి యిచ్చింది.

కానీ మౌళీచంద్ర ఉద్దేశాలు వేరుగా వున్నాయి. శ్యామా ప్రసాద్‌ స్థానంలో తను వచ్చాడు కాబట్టి, పార్టీని తన యిష్టప్రకారం నడపాలనుకున్నాడు.  ఈ జాబితాను ఒప్పుకోలేదు. దాంతో సంస్థాగత కార్యదర్శిగా వున్న తమ మనిషి దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ద్వారా సంఘ్‌ మౌళీచంద్రకు యిబ్బందులు కలిగించింది. దాంతో విసిగిపోయిన మౌళీచంద్ర 1954 నవంబరులో తన పదవికి రాజీనామా చేశాడు. ఆ సందర్భంగా రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశాడు - ''గత ఏడాదిగా మా పార్టీ వ్యవహారాల్లో సంఘ్‌ ప్రమేయం పెరుగుతూ వచ్చింది. సంఘ్‌ తాము సాంస్కృతిక కార్యకలాపాలకే పరిమితమవుతామని, రాజకీయాల్లో పాల్గొనమని గతంలో ప్రకటించిన కారణంగా దాని సభ్యులు మా పార్టీలో చేరడాన్ని స్వాగతించాం. కానీ సంఘ్‌ ప్రధాన కార్యాలయం మాటిమాటికీ తమ కార్యకర్తల ద్వారా ఆదేశాలు పంపుతూ పార్టీని తమ చిత్తానుసారం నడపాలని చూడసాగింది. ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలని సంఘ్‌ నాయకత్వం డిమాండ్‌ చేయడం శ్యామా ప్రసాద్‌ను కూడా కలవర పరచేది. ఇటీవలి కాలంలో యిది మరీ ఎక్కువైంది. కార్యకర్తలకు, రాష్ట్ర యూనిట్లకు రహస్యంగా ఆదేశాలు పంపుతూ జనసంఘ్‌ను సంఘ్‌ చేతిలో కీలుబొమ్మగా మారుద్దామని చూస్తున్నారు. ఇది పార్టీలో కొందరు కార్యకర్తలను కలవరపరుస్తోంది. ఢిల్లీ యూనిట్‌ తాము సంఘ్‌ ఆదేశాలను పట్టించుకోమని స్పష్టంగా చెప్పింది.'' అంటూ దానిలో రాశాడు. 

ఏది ఏమైనా 16 నెలల్లో మౌళీచంద్ర పదవి ముగిసింది. ఆయన స్థానంలో జమ్మూలో హిందూ హక్కులకై ప్రజా పరిషద్‌ను ఏర్పరచిన సంఘ్‌ ప్రేమ్‌ నాథ్‌ డోంగ్రాను కూర్చోబెట్టింది. ఆయన కశ్మీర్‌ మహారాజా హరిసింగ్‌ ఆస్థానంలో తాసిల్దార్‌గా పనిచేశాడు. ఆయన మద్దతుతో ఏర్పాటు చేసిన హిందూ సభ పార్టీలో నాయకుడు. భారత్‌లో కలవడానికి యిష్టపడకుండా కశ్మీర్‌ను స్వతంత్రదేశంగా వుంచుతానని మహారాజా అన్నపుడు యీ పార్టీ సమర్థించింది. అది కుదరక, చివరకు గద్దె దిగవలసి వచ్చినపుడు మహారాజా ప్రజా పరిషద్‌ పార్టీకి సాయపడ్డాడంటారు. డోంగ్రా జమ్మూ ప్రాంతాల్లో తెలిసిన నాయకుడే తప్ప జాతీయ స్థాయి లేనివాడు. ఆయనను కూర్చోబెడుతూనే సంఘ్‌ పార్టీ నుంచి మౌళీచంద్ర అనుయాయులను పదవుల్లోంచి తప్పించింది. తమ మాట వినని ఢిల్లీ యూనిట్‌ను రద్దు చేసి, దాని నాయకులైన గురు దత్‌, కఁవర్‌ లాల్‌ గుప్త (ఈయన చాలా ఏళ్ల తర్వాత పార్టీలో మళ్లీ చేరి ఎంపీ అయ్యాడు)లను సాగనంపి, ఆ యూనిట్‌ను సంఘ్‌ కార్యకర్తలతో నింపివేసింది. ఎటు పోవడానికి దారి లేక మౌళీచంద్ర కాంగ్రెసు పార్టీలో చేరాడు.

డోంగ్రా ఏడాదికి మించి పదవిలో లేడు. 1956 వచ్చేసరికి ఆయన స్థానంలో దేవప్రసాద్‌ ఘోష్‌ అనే మేథ్స్‌ ప్రొఫెసర్‌ను అధ్యక్షుడిగా చేశారు. ఆయన తూర్పు బెంగాల్‌ నుంచి శరణార్థిగా కలకత్తా వచ్చి రిప్పన్‌ కాలేజీలో పనిచేసేవాడు. శ్యామా ప్రసాద్‌ స్నేహితుడిగా మొదట హిందూ మహాసభలో వుండి తర్వాత పార్టీ పెట్టినపుడు పార్టీలో చేరాడు. ఈయన పేరుకు మాత్రమే అధినేత. అధికారాలన్నీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గుప్పిట్లోనే వుండేవి. అసలు ఆయన్నే అధ్యక్షుడిగా వుండమని సంఘ్‌ కోరింది. కానీ దీన్‌ దయాళ్‌ పదవి చేపట్టడానికి విముఖత చూపడంతో యిలాటి డమ్మీ కాండిడేట్లను పెట్టేవారు. ఘోష్‌ను 1956 నుండి 60 వరకు వుంచారు. ఆ తర్వాత 1960లో కాంగ్రెసు పార్టీ నుండి ఫిరాయించిన ఉత్తర ప్రదేశ్‌ నాయకుడు పీతాంబర్‌ దాస్‌ను పెట్టారు. 1961లో ఆంధ్ర ప్రదేశ్‌ నుండి పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అవసరాల రామారావు అనే తెలుగాయన్ను అధ్యక్షుణ్ని చేశారు. (ఈయన 1962 లోకసభ ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన పేరు తెలుగువాళ్లలో ఎంతమందికి గుర్తుందో సందేహమే) 1962లో మళ్లీ ఘోష్‌ను తీసుకుని వచ్చి 1964 వరకు కొనసాగించారు. బెంగాలీ ఆయన అధ్యక్షుడిగా వున్నాడు కదాని బెంగాల్‌లో పార్టీ ఎదగలేదు. క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది. 60 ఏళ్లు దాటాక బిజెపి రూపంలో ఇటీవల 2014 నుండే పుంజుకుంటోంది. 

1957 ఎన్నికలలో జనసంఘ్‌కు 4 లోకసభ సీట్లు గెలిచింది. 5% ఓట్లు వచ్చాయి. వాజపేయి తొలిసారిగా లోకసభకు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో మూడు సీట్లకు (బలరామ్‌పూర్‌, లఖనవ్‌, మథుర) పోటీ చేసి మొదటి దాన్లో మాత్రమే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికలలో 11 రాష్ట్రాలలో 130 సీట్లలో నిలబడితే 57 సీట్లలో డిపాజిట్లు పోయాయి. ఢిల్లీలో 16%, మధ్య ప్రదేశ్‌లో 13%, రాజస్థాన్‌లో 11% ఓట్లు వచ్చాయి. దీనికి కారణం హిందూ మహాసభ, రామరాజ్య పరిషద్‌ పార్టీలు తెరమరుగై హిందూత్వ ఓట్లన్నీ జనసంఘ్‌కే రాసాగాయి. వామపక్షవాదులకు వీళ్ల కంటె ఎక్కువ సీట్లు, ఓట్లు వచ్చాయి. నాయకత్వం మాత్రం కాంగ్రెసుదే. మొత్తం 490 సీట్లలో 371, 47% ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్‌ నుండి ఢిల్లీలో, పంజాబ్‌లో స్థిరపడిన పంజాబీ శరణార్థులు జనసంఘ్‌కు, శిఖ్కు శరణార్థులు అకాలీ దళ్‌కు మద్దతుదారులుగా మారారు. పంజాబ్‌లో భాష విషయంలో సంఘ్‌ పొరపాటు చేసింది. ఆర్య సమాజ్‌ నుండి పార్టీలో చేరిన సభ్యుల ఒత్తిడి వలన పంజాబీ భాష స్థానంలో హిందీని వాడాలని ఉద్యమాలు చేసింది. దాంతో శిఖ్కులు అకాలీ దళ్‌ వైపు వెళ్లిపోయారు. ముస్లిం లీగ్‌ సభ్యులైన ముస్లింలు పాకిస్తాన్‌ కోరినట్లే అకాలీ దళ్‌ నేతృత్వంలో శిఖ్కులు ఎప్పటికైనా ఖలిస్తాన్‌ కోరతారని జనసంఘ్‌కు సందేహం వుండేది. 

జనసంఘ్‌కు వ్యాపారస్తుల మద్దతు బాగా వుండేది. పార్టీ విధానాలు కూడా వారికి అనుగుణంగానే వుండేవి. అమ్మకపు పన్ను వలన వ్యాపారస్తులు, సామాన్యులు కష్టపడుతున్నారని, అవసరమైన వస్తువులపై రాష్ట్రాలు సేల్స్‌ టాక్స్‌ ఎత్తివేయాలని, సెంట్రల్‌ సేల్స్‌ టాక్స్‌ పూర్తిగా రద్దు చేయాలని తమ మానిఫెస్టోలో రాస్తూ వుండేది. జాతీయ భద్రత కోసం డిఫెన్సు పరికరాలు తయారుచేసే పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ అధీనంలో వుండాలని, తక్కిన పరిశ్రమలన్నీ ప్రయివేటు రంగానికే అప్పగించాలని, బ్యాంకింగు, ఇన్సూరెన్సు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టరాదని వాదించేది. అందుకే పెట్టుబడిదారులకు అభిమాన పార్టీగా మారింది. కార్మికులు, పేదలు అనుమానించేవారు. (సశేషం)  (ఫోటోలు - 1. పండిత్‌ మౌళీచంద్ర శర్మ, 2. ప్రేమ్‌ నాథ్‌ డోంగ్రా (రంగుల్లో) 3. దేవప్రసాద్‌ ఘోష్‌, అవసరాల రామారావు, గురు దత్‌) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?