Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 29

పట్టాభి పదవీకాలం 1950 ఆగస్టు నాటికి ముగిసింది. ఆయన వారసుడి కోసం ఎన్నిక జరగాలి. అప్పటికే నెహ్రూ సోషలిస్టు విధానాలు రైటిస్టులకు కంటగింపుగా వున్నాయి. ఆయనకు ముకుతాడు వేయాలంటే కాంగ్రెసు అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవాలనుకున్నారు. తమ అభ్యర్థిగా పురుషోత్తమదాస్‌ టాండన్‌ను నిలబెట్టారు. మతవిశ్వాసాల పరంగా, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఆయనను ఛాందసుడిగా పరిగణిస్తారు. ఆయనకు పటేల్‌ మద్దతు పలికాడు. నెహ్రూ తన తరఫున కృపలానీని నిలబెట్టాడు. ఎన్నికలో టాండన్‌కు 1306 ఓట్లు రాగా, కృపలానీకి 1092 మాత్రమే వచ్చి ఓడిపోయాడు. నెహ్రూ వ్యతిరేకులు పొంగిపోయారు. టాండన్‌ యిక తన తడాఖా చూపసాగాడు. కృపలానీ వంటి సోషలిస్టులను కీలకపదవుల్లోంచి తొలగించి తన అనుయాయులతో పదవులు నింపాడు. నెహ్రూ ప్రభుత్వంలో ప్రధాని, యితర మంత్రులు పార్టీ (అనగా తను) చెప్పినట్లు వినాలన్నాడు. దీనితో విసిగిపోయిన కృపలానీ 1951 జూన్‌లో పార్టీ వదిలిపెట్టి కిసాన్‌ మజ్‌దూర్‌ ప్రజా పార్టీ స్థాపించాడు. అతని అనుయాయులు యింకా కొంతమంది అతన్ని అనుసరించారు. పార్టీలో నెహ్రూ స్థానం బలహీనపడింది. ఒక ఏడాది యిలా గడిచేసరికి నెహ్రూకు చిర్రెత్తుకొచ్చింది. ఇలాగే వదిలేస్తే పార్టీ పూర్తిగా రైటిస్టు మార్గంలో పోతుందని భయపడి, రాజకీయంగా జూదం ఆడాడు. 1951 ఆగస్టులో పార్టీ వర్కింగ్‌ కమిటీలో తన సభ్యత్వానికి రాజీనామా చేసి, 'నేను, టాండన్‌ మాలో ఎవరో ఒకరిని ఎంచుకోండి' అని పార్టీ నాయకులకు సవాలు విసిరాడు. పటేల్‌ 1950 డిసెంబరులో చనిపోవడం వలన టాండన్‌ పక్షాన నిలిచి నెహ్రూతో తలపడే ధైర్యం ఎవరికీ లేకపోయింది. పైగా అదే ఏడాది మొదటి సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజల్లో నెహ్రూకున్న పలుకుబడి టాండన్‌కే కాదు, వేరెవరికీ లేదు. అందువలన టాండన్‌ 'నేనే రిజైన్‌ చేస్తా' అన్నాడు. 

నెహ్రూ సెప్టెంబరులో కాంగ్రెసు అధ్యక్షపదవి చేపట్టాడు. టాండన్‌ను వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా చేరమని కోరాడు. టాండన్‌ ఒప్పుకున్నాడు. అలాగే తనతో విభేదించిన అనేకమందికి నెహ్రూ పదవులు యిచ్చాడు. కానీ నాయకత్వం మాత్రం తన దగ్గరే పెట్టుకుని ఏడాది తర్వాత తన విధేయుడైన యుఎన్‌ ధేబర్‌కు అప్పగించాడు. గతంలో వున్న నిబంధనను మార్చి అతన్నే 1959 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత తన కూతురు ఇందిరా గాంధీకి అప్పగించాడు. ఒక ఏడాది పోయిన తర్వాత సంజీవరెడ్డికి యిప్పించాడు. రెండేళ్లు పోయాక దామోదరం సంజీవయ్యకు, 1964లో కామరాజ్‌కు అప్పగించాడు. ఇలా పార్టీ అధ్యక్షుడిగా తన విధేయుడే వుండేటట్లు చూసుకుని పార్టీపై ఆధిపత్యం సంపాదించాడు. 

ఈ విధంగా తన ఆదర్శాలకు విరుద్ధంగా పార్టీ, ప్రభుత్వంకు మధ్య గీత చెరిపివేశాడు. తర్వాతి రోజుల్లో అధ్యక్షుడు, ప్రధాని తలపడిన సందర్భాలు వచ్చాయి. పోనుపోను రెండు పదవులూ ఒకరే నిర్వహించడం జరిగింది. మొన్నటివరకు సోనియా అధ్యక్షురాలిగా, మన్‌మోహన్‌ ప్రధానిగా వున్నా సోనియా మాటే చెల్లింది. ఇదే ధోరణి తక్కిన పార్టీల్లో కూడా వ్యాపించింది. ప్రాంతీయపార్టీలైతే మరీ అన్యాయం. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒకరే అయిపోతున్నారు - మరొకరిని పెడితే వాళ్లు ప్రత్యామ్నాయ అధికారకేంద్రంగా మారతారన్న భయంతో! ఇలాటి భయాలతో ప్రభుత్వాధినేతలే పార్టీని బలహీనపరచడం వలన చాలా చెఱుపు జరిగింది. పార్టీ నుండి ఫీడ్‌బ్యాక్‌ రావడం మానేసింది. పార్టీ వ్యవస్థ మొత్తం ప్రభుత్వంపై ఆధారపడసాగింది. నాయకులందరూ పార్టీ పదవుల్లో మజా ఏమీ లేదని ప్రభుత్వ పదవులకు ఆశపడసాగారు.  పార్టీ విస్తరణపై, పార్టీలో కొత్త సభ్యులను చేర్పించడంపై ఆసక్తి నశించింది. యువత పార్టీలో చేరడం మానేశారు. పాతవాళ్లే కొనసాగడంతో ప్రజలకు వాళ్ల మొహాలు చూసి విసుగుపుట్టి, పార్టీకి దూరం కాసాగారు. గమనిస్తే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గీత చెరిపేసిన పార్టీలన్నిటికీ యిదే గతి పట్టింది. 

ఇక నెహ్రూ సోషలిస్టు విధానాలకు వస్తే - పార్టీ తన చేతికి వచ్చాక మళ్లీ సోషలిస్టులను పార్టీలోకి తెద్దామని గట్టి ప్రయత్నం చేశాడు. తను సోదరుడిగా భావించే జయప్రకాశ్‌ నారాయణ్‌ను 1951లో బతిమాలాడు. కానీ జయప్రకాశ్‌ అతన్ని ఫాసిస్టు అని నిందించాడు. 1957లో మళ్లీ అడిగినప్పుడు బ్యాంకుల జాతీయకరణ వంటి 14 అంశాల కార్యక్రమాన్ని ముందుపెట్టి అది అమలు చేసి, తర్వాత తమను పార్టీలోకి ఆహ్వానించమన్నాడు. అమలు చేస్తాను కానీ అది ఒక షరతుగా పెట్టకుండా పార్టీలో చేరండి అని అడిగాడు నెహ్రూ. కుదరదన్నాడు జయప్రకాశ్‌. ఏ మార్పయినా క్రమేపీ చేసుకుంటూ రావాలి తప్ప ఒక్కసారిగా చేయకూడదని నెహ్రూకు తెలిసివచ్చింది. 1959లో జమీందారీ రద్దు చేసిన ఒడిశాలో ప్రజల్లో అసంతృప్తి గమనించి పార్టీ నాయకులు విస్తుపోయారు. జమీందార్లలో అందరూ కౄరులు కారు. పైగా పన్నులు దారుణంగా వసూలు చేసినా ఎవరైనా రైతుకి  వ్యక్తిగతమైన అవసరం పడి వెళ్లి బతిమాలుకుంటే తోచినంత డబ్బు యిచ్చేవారు. దాంతో వాళ్లు దేవుడిలా తోచేవారు. జమీందారీ పద్ధతి రద్దయి వారి స్థానంలో ప్రభుత్వాధికారులు వచ్చాక 'నీకెందుకు కావాలి? అది ఉత్పాదకత పెంచే ఖర్చా? విలాసాలకు పెట్టేదా? మళ్లీ ఎలా తిరిగి యిస్తావ్‌?' వంటి ప్రశ్నలు అడిగేవారు. అక్కడ పెర్శనల్‌ టచ్‌ లేదు. కొత్త పద్ధతి వలన ఒనగూడే దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రజలకు బోధపడలేదు. ప్రస్తుతానికి అవసరం తీర్చేవాడు కనబడలేదు, అందువలన భూసంస్కరణలు తెచ్చిన కాంగ్రెసును తిట్టుకున్నారు. ప్రభుత్వోద్యోగం అంటే పని చేయకపోయినా జీతం యిస్తారనే భావం ప్రజల్లో బలపడి, ప్రభుత్వసంస్థల పనితీరు దెబ్బ తింది. అందువలన చిత్తం వచ్చినట్లు జాతీయకరణ చేస్తే ఆర్థికాభివృద్ధి దెబ్బ తినవచ్చు. ప్రభుత్వంలో వున్నవారికే ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుస్తాయి. ప్రతిపక్షం అర్థం చేసుకోకుండా ఆదర్శాలు వల్లిస్తుంది. అధికారంలోకి వచ్చాక అప్పుడు తెలిసివస్తుంది. అందువలన కాంగ్రెసు సంస్కరణలవైపు అడుగు వేసిన ప్రతీసారి భూవసతి లేని పేద కార్యకర్తలు జేజేలు కొట్టగా ఆ పార్టీలోని ధనిక రైతులు, మధ్యతరహా రైతులు వాటిని అడ్డుకుని తిరగతోడేవారు. (1972లో పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు చేపట్టి ల్యాండ్‌ సీలింగ్‌ తెచ్చినపుడు దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు) ఈ విధంగా కాంగ్రెసుకు ఒక దిశ లేకుండా, ఏ సిద్ధాంతానికి కట్టుబడకుండా అందర్నీ తృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ, ఎవరికీ ఏదీ గట్టిగా చేయకుండా అలా బండి నడుపుకుంటూ వచ్చేసింది. (సశేషం)  

(ఫోటో - పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌, మెడలో దండలున్నాయన)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?