Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 31

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 31

సిండికేట్‌ శాస్త్రిని బలపరుస్తోందని వినగానే చాలామంది కాంగ్రెసు ఎంపీలు మొరార్జీ వైపుకి మొగ్గారు. మరి కొంతమంది యిద్దరూ కలిసి పనిచేస్తే బాగుంటుంది కదా అన్నారు. అప్పుడు కామరాజ్‌ ఎంపీలందరినీ విడివిడిగా కలిసి అభిప్రాయసేకరణ చేశారు.  నెహ్రూ అంతటి నాయకుడు మళ్లీ దొరకడు కాబట్టి ఎవరు ప్రధాని అయినా కొందరు సలహామండలి (థింక్‌ ట్యాంక్‌)లా ఏర్పడి ప్రధానికి దిశానిర్దేశం చేస్తూ వుండాలని అలాటి ఏర్పాటుకు శాస్త్రిని ఒప్పించడం సులభం కానీ మొరార్జీని ఒప్పించడం కష్టమని నచ్చచెప్పి ఫెనల్‌గా ఎక్కువమంది శాస్త్రిని బలపరిచేట్లు చేశారు. ఇది విని మొరార్జీ మండిపడ్డాడు. కామరాజ్‌ను తిట్టిపోశాడు. హోం మినిస్టర్‌గా చేరమని శాస్త్రి పంపిన ఆఫర్‌ తిరస్కరించాడు. ఏ ఆర్థికశాఖో యిస్తాడేమోననుకుంటే శాస్త్రి యింకో ఆఫర్‌ యివ్వలేదు. ఆ విషయం కామరాజ్‌కైనా చెప్పలేదు. ప్రధాని అవుతూనే శాస్త్రి సిండికేట్‌ నాయకులకు ప్రాధాన్యం యివ్వడం మానేశాడు. మంత్రుల జాబితా కామరాజ్‌కైనా చూపలేదు. జగ్‌జీవన్‌ రామ్‌ వంటి సీనియర్‌ను కాబినెట్‌లో తీసుకోవటం లేదని మాటవరసకైనా చెప్పలేదు. థింక్‌ ట్యాంక్‌లా పనిచేద్దామనుకున్న సిండికేట్‌ నాయకులు నాలిక కరుచుకోవలసి వచ్చింది. నెహ్రూ విదేశాంగ మంత్రిత్వశాఖ తన వద్దే పెట్టుకుని అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. తనూ అలాగే చేసి గుర్తింపు తెచ్చుకోవాలని శాస్త్రి భావించాడు. తన వద్దే అట్టేపెట్టుకున్నాడు. కానీ మూడోసారి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో కొద్ది నెలల్లోనే ఆ పదవిని స్వరణ్‌ సింగ్‌కు అప్పగించాడు. 

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇండో-పాక్‌ యుద్ధానంతరం జరిగిన సంధిచర్చలకు తాష్కెంట్‌ వెళ్లిన శాస్త్రి అక్కడే అర్ధరాత్రి మరణించడంతో రష్యన్లు కావాలని ఆయన్ను చంపేశారని పుకార్లు పుట్టాయి. శాస్త్రి హృద్రోగి అని ప్రధాని అయ్యేటప్పటికే రెండు సార్లు ఎటాక్‌ వచ్చిందని, అయ్యాక మూడోసారి వచ్చిందని గుర్తు పెట్టుకోవాలి. తాష్కెంట్‌లో వచ్చినది నాలుగోదన్నమాట. 1959లో మొదటి గుండెపోటు వచ్చేవరకు ఆయన తన బట్టలు తానే వుతుక్కునేవాడు. కేంద్రమంత్రి అయినా ఏ ఆడంబరమూ లేకుండా, శాకాహార భోజనాన్ని తన భార్య చేత వండించుకునే తినేవాడు. కైరోలో అలీనదేశాల సమావేశానికి వెళ్లినపుడు అక్కడ పెట్టిన భోజనం కాదని, హోటల్‌ రూములోనే తనకు కావలసిన విధంగా శాకాహార భోజనం వండించుకున్నాడు. దాంతో గదిని మళ్లీ పెయింటు చేయాల్సి వచ్చిందంటూ హిల్టన్‌ హోటల్‌ భారతప్రభుత్వానికి బిల్లు వేసింది. ఇలాటి చాదస్తపు గాంధేయవాది నెహ్రూకి నచ్చాడు కానీ ఇందిరకు నచ్చలేదు. నెహ్రూ అనారోగ్యంగా వున్నపుడు ఆయనను కలవాలంటే ఇందిర ఓ పట్టాన కలవనిచ్చేది కాదు. నాయకుడు జబ్బు పడగానే కుటుంబసభ్యుల ప్రమేయం ఎక్కువై పోతుంది. శాస్త్రి యీ విషయం మర్చిపోలేదు. తను ప్రధానిగా, ఇందిర మంత్రిగా వున్నపుడు ఇందిర ఎపాయింట్‌మెంట్‌ అడిగితే పదిరోజులైనా యిచ్చేవాడు కాడు. పైకి ఎంత సింపుల్‌గా కనబడినా రాజకీయనాయకుడు రాజకీయ నాయకుడే!

విజనరీగా నెహ్రూకున్న యిమేజి తనకు లేదని శాస్త్రికి తెలుసు. అందుకని ఆదర్శాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకోవడం కంటె తను చేతల ప్రధానిని అని చూపించదలచుకున్నాడాయన. అంతకంటె ముందు తన నెహ్రూకి వారసుడు అని ప్రజల మెదళ్లలో నాటాలని ప్రయత్నించాడు. అందుకని నెహ్రూ తన భుజం మీద చేయి ఏదో మాట్లాడుతూన్న ఫోటోను క్యాలండర్లుగా ఇన్ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చేత అచ్చొత్తించి గవర్నమెంటు ఆఫీసుల్లో పెట్టించాడు. కానీ శాస్త్రికి నెహ్రూలా సోషలిజంపై వ్యామోహం లేదు. సిండికేటు నాయకులకూ లేదు. అందుకని నెహ్రూ చనిపోయిన రెండు రోజులకు కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీలో చేసిన తీర్మానంలో సోషలిజం అనే మాట తీసేశారు. 'జాతి ఐక్యతకు, ప్రణాళికబద్ధమైన ఆర్థికాభివృద్ధికి, సామాజిక పునరేకీకరణకు, అంతర్జాతీయ శాంతికి అంకితమవుదాం' అనే రాసుకున్నారు. ఇది చాలామంది గమనించడంతో శాస్త్రి తను ప్రధాని కాగానే 'సమసమాజ స్థాపనే మన ధ్యేయం' అని ప్రకటించి వాళ్లను చల్లార్చాడు. కానీ ఆయన ఎన్నడూ సోషలిస్టు కాదు. 

నెహ్రూకు యీయనకు మరొక విషయంలో కూడా వైరుధ్యం వుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో అత్యధికశాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి వున్నారు. కానీ వ్యవసాయం కుటుంబసభ్యులందరికీ ఉపాధి కల్పించలేకపోతోంది. పైగా వ్యవసాయం వర్షాపాతంపై ఆధారపడినది కాబట్టి ఏడాదిలో చాలా నెలలు నిర్వ్యాపారంగా వుంటున్నారు. ఒక్కో ఏడాది ఏ పనీ లేకుండా వుంటున్నారు. దీన్ని సవరించాలంటే రెండు మార్గాలు. పట్టణ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు పెట్టి ప్రజల్లో కొంతమందిని కార్మికులుగా మార్చడం, ఇంకోటి భారీ యిరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టి పెద్ద ఎత్తున నీరు పొలాలకు అందించి వ్యవసాయాన్ని పెంచడం. సామాజికపరమైన మార్పు తీసుకురావడానికి కూడా పట్టణీకరణ అవసరం. గ్రామాలలో వున్నవాళ్లు కులాలవారీగా విడిపోవడం, మూఢనమ్మకాలకు బలి కావడం, పిల్లలను చదివించకపోవడం జరుగుతోంది. పట్టణాలకు వచ్చిన ప్రజల్లో యీ జాడ్యాలు తగ్గుతున్నాయి. పరిశ్రమలు రావాలంటే రాత్రికి రాత్రి రావు. విద్యుత్‌ ఉత్పాదన పెంచాలి. ఎరువుల ఫ్యాక్టరీలు పెట్టాలి. నిపుణులైన కార్మికులు కావాలంటే విద్యావకాశాలు పెంచాలి. వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు పెరగాలంటే రహదారులు నిర్మించాలి. ఇరిగేషన్‌, విద్యుత్‌ కలిసి వున్న బహుళార్థ ప్రాజెక్టులు భారీస్థాయిలో కట్టాలి. వీటన్నిటికీ పెట్టుబడి కావాలి. అందువలన రష్యా మోడల్లో పంచవర్ష ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేశాడు. 

1951-56 మధ్య నడిచిన మొదటి ప్రణాళికలో ప్రాథమిక రంగాలకు ప్రాధాన్యత యిచ్చారు. బజెట్‌లో 27% ఇరిగేషన్‌, ఎనర్జీకి, 17% వ్యవసాయం, సామాజిక అభివృద్ధికి, 24% ట్రాన్స్‌పోర్టు, కమ్యూనికేషన్స్‌కు, 8% పరిశ్రమలకు, సోషల్‌ సర్వీసెస్‌కు 17%, లాండ్‌ రిహేబిలిటేషన్‌కు 4%, సర్వీసెస్‌, యితర సెక్టార్లకు 3% కేటాయించారు. జిడిపి 2.1% పెరగాలని అంచనా వేస్తే 3.6% పెరిగింది. భాక్రా నంగల్‌,  హీరాకుడ్‌, నాగార్జున సాగర్‌ ప్రారంభమయ్యాయి. 1956లో ఐఐటిలు ప్రారంభమయ్యాయి. ఉన్నతవిద్యను ప్రోత్సహించడానికి యుజిసి ఏర్పడింది. భిలాయి, రౌర్కేలా, దుర్గాపూర్‌ వంటి చోట్ల 5 స్టీలు ప్లాంట్లకు రూపకల్పన చేసి, రెండో ప్రణాళిక (1956-61)లో పూర్తి చేశారు. రెండో ప్రణాళికలో పబ్లిక్‌ సెక్టారుకు బాగా ప్రోత్సాహం యిచ్చారు. రిసెర్చిని ప్రోత్సహించడానికి టాటా యిన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చి నెలకొల్పారు. జిడిపి 4.5% పెరుగుతుందని ఆశిస్తే 4.27% మాత్రమే పెరిగింది. మూడో ప్రణాళిక (1961-66)లో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత యిచ్చి గోధుమ ఉత్పాదన పెంచుదామనుకున్నారు. కానీ ప్రణాళిక ఆరంభంలోనే చైనాతో యుద్ధం వచ్చింది. రక్షణకు నిధులు ఖర్చు పెట్టవలసి వచ్చింది. నెహ్రూ అనారోగ్యపీడితుడయ్యాడు. ప్రణాళిక మధ్యలోనే కన్నుమూశాడు. (సశేషం)

(ఫోటో - సిండికేటు నాయకులు)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?