Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 32

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 32

భారీ ప్రాజెక్టులు ప్లాను చేసినంత యీజీ కాదు. రష్యా, చైనాలు భారీ ప్రాజెక్టులను చేపట్టినపుడు వారి వద్ద ఆహారధాన్యాల నిలువలు వున్నాయి. పొలాలను స్వాధీనం చేసుకుని తమకు కావలసిన పంటలు పండించాయి. భారతదేశానికి యీ సౌకర్యం లేకపోయింది. ఆహారధాన్యాల కొరత తీర్చడానికి అమెరికా నుండి పిఎల్‌ 480 పథకం కింద గోధుమను తక్కువ ధరకు కొంటోంది. భూసంస్కరణలు చేపట్టడానికి పార్టీ నాయకులెవరూ సిద్ధంగా లేరు. అందువలన నిధుల కొరత పెద్ద అవరోధంగా నిలిచింది. దానికి సాంకేతిక నిపుణుల కొరత తోడై, ప్రాజెక్టులు అనుకున్నదాని కంటె జాప్యమై అంచనాలను తారుమారు చేశాయి. శాస్త్రి తన తొలి కాబినెట్‌ సమావేశంలోనే ''నేను చిన్నవాణ్ని,  ఖఱ్చు తక్కువయ్యే చిన్న ప్రాజెక్టుల మీదే నమ్మకం. అలా అయితే మనకు ఫలితాలు త్వరితంగా వస్తాయి'' అన్నాడు. ముఖ్యమంత్రులు లేఖ రాసి పెండింగులో వున్న ప్రాజెక్టులు, ఆలస్యానికి కారణాలు తెలపమన్నాడు. ఉత్పత్తి పెంచాలని, పబ్లిక్‌ సెక్టార్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ కూడా ఉత్పత్తి చేపట్టడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పాడు. 

ఇవన్నీ చెప్పడం సులభమే తప్ప అమలు కావడం కష్టం. 1961-64 మధ్య ధరలు 49% పెరిగాయి. 1965లో కరువు వచ్చి దిగుబడి బాగా తగ్గిపోయింది. 1964-66 మధ్య ఆహారోత్పత్తి 20% తగ్గింది. సామాన్య ప్రజలకు ఆహారధాన్యాల కొరత భరించశక్యం కావటం లేదు. మన ప్రాధాన్యతను పరిశ్రమల నుంచి వ్యవసాయానికి మరలించాలి అన్నారు శాస్త్రి. గతంలో  ఏ రంగానికి ఎప్పుడు ఎంత ప్రాధాన్యత యివ్వాలి అనే విషయాన్ని ప్లానింగ్‌ కమిషన్‌ నిర్ణయించేది. అది సోషలిస్టు మేధావులతో నిండివుందని శాస్త్రి భావం. అందువలన దాన్ని నిర్వీర్యం చేయసాగాడు. దాని సభ్యుల నియామకానికి కాలపరిమితి విధించాడు. ముఖ్యమంత్రుల సలహా మండలి అయిన నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ను ఐదు కమిటీలుగా విడగొట్టి ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత (వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌, సోషల్‌ సర్వీసెస్‌, పర్వతప్రాంతాల అభివృద్ధి) అప్పగించి ఆ యా రంగాలపై సలహాలు, సాధించిన ప్రగతిపై సమీక్ష బాధ్యత వహించమన్నాడు. ఆ విధంగా ప్లానింగ్‌ కమిషన్‌ పని తగ్గించివేశాడు.  

భవిష్యత్తు మాట ఎలా వున్నా అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించవలసిన పని పడింది. ప్రధానంగా వ్యవసాయ ప్రాంతాలైన కొన్ని రాష్ట్రాలలో మిగులు ఆహారధాన్యాలున్నాయి. బెంగాల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి పారిశ్రామిక రాష్ట్రాలు కొరత ఎదుర్కుంటున్నాయి. మిగులు రాష్ట్రాలనుండి గోధుమ సేకరించి తమకు యివ్వాలని యీ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కానీ మిగులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి యిష్టపడలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాలలోని పెద్ద రైతులు, దళారులు, వ్యాపారస్తులు ధాన్యాన్ని నిలవచేసి, ధరలు పెంచి లాభపడుతున్నారు. కాంగ్రెసు పార్టీకి నిధులిచ్చి ఆదుకుంటున్నారు. మిగులు ధాన్యాన్ని కేంద్రానికి అప్పగిస్తే వాళ్లకు దెబ్బ. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని ప్లానింగ్‌ కమిషన్‌ను అడిగాడు శాస్త్రి. కేంద్రం ఆహారధాన్యాలను సేకరించి, ధరలను అదుపు చేసి, రేషనింగ్‌ ద్వారా ప్రజలందరికీ ఒక మేరకు అందించాలని సూచించింది. అయితే వ్యాపారస్తుల పక్షాన నిలిచిన ఆహారమంత్రి సుబ్రహ్మణ్యం దాన్ని వ్యతిరేకించాడు. ధరలను మార్కెటు మెకానిజంకే వదిలేయాలని, అమెరికా నుండి మరింత గోధుమను దిగుమతి చేసుకోవాలని, ఎక్కువ దిగుబడి యిచ్చే పంటలు వేయడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించాడు. సుబ్రహ్మణ్యం ఆలోచనే శాస్త్రి ఆలోచన కూడా. కానీ దాన్ని అమలు చేస్తే నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా వెళుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని భయపడి తనకు నమ్మకస్తుడైన ఝా అనే ఐసియస్‌ అధికారి అధ్యక్షతన ఒక కమిటీ వేశాడు. 

సుబ్రహ్మణ్యం సూచనలనే ఝా ఆమోదిస్తూ, బొత్తిగా ఏకపక్షంగా కనబడకూడదన్న ఉద్దేశంతో 'కొన్ని ఎంపిక చేసిన ఆహారధాన్యాల విషయంలో కేంద్రమే సేకరణ చేపట్టాలని, కానీ అది యిప్పుడిప్పుడే కాదనీ, ఎప్పుడో భవిష్యత్తులో చేయాలనీ' చేర్చాడు. కమిటీ రిపోర్టును శాస్త్రి ఆమోదించడమే కాకుండా ముఖ్యమంత్రులకు ''తమ నిలవలను డిక్లేర్‌ చేయడానికి ముందుకు వస్తున్న ఆహారధాన్యాల వ్యాపారులపై మీరు జరిమానాలు వేయకండి'' అని లేఖ రాశాడు. దాని అర్థం వారిని చూసీ చూడనట్లు వదిలేయమనే! అంతే బ్లాక్‌మార్కెటింగు పెరిగిపోయింది. ప్రజలు విలవిలలాడారు. ఇక దిగుమతి  విషయానికి వస్తే అమెరికాకు ఆప్తుడైన రైల్వే మంత్రి ఎస్‌కె పాటిల్‌ను పంపి 5 ఏళ్ల కాలంలో అదనంగా 2 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు యివ్వాలని కోరాడు. అప్పటివరకు విదేశీ పెట్టుబడుల అంశంపై నెహ్రూ విధానాలతో అసంతృప్తి చెందివున్న అమెరికాకు శాస్త్రి విధానాలు నచ్చాయి. 

''పరిశ్రమలకు కావలసిన పెట్టుబడులు మన దేశస్తులే పెట్టాలి. అయితే మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి విదేశీ సహాయం తప్పనిసరి. అది ఋణాల రూపంలో వుండాలి తప్ప, మన వనరుల్లో వాటాగా వుండకూడదు. మనం పెట్టుబడి పెట్టకుండా ఆ రిస్కుని, ఆ భారాన్ని విదేశీయులకు అప్పగించి మనం కాళ్లు చాపుకుకూర్చుంటే, పందెంలో వెనకపడిపోయినట్లే.'' అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ తన భావాలను చాటాడు. విదేశీ పెట్టుబడులు అనుమతించినా మౌలిక రంగాల్లో అస్సలు అనుమతించకూడదని, అనుమతించినా ఒక పరిమితి మించనీయకుండా భారతదేశపు వాటాయే ఎక్కువ వుండాలని నెహ్రూ ఆలోచన. విదేశీ పెట్టుబడుదారుల చేతిలో మౌలిక వసతులు యిరుక్కుంటే వారు ముడిసరుకు ఆపివేసో, ఉత్పాదన తగ్గించో, ధరలు పెంచివేసో దేశాన్ని దెబ్బ తీయగలరు. బొకారో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి అమెరికా ముందుకు వచ్చింది కానీ భాగస్వామ్యం విషయంలో మాట కుదరలేదు. అప్పుడు రష్యా వచ్చి దాని బాధ్యత తీసుకుంది. నెహ్రూ హయాంలోనే ఒకసారి 40 మంది అమెరికన్‌ వాణిజ్యవేత్తల బృందం వచ్చి ఏ యే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలో సంప్రదింపులు జరిపింది. సిమెంటు కూడా వుండాలని వాళ్లు అడిగినా, జాబితాలోంచి దాన్ని నెహ్రూ తీయించివేశాడు. కానీ శాస్త్రికి యీ పట్టింపులు లేవు. విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే త్వరగా అభివృద్ధి సాధిస్తామని, మౌలిక రంగమా కాదా, నిష్పత్తి ఎలా వుండాలి అనేదాని గురించి మరీ చింతించనక్కరలేదని ఆయన అభిప్రాయం. అది అమెరికాకు నచ్చింది కాబట్టి పాటిల్‌ ద్వారా పంపిన అభ్యర్థనను మన్నించింది. (సశేషం) (ఫోటో - రాధాకృష్ణన్‌, నెహ్రూ, శాస్త్రి)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?