Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 37

1967 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘోరంగా దెబ్బ తింది. 520 స్థానాలున్న పార్లమెంటులో గతంలో కంటె 83 తక్కువగా 281 సీట్లు వచ్చాయి. అంటే సాధారణ మెజారిటీ కంటె 21 ఎక్కువ. దేశం మొత్తం మీద వున్న 3483 అసెంబ్లీ సీట్లలో సగం కంటె తక్కువ 1688 గెలిచింది.  ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌ మొత్తం 8 రాష్ట్రాలలో అధికారం పోయింది. వాటితో పాటు ఢిల్లీ, మణిపూర్‌లలో కూడా! కామరాజ్‌, సుబ్రహ్మణ్యం, ఎస్‌కె పాటిల్‌, అతుల్య ఘోష్‌ వంటి హేమాహేమీలు ఓడిపోయారు. పార్టీ తరఫున నిలబడవలసిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇందిరకు స్వేచ్ఛ లేదు. అదంతా కామరాజ్‌, సిండికేటు నాయకులే చూసుకున్నారు. కానీ ఓటమి తర్వాత నింద మాత్రం ఇందిర నాయకత్వంపై వేశారు. ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. ఇందిర, మొరార్జీ పోటీ పడ్డారు. గతంలో మొరార్జీకి అడ్డుపడిన కామరాజ్‌, సిండికేట్‌ నాయకులు యీసారి మొరార్జీ పక్షాన నిలబడ్డారు. కానీ నెగ్గిన ఎంపీలలో ఎక్కువమంది, చవాన్‌ ఇందిర పక్షాన నిలిచారు. పోటీ అనివార్యం అని తేలగానే నాయకులు భయపడ్డారు. అసలే అంతంత మాత్రంగా మెజారిటీ వున్న పార్టీ నిలువునా చీలుతుందని బెదిరి, సిబి గుప్తా, డిపి మిశ్రా రాజీకై ప్రయత్నాలు చేశారు. ఇందిరకు ఎక్కువమంది మద్దతు వుందని గ్రహించిన మొరార్జీ కాస్త తగ్గి, తనకు ఉపప్రధాని పదవి, హోం శాఖ యివ్వాలని అడిగాడు. ఇందిర ఉపప్రధాని పదవి ఓకే కానీ, ఆర్థిక శాఖ యిస్తానంది. అలా అయితే తమ సభ్యుడైన సంజీవరెడ్డిని లోకసభ స్పీకరు చేయాలని సిండికేటు అడిగింది. ఇందిర సరేనంది.  ఇందిర రెండోసారి ప్రధాని అయింది.

ఎన్నికలలో పోగొట్టుకున్న అధికారాన్ని అడ్డదారిలో దక్కించుకోవాలని కాంగ్రెసు ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్సహించింది. కొంతకాలం పోయాక ప్రతిపక్షాలు కాంగ్రెసు నుండి లాక్కోసాగారు. దాంతో కాంగ్రెసు ఉలిక్కిపడింది. 1967 చివరి నాటికి దేశంలోని శాసనసభ్యుల్లో 9% మంది పార్టీ ఫిరాయించారు. ఉన్నవాళ్లు జారిపోకుండా కాంగ్రెసు రాజ్యాంగంలోని 32 వ సవరణ ద్వారా పార్టీ విప్‌ను ధిక్కరించిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ సభ్యత్వం కోల్పోతాడని చట్టం చేసింది. దీనితో బాటు గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలకు ఛాన్సు లేకుండా చేసింది. శాస్త్రి హయాంలో కూడా కేరళలో కమ్యూనిస్టులకు అత్యధిక స్థానాలు వచ్చినా మెజారిటీ లేదన్న కారణంగా గవర్నరు వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించమని ఆహ్వానించలేదు. ఇందిర హయాంలో కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా రద్దు చేయించింది. కమ్యూనిస్టులు బలంగా వున్న బెంగాల్‌ ప్రభుత్వాన్ని కూల్చినట్లే, భూస్వాముల అండ వున్న హరియాణా ప్రభుత్వాన్నీ కూల్చింది. 

ఇక ఆర్థికపరమైన అంశాలకు వస్తే ద్రవ్యోల్బణం 10% పెరిగింది. అనేక వస్తువుల ధరలు 20% పెరిగాయి. ఆహారధాన్యాల దిగుబడి తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. రూపాయి విలువ తగ్గించినందువలన దిగుమతులు మరింత ఖరీదయ్యాయి.  ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఇందిర అసమర్థురాలని అందరూ అనసాగారు. పార్టీలో ఆమె మాట లక్ష్యపెట్టేవారు లేకపోయారు. ఇదంతా ఆమెను చికాకు పెట్టింది. తప్పులు చేస్తున్నది పార్టీ సీనియర్లు, నింద మోస్తున్నది తను. పార్టీ పెద్దలు తనను యింకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ పరిస్థితి మార్చడానికి నిశ్చయించుకుందామె. తనకంటూ ఒక వర్గం ఏర్పడాలని గట్టిగా ప్రయత్నించింది. పార్టీ తన చేతిలో లేకపోయినా ప్రజలు తన పక్షాన వుంటే చాలనుకుంది. వారిలో తన పరపతి పెరిగేందుకు ఎటువంటి విధానాలు అవలంబించాలో చెప్పేందుకు సలహామండలి ఉండాలనుకుంది. ఆ వెతుకులాటలో ఆమెకు తారసిల్లినది - పిఎన్‌ హస్కర్‌ అనే సివిల్‌ సర్వీసెస్‌ అధికారి. బ్రిటన్‌లో డిప్యూటీ హై కమీషనర్‌గా పనిచేసిన హస్కర్‌ కశ్మీరీ పండిత కుటుంబానికి చెందినవాడు. వామపక్షభావాలు కల మేధావి. శాస్త్రి హయాం నుండి ప్రధాని కార్యాలయంలో వున్న ఎల్‌కె ఝా స్థానంలో ఇందిర హస్కర్‌ను నియమించుకుంది . ఇందిర పాలన మెరుగుపడడానికి, ప్రజాహిత కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకోవడానికి ప్రణాళికలు రచించినది హస్కరే. రాజకీయపరంగా ఇందిర బలపడడానికి కూడా పథకాలు రచించినది అతనే. ప్రతిపక్ష నాయకులతో బాటు, సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న నాయకులపై నిఘా వేయడానికి తన కింద పనిచేసే గూఢచారి సంస్థ వుండాలని అతను సూచించాడు. 

చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో ముందస్తు సమాచారం సేకరణలో ఇంటెలిజెన్సు బ్యూరో (ఐబి) పూర్తి సామర్థ్యంతో పనిచేయలేక పోయింది కాబట్టి విదేశీ ప్రభుత్వాలపై గూఢచర్యం నెరపడానికి రిసెర్చి అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (రా) అనే ప్రత్యేక గూఢచారి సంస్థ ప్రధాని  కార్యాలయ పర్యవేక్షణలో నడవాలని ప్రతిపాదించారు. ఆర్‌ ఎన్‌ కావు అనే మరో కశ్మీరీ పండిత కుటుంబానికి చెందిన ఐబి అధికారికి ఆ బాధ్యత అప్పగించారు. అత్యంత సమర్థుడు, ఇందిరకు విశ్వాసపాత్రుడు అయిన కావు నేతృత్వంలో రా విదేశీ గూఢచర్యంతో బాటు కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న మంత్రులందరిపై రహస్య ఫైళ్లు (డొసైయిర్‌) మేన్‌టేన్‌ చేసేది. దీనితో బాటు ఐబిలోని ఒక విభాగాన్ని ఇందిర హోం శాఖ నుండి తొలగించి తన కార్యాలయం అజమాయిషీలోకి తెచ్చుకుంది. చవాన్‌కి యిది నచ్చకపోయినా సహించవలసి వచ్చింది. 

రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పదవీకాలం ముగిసిపోతోంది కాబట్టి ఆయన స్థానంలో ఉపరాష్ట్రపతిగా వున్న డా|| జాకీర్‌ హుస్సేన్‌ను  రాష్ట్రపతిని చేద్దామని ఇందిర అనుకుంది. కానీ కామరాజ్‌కు అది యిష్టంలేదు. ''ఒక ముస్లిముకు అంత ఉన్నత స్థానం యివ్వడానికి సమయం యింకా రాలేదు. దేశప్రజలకు యిది రుచించదనే భయంతో పార్టీలో చాలామంది ఎదురుతిరుగుతారు. అధ్యక్ష ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థి ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుంది.'' అని కామరాజ్‌ వాదించాడు. ఇలా అడ్డు తగలడం ఇందిరకు నచ్చలేదు. సుబ్రహ్మణ్యంను ప్లానింగ్‌ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్‌గా వేస్తానన్నప్పుడూ 'అతను ఎన్నికలలో ఓడిపోయాడు కాబట్టి ఆ పదవికి తగడు' అని కామరాజ్‌ అడ్డుపడ్డాడు. కామరాజ్‌ తనకు వ్యతిరేకంగా పార్టీలో పదిమంది దగ్గరా మాట్లాడుతున్న సంగతి కావు ద్వారా అప్పటికే ఆమెకు తెలిసింది. జాకీర్‌ హుస్సేన్‌ను కాంగ్రెసు అభ్యర్థిగా నిలబెట్టి తీరాలని పట్టుబట్టి సాధించింది. ప్రతిపక్షాలు తమ తరఫున తెలుగువాడైన కోకా సుబ్బారావును నిలబెట్టారు. ఆయన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసేవారు. కామరాజ్‌ భయపెట్టినట్లుగా కాంగ్రెసులో భిన్నస్వరాలు ఏమీ వినబడలేదు. జాకీర్‌ హుస్సేన్‌ నెగ్గారు. మరో తెలుగువాడైన వివి గిరి ఉపరాష్ట్రపతి అయ్యారు. 

1967 డిసెంబరులో కాంగ్రెసు అధ్యక్షుడిగా కామరాజ్‌ పదవీకాలం ముగియగానే ఇందిర ధేబర్‌ను మళ్లీ తెద్దామనుకుంది. సిండికేటును దెబ్బ తీయడానికే ఇందిర తనను వుండమంటోందని గ్రహించిన ధేబర్‌ నిరాకరించాడు. అప్పుడు నందాను నిలబెడదామనుకుంది. సిండికేటు పక్షాన ఎస్‌ పాటిల్‌ తను నిలబడతానని ప్రకటించాడు. అతనిపై నందా గెలవలేడన్న అనుమానం తగిలి ఇందిర, కామరాజ్‌తో సమావేశమై చర్చలు జరిపింది. నందాకు ప్రత్యామ్నాయంగా రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా వున్న మోహన్‌ లాల్‌ సుఖాడియా, దామోదరం సంజీవయ్య ల పేర్లు సూచించింది. కామరాజ్‌ ఒప్పుకోలేదు. చివరికి రాజీ అభ్యర్థిగా అప్పటి మైసూరు ముఖ్యమంత్రి నిజలింగప్ప పేరు ఖరారైంది. అధ్యక్షుడిగా నిజలింగప్ప రాకతో మొరార్జీ బలపడినట్లయింది. వాళ్లు రోజూ కలుస్తూ ఇందిర బలాన్ని ఎలా తగ్గించాలా అని చర్చించేవారు. సిద్ధాంతపరంగా ఆమెతో తలపడడానికి వారికి దొరికిన ఆయుధం - పబ్లిక్‌ సెక్టార్‌ రంగం! (సశేషం) (ఫోటో - డా|| జాకీర్‌ హుస్సేన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?