Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 41

ఆ బలం చూసుకుని ఇందిర వివి గిరి గారిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబడమంది. గిరి యిప్పటి ఒడిశాలో పుట్టి పెరిగిన తెలుగాయన. కాంగ్రెసు పార్టీ సభ్యుడు. స్వాతంత్య్రసంగ్రామ వీరుడు. కార్మికనాయకుడు. ప్రకాశం గారి కాబినెట్‌లో, నెహ్రూ కాబినెట్‌లో కార్మిక మంత్రిగా పనిచేశారు. మూడు రాష్ట్రాలకు గవర్నరుగా వున్నారు. సోషలిస్టు భావాలు కలవాడు. మచ్చలేని వ్యక్తిత్వం కలవాడు. ఉప రాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందినవాడు. ఆయనపై సోషలిస్టులకు, కమ్యూనిస్టులకు గౌరవం వుంది. ఆయన నామినేషన్‌ వేయగానే  వారితో బాటు డిఎంకె, ముస్లిం లీగ్‌, అకాలీ దళ్‌లో కొందరు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల వారికి కూడా ఆయనపై వ్యతిరేకత లేదు. స్వతంత్ర, జనసంఘ్‌ పార్టీలు సిడి దేశ్‌ముఖ్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టారు. మహారాష్ట్రకు చెందిన దేశ్‌ముఖ్‌ గొప్ప ఆర్థికవేత్త. సచ్ఛీలుడు. ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు తెలుగు మహిళ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ భర్త. గిరిని తను నిలబెట్టినట్లు ఇందిర ఎక్కడా ప్రకటించుకోలేదు. కాంగ్రెసు పార్టీ సభ్యురాలిగా ఆమె సంజీవరెడ్డిని బలపరుస్తున్నట్లే లెక్క. కానీ గిరి నామినేషన్‌ వేయగానే ఆమె అనుచరుల్లో కొందరు ఆయన వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. అర్జున్‌ అరోడా అనే యంగ్‌ టర్క్‌ తను గిరికి ఓటేస్తానని బాహాటంగా ప్రకటించాడు. మరి కొందరూ మేమూనూ.. అన్నారు. ఇదంతా ఇందిరే చేయిస్తోందని గ్రహించిన సిండికేటు సంజీవరెడ్డి నామినేషన్‌పై ఇందిరను సంతకం చేయమన్నారు. పళ్లు నూరుకున్నా వాళ్లు చెప్పినట్టు చేయక తప్పలేదు ఇందిరకు. కానీ సంజీవరెడ్డికి ఓట్లేయమని విజ్ఞప్తి జారీ చేయమంటే మాత్రం చేయనంది. 

ఈ దశలో నిజలింగప్ప ఒక పెద్ద పొరపాటు చేశాడు. సంజీవ రెడ్డికి మద్దతు యివ్వండని కోరుతూ రైటిస్టు పార్టీలైన జనసంఘ్‌, స్వతంత్ర పార్టీ సభ్యులను కోరడానికి వాళ్ల దగ్గరకు వెళ్లాడు. దానిపై ఇందిర తన అనుచరుల చేత రచ్చ చేయించింది. నిజానికి అలా వెళతానని నిజలింగప్ప  కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సమావేశంలో చెప్పాడు. ఇందిర ఆ సమావేశంలో వుంది, కానీ ఆమె మాట అక్కడ చెల్లదు, అందుకే మౌనంగా వుంది. పైగా నిజలింగప్ప చేత తప్పు చేయిస్తేనే ఆమెకు లాభం. 'మన ప్రభుత్వపు సోషలిస్టు విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీల వద్దకు, మతతత్వ పార్టీల వద్దకు పార్టీ అధ్యక్షుడి హోదాలో మీరు అలా వెళ్లడం తప్పు' అని జగ్‌జీవన్‌ రామ్‌, ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ల చేత నిజలింగప్పకు లేఖ రాయించింది. సిండికేటుకు అనుమానం వచ్చేసింది - చూడబోతే కాంగ్రెసు పార్టీ సభ్యులందరూ సంజీవరెడ్డికి ఓట్లేసే పరిస్థితి లేదని! వేయనివాళ్లపై క్రమశిక్షణా రాహిత్యం పేర చర్య తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రకటన చేసింది. దానికి ప్రతిగా ఇందిర 'అంతరాత్మ ప్రబోధం' ప్రకారం ఓటేయమంటూ పిలుపు నిచ్చింది.  ఈ 'అంతరాత్మ ప్రబోధం' అనేది అప్పణ్నుంచి ఒక జోక్‌ అయిపోయింది. పార్టీ ఫిరాయించేవాళ్లు, విప్‌ ఎదిరించేవాళ్లు అందరూ యీ మాట తరచుగా వాడేయసాగారు. 

గిరి, సంజీవరెడ్డిల మధ్య పోటీ హోరాహోరీ సాగింది. అంతకు ముందు లోకసభ స్పీకరు స్థానానికి అధికార పార్టీ తరఫున తను,  ప్రతిపక్షాల అభ్యర్థిగా తెన్నేటి విశ్వనాథంల మధ్య పోటీ జరిగితే సాటి తెలుగువాడిపై గెలిచిన సంజీవరెడ్డి యీసారి మరో తెలుగువాడు గిరి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెసు ఎంపీలలో 62% మంది, ఎమ్మేల్యేలలో 75% మంది తనకే ఓటేసినా, 4,05,527 ఓట్లు తెచ్చుకున్నా కేవలం 14,450 ఓట్ల తేడాతో ఓటమి రుచి చూడవలసి వచ్చింది. దీనికి కారణం దేశ్‌ముఖ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతిపక్షాల ఎంపీలలో కొందరు తమ రెండో ప్రాధాన్యత ఓటును గిరికి వేశారు. సెకండ్‌ ప్రిఫరెన్సు ఓట్లు లెక్కించేవరకు గెలుపెవరిదో తెలియరాలేదు. గిరి - ఒకలా ఇందిర - విజయానికి కారణం చవాన్‌ ఆమె వైపు మొగ్గడం. నిజానికి చవాన్‌, సిండికేటు ఒక ఒప్పందానికి వచ్చారు.  దాని ప్రకారం 'సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగానే, కాంగ్రెసు పార్టీ ఇందిరను పార్టీలోంచి బహిష్కరిస్తుంది, సంజీవరెడ్డి ఇందిర ప్రభుత్వాన్ని రద్దు చేసేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మొరార్జీకి యిస్తాడు. మొరార్జీ ప్రధానిగా, చవాన్‌ ఉపప్రధానిగా పదవులు అలంకరిస్తారు. 1972 వరకు ప్రధానిగా వున్నాక మొరార్జీ తను దిగిపోయి, చవాన్‌ను ప్రధాని చేస్తాడు.' కానీ యిది కుదరలేదు. ఎందుకంటే 1972 తర్వాత కూడా తనే ప్రధానిగా వుంటానని మొరార్జీ మొండికేశాడు. నంబర్‌ టూ పొజిషన్‌లోనే వుండేమాటయితే మొరార్జీ వంటి తిక్కమనిషితో కంటె ఇందిర వంటి లౌక్యురాలితో పనిచేయడం సులభం అనుకున్నాడు చవాన్‌. అందువలన సిండికేటుతో ఒప్పందం రద్దు చేసుకుని ఇందిరవైపు నిలిచాడు. లేకపోతే సంజీవరెడ్డి గెలిచేవాడు. 

ఆగస్టు 20న యీ ఫలితం రాగానే సిండికేటు దిమ్మ తిరిగిపోయింది. పార్టీలో మూడింట రెండు వంతుల మంది తమ పక్షానే వున్నా, కావాలనుకుంటే ఇందిర బయటివారి మద్దతుతో తమను ఓడించగలదని అర్థమైంది. ఇలా అయితే పార్టీ నాశనమై పోతుందని అందరూ అనుకున్నారు. రాజీ ప్రయత్నాలు సాగాయి. ఐక్యతా తీర్మానం ఒకటి చేసి, పార్టీ కార్యకర్తలందరినీ ఒకే తాటి మీద నిలబడాలని చెప్పాలనుకున్నారు. 'సిద్ధాంతవైరుధ్యం వలన జరిగిన ఘర్షణలో అన్ని పక్షాలవారూ పొరపాట్లు చేశారు, అవి విస్మరించి ముందుకు సాగుదాం' అని తీర్మానం రూపొందించారు. 'సిద్ధాంతవైరుధ్యం' అనడం వలన తాము రైటిస్టులమనే అర్థం స్ఫురిస్తోందని నిజలింగప్ప మథన పడినా, తను రైటిస్టు పార్టీల వద్దకు వెళ్లిన వివాదం సద్దుమణిగినందుకు ఆనందపడ్డాడు. ఈ ప్రకటన చేసి సిండికేటు హమ్మయ్య అనుకుంది కానీ ఇందిర అనుకోలేదు. పార్టీలో తన బలం పెంచుకోవాల్సిన అవసరం వుందని గ్రహించి, ఎంపీలను వ్యక్తిగతంగా పిలిపించి మంచీచెడ్డా మాట్లాడసాగింది. తనను బహిరంగంగా వ్యతిరేకించేవారిని పక్కన పెట్టి, తటపటాయించే తటస్థులను మచ్చిక చేసుకోసాగింది. దీనికి ప్రతిగా సిండికేటు 'ఆమె కమ్యూనిస్టు, ఆమెతో మంతనాలేమిటి?' అంటూ ఆ ఎంపీలను మందలించసాగింది. దీనికి సమాధానంగా 'కేరళలో, బెంగాల్‌లో కమ్యూనిస్టులకు బలం చేకూర్చినది వారా? నేనా? కేరళలో శంకర్‌, బెంగాల్‌లో అతుల్య ఘోష్‌ చేసినదేమిటి? తమ మాట వినలేదన్న కారణంగా మంచిమంచి నాయకులను పార్టీలోంచి తరిమేసి, వారు ప్రాంతీయ పార్టీలు పెట్టి కమ్యూనిస్టులతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు' అనేది ఇందిర. సిండికేటు నాయకులందరూ ఎత్తుపైయెత్తులకు, జిత్తులకు పేరుబడినవారు కాబట్టి ఎంపీలకు ఇందిర మాటలు సబబుగా తోచాయి.

ఇరువర్గాల మధ్య రాజీ తాత్కాలికమే అయింది. ఇందిరకు ముకుతాడు వేసి అంకెకు తెచ్చేందుకు సిండికేటు నడుం బిగించింది. అక్టోబరు 28 న నిజలింగప్ప ఇందిరకు బహిరంగ లేఖ రాశాడు - 'కాంగ్రెసులో ఎప్పటినుంచో వున్న ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసేటట్లు మీరు వ్యక్తిపూజను ప్రోత్సహిస్తున్నారు. మీరు చెప్పిన మాట వింటేనే దేశభక్తి, పార్టీ విధేయత కలిగివున్నట్లు చిత్రీకరిస్తున్నారు' అని. (రాబోయే రోజుల్లో యిది అక్షరాలా నిజమైంది) ఆ తర్వాత వర్కింగ్‌ కమిటీని తమ చేతిలో తెచ్చుకోవాలనుకున్నాడు. కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీలో 21 మంది సభ్యులుంటే 12 మంది సిండికేటు పక్షాన, 9 మంది ఇందిర పక్షాన వున్నారు. ఇందిర మద్దతుదారుల సంఖ్య తగ్గించాలనుకుని ఫకృద్దీన్‌, సి సుబ్రహ్మణ్యంలపై దృష్టి సారించారు. ఫకృద్దీన్‌ పూర్తి సభ్యుడు కాడు, సభ్యుడిగా కో-ఆప్ట్‌ చేయబడ్డాడు. సులభంగా తీసేశారు. సుబ్రహ్మణ్యం తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షుడిగా వుండే రోజుల్లో ఆ హోదాలో సభ్యుడయ్యాడు. ఇప్పుడు అక్కడ ఆ పదవి పోయింది కాబట్టి యిదీ పోయిందన్నారు. ఈ నిర్ణయాలను ప్రతిఘటించడానికి ఇందిర నవంబరు 1 న జంతర్‌మంతర్‌లో ఏర్పాటు చేసిన వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని బహిష్కరించడమే కాక అదే రోజు తన యింట్లో తొమ్మిదిమంది మద్దతుదారులతో వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. అంతేకాదు, యింకో వారం పోయాక 'కాంగ్రెసు కార్యకర్తలకు బహిరంగ లేఖ' అంటూ విడుదల చేసి దానిలో - 'ఇది వ్యక్తుల మధ్య కలహం కాదు, అధికారం కోసం ఆరాటం కాదు, పార్టీలోని పార్లమెంటరీ విభాగానికి, సంస్థాగత విభాగానికి మధ్య పేచీ కాదు. రెండు దృక్పథాల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటమిది. ఒక వర్గం మార్పుకు, సోషలిజానికి, అంతర్గత ప్రజాస్వామ్యానికి కట్టుబడగా, మరో వర్గం యథాతథ స్థితికి, పిడివాదానికి, పార్టీలో నియంతృత్వానికి ప్రతీకగా నిలబడుతోంది. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవలసినది మీరే.' అని రాసింది.

'ఇది క్రమశిక్షణా రాహిత్యం, చర్య అనివార్యం' అనుకున్నారు సిండికేటు నాయకులు. నవంబరు 12 న ఇందిర పరోక్షంలోనే ఆమెపై విచారణ సాగింది. అనేక ఆరోపణలతో బాటు ఆమె హక్సర్‌ ద్వారా దేశాన్ని రష్యాకు అమ్మేస్తోందన్న ఆరోపణ కూడా చేశారు. ఇందిరను పార్టీలోంచి తీసేయాల్సిందే అనుకుని రాష్ట్రాలలోని కాంగ్రెసు ముఖ్యమంత్రులతో చెపితే 'వద్దు ఆమెకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది' అని కొందరు వారించారు. కానీ సిండికేటు నాయకులు అది వినలేదు, ఇందిరకు బుద్ధి చెప్పాల్సిందే అనుకున్నారు. 1969 నవంబరు 12 న ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు, ఆమె స్థానంలో మరొకరిని ఎన్నుకోండి అని కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు. (సశేషం)  ఫోటో - వివి గిరి

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?