Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 45

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 45

జవాబులు - 1971లో కాంగ్రెసు (ఆర్‌)కు ఆవు-దూడ గుర్తు కేటాయించి, పాత కాంగ్రెసుకి పాత గుర్తు యిచ్చారని నేను రాసినది తప్పని చరఖా వడికే స్త్రీ గుర్తు యిచ్చారని ఒక పాఠకుడు ఎత్తిచూపారు. ధన్యవాదాలు. 

తన గరీబీ హటావో నినాదానికి అనువుగా ఇందిర కొన్ని చర్యలను చేపట్టింది. తన కాబినెట్‌లో మాజీ కమ్యూనిస్టులు అనేకమందిని తెచ్చింది. కుమారమంగళం, ఎఆర్‌ గణేశన్‌, ఆర్‌కె ఖాదీకర్‌, నందినీ శతపథి, రఘునాధరెడ్డి వీళ్లంతా వామపంథీయులే. పల్లెల్లో నిరుద్యోగం బాపడానికి రూ.50 కోట్లతో స్కీము ప్రకటించింది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉపాధికల్పనకు మరో రూ. 50 కోట్ల స్కీము. కార్మికుల బోనస్‌ను 4% నుండి 8.33%కి పెంచింది. భూపరిమితిని తగ్గించింది. పల్లపుభూమికి 10-18 ఎకరాలు, మెట్టభూమికి 54 ఎకరాలు అంది. స్వదేశీ, విదేశీ  జనరల్‌ ఇన్సూరెన్సు కంపెనీలు మొత్తం 106 టిని 1971 మేలో జాతీయం చేసింది. వాటి ఎసెట్స్‌ రూ. 240 కోట్లు. దీనితో బాటు  214 బొగ్గు గనులను, 12 కోక్‌-అవన్‌ ప్లాంట్లను జాతీయం చేసింది. పరిశ్రమలు చక్కగా నడవాలంటే కార్మికనాయకులు చేపడుతున్న సమ్మెలు, ఘొరావుల్లాటివి నిరోధించవలసిన అవసరం వుందని,  ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ అమలులో వుండేట్లు చూస్తే దాన్ని ఉపయోగించి గొడవ జరగడానికి ముందే నాయకులను అదుపులో తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరేవారు. కానీ కమ్యూనిస్టులపై ఆధారపడినంతకాలం ఆ చట్టాన్ని మళ్లీ తేవడానికి ఇందిర జంకింది. ఇప్పుడా అవసరం లేదు కాబట్టి 1971 మేలో ఒక ఆర్డినెన్సు ద్వారా మళ్లీ ఆ చట్టాన్ని తెచ్చింది. మరో వారం పోయాక మీసా (మేన్‌టెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ ఏక్ట్‌) తెచ్చింది. 

ఇక న్యాయవ్యవస్థ పని పట్టడం కూడా ప్రారంభమైంది. రాజభరణాల రద్దు విషయంలో రాజభరణాలు మాజీ రాజుల ఆస్తి అని, ఆస్తి కలిగి వుండడం పౌరుడి ప్రాథమిక హక్కు అని కోర్టు తీర్పు యిచ్చింది. ఆ హక్కు యిస్తున్న ఆర్టికల్‌కు సవరణ చేయడానికి ఇందిర పూనుకుంది. దాన్ని 25 వ రాజ్యాంగ సవరణ అన్నారు. దాని ప్రకారం సంపద ఒకేచోట పోగుపడిపోకుండా అందరికీ పంచే ప్రయత్నంలో పార్లమెంటు ఆస్తి హక్కుకు భంగం వాటిల్లే చట్టం చేసినా కోర్టు జోక్యం చేసుకోలేదు. ఇది చాలా విమర్శలపాలైంది. కానీ ఇందిర ముందుకు వెళ్లింది. ఆ తర్వాత 26 వ సవరణ ద్వారా రాజభరణాల రద్దు పూర్తి చేసింది. అనేక నిర్ణయాలు ధైర్యంగా చేపట్టింది. హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, మణిపూర్‌లకు విడి రాష్ట్రాలుగా ప్రకటించింది. విడి రాష్ట్రంగా ఏర్పడతామన్న తెలంగాణ ప్రజా సమితి కోరిక నిరాకరించి, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి హెచ్చు అధికారాలు యిచ్చి సరిపెట్టింది. 

 ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ యుద్ధం వచ్చింది. హిందువులు, ముస్లిములు రెండు వేర్వేరు జాతులనీ, ముస్లిములకు పాకిస్తాన్‌ వుండాలని జిన్నా ప్రతిపాదించగా ఆంగ్లేయులు అంగీకరించి తూర్పుపాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ ఏర్పరచారు. ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఇండియా వుంది. తూర్పు పాకిస్తాన్‌ది వంగ సంస్కృతి కాగా, పశ్చిమ పాకిస్తాన్‌ది పంజాబీ, సింధీ సంస్కృతి. మతం ఒకటే అయినా యీ సంస్కృతుల మధ్య వైరుధ్యం వలన వారిలో ఐక్యత ఏర్పడలేదు. రాజధాని పశ్చిమ పాకిస్తాన్‌లో వుండడం చేత వారే అన్ని ముఖ్య పదవుల్లో వుంటూ తూర్పు పాకిస్తాన్‌ వారిని తక్కువగా చూసేవారు. ఈ వివక్షత కారణంగా తూర్పులో ఉదయమాలు తలెత్తేవి. పాకిస్తాన్‌ను పాలించే సైనిక నియంత యాహ్యాఖాన్‌ 1970 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాడు. తూర్పులో షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ నేతృత్వంలోని అవామీ లీగ్‌ అక్కడి సీట్లలో 99% గెలిచింది. పశ్చిమంలో వివిధ పార్టీల మధ్య సీట్లు చెదిరిపోయాయి. మొత్తం పార్లమెంటులో అత్యధిక సీట్లున్న పార్టీ అవామీ కాబట్టి ముజిబ్‌ను ప్రధానిని చేయాలి. కానీ అది యిష్టం లేని  భుట్టో వంటి పశ్చిమ నాయకుల ప్రోద్బలంతో యాహ్యా అతనికి ఆ అవకాశం యివ్వలేదు. దాంతో తూర్పులో శాసనోల్లంఘన వుద్యమం నడిచింది. అది మరింత ఉధృతం కావడంతో 1971 మార్చిలో యాహ్యా ముజిబ్‌ను ఖైదు చేసి పశ్చిమపాకిస్తాన్‌లో ఎక్కడో దాచివేశాడు. అతను ఉన్నాడో, చచ్చిపోయాడో తెలియలేదు. ఇక అప్పణ్నుంచి పశ్చిమ పాకిస్తాన్‌ సైనికులు తూర్పుప్రాంతంపై అన్ని రకాలుగా దమనకాండ సాగించారు. ఇది ఆర్నెల్లపాటు సాగింది. అక్కణ్నుంచి పౌరులు పక్కనే వున్న భారతదేశంలో తండోపతండాలుగా శరణార్థులుగా వచ్చిపడ్డారు. క్రమేపీ నవంబరు నాటికి యీ శరణార్థుల సంఖ్య కోటికి చేరింది. 

శత్రుదేశమైన పాకిస్తాన్‌ను రెండుగా చీల్చేందుకు భారత్‌కు యిది మంచి అవకాశం. అయినా ఇందిర తొందర పడలేదు. శరణార్థుల భారం భరించలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇండియా యుద్ధానికి దిగిందని అంతర్జాతీయ సమాజం అంగీకరించేదాకా ఓపిక పట్టింది. ఈ లోపున కలకత్తాకు పారిపోయి వచ్చిన అవామీ నాయకులు ప్రవాసంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఏర్పరచడానికి అనుమతించింది. ముక్తివాహిని పేర ఏర్పడిన పౌరసేనకు మిలటరీ చేత గెరిల్లా యుద్ధంలో తర్ఫీదు యిప్పించింది. తూర్పు పాకిస్తాన్‌కు పంపి పశ్చిమ పాకిస్తాన్‌ సైనికులతో పోరాడే అవకాశం కల్పించింది. శరణార్థుల భారం వహించడానికి భారత ప్రజలపై అదనపు సుంకాలు వేసింది. ఈ భారం మోసేకంటె యుద్ధమే మేలు అని ప్రజలందరూ అనుకునేట్లు చేసింది. కానీ ఆమె ఆగింది. ఎందుకంటే వర్షాకాలంలో తూర్పు పాకిస్తాన్‌లో నదులు పొంగుతాయి. బురదనేలల్లో సైన్యం ముందుకు సాగడం కష్టం. శీతాకాలం వచ్చాక యుద్ధం ప్రారంభిస్తే ఆ పాటికి హిమాలయాల కనుమల్లో మంచు పడి పాకిస్తాన్‌కు దన్నుగా నిలిచిన చైనా ముందుకు రాలేదు. ఈలోగా పాకిస్తాన్‌ తన పౌరుల మీదనే యీ రకమైన జాతిహననం (జినోసైడ్‌) చేయడం అత్యంత దుర్మార్గమని, ఇండియాపై అనవసరంగా భారం పడుతోందని ప్రపంచదేశాలన్నీ గుర్తించాయి. రష్యా, దానికి అనుబంధంగా వున్న యూరోపియన్‌ కమ్యూనిస్టు దేశాలు ఇండియాకు మద్దతు ప్రకటించాయి. కానీ అమెరికా, చైనా మాత్రం పాకిస్తాన్‌ను సమర్థిస్తూ పోయాయి. అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. యుద్ధం ప్రకటిస్తే అమెరికా ఇండియాపై దండెత్తుతుందని వూహించిన ఇందిర ఆగస్టులో రష్టాతో 20 సం||రాల శాంతి ఒప్పందం చేసుకుంది. రెండిటిలో ఏ దేశమైనా దాడికి గురవుతే రెండో దేశం దానికి ఆయుధసాయం చేస్తుందని రాసుకున్నారు. 

డిసెంబరు నెల వచ్చింది. దాడి చేయడానికి సర్వం సిద్ధమైంది. ఆ సమయంలో డిసెంబరు 3 న యాహ్యా భారత పశ్చిమతీరంలోని ఎనిమిది ఎయిర్‌ఫీల్డులపై విమానదాడులు ప్రారంభించాడు. అప్పుడు అంతర్జాతీయ దేశాలన్నీ కదిలివచ్చి ఐక్యరాజ్యసమితిని దింపుతాయని, అవి తూర్పు బెంగాల్‌లో ఇండియాను ముందుకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తాయని లెక్కవేశాడు. కానీ యీ దాడిని ముందే వూహించిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అక్కణ్నుంచి ముందుగానే విమానాలను తరలించింది. దాడి జరగగానే బంగ్లాదేశ్‌ను గుర్తించింది. పాకిస్తాన్‌పై ప్రతిదాడులు చేయకుండా తనను తాను కాపాడుకోసాగింది. తూర్పు తీరంలో మాత్రం దాడి మొదలుపెట్టింది. 11 రోజుల్లో భారతసైన్యం ఢాకా చేరింది. అమెరికా వెంటనే ఇండియాను దాడి చేసిన దేశంగా గుర్తించి అన్నిరకాల ఆర్థికసాయాన్ని నిలిపివేసింది. యుఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో యుద్ధవిరమణ, సైన్యాల తిరోగమనం ప్రతిపాదించింది. కానీ దాన్ని రష్యా వీటో చేసింది. బ్రిటన్‌, ఫ్రాన్సు గైరుహాజరయ్యాయి. చైనా నిరసన తెలిపి వూరుకుంది. అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌, అతని సలహాదారు కిస్సింజర్‌ ఆదేశాల మేరకు అమెరికా సెవెన్త్‌ ఫ్లీట్‌కు సంబంధించిన ఒక నౌకను న్యూక్లియార్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సహా బంగాళాఖాతం వైపు బయలుదేరింది. అది డిసెంబరు 9 న బయలుదేరింది. మీరు దిగితే మేమూ దిగాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిందంటారు. ఇందిర ఏ మాత్రం చెదరకుండా ఢాకాను వెంటనే పట్టుకోమని సైన్యాన్ని ఆదేశించింది. డిసెంబరు 13 కల్లా ఢాకాను చుట్టుముట్టడం, దాసోహమంటూ పాకిస్తాన్‌ సైన్యాధికారులు డిసెంబరు 16న లొంగిపోతూ సంతకాలు పెట్టడం జరిగాయి. మర్నాడే భారత్‌ తనంతట తానే యుద్ధాన్ని విరమించింది. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో పశ్చిమ పాకిస్తాన్‌ 1972 జనవరిన ముజిబ్‌ను విడుదల చేసి బంగ్లాదేశ్‌కు పంపేసింది. (సశేషం) ఫోటో - ముజిబ్‌ 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?