Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 47

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 47

దీనికి కారణం ఆర్థిక వైఫల్యం, కార్మిక సమస్యలు, రాజకీయ సంక్షోభాలు. వరుసగా రెండేళ్లు కరువు వచ్చింది. రక్షణ వ్యయం విపరీతంగా పెరిగింది, ఆర్థికమాంద్యం ఏర్పడింది, ధరలు పెరిగాయి, నిరుద్యోగులు పెరిగారు. వీటిని కొన్ని గణాంకాల సహాయంతో చెప్పాలి. లేకపోతే ఇందిరకు వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ (జెపి) లేవదీసిన ఉద్యమానికి అపూర్వమైన స్పందన ఎందుకు వచ్చిందో, దాన్ని చూసి బెదిరి ఇందిర ఎమర్జన్సీ ఎందుకు విధించిందో అర్థం కాదు. 

1954-64 మధ్య జాతీయాదాయం ఏటా 4.3% పెరిగింది. 64-67 మధ్య మాంద్యం వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా 1967-73 మధ్య పెరుగుదల 2.9% మాత్రమే. తలసరి ఆదాయం 1954-64 మధ్య ఏటా 2.1% చొప్పున పెరగగా 1967-73 మధ్య 0.6% పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తి 1956-61 మధ్య 7%, 1961-65 మధ్య 9% కాగా, 1965-70 మధ్య 3.3%, 1970-74 మధ్య 2.8% అయింది. స్టీలు, సిమెంటు, విద్యుత్‌, బొగ్గు, మిల్లు బట్ట, జనుము, వనస్పతి వంటి మౌలిక వస్తువుల ఉత్పాదనలో కూడా తగ్గుదల కనబడింది. ప్రయివేటు సెక్టార్‌ పెట్టుబడులు పెట్టడం మానేసింది, పబ్లిక్‌ సెక్టార్‌ ద్వారా పెట్టడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అప్పటికే లోటు బజెట్‌. కోటి మంది బంగ్లాదేశ్‌ శరణార్థుల భారం, ముక్తివాహినికి తర్ఫీదు యిచ్చే భారం పాకిస్తాన్‌తో యుద్ధభారం యివన్నీ తోడై ఆహారనిల్వలు, ఆర్థికసత్తా హరించివేశాయి. రక్షణ వ్యయాన్ని, ఆర్థిక లోటును పెంచాయి. యుద్ధం కారణంగా అమెరికా నుంచి వచ్చే సాయం ఆగిపోయింది. దాంతో దారిద్య్రాన్ని అదుపు చేసే పథకాలకై ప్రభుత్వమే ఖర్చు చేయవలసి వచ్చింది. బజెట్‌ లోటు రూ. 2 వేల కోట్లు దాటింది. 

ఈ దశలో చెప్పుకోదగ్గ మంచి అంశం - 1967-70 మధ్య ఆహారధాన్యాల ఉత్పత్తి 35% పెరగడం! కానీ 1972, '73లు వరుసగా కరువు రావడంతో ఆ నిల్వలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు 1975 వరకు సాగింది. దాంతో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. 1974లో 50 లక్షల టన్నుల ఆహారధాన్యాలు దిగుమతి చేసుకున్నారు. అయినా తల ఒక్కింటికి ఆహారధాన్యాల లభ్యత 1971-74 మధ్య 11% తగ్గిపోయింది. దాంతో వాటి ధరలు పెరిగాయి. దిగుమతుల కారణంగా ద్రవ్య లోటు పెరిగింది. కరువు వలన జలాశయాలు, నదులు ఎండిపోయి జలవిద్యుత్‌ ఉత్పాదన తగ్గిపోయింది. తన్మూలంగా విద్యుత్‌ కోతలు, పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడం జరిగాయి. పంటలు పండక గ్రామాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా అమ్ముడుపోని పరిస్థితి వచ్చింది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టకపోగా, వున్న వుద్యోగాలు వూడాయి. ఇవన్నీ చాలనట్లు 1973 అక్టోబరులో పెట్రోలు ఉత్పత్తి చేసే దేశాలు తైలం వెలికితీతను బాగా తగ్గించేసి పెట్రోలు ధర  ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగేట్లా చేశారు. దేశంలో ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ నిలవలు తగ్గిపోయాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. దేశంలో పెట్రోలు ఆధారిత వస్తువులు, సేవలు ఖరీదై పోయాయి. ఎరువుల తయారీ వంటివి దెబ్బ తిని, ధర పెరిగి రైతుల నడ్డి మరింతగా విరిచాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌)లను ఆర్థిక సాయం కోసం అర్థించడం, అవి విధించిన దుర్మార్గపు షరతులకు అంగీకరించడం జరిగింది. 

1972-73 మధ్య ద్రవ్యోల్బణం 22% పెరిగింది. 1974 జూన్‌ వచ్చేసరికి అది 30% అయింది. అంటే నెలకు 2.3% చొప్పున పెరిగిందన్నమాట.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యింత తీవ్రంగా ధరలు ఎన్నడూ పెరగలేదు. సామాన్య జనులకు అవసరమైన బియ్యం, గోధుమ, కాయధాన్యాలు అన్నిటి ధరలు పెరిగాయి. నూనె, కిరోసిన్‌, పేపరు, సిమెంటు ధర పెట్టి కొందామన్నా దొరికేవే కాదు. పేదలే కాదు, మధ్యతరగతి వారు కూడా యీ పరిస్థితికి హాహాకారాలు చేయసాగారు. వ్యాపారస్తులు యీ పరిస్థితిని పూర్తిగా వినియోగించుకున్నారు. అక్రమంగా నిలవ చేసి, బ్లాక్‌మార్కెటింగ్‌ చేయసాగారు. వారికి రాజకీయనాయకుల అండదండలుండేవి. చాలా రాష్ట్రాలలో, కేంద్రంలో వున్నది కాంగ్రెసు ప్రభుత్వమే కాబట్టి ప్రజలు కాంగ్రెసునే దోషిగా నిలబెట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ పట్ల ద్వేషం పెరిగింది. ఉద్యోగాలు లేక, తిండి దొరక్క యువత, పేదలు హింసామార్గాన్ని పట్టారు. నాగపూర్‌, బొంబాయి, మైసూరులలో తిండి ధాన్యాలు తీసుకెళుతున్న రైళ్లను, వ్యాన్‌లను ఆపి దోచుకున్నారు. ధరలు అరికట్టడానికై మార్కెట్లో డబ్బు పంపిణీ తగ్గించాలి. దానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం పరిశ్రమల ఖర్చుపై పరిమితులు విధించడం! ఖర్చు తగ్గించాలని వాళ్లు ఉద్యోగులను తీసివేశారు. 1960-65 మధ్య ఉద్యోగాల సంఖ్య ఏటా 5.6% చొప్పున పెరగగా, అది 1968-74 మధ్య దానిలో సగం 2.8% మాత్రమే! నిరుద్యోగులు శాంతిభద్రతల సమస్య సృష్టించేవారు. 

ఉద్యోగాలలో వున్నవారికి కూడా జీతాలు చాలేవి కావు. ఉద్యోగభద్రత లేదు. అందువలన విపరీతంగా సమ్మెలు జరిగేవి. ఉదాహరణకి 1973 అక్టోబరు - 1974 జూన్‌ మధ్య బొంబాయిలో 13 వేల సమ్మెలు జరిగాయి. 1965లో 65 లక్షల పనిగంటలు (మాన్‌అవర్స్‌) వృథా అయితే 1974లో 310 లక్షల పనిగంటలు వృథా అయ్యాయి. 1974 మేలో జార్జి ఫెర్నాండెజ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైల్వే కార్మికుల సమ్మె జరిగింది. ప్రతిపక్షాలన్నీ సమర్థించాయి. కానీ కార్మికుల కోర్కెలు తీర్చే స్తోమత లేని ప్రభుత్వం సమ్మెను భగ్నం చేయడానికి శతథా ప్రయత్నించింది. 22 రోజుల సమ్మె విఫలమైంది. కానీ ఇందిరకు కార్మికులందరూ వ్యతిరేకులయ్యారు. సమ్మె చేయని ఉద్యోగవర్గాలను కూడా మండించిన చర్య ఒకటుంది. ద్రవ్యోల్బణం తగ్గించాలంటే ఆదాయం తగ్గించాలి అనే లాజిక్‌పై ఉద్యోగులకు వచ్చే జీతాన్ని 1974 జులై 6 న ఫ్రీజ్‌ చేశారు. అప్పణ్నుంచి జీతం పెరిగినప్పుడు పెరిగిన బేసిక్‌, డిఎలో సగం ఉద్యోగి చేతికి యివ్వకుండా అతని పేర కంపల్సరీ డిపాజిట్‌ ఖాతా ఒకటి తెరిచి దాన్లో పడేసింది. 15 వేల రూ.లకు మించి ఆదాయం వచ్చే చెల్లింపుదారులందరూ అదనంగా 4-8% కంపల్సరీ డిపాజిట్‌ ఖాతాలో వేయాలంది. ఆ నిధులన్నీ ప్రభుత్వం తన దగ్గర పెట్టుకుంది. 

కష్టపడి చదివినా ఉద్యోగాలు రాకపోవడం, వచ్చినా సరిగ్గా జీతాలు రాకపోవడం, మరో పక్క బ్లాక్‌ మార్కెటీర్లు, స్మగ్లర్లు అడ్డదారుల్లో ధనవంతులు కావడం - యివన్నీ దేశయువతను వెర్రెక్కించాయి. భవిష్యత్తు పట్ల వాళ్ల నిరాశ, నిస్పృహ, పరిస్థితుల పట్ల ఆక్రోశం యివన్నీ ఆనాటి కథల్లో, నవలల్లో, సినిమాల్లో, నాటకాల్లో, పత్రికలల్లో ప్రతిఫలిస్తాయి. కాలేజీలు, యూనివర్శిటీలు తిరగబడే విద్యార్థుల కార్యక్షేత్రాలుగా మారాయి. లెఫ్టిస్టు సిద్ధాంతానికి సంబంధించిన సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్‌ లకు అనుబంధ విద్యార్థి సంఘాల్లో పనిచేసే విద్యార్థి నాయకులు, రైటిస్టు సిద్ధాంతవాదులైన ఎబివిపికి చెందిన నాయకులు, యూనివర్శిటీ క్యాంపస్‌లలో ఏళ్ల తరబడి తిష్టవేసి కొత్తగా వచ్చే విద్యార్థులను తమ మార్గంవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూండేవారు. తమలో తాము నిరంతరం కలహిస్తూ విద్యాలయాలను రణక్షేత్రాలుగా మార్చారు. ఏ సమస్య దొరికినా సరే దాన్ని సమ్మెలోకి దింపేవారు. ఆందోళనలు, ఉద్యమాలు, గోడల మీద రాతలు తరచుగా నడిచే కార్యక్రమం. దాంతో చదువులు సవ్యంగా సాగేవి కావు. నెలల తరబడి పరీక్షలు వాయిదా పడేవి. అంతా అల్లకల్లోలంగా వుండేది. న్యాయంగా మాట్లాడాలంటే అధికారంలో ఎవరున్నా యీ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమే. సరైన పాలకుడు వుండి వుంటే తన పార్టీలో సమర్థులను గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగించి, కార్యాచరణలో ప్రతిపక్షాలను కూడా కలుపుకుంటూ పోయేవాడేమో తెలియదు. కానీ ఇందిర మార్గమే వేరు. తన పార్టీలో తను తప్ప వేరే బలవంతుడెవడూ వుండకూడదని ప్రయత్నించింది. సమర్థత కంటె విశ్వసనీయతే ముఖ్యమని భావించింది.  ప్రతిపక్షాలను శత్రువులుగా చూసింది. వాళ్లందరూ తనను చంపడానికి కాచుక్కూచున్నారని ప్రచారం చేసేది. చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఇందిర మనుష్యులే వుండేవారు కాబట్టి సమాజంలో నెలకొన్న అధ్వాన్నస్థితికి ప్రత్యక్ష, పరోక్ష కారణం ఇందిరే అని ప్రజలందరూ నమ్మసాగారు.  (సశేషం) ఫోటో - జార్జి ఫెర్నాండెజ్‌

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?