Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 50

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 50

జవాబులు - కామెంట్స్‌ రాసేవారు ఉబుసుపోకకు రాస్తారని నేననుకోను. మంచో, చెడో ఏదో ఒక ఉద్దేశంతోనే రాస్తారు. నా వ్యాసంలో నేను సరిగ్గా బోధపరచలేకపోయి వుండవచ్చు. నేను అనవసరం అనుకుని వదిలేసిన సమాచారం వారి అవగాహనలో ఒక గ్యాప్‌ కలిగించి వుండవచ్చు. దాన్ని పూరించవలసిన బాధ్యత నాది. సందేహనివృత్తి చేసే క్రమంలో మరి కొంత సమాచారం యిస్తూంటాను. ఇక కొందరు పని కట్టుకుని యిదే వేదికపై నాపై అబద్ధాలు రాస్తే ఖండించకుండా ఎలా వుంటాను? జవాబుల వలన వ్యాసం పొడవు తగ్గదు. ఎప్పుడూ రాసేటంత రాసి వాటిని జతపరుస్తాను.

విద్యార్థుల కోరిక విన్న జెపి ''నా పేరు మీద మీరు ఉద్యమం నడుపుతానంటే ఒప్పుకోను. నా నిర్ణయాలను మీరందరూ తలదాల్చాలి. మీ అందరి సలహాలు, ఉద్దేశాలు వింటాను కానీ అంతిమ నిర్ణయం నాదే. దానికి యిష్టపడితేనే చెప్పండి.'' అన్నాడు. విద్యార్థులు సరేనన్నారు. 'మీరు శాంతియుతంగా పోరాటం చేయాలి. సామాజిక వ్యవస్థను మార్చకుండా ప్రభుత్వాన్ని మార్చమనడం సరైన పద్ధతి కాదు. ఎడం చెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టమన్నట్లు తయారవుతుంది.' అని హితబోధ చేశాడు. వాళ్లు తలూపారు. నెల తిరక్కుండానే జెపి తన మాట తనే జవదాటారు.  ఏప్రిల్‌ 23 కే అసెంబ్లీ రద్దు చేయాలని బహిరంగ ప్రకటన చేశారు. నిజానికి యీ దశలో జెపి ఊహల్లో విహరించారు. తను గట్టిగా పూనుకుంటే భారతీయ సమాజమే మారిపోతుందని భ్రమ పడ్డారు. విప్లవసాధనకు ఆయన ఎంచుకున్న మార్గం అందరూ ఎప్పణ్నుంచో అవలంబిస్తున్న బంద్‌లు, ధర్నాల మార్గమే! పోలీసుల అణచివేతకు వ్యతిరేక ప్రదర్శన అంటూ ఏప్రిల్‌ 8 న మౌనప్రదర్శనతో జెపి రంగంలోకి దిగారు. మర్నాటి సభలో జెపి ''27 సం||రాలుగా నేను వేదికమీదకు రాలేదు. కానీ యిప్పుడు రాక తప్పటం లేదు. ప్రస్తుత వ్యవస్థ ప్రతి వ్యక్తిని అవినీతిపరుడిగా మార్చేస్తోంది. ఈ వ్యవస్థను నైతిక విప్లవం ద్వారా మార్చడానికి సంకల్పించాను.'' అని ఉపన్యసించారు. 

ఈ విప్లవసాధనలో భాగంగా వచ్చే ఐదు వారాల్లో ధర్నాలు, మౌనప్రదర్శనలు, ఊరేగింపులు ప్లాన్‌ చేశారు. 23 కల్లా అసెంబ్లీ రద్దు చేయమని కోటి సంతకాల సేకరణ చేయాలన్నారు. అసెంబ్లీ రద్దు మాట ఎత్తగానే ఉద్యమం పక్కదోవ పట్టిందని ఆరోపిస్తూ లెఫ్ట్‌ పార్టీలు, కార్మిక యూనియన్లు ఉద్యమం నుంచి తప్పుకున్నాయి. జెపి తన విప్లవాన్ని (జూన్‌ 5 నుండి దానికి సంపూర్ణ విప్లవం అనే పేరు పెట్టారు) చాలా సీరియస్‌గా తీసుకుని బృహత్‌ ప్రణాళికలు రచించారు. ఎన్నికల విధానంలో సంస్కరణల ద్వారా మార్పులు, ప్రభుత్వపాలనలో అవినీతినిర్మూలన, విద్యావిధానంలో మార్పులు రావాలన్నారు. దానికోసం ఇంజనీరింగు, మెడికల్‌ కాలేజీలతో సహా అన్ని కాలేజీల విద్యార్థులూ ఏడాది పాటు చదువులు మానేసి ఉద్యమంలోకి దూకాలన్నారు. ఉద్యమం రెండు రకాలుగా సాగాలి. ఒకటి పోరాట విధానం. దీనిలో అసెంబ్లీని, ఎమ్మెల్యేలను ఘొరావ్‌ చేసి రాజీనామా చేసేదాకా వదలకూడదు. ప్రభుత్వ ఆఫీసులను చుట్టుముట్టి పని సాగనీయకుండా చేయాలి. పన్నులు కట్టకూడదు.  దీని కోసం ప్రతి కాలేజీలో, హైస్కూలులో ఛాత్ర సంఘర్ష్‌ సమితులు ఏర్పడాలి. గ్రామాల్లో జన సంఘర్ష్‌ సమితులు ఏర్పడాలి. ఈ సమితులు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో, పట్టణాల్లో జన సర్కార్‌ పేర సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపాలి. అంటే హింస, నేరం జరగకుండా ఆపేయాలి. రేషన్‌ షాపుల్లో వస్తువులు సవ్యంగా అందేట్లు చేయాలి. భూమిలేని పేదలకు భూదాన్‌ భూములను పంచాలి. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించినపుడు అభ్యర్థులను ఎన్నుకుని ఆ యా పార్టీల వారికి ఫలానా వారికే టిక్కెట్టు యిమ్మనమని చెప్పాలి. 

ఇంతటి ఆదర్శాలు ప్రవచిస్తే ఆచరణలో ఏమౌతుందో ఎవరైనా వూహించగలరు. జెపి మాత్రం అమాయకంగా యివన్నీ ప్రకటించారు. ప్రకటించిన ఏడాది తర్వాత అంటే 1975 మే నాటికి 587 బ్లాకుల్లో 20టిలో మాత్రం జనతా సర్కార్లు ఏర్పడ్డాయి. వీటిల్లో అగ్రవర్ణాల వారు, ధనిక రైతులు సభ్యులుగా వుండి పెత్తనం చలాయించబోయారు. ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అతి త్వరలోనే మూతపడ్డాయి. మొత్తానికి ఉద్యమం అసెంబ్లీ రద్దు అనే ఒక్క అంశం చుట్టూ తిరిగింది. జూన్‌ 5 లక్షల మందితో జెపి రాజభవన్‌కు ఊరేగింపుగా వెళ్లి ముఖ్యమంత్రి అబ్దుల్‌ గఫూర్‌ చేత రాజీనామా చేయించి అసెంబ్లీ రద్దు చేయాలని పిటిషన్‌ యిచ్చారు. జూన్‌ 7 నుండి జులై 12 వరకు అసెంబ్లీ గేట్ల వద్ద ధర్నా చేసి లోపలకి ఎమ్మెల్యేలు వెళ్లకుండా చేయాలని కార్యక్రమం రూపొందించారు. జులై 13 న రాజ్‌ భవన్‌ ఎదురుగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ఏడాది పాటు కాలేజీలు మూసేయాలని డిమాండ్‌ చేశారు. 1974 సెప్టెంబరులో జెపిని అడిగారు - 'ఇదేమిటి? ప్రజాస్వామికంగా ఎన్నికైన అసెంబ్లీ రద్దు చేయమని అడగడమేమిటి? దానితోనే విప్లవం వస్తుందనడం ఏమిటి?' అని. దానికి ఆయన ''ప్రజావ్యతిరేక, అవినీతిమయమైన ప్రభుత్వపు రద్దు మా తక్షణ గమ్యం. అప్పుడే విప్లవానికి అడ్డు తొలుగుతుంది. విద్యార్థులు, ప్రజలు విప్లవం లోని యితర నిర్మాణాత్మక అంశాలపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు. అందుకే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయడానికి అక్టోబరు 2 ముహూర్తం నిర్ణయించాం.'' అన్నారు. కానీ ఎవరూ చేయలేదు. దాంతో అక్టోబరు 3,4 తేదీల్లో సెక్రటేరియట్‌ను ముట్టడించారు జెపి. మూడు రోజుల బిహార్‌ బంద్‌ నిర్వహించారు. దాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో వచ్చే రైళ్లన్నిటినీ ఆపేశారు. ఏం చేసినా రాజీనామాలు జరగకపోవడంతో అక్టోబరు 10 న 'సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేశాం, నవంబరు 4 న సెక్రటేరియట్‌ను, ఎమ్మెల్యేల యిళ్లను 24 గంటల పాటు ఘొరావ్‌ చేస్తాం' అని ప్రకటించి పనిలో పనిగా ఇందిరా గాంధీ కూడా రాజీనామా చేయాలి అని డిమాండ్‌ చేర్చారు జెపి. నూటికి 95 మంది బిహార్‌ ప్రజలు ప్రస్తుత బిహార్‌ ఎసెంబ్లీని రద్దు చేయాలని కోరుతున్నారు కాబట్టి, ఇందిర వాళ్ల మాటల్ని పట్టించుకోవటం లేదు కాబట్టి ఆమె గద్దె దిగిపోవాలి అని ప్రకటించారు. అక్టోబరు 17 వచ్చేసరికి 'నా లక్ష్యం ఇందిరను అధికారం నుండి తప్పించడమే' అని ప్రకటించారు. సంపూర్ణ విప్లవం అంటే ఇందిరను దింపడం అనే స్థాయికి దిగారు.

ఈ డిమాండ్లు ఇందిరను చిర్రెత్తించాయి. మొరార్జీ వయసు చూసి గుజరాత్‌లో అసెంబ్లీ రద్దు చేసి కథ అక్కడితో ముగిసిందనుకుంది. ఇప్పుడు బిహార్‌లో మొదలైంది. ఇక్కడా రద్దు చేస్తే రేపు మరో రాష్ట్రంలో డిమాండ్‌ వస్తుంది. 'ఇవన్నీ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు. ఎవరో కొందరు అడిగారని రద్దు చేయాలా? కొత్తగా ఎన్నికలు జరిపి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని  రద్దు చేయమని మరి కొందరు అడిగితే? ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా వుందన్నమాట నిజమే కానీ దాన్ని చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా మార్చాలి కానీ బంద్‌ల ద్వారా, బలవంతంగా రాజీనామాలు అడగడం ద్వారా కాదు.' అని ఇందిర వాదించింది. తనను నియంత అంటున్న జెపి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఎత్తి చూపింది. తొలి రోజుల్లో జెపి ఉద్యమంపై ఆసక్తి చూపించినవారు కూడా యీ దశ వచ్చేసరికి జెపి ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మ అయిపోయారని అనుకున్నారు. 1971, 1972 ఎన్నికలలో ఇందిర చేతిలో చిత్తయిన ప్రతిపక్షాలకు ఊపిరి పోయడానికి జెపి తన యిమేజి ధారపోస్తున్నారని బాధపడ్డారు. కానీ జెపి యిదేమీ గ్రహించే స్థితిలో లేరు. తను తలచుకుంటే దేశపాలకులనే మార్చేయగలనన్న భ్రమలో పడ్డారు. 

జనసంఘ్‌ ఉద్యమాన్ని హైజాక్‌ చేసిందనే చెప్పాలి. జనసంఘ్‌ బలంగా వున్న ఉత్తర భారతంలో, ఢిల్లీలో జెపి పర్యటనలు చేశారు. సంపూర్ణ క్రాంతి ఉద్యమం ఒక బార్డోలీ ఉద్యమం, ఒక దండి యాత్ర, ఒక క్విట్‌ ఇండియా వంటి ఉద్యమమని చెప్పారు. వెళ్లిన ప్రతీ చోటా ఏడాది పాటు విద్యార్థులు చదువులు మానేయాలని ఉద్బోధించారు. జాతీయ మీడియా ఆయన్ను ఆకాశానికి ఎత్తివేయడంతో మధ్యతరగతి మేధావులకు జెపి ఆశాకిరణంగా తోచాడు. ఉద్యమం ఇందిరను గద్దె దింపే కార్యక్రమంగా రూపాంతరం చెందడంతో ఆరెస్సెస్‌, జనసంఘ్‌, ఆనంద్‌మార్గ్‌, ఎస్‌ఎస్‌పి, పాత కాంగ్రెస్‌, బిఎల్‌డి, డిఎంకె, అకాలీ దళ్‌, నక్సలైట్లు జెపిని సమర్థించి ఆయనను సూపర్‌మాన్‌గా చిత్రీకరించారు.  కానీ బిహారులో ఉద్యమం ఆయన ఆశించినట్లు జరగలేదు. ఉద్యమం పట్టణాలలోని విద్యార్థులు, మధ్యతరగతి, మేధావులు, గ్రామీణ ప్రాంతాల్లో ధనిక రైతులకే పరిమితమైంది. పల్లెల్లో పట్టణాల్లో వున్న పేదలు, హరిజనులు, గిరిజనులు, మైనారిటీలు, కార్మికులు అందరూ ఉద్యమానికి దూరంగా వున్నారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి నాయకత్వాన్ని చేతిలోకి తీసుకుందామని చూసిన ఎబివిపి విద్యార్థులకు, యితర విద్యార్థులకు విభేదాలు పొడసూపాయి. విద్యార్థులలో అతి తక్కువమంది మాత్రమే గ్రామాల్లోకి వెళ్లి జెపి ప్రవచించిన సేవా కార్యక్రమాలు చేపట్టబోయారు. వాళ్లు కూడా రెండు వారాలకే తిరిగి వచ్చారు. 

ఇదంతా చూసిన ఇందిర అస్సలు లొంగ దలచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఒత్తిడి చేసినా రాజీనామాలు చేయవద్దని తన ఎమ్మెల్యేలకు చెప్పింది. నలుగురే నలుగురు చేశారు. 88 మంది ప్రతిపక్షాల ఎమ్మెల్యేలుంటే వారిలో 38 మంది మాత్రమే చేశారు. మొత్తం 318 ఎమ్మెల్యేలలో రాజీనామా చేసినది 42 మంది మాత్రమే! ఉద్యమం చల్లారగానే హరిజన, గిరిజన ఎమ్మెల్యేలు తమను బెదిరించి రాజీనామా చేయించారని, వాటిని పరిగణించవద్దని స్పీకరుకు రాశారు. ఏం చేసినా ఇందిర చలించకపోవడంతో సమాజంలో చాలా వర్గాలు ఉద్యమానికి దూరంగా వుండడంతో ఉద్యమకారులకు నీరసం వచ్చింది. నవంబరు 4 నాటి ఘొరావ్‌ తర్వాత బిహార్‌లో జెపి ఉద్యమం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. బంద్‌లు, ఘొరావ్‌లు, ప్రదర్శనలు యించుమించు ఆగిపోయాయి. విద్యార్థులందరూ తమ క్లాసులకు తిరిగి వెళ్లసాగారు. ఏడాదిపాటు మానేసే ఐడియాను అటకెక్కించారు.  నాలుగు నెలల విరామం తర్వాత జులై 18కి కాలేజీలు తెరిస్తే చాలామంది విద్యార్థులు కాలేజీలకు చేరిపోయారు. పరీక్షలు బహిష్కరించండని జెపి యిచ్చిన పిలుపును 90% విద్యార్థులు ఖాతరు చేయలేదు. ఇది చూసి జెపికి కంగారు పుట్టి అక్టోబరులో విద్యార్థుల ముందు రెండు ప్రతిపాదనలు పెట్టారు. చదువు మానేసి ఉద్యమానికై ఒక ఏడాది వెచ్చించడం మొదటిది కాగా చదువుకుంటూనే వారంలో ఒక రోజు ఉద్యమానికి కేటాయించడం రెండో ఆప్షన్‌. పట్నా యూనివర్శిటీలో 13 వేల మంది విద్యార్థులుంటే 300 మంది మొదటి ఆప్షన్‌కి సై అంటే 2500 మంది రెండోదానికి ఒప్పుకున్నారు. తక్కినవాళ్లు పట్టించుకోలేదు. 

జెపి యితర ప్రాంతాల్లో పర్యటించినా సభలకు జనం వచ్చారు కానీ అక్కడ ఉద్యమాన్ని కొనసాగించినవారెవరూ లేరు. హైదరాబాదుకి వచ్చినపుడు ఆ సభకు నేనూ వెళ్లాను. చాలామంది వచ్చారు. 'గుజరాత్‌ విద్యార్థులే నా స్ఫూర్తిదాతలు. బిహార్‌ విద్యార్థుల్లో కనబడుతున్న ఉత్సాహమే యిక్కడి విద్యార్థుల్లోనూ కనబడుతోంది. రండి సంపూర్ణ క్రాంతిలో పాల్గొనండి, దేశాన్ని మార్చేద్దాం' అంటూ ప్రసంగించారు. అందరూ చప్పట్లు కొట్టాం. మర్నాటి నుంచి షరా మామూలే. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్లు ఎవరూ లేరు. ఇదే కథ తక్కిన అన్ని రాష్ట్రాల్లో నడిచింది. ఎమర్జన్సీ విధించడం వలన జెపి హీరో అయిపోయారు కానీ లేకపోతే ఆయన ఉద్యమం గురించి నేడు సమీక్షించుకుంటే ఉద్యమంలో పస లేదని స్పష్టంగా తెలుస్తుంది. అవినీతిపరుడు, రాజీనామా చేయాలి అని ఆయన గొడవ చేసిన అబ్దుల్‌ గఫూర్‌ స్వయంగా నిజాయితీపరుడేట. జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అతనిపై ఏ విచారణ జరిపించలేదు. ఆనాడు జెపి వెంట తిరిగి అవినీతిని రూపుమాపుదాం అని నినదించి, ప్రాచుర్యంలోకి వచ్చిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌, పాశ్వాన్‌లు అధికారం, అవకాశం రాగానే ఎంతటి అవినీతికి పాల్పడ్డారో చూశాం. 'వీళ్లను వెంటవేసుకునా జెపి ఆనాడు అవినీతిరహిత సమాజాన్ని తయారుచేద్దామనుకున్నారు? ఎంత అమాయకుడు' అనిపిస్తుంది. - (సశేషం) - (ఫోటో - జెపి ఉద్యమనాయకులుగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌, పాశ్వాన్‌) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?