Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 58

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 58

ఇందిరా గాంధీ చుట్టూ వున్నవారంతా అపరిమిత అధికారాల కోసం తహతహలాడినవారే. సాధారణ పరిస్థితుల్లో అయితే అది కుదరదు, అందువలన ఎమర్జన్సీ లాటిది విధించి తమ పెత్తనం చలాయించాలనే కోరిక వుంది. అందుకే ఎమర్జన్సీ విధించాక అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చెలరేగిపోయారు. అనేక అత్యాచారాలకు ఒడిగట్టారు. చేసే ప్రతీ పనీ ఇందిరకు చెప్పే చేశారని అనుకోవడానికి వీలు లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో అయితే అక్కడి ముఖ్యమంత్రులు తమ రాజకీయ శత్రువుల యిళ్లు పడగొట్టారు. జైళ్లల్లో కుక్కారు. పోలీసులకు విశేషాధికారాలిచ్చి వాళ్లు రాక్షసకృత్యాలు చేస్తూ వుంటే వూరుకున్నారు. సెన్సార్‌షిప్‌ విధించి, నిజాలు చెప్పేవారిని దూరం చేసుకోవడం వలన ఇందిరే నష్టపోయింది.  దీనివలన తెలిసేదేమిటంటే నియంత స్వభావం ఇందిరకు ఒక్కరికే కాదు, అనేకమంది పాలకుల్లో, అధికారుల్లో వున్న వికృతత్వం ఆ సమయంలో పురి విప్పుకుంది. అలా విప్పుకోవడానికి సహకరించినది ఇందిర స్వార్థం. దానికి ఆమె శిక్ష అనుభవించింది కానీ ఆమె పేరుమీదుగా దుర్మార్గాలు చేసి, సొంత కక్షలు తీర్చుకున్న అనేకమంది నాయకులు ఎమర్జన్సీ తర్వాత పార్టీ ఫిరాయించి, మొత్తం పాపాన్ని ఇందిర నెత్తికే కట్టేశారు. ప్రపంచంలోని నియంతలందరికీ యిదే జరిగింది. కొందరు సకల సౌఖ్యాలు అనుభవించి, నియంత పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని ఖరారుగా తెలిశాక, ఆఖరి క్షణంలో నియంతతో పోట్లాడి వచ్చి ప్రజల దృష్టిలో హీరోలయ్యారు. ప్రజాస్వామ్యం గందరగోళంగా తయారైనప్పుడు దీని కంటె నియంతృత్వమే మేలు అనుకుంటారు కొందరు. కానీ దానివలన జరిగే అనర్థం అంతాయింతా కాదు. నియంతృత్వం లేదా సైనిక పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యం పునరుజ్జీవింపబడడం ఓ పట్టాన సాధ్యపడదు. పొరుగున వున్న పాకిస్తాన్‌ను చూస్తే ఆ సత్యం బాగా బోధపడుతుంది.

ఇందిర హయాంలో బెంగాల్‌లో అరాచకం సృష్టించిన ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌ రాయ్‌ అపరిమిత అధికారాలపై మోజు పడిన సామంతరాజుల్లో ఒకడు. 1975 జనవరి 3న రైల్వే మంత్రి లలిత్‌ నారాయణ్‌ మిశ్రా హత్య జరగగానే (క్రైమ్‌ రచన 14 చూడండి) ఆ నెపం పెట్టుకుని జెపి ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని జైల్లో పెట్టిద్దామని అనుకున్నారు. అది జరిగిన 5 రోజులకు, జనవరి 8 న ఢిల్లీలో సిద్ధార్థ, న్యాయశాఖా మంత్రి ఎచ్‌ ఆర్‌ గోఖలే, బొంబాయికి ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ సభ్యుడు రజనీ పటేల్‌, కాంగ్రెసు అధ్యక్షుడు డి కె బరువా కలిసి చర్చించి, అంతర్గత ఎమర్జన్సీ విధిస్తే ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లల్లో బంధించవచ్చని, ఆ విధంగా వారి పీడ వదిలించుకోవచ్చని ప్లాను వేశారు. ప్రముఖ న్యాయవాదుల కుటుంబంలో పుట్టి బారిస్టర్‌ చదివి, హై లెవెల్‌ ప్రాక్టీసు చేసిన సిద్ధార్థ ఇందిరకు వ్యక్తిగతంగా స్నేహితుడు, ఆత్మీయుడు. ఆ చనువుతో సమావేశం ముగిశాక ఒక ఉత్తరం చేత్తో రాసి పంపించాడు. 

డియర్‌ ఇందిరా అనే సంబోధనతో ప్రారంభమైన ఆ ఉత్తరంలో 'మా సమావేశం ముగిశాక నీ కోసం చూస్తే ప్రభుత్వం తరఫున విందులో వున్నావు. అందుకే అడావుడిగా యిది రాసి పంపుతున్నాను. మేం లిస్టేమీ తయారు చేయలేదు. ఆర్డినెన్స్‌ ఎలా తయారుచేయాలో చెప్పాను. గోఖలే యివాళ రాత్రి చిత్తుప్రతి తయారు చేస్తానన్నాడు. రేపు పొద్దున్న 9 గం||లకు మళ్లీ కలిసి డ్రాఫ్టు  సవరించి నిన్ను కలుస్తాం. ఈ ఆర్డినెన్సు జారీ చేసే బాధ్యత నీదే అని ఓమ్‌ మెహతాకు చెప్పాను. కానీ బ్రహ్మానంద రెడ్డిని నువ్వే ఆదేశించాలి. (అప్పట్లో ఆయన హోం మంత్రి, ఓమ్‌ మెహతా ఆయన డిప్యూటీ. కానీ ఈ కోటరీ ఓమ్‌ ద్వారానే ఆపరేట్‌ చేసేవారు. బ్రహ్మానంద రెడ్డి పాతకాలం మనిషి కాబట్టి రూల్సు, గీల్సూ అంటాడని వాళ్ల భయం. అందుకని ఇందిర చేతనే చెప్పించారు. ఎమర్జన్సీ కాలంలో పేరుకు బ్రహ్మానంద రెడ్డి హోం మంత్రిగా వున్నా, పెత్తనం చలాయించినదంతా ఓమ్‌ మెహతాయే. ఎంతో సమర్థపాలకుడైన బ్రహ్మానంద రెడ్డి ఎమర్జన్సీ కాలంలో ఇందిరను అంటిపెట్టుకుని వుండి పేరు పోగొట్టుకున్నారు. అప్పుడంతా నోరు మూసుకుని వుండి, ఎమర్జన్సీ అనంతరం ఇందిర ఓడిపోయాక ఆమెను పార్టీలోంచి తీసేసి, కొన్నాళ్లపాటు హంగు చేసి, చివరకు తన పేర పెట్టుకున్న కాంగ్రెసు ముక్కను నడపలేక, చివరకు ఇందిర పంచనే చేరారు) నువ్వు ఆర్డినెన్సు ఫైనల్‌ ప్రతిని ఆమోదించగానే కాంగ్రెసు ముఖ్యమంత్రులందరికీ రహస్యంగా టెలెక్సు మెసేజిలు పంపి, వాళ్ల రాష్ట్రాలలో వుండే ముఖ్యులైన ఆరెస్సెస్‌, ఆనందమార్గీ నాయకుల జాబితా తయారు చేయమనాలి. ఆర్డినెన్సు గురించి ముఖ్యమంత్రలకు ముందుగా చెప్పనక్కరలేదు కానీ జాబితా రెడీగా చేతిలో పెట్టుకుని వుండాలని చెప్పాలి. ఆర్డినెన్సు వెంటనే, అంటే యిప్పణ్నుంచి 24 గంటల్లోగా, రెడీ చేయాలి. రాష్ట్రపతి సంతకం పెట్టడానికి టైము తీసుకోరనుకుంటాను. ఆర్డినెన్సు వెలువడిందన్న వార్త రాగానే ముఖ్యమంత్రులు వెంటనే కార్యాచరణలోకి దూకి, అందర్నీ అరెస్టు చేయించాలి. రేపు రాత్రో, ఎల్లుండి పొద్దున్నో స్పెషల్‌ కాబినెట్‌ మీటింగు ఏర్పాటు చేసి ఆర్డినెన్సు సంగతి చెప్పాలి. రేపు మేం నిన్ను కలవడానికి వచ్చినపుడు 24 గంటల్లో ఆర్డినెన్సు రెడీ కావాలని నీ మాటగా మా అందరికీ చెప్పు. ఇవాళ రాత్రే బ్రహ్మానంద రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పేయ్‌.'' అని రాశాడు. 

వీళ్ల సలహా ఎలా వున్నా ఇందిర జంకింది. భారతదేశంలో మౌలికంగా వున్న ప్రజాస్వామ్యం దీన్ని సహించదని ఆమె అంచనా వేసింది. ప్రతిపక్షాలు యీ ఆర్డినెన్సు చూపించి, తమను అణచివేస్తున్నారని మరింత ఆందోళన చేసి తన యిమేజి దెబ్బ తీస్తాయని ఆమెలో వున్న రాజకీయవేత్త హెచ్చరించింది. ప్రజాస్వామ్యవాదిగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతుడైన నెహ్రూ కూతురుగా తను యిలాటి పని చేస్తే ప్రపంచ దేశాధినేతలు తనను తప్పు పడతారని ఆమె వూహించింది. (ఎమర్జన్సీ విధించాక అదే జరిగింది. అనేకమంది ప్రపంచ నాయకులు నెహ్రూ పేరు చెప్పి ఆమెను వెక్కిరించారు. అవన్నీ భరించలేక చివర్లో ఆమె ఎమర్జన్సీ ఎత్తివేయడానికి సిద్ధపడింది. కానీ ప్రజలు మళ్లీ ఎన్నుకుంటారో లేదోనన్న సంశయిస్తూ వుంటే ఆమె చుట్టూ వున్న భజనమేళం 'ఎమర్జన్సీ వలన ప్రజలు ఎంతో లాభపడ్డారు, ఆనందంగా వున్నారు, మీ విజయం ఖాయం' అని ఉబ్బేశారు. సెన్సారు విధించి మీడియా గొంతు నొక్కిన కారణంగా క్షేత్రస్థాయి వాస్తవాలేమిటో ఆమెకే తెలియ రాలేదు. గెలుపు ఖాయం అనుకుని ఎమర్జన్సీ ఎత్తేసి, ఎన్నికలలోకి దిగింది. గోదాలోకి దిగాక ఆమెకు తెలిసి వచ్చింది - ప్రజలు ఎమర్జన్సీని ఎంత అసహ్యించుకున్నారో). ఇలాటి ఇందిర ఐదు నెలల్లోనే ఎమర్జన్సీ విధింపుకు సమ్మతించిందంటే దానికి కారణం అలహాబాదు హైకోర్టు తీర్పు కారణంగా దెబ్బ తిన్న ఆమె మానసిక సమతుల్యత, అదను చూసి సంజయ్‌ ఆమె ఆలోచనాధోరణిని ప్రభావితం చేయగలగడం.

ఇలా అనగానే ఆమె రాజకీయమార్గాలేవీ పరిగణించలేదని, సంజయ్‌ చెప్పినది తీసిన గోతిలో గుడ్డిగా పడిపోయిందనీ అనుకోకూడదు. జెపి అప్పటికే తన సంపూర్ణ క్రాంతి ఉద్యమంతో ప్రతిపక్షాలకు ఊపిరి పోశారు. హైకోర్టు తీర్పు వచ్చాక సిపిఐ తప్ప వేరే పార్టీలేవీ ఇందిరను సమర్థించలేదు. కానీ రాజీనామా చేయవద్దంటూ ఇందిర యింటి ముందు ప్రదర్శనలు జరుగుతున్నాయంటే దానికి కారణం - ఆర్‌ కె ధవన్‌ ఉత్తరాది ముఖ్యమంత్రులను ఆదేశించి కిరాయి మూకలను తెప్పించడమే! దేశప్రజలు యీ విషయంపై ఏమనుకుంటున్నారో ఏమీ తెలియటం లేదు. ఇందిరను దెబ్బ తీయడానికి యిదే అదను అనుకున్న ప్రతిపక్షాలు ఢిల్లీలో ఒక ర్యాలీ ఏర్పాటు చేసి తమకు నాయకత్వం వహించడానికి  జెపిని ఢిల్లీ రమ్మనమని  జూన్‌ 17 న కబురు పంపారు. ''హైకోర్టు తీర్పుపై స్టే యిమ్మనమని ఇందిర సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్లింది. ఆ అప్పీలును సుప్రీం కోర్టు తిరస్కరించిన తర్వాత మన పూర్తి స్థాయిలో యుద్ధరంగంలోకి దిగితే బాగుంటుంది. ఈ లోపునే మనం అడావుడి చేసినదాకా వుండి, సుప్రీం కోర్టు స్టే యిస్తే అబాసుపాలవుతాం.'' అని జవాబిచ్చారాయన. 

ఇందిర కూడా సుప్రీం కోర్టు ఏమంటుందోనన్న ఆందోళనలో వుంది. అది తేలకుండా పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేస్తే రభస అవుతుందని ఆమె భయం. ఇప్పటికే ప్రతిపక్షాలు ''నిన్ను ప్రధానిగా మేం గుర్తించటం లేదు'' అని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. తుల్‌ మోహన్‌ రామ్‌ అనే ఎంపీ తెచ్చుకున్న యింపోర్టు పెర్మిట్‌పై సిబిఐ యిచ్చిన నివేదికపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తుల్‌ మోహన్‌, అవినీతికి మారుపేరుగా మారిన ఎల్‌ఎన్‌ మిశ్రా అనుయాయి. సిబిఐ నివేదికను బహిరంగపరచాలని ప్రతిపక్షాలు అడిగినా ఇందిర వినలేదు. అప్పుడు మొరార్జీ దేశాయి పార్లమెంటులోనే సత్యాగ్రహం చేస్తానని హెచ్చరించాడు. 'అలా అనడం పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి సభ నుంచి మొరార్జీని బహిష్కరించు' అని స్పీకరు జియస్‌ ధిల్లోఁకు ఇందిర లోపాయికారీగా చెప్పింది. కానీ ధిల్లోఁ ఆ సలహా వినకుండా మొరార్జీ, ఇందిర తన ఛాంబర్‌లో వచ్చి తనను కలవాలని, యిద్దరికీ సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తానని రూలింగు యిచ్చాడు. తను స్పీకరు చేసిన వ్యక్తి తను యింతలా చెప్పినా అలాఎలా చేస్తాడని ఇందిరకు ఒళ్లు మండిపోయింది. ఆ విషయం తెలియగానే ధిల్లోఁ అయితే రాజీనామా చేస్తానని కబురంపాడు. అలా చేస్తే మరింత గందరగోళమవుతుందని కంగారుపడిన ఇందిర వద్దని నచ్చచెప్పవలసి వచ్చింది. (సశేషం)   (ఫోటో - సిద్ధార్థ శంకర్‌ రాయ్‌, ఓం మెహతా) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?