Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎగ్జిట్టే ! - ఎందుకలా?

ఎమ్బీయస్‌ : ఎగ్జిట్టే ! - ఎందుకలా?

యుకె ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు వచ్చేశాయి. విడిపోదామని 52% మంది అంటే కలిసుందామని 48% మంది అన్నారు. ఎటైనా సరే, తేడా 1-2% కంటె వుండదనుకుంటే ఏకంగా 4% అయింది. 72% మంది ఓటేశారు కాబట్టి ఇది మెజారిటీ ప్రజల అభిప్రాయమే. విడిపోతే కష్టాలు తప్పవని, మళ్లీ నిలదొక్కుకోవడానికి చాలాకాలం పడుతుందని ఎందరు హెచ్చరించినా లాభం లేకపోయింది. విడిపోతే స్వర్గం దిగి వస్తుందన్నంత లెవెల్లో ''ఇది స్వాతంత్య్రదినం'' అనేశారు బ్రెగ్జిట్‌ నాయుకులు. విడిగా వుంటే ఓవర్‌హెడ్స్‌ తట్టుకోవడం కష్టంగా వుంటోందని ప్రపంచంలోని అనేక వ్యాపారసంస్థలు ఇంకొకరితో కలిసిపోవడానికి సిద్ధపడుతున్నారు. దశాబ్దకాలంగా ఎన్నో మెర్జర్స్‌ అండ్‌ అమాల్గమేషన్స్‌ చూస్తూ వచ్చాం. ఇయు వంటి పెద్ద వ్యాపారవేదిక వదులుకోవడానికి బ్రిటన్లు ఎందుకు సిద్ధపడ్డారు? అనే ప్రశ్నకు సమాధానంగా 'ఇది భావావేశంతో తీసుకున్న నిర్ణయం' అనిపిస్తుంది నాకు. ఈ విషయంపై రాబోయే రోజుల్లో అనేక విశ్లేషణలు వస్తాయి. పరిణామాల పట్ల అనేక వ్యాఖ్యానాలు వస్తాయి. ఈ లోపుగా నీ-జెర్క్‌ రియాక్షన్‌గా యీ వ్యాసం. 

నేను యిటీవలే నాలుగు నెలలు బ్రిటన్‌లో (లండన్‌లో కాదు, లండన్‌కు వంద మైళ్ల దూరంలో మూడున్నర లక్షల జనాభాతో వున్న కవెంట్రీలో) వున్నాను. ఆ స్వల్పకాలంలో, నాకున్న స్వల్పపరిచయాలతో, పరిమిత జ్ఞానంతో, బ్రిటిషు సమాజం గురించిన అతి తక్కువ ఎక్స్‌పోజర్‌తో ఏం వ్యాఖ్యానించినా అది ప్రామాణికం కాదు. అయినా నేను గమనించిన, సేకరించిన విషయాలు కొన్ని చెప్తాను. పొరబాట్లుంటే విజ్ఞులు సవరించగోర్తాను. బ్రిటన్‌లో యితర దేశస్తులు చాలామంది కనబడతారు. బ్రిటన్లు శతాబ్దాలుగా ఒక తరహా జీవితానికి అలవాటు పడ్డారు. వారిలో మారే వేగం (రేట్‌ ఆఫ్‌ ఛేంజ్‌) చాలా తక్కువ. వారు తీసే టీవీ సీరియల్స్‌లో షెర్లాక్‌ హోమ్స్‌, అగాథా క్రిస్టీ కథలను చూసేటప్పుడు ఆనాటి వాతావరణాన్ని మళ్లీ ఎలా క్రియేట్‌ చేశారో అని ఆశ్చర్యపడుతూ వుండేవాణ్ని. అక్కడకు వెళ్లి చూస్తే ఆర్ట్‌ డైరక్టర్ల ప్రజ్ఞ ఏమీ లేదని తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాలలో కూడా యిళ్ల డిజైన్ల దగ్గర్నుంచి ఏమీ మారలేదు. ఇంటీరియర్స్‌లో మార్పులు వచ్చి వుంటాయి తప్ప, బయట నుంచి చూస్తే అవే సింహద్వారాలు, అవే కారు గరాజ్‌లు, అవే యిటుకల ప్రహారీ గోడలు! చెట్లు, పుట్టల జోలికి వెళ్లలేదు. 'ఓల్డ్‌ వ(ర)ల్డ్‌ ఛామ్‌' అనుకుంటూ మనం మురిసిపోవచ్చు కానీ అతి వేగంగా పరుగెడుతున్న యీనాటి ప్రపంచానికి యీ తరహా 'లెయిడ్‌ బ్యాక్‌ ఏటిట్యూడ్‌' పనికి వస్తుందాన్న అనుమానం వస్తుంది. లండన్‌లో పాతా, కొత్తా కనబడ్డాయి. ఎడింబరాలో పాతయే ప్రముఖంగా కనబడింది. నగరాలన్నీ క్షుణ్ణంగా చూడందే ఏ కామెంటూ చేయకూడదు. కానీ టూర్లు వెళ్లినపుడు చూస్తూ వుంటే, వీళ్లు మరింత చురుగ్గా వుంటే బాగుండునే అనిపించింది.

ఇలాటి బ్రిటిషు సమాజంలో బయటివాళ్లు వచ్చి చొచ్చుకుపోతున్నారు. కవెంట్రీలో ఏవో రెండు, మూడు సూపరు బజార్లు రోజంతా తెరిచి వుంటాయి కానీ తక్కిన దుకాణాలన్నీ సాయంత్రం 5 గంటలకే మూసేస్తారు. సెలూన్లు కూడా మధ్యాహ్నం లంచ్‌ టైమంటూ మూసేస్తారు. ఇండియన్లు, ఆసియన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో 8 గంటల దాకా షాపులుంటాయి. లండన్‌ శివార్లలో ఇండియన్లు, బంగ్లాదేశీలు, శ్రీలంక వారు రాత్రి పది గంటల దాకా కిరాణా షాపులు తెరిచి వుంచి డబ్బు గడిస్తారట. గవర్నమెంటు రూలు ప్రకారం  దుకాణాలు ఎప్పటివరకు తెరిచి వుంచవచ్చో నాకు అర్థం కాలేదు. రాత్రి ఏ 8 వరకో వుంచవచ్చనే రూలుంటే ఇంగ్లీషువాళ్లు 5 గంటలకే ఎందుకు మూసేయాలి? తక్కువ గంటలు వ్యాపారం చేస్తే బయటివాళ్ల ఆదాయంతో పోటీ పడలేరు కదా!

ఈ శ్రీలంక వాళ్ల గురించి కాస్త చెప్పాలి. ఎల్‌టిటిఇ విజృంభణలో వున్నపుడు, శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రాంతాలపై నిఘా వేసేది. అక్కడున్న తమిళులలో కొందరు ప్రభుత్వం తమను రాజకీయంగా వేధిస్తోందని, అందువలన తమకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని కోరుతూ బ్రిటన్‌ వచ్చేశారు. బ్రిటన్‌ వాళ్లు శరణు దయచేశారు. ఈ పాశ్చాత్యదేశాల వారికి ఆసియన్‌, ఆఫ్రికన్‌ దేశాల ప్రభుత్వాలపై చిన్నచూపు జాస్తి. వాళ్లకు ప్రజాస్వామ్యం అంటే తెలియదని వీళ్ల ఉద్దేశం. అందుకని 'వారు మా స్వేచ్ఛను హరించారు, హక్కులకు భంగం కలిగించారు' అంటూ ఎవరైనా వచ్చేస్తే ఔదార్యం ఒలకబోస్తూ వారికి ఆశ్రయం యిచ్చేస్తారు. వాళ్లు తమ గడ్డ మీద నివసిస్తూ మాతృదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ, అక్కడి విద్రోహచర్యలకు నిధులు సేకరిస్తూ వుంటే వారించరు. ఖలిస్తాన్‌ ఉద్యమం నడిచేటప్పుడు చాలా మంది శిఖ్కులు వేధింపుల పేరుతో అక్కడికి చేరిపోయారు. వాళ్లు చెప్పేదానిలో నిజానిజాలు నిర్ధారించుకునే పద్ధతే లేదు. అందుకే ఎల్‌టిటిఇ సమర్థకులు, ఖలిస్తాన్‌ సమర్థకులు చాలామంది అక్కణ్నుంచే టెర్రరిస్టు కార్యకలాపాలకు రూపకల్పన చేశారు. వాటివలన నష్టపోయేది అవతలి దేశాలు కాబట్టి వారికి చీమ కుట్టినట్లు లేదు. ఇప్పుడు సొంతింట్లో బాంబులు పేలుతూండడంతో ఉలిక్కిపడుతున్నారు. 

ఇలా శరణార్థులమంటూ వచ్చిన శ్రీలంక వారు కానీ, శిఖ్కులు కానీ, బంగ్లాదేశీలు కానీ చాలా చురుగ్గా వుంటారు. స్థానికుల కంటె ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ, అతి త్వరగా పైకి వస్తారు. మన దేశంలోనే చూడండి. పాకిస్తాన్‌లో ఆస్తులు పోగొట్టుకుని వచ్చిన పంజాబీలు, సింధీలు దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించి, వ్యాపారాలు పెట్టుకుని ఎంత బాగా ఆర్జించారో. కరాచీ స్వీట్సు, కరాచీ బేకరీలు, కరాచీ స్టోర్సు అంటూ చిన్న వూళ్లలోనూ కనబడతాయి. ఆటోమొబైల్‌ షాపుల నుంచి సైకిళ్ల షాపుల దాకా పెట్టి పంజాబీలు ఆ రంగంపై తమ స్టాంపు కొట్టేశారు. శ్రీలంక వాళ్లు యుకెలో హోటళ్లు, కిరాణా షాపులు పెట్టుకుని తెగ సంపాదించేశారు. దీపావళికి వాళ్లు చేసే హడావుడి యింతా అంతా కాదు. ఇతర ఆసియన్‌ దేశాల వాళ్ల షాపులు కూడా పుష్కలంగా కనబడతాయి. వీళ్లంతా అక్కడ యిళ్లు కొనేసి, అద్దెల మీద బాగా గడిస్తున్నారు. వీళ్లంతా వ్యాపారస్తులు. ఇక ప్రొఫెషనల్స్‌ సంగతి చెప్పాలంటే - మా యింట్లో ప్లంబింగ్‌ పని వుంటే ఎపార్టుమెంట్‌ కాంప్లెక్సు మేనేజరుకి చెపితే 'ఇతనైతే ఏ టైములోనైనా వస్తాడు, త్వరగా వస్తాడ'ంటూ ఒకతని నెంబరు యిచ్చాడు. చూస్తే అతను పంజాబీ. తండ్రి వచ్చి అక్కడ స్థిరపడ్డాడట. మా కాంప్లెక్సుకి గతంలో ఆస్థాన ప్లంబర్‌గా ఓ తెల్లవాడు వుండేవాడట. ఎప్పుడు రమ్మన్నా, టైమయిపోయింది రేపు చూదాం అనేవాట్ట. చార్జి కూడా ఎక్కువే వేసేవాడట. అందుకని యితన్ని పిలవసాగారు. చార్జి తక్కువే తీసుకున్నాడు. 'తెల్లవాళ్లకు ఒళ్లొంగదు, కష్టపడితే మనం ఇండియాలో కంటె పది రెట్లు సంపాదించవచ్చు. ఇప్పటికే మూడు యిండిపెండెంటు బంగళాలు కొన్నాను.' అంటూ చెప్పుకొచ్చాడు.

భారతీయుడు పైకి వచ్చాడంటే మనం సంతోషిస్తాం కానీ స్థానికుడు ఎలా ఫీలవుతాడో ఆలోచించండి. వీళ్లంతా వచ్చి రేట్లు పెంచేశారు, మా పొట్ట కొట్టేరు అనుకుంటాడు. అసలక్కడ లేబరు, జీతాల విధానమే నాకు అర్థం కాలేదు. కనీస వేతనం అంటూ వ్యాపారస్తులకు గిట్టుబాటు కాని లెవెల్‌ స్థిరపరిచారు. దాంతో షాపుల్లో హెల్పర్లు లేకుండా పోయారు. చెప్పుల షాపులోకి వెళ్లి, మనకు కావలసినదేదో మనమే ట్రై చేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడైతే హెల్పరుకు ఫలానా రంగు, ఫలానా సైజు, ఫలానా డిజైను అంటూ వివరింగా చెప్పి తెప్పించుకోవచ్చు. అక్కడ మనమే తంటాలు పడాలి. పెట్రోలు బంకులో మనమే పెట్రోలు నింపుకోవాలి, టైర్లలో గాలి మనమే కొట్టుకోవాలి వగైరా, వగైరా. ఇండియాలో లాగ డబ్బిచ్చి పని చేయించుకుందామంటే మనుష్యులు వుండరు. పోనీ నిరుద్యోగులు లేరా అంటే పుష్కలంగా వున్నారు. వాళ్లను యింట్లో కూర్చోబెట్టి భృతి యిస్తున్నారు. ఇదేమి లాజిక్కో తెలియదు. అయ్యే ఖర్చూ అవుతోంది, పౌరులకు అందవలసిన సౌకర్యమూ అందటం లేదు. నిరుద్యోగులకు, యింకా కొన్ని వర్గాలకు ఎన్నో రకాల ఉచితాలు, పిల్లలు పుడితే ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది అంటే, వాళ్లు పిల్లలు కనేస్తున్నారు. ఉద్యోగం లేదు కదాన్న జంకు లేదు వాళ్లకు. ఈ భారమంతా పన్నులు కట్టే పౌరులపై పడుతోంది. విదేశాల్లో నివాసం వుండేవారికి యివి వింతగా తోచవు కానీ, ఇండియా నుంచి అతిథిగా వెళ్లిన నాకు దీనిలో విజ్ఞత ఏమిటో బోధపడలేదు. మన ఇండియన్లు అక్కడ పని చేస్తూ, చచ్చేటంత పన్నులు కట్టి అక్కడి సోమరులను పోషిస్తున్నారన్నమాట అనిపించింది. 

'బ్రిటన్‌లో లేబరు చట్టాలు గట్టిగా వుంటాయి. అమెరికాలోలా ఎప్పుడు తలచుకుంటే అప్పుడు పింక్‌ స్లిప్‌ యిచ్చేయడం కుదరదు' అంటే బాగుందే అనుకున్నాను. కానీ కార్మిక హక్కుల రక్షణ ఎంత మితిమీరిందో ఒక ఉదాహరణ చెప్తాను. ఒకాయన తారసిల్లాడు - మీ కంపెనీ ఏ పని చేస్తుంది అని అడిగితే 'ఆబ్సెన్స్‌ మేనేజ్‌మెంట్‌! ఎవరైనా ఉద్యోగికి ఆఫీసుకి వెళ్లడానికి కుదరకపోతే మాకు ఫోన్‌ చేసి చెప్తాడు' అన్నాడు. 'మీకెందుకు? ఆఫీసులో బాస్‌కే చెప్పవచ్చు కదా' అని అడిగాను. 'అలా చెప్పాలన్న రూలు లేదు, మాకు చెప్తాడు, మేం వాళ్లకు చెప్తాం' అన్నాడు. 'అతని బదులు వేరేవారిని పంపించే బాధ్యత మీరు తీసుకుంటారా?' అని అడిగాను. 'అబ్బే, అదేం లేదు, మీవాడు యివాళ రావటం లేదు అని చెప్తామంతే. ప్రత్యామ్నాయం చూసుకునే బాధ్యత వాళ్లదే' అన్నాడాయన. అంటే నెలనెలా జీతం యిచ్చే కంపెనీకి నేను యివాళ రావటం లేదు అని చెప్పడానికి కూడా ఉద్యోగికి గోరోజనమా? ఆ ముక్క వాళ్లకు కాకుండా కంపెనీ నియమించిన ఏజన్సీకి చెపితే గౌరవమా? నాకు కాన్సెప్టు అర్థం కాలేదు. పొరబడ్డానేమో అన్న అనుమానం యింకా వదలలేదు. బ్రిటిషు ఉద్యోగులు యింత పోజు కొట్టేస్తూన్నపుడు, కంపెనీ యజమానులు విధేయులుగా పనిచేసే యితర జాతీయులకు ఉద్యోగాలు యిస్తే ఆశ్చర్యమేముంది? 

చదువు గురించి చెప్పాలంటే అక్కడ దాదాపు అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతారట. అవి చాలా బాగుంటాయట. పురుషుల్లో పుణ్యపురుషుల్లా గ్రామర్‌ స్కూళ్లని వుంటాయిట. వాటిలో ఎడ్మిషన్‌ కష్టమట. మన తెలుగు వాళ్లకు ఏదీ సాదాసీదాగా పోనివ్వడం అలవాటు లేదు. పోటీ పడడమంటే మహా యిష్టం. ఇక్కడ ఎంసెట్‌కు, ఐఐటికి ఫౌండేషన్‌, ప్రిపరేషన్‌ అంటూ పిల్లల్ని ఎలా తోమేస్తారో, అదే అనుభవంతో అక్కడి తెలుగువాళ్లు తమ పిల్లల్ని గ్రామర్‌ స్కూల్లో సీటు సంపాదించడానికి రెండేళ్ల ముందు నుంచి  మన ఇండియన్‌ టీచర్ల చేతనే వారానికి రెండు, మూడు క్లాసుల స్పెషల్‌ ట్రైనింగ్‌ యిప్పిస్తున్నారు. సహజంగానే మనవాళ్లకు సీట్లు వచ్చేస్తున్నాయి. కొన్నాళ్లు పట్టించుకోకుండా వున్న బ్రిటిషర్లు యీ వరస చూసి పోటీ పడకపోతే తమ పిల్లలకు గ్రామర్‌ స్కూలు సీట్లు మిగిలేట్లు లేవని భయపడి, తమ పిల్లల్నీ ఇండియన్ల వద్దకు ట్రైనింగ్‌కు పంపిస్తున్నారట. ఇలా యుకెలో యితర ప్రాంతాల వాళ్లు వచ్చి బాగు పడిపోవడం, తమకు పోటీగా మారడం స్థానికులకు కంటగింపుగా వుండడంలో ఆశ్చర్యమేముంది? 

ఇవన్నీ మధ్యతరగతి వాళ్లకు యిబ్బంది కలిగించే అంశాలు. తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ ఏదోలా నెట్టుకొస్తున్నారు. కానీ యిటీవలి సంవత్సరాలలో కింది స్థాయి వాళ్లకు శరణార్థులు పెద్ద ముప్పుగా పరిణమించారు. కాందిశీకులు ఎంత తక్కువ కూలీకైనా పని చేయడానికి సిద్ధపడడంతో వీళ్లకు పని దొరకడం మానేసింది. పైగా వాళ్లకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించ రావలసి రావడంతో బ్రిటన్‌ తన పౌరులకు యిచ్చే సంక్షేమ పథకాలలో కోత పెట్టింది. అందువలన బ్రిటిషర్లు యితర దేశస్తులపై కోపంతోనే బ్రెగ్జిట్‌కు మొగ్గు చూపారు. ఓటింగు సరళి చూస్తే యిది బోధపడుతోంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?