Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గోడ్సే-34 ''నైన్‌ అవర్స్‌ టు రామా''4

ఎమ్బీయస్‌: గోడ్సే-34 ''నైన్‌ అవర్స్‌ టు రామా''4

మధ్యాహ్నం 1.30 గం|| నాథూ సంస్థానాధీశుడు శివాజీరావ్‌ నల్కర్‌ రాజమందిరం. ఈసారి తమ ప్రయత్నం విజయవంతం అవుతుందని. యిన్నేళ్లుగా మహారాజు గుమ్మరిస్తున్న డబ్బు వ్యర్థం కాదనీ శ్యామా ప్రహ్లాద్‌ ఆయనకు హామీలు గుప్పిస్తున్నాడు. గురూజీ పై చదువులకు ఈ రాజా ఆర్థిక సహాయం చేసి వున్నాడు. ప్రహ్లాద్‌ రాజా వద్ద మంత్రిగా పనిచేసి, రైటిస్టు రాజకీయాల్లోకి వెళ్లాడు. ప్రస్తుతం ఎంపీ అయ్యి 43 మంది సభ్యులున్న పార్టీకి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. తమకు మాట యిచ్చిన రాజభరణాలని తగ్గించాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ వుందని విని రాజా మండిపడుతున్నాడు. కశ్మీరుపై దండెత్తిన ముస్లిములకు బాకీ తీర్చడానికి డబ్బుంది కానీ, తమ రాజభరణాలకు మాత్రం లేదా అని అతని కోపం. తమ కోసం పనిచేసే రైటిస్టు ఉద్యమానికి కావలసినంత ధనసహాయం చేస్తున్నా గాంధీపై హత్యాప్రయత్నం విఫలమైనందుకు గుర్రుగా, గురూజీ యీసారి నాథూ వంటి తాగుబోతుకు పని అప్పచెప్పినందుకు యీసారి కూడా పని కాదని నిరాశగా వున్నాడు. తన నిస్పృహను, అసహనాన్ని ప్రహ్లాద్‌పై వెళ్లగక్కాడు.

ప్రహ్లాద్‌ అతనికి వివరించాడు - ''మహారాజా యీ సారి తప్పకుండా లక్ష్యం సాధిస్తాం. గాంధీ హత్య జరగగానే దేశమంతా అల్లర్లు జరిగేట్లా ప్లాన్‌ చేశాం. ఇన్నాళ్లూ ఉగ్గబట్టుకున్న హిందువుల ఆగ్రహావేశాలు పొంగిపొరలాయనీ, ముస్లిములను బుజ్జగించే దేశద్రోహులకు యిదే శిక్ష అని ఎలుగెత్తి చాటడానికి వీధుల్లోకి వచ్చారనీ అందరూ అనుకుంటారు. ఇంగ్లీషువాళ్లు చట్టాలనీ, చట్టుబండలనీ యిన్నాళ్లూ మన చేతులు కట్టివేశారు. ఇప్పుడా శృంఖలాలు లేవని మనం అందరికీ తెలిసి వస్తుంది. హింసకు హింసే జవాబు. ఉత్తర భారతంలో శరణార్థుల సమస్య వుంది కాబట్టి పోలీసులందరినీ అక్కడే మోహరించారు. దక్షిణాదిన పోలీసులు లేరు. అక్కడ గొడవలు వస్తాయని ఎవరూ వూహించరు. అందుకని మనం అక్కడ అల్లర్లు చెలరేగేలా ప్లాన్‌ చేశాం. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని పార్లమెంటులో నేను ఏకేస్తాను. దేశాన్ని కాపాడడానికి తాత్కాలిక పరిష్కారంగా ఒక కేర్‌టేకర్‌ ప్రభుత్వం వుండాలని, దానికి అధినేతగా రాజవంశీకుడు, దైవదత్తమైన అధికారాన్ని తరతరాలుగా అనుభవిస్తూ, వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం గల తాము వుండాలని ప్రతిపాదిస్తాను. అధికారపక్షంలో నా మిత్రులతో మాట్లాడి వారూ ఒప్పుకునేట్లు చేస్తాను. తమరు కాస్త ఓపిక పట్టాలి.''

ఇది విని మహారాజు ప్రసన్నుడయ్యాడు. అంతలోనే అనుమానం వచ్చింది - ''దేశంలో అల్లర్లు జరుగుతూంటే ఆర్మీ చూస్తూ వూరుకుంటుందా? మధ్యలో చొరబడితే...?''

''వాళ్లు కశ్మీర్‌ సమస్యతో సతమతమవుతున్నారు. పాకిస్తాన్‌ సరిహద్దుల్లో మోహరించి ముస్లిములతో పోరాడుతున్న సైన్యాన్ని వెనక్కి పిలిచి మన హిందూ సోదరులపై తుపాకులు ఎక్కుపెట్టండి అని ఏ సైన్యాధికారి చెప్పగలడు, మహారాజా?'' 

ఇంకో అనుమానం - ''ఈ కాంగ్రెసు వాళ్లే కదా మా మహారాజులని దింపేసింది, మళ్లీ మాకు యింత పెద్ద సింహాసనం - తాత్కాలికంగానైనా - అప్పగిస్తారా? పార్టీలో యితర నాయకులు వూరుకుంటారా?''

''..గత ఆర్నెల్ల అనుభవం వారికి చాలా గుణపాఠాలు నేర్పింది, మహారాజా! కశ్మీరుపై దాడితో వీళ్లకు తెలిసివచ్చింది, రాజకీయనాయకులు రాజులకు సాటి రారని, దేశప్రయోజనాలను కాపాడలేరని. అధికారం రక్తంలో వుండాలి ప్రభూ..''

రాజావారికి పట్టరాని సంతోషం కలిగింది. ఆర్నెల్ల క్రితం యిచ్చిన పదివేల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైందని సణుగుతూనే పదిహేను వేల రూపాయల విలువ చేసే ఉంగరాన్ని ప్రహ్లాద్‌కి యిచ్చి దానితో పని జరిపించమన్నాడు. ప్రహ్లాద్‌ వంగి వంగి దణ్ణాలు పెట్టి వెళ్లాడు. 

xxxxxxxxxxxxxxxxxxxx

మధ్యాహ్నం 2.30 గం|| నాథూ హఠాత్తుగా నిద్ర లేచాడు. గదిలో షీలా కనిపించలేదు. తను పడుక్కున్నపుడు తుపాకీ చూసిందా? తనతో కబుర్లాడినపుడు వెలిబుచ్చిన రాజకీయాభిప్రాయాలతో దడిసి పోలీసులకు చెప్పడానికి వెళ్లిందా? భయపడి పారిపోయిందా? ఏమో, బయటకు వచ్చి వీధిలో నడవసాగాడు. కనబడిన ప్రతీవాడూ తన కేసే చూస్తున్నట్లు అనిపించింది. ముష్టి కుర్రవాళ్లు కూడా అతని దగ్గరకు రాలేదు. అందర్నీ హెచ్చరించిందా? 

అతనికి సడన్‌గా కాశీనాథ్‌ త్య్రంబక్‌పై తను చేసిన దాడి గుర్తుకు వచ్చింది. అప్పుడూ అంతే, ఎవరైనా తనని గమనిస్తున్నారేమో, తన ఉద్దేశాలను గ్రహిస్తున్నారేమో అని భయపడిపోయాడు. సంఘసంస్కరణకు ఉద్దేశించిన ''రిఫార్మర్‌'' అనే పత్రికకు కాశీనాథ్‌ సంపాదకుడు. కులవ్యవస్థను నిరసిస్తూ, తన ఉదారవాద అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చేవాడు. గురూజీ భావాలను రియాక్షనరీ భావాలంటూ తన సంపాదకీయాల్లో తూర్పారబట్టేవాడు. అతని నోరు మూయించే పని నాథూకి అప్పగించారు గురూజీ. 

ఎందుకంటే నాథూని కాశీనాథ్‌ ఎప్పుడూ చూడలేదు. గురి తప్పి కాశీనాథ్‌ బతికితే, తనపై దాడి చేసినవాణ్ని ఆయన గుర్తుపట్టకూడదు. కాశీనాథ్‌ తన ఆఫీసు నుంచి యింటికి వెళ్లేందుకు పదిహేను నిమిషాలు పడుతుంది. మధ్యాహ్న సమయంలో యింటికి వెళుతూండగా తన సందులోకి తిరగగానే నాథూ ఒక పైపుతో ఆయన చెవి కింద మోదాలి. ఆ తర్వాత పరిగెట్టుకుని వెళ్లి దగ్గరున్న నదిలో ఆ పైపు పారేసి, వెంటనే హోటల్లో టీ తాగుతున్న తన స్నేహితుల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. రేపెవరైనా అడిగితే నాథూ తమతోనే వున్నాడని వాళ్లు సాక్ష్యం చెప్తారు. 

కానీ అసలు సమయానికి నాథూకి దడ పట్టుకుంది. కాశీనాథ్‌ ఒంటరిగా చిక్కేడనుకునే సమయానికి ఎవరో ఆయన్ను వెనకనుంచి పిలిచారు. ఆయన వెనక్కి తిరిగాడు. తనను చూశాడేమో అన్న అనుమానం పట్టుకుంది నాథూకి. ఇక యిప్పుడు కొట్టేదేదో గట్టిగానే కొట్టాలి, బతికితే ప్రమాదమే అనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. ఒక మనిషిని అలా కొట్టడం న్యాయం కాదేమో అనిపించింది. అంతలోనే గురూజీ ఉపదేశం గుర్తుకు తెచ్చుకున్నాడు. సుడిగాలిలా రివ్వున వెళ్లి పైపుతో కాశీనాథ్‌ చెవిపై గట్టిగా మోదాడు. కాశీనాథ్‌ శరీరం దబ్బున నేలకొరిగింది. అతని ముక్కుపుటాల్లోంచి రక్తం కారింది. ''అయ్యో, ఎవరో కొట్టి పారిపోతున్నారు, సాయం చేయండి'' అని అరిచి తనను నిర్దోషిగా చూపించుకుందామన్న ఐడియా వచ్చింది. కానీ అప్పటికే కొందరు ఆడవాళ్లు తలుపులు తీసి తొంగి చూస్తున్నారు. నాథూ పరుగు పెట్టాడు. ఎక్కడా ఆగలేదు.

ఇప్పుడూ అలాగే పరుగు పెట్టాలనిపించింది. కానీ నిదానించాడు. టాక్సీని పిలిచాడు.  పామైరో పామ్స్‌ హోటల్‌ పోనీ అన్నాడు.  ఎందుకంటే రాణీ ఆలోచనలతో నిద్ర లేచిన అతనికి చనిపోయేలోగా ఆమెను చూడాలని గాఢంగా అనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ హోటల్‌లో బస చేశారని పొద్దున్న చూసిన పేపర్లో వుంది. తన కింకా గంటన్నర సమయం వుంది, ఫర్వాలేదు.(సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?