Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? - 17

ఇదీ జరిగినది. ఇప్పుడు గోడ్సే వాదనలను పరికిద్దాం - సుహ్రవర్దీ మతకల్లోలాలకు కారకుడు అనడంలో ఏ సందేహం లేదు. రాజకీయకారణాలతో అతనే ఆ ఘాతుకాలను జరిపించాడు. కానీ ఎప్పుడైతే హిందువులు తిరగబడ్డారో కంగు తిన్నాడు. శాంతి కోసం అలమటించి, గాంధీని బతిమాలాడు. గాంధీకి కావలసినది శాంతి. శాంతి వలన ముస్లిములే కాదు, హిందువులూ రక్షింపబడతారు. కొన్ని ప్రాంతాలలో వారిది పైచేయి, యింకొన్ని ప్రాంతాలలో వీరిది పైచేయి. 'శాంతి కావాలంటే నువ్వు కూడా కలిసి రావాల్సిందే అని గాంధీ సుహ్రవర్దీకి షరతు పెట్టాడు. గాంధీకి తెలుసు - సుభాష్‌ బోసుతో తన వైరం కారణంగా బెంగాలీ లకు తనపై కోపం వుందని, సుభాష్‌ సోదరుడు శరత్‌ సుహ్రవర్దీకి మిత్రుడనీ. బెంగాల్‌లో తనకంటె ఎక్కువ పలుకుబడి వున్న సుహ్రవర్దీని కలుపుకుని రాకపోతే శాంతి నెలకొనడం కష్టమని గ్రహించాడు. సుహ్రవర్దీ తక్కువవాడేమీ కాదు. 31 ఏళ్ల వయసులో కలకత్తాకు డిప్యూటీ మేయరుగా పనిచేశాడు. ఏడేళ్ల తర్వాత 1931లో మేయరయ్యాడు. ముస్లిముల్లోనే కాదు, హిందువుల్లో కూడా అనుయాయులు వున్నవాడు. సంయుక్త బెంగాల్‌ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినవాడు. మెజారిటీగా వున్న ముస్లిములకు ప్రతినిథి. విభజన జరగగానే అతను తూర్పు పాకిస్తాన్‌ పారిపోలేదు. కలకత్తాలో హింసను చల్లార్చే బాధ్యత గుర్తెరిగి, అక్కడే వుండి మరీ వెళదామని ఆగాడు. 'గతాన్ని మరిచి యిద్దరం చేతులు కలిపితే శాంతి నెలకొంటుంది' అని గాంధీ చెప్పి ఆ సందర్భంగా అతని గురించి బహిరంగ సమావేశాల్లో నాలుగు మంచి మాటలు చెప్పి వుండవచ్చు. 'మై ట్రస్టెడ్‌ ఫ్రండ్‌' అన్నాడని, మీ యిద్దరి కలయిక వింతగా లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా 'ఏడ్వర్సిటీ మేక్స్‌ స్ట్రేంజ్‌ బెడ్‌ఫెలోస్‌' అన్నాడని నేను చదివాను. 'ఆత్మత్యాగ వీరుడు' (మార్టియర్‌ అని కాబోలు) అనే పదప్రయోగం నేను చదివినవాటిల్లో లేదు. ఒకవేళ అన్నా అని వుండవచ్చు. దాన్ని బట్టి సుహ్రవర్దీని గాంధీ సమర్థించాడని అర్థం తీయలేం.

జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వాజపేయి పాకిస్తాన్‌కు వెళ్లినపుడు 'మీరు జనసంఘ్‌ లీడరుగా పాకిస్తాన్‌పై ఫలానా ఫలానా వ్యాఖ్యలు చేశారు కదా, వాటికి కట్టుబడి వున్నారా?' అని అక్కడి మీడియా అడిగారు. 'అప్పుడు నేను ప్రతిపక్షంలో వున్నాను, ఇప్పుడు అధికారపక్షంలో వున్నాను.' అన్నారు వాజపేయి. ఆడ్వాణీ పాకిస్తాన్‌కు వెళ్లినపుడు జిన్నా చేయించిన ప్రత్యక్ష చర్య గురించి ప్రస్తావించలేదు. పాకిస్తాన్‌ ఏర్పడ్డాక 'ఇక్కడ అన్ని మతాలవారూ సమానమే' అంటూ యిచ్చిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ప్రతీ రాజకీయనాయకుడికీ అనేక కోణాలుంటాయి. దేన్ని ఎప్పుడు తీసుకుంటారనేది సందర్భం బట్టి వుంటుంది. నవాజ్‌ షరీఫ్‌ తల్లికి మోదీ శాలువా పంపించారు. 'భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి చూస్తున్న పాకిస్తాన్‌ దేశపు అధినేతకు యిలాటి మర్యాదలా, సిగ్గుసిగ్గు, మోదీ దేశద్రోహి' అనవచ్చా? శాలువా పంపారు కదాని అవసరమైతే యుద్ధానికి దిగడం మానేస్తారా? రాజకీయనాయకులు అసెంబ్లీలో అమ్మనాబూతులు తిట్టుకుంటారు. మళ్లీ ఒకరింట్లో పెళ్లయితే మరొకరు వచ్చి కౌగలించుకుంటారు. వ్యక్తిగతంగా మా మధ్య ఏమీ లేదంటూ నవ్వుతూ ఫోటోలు దిగుతారు. సుహ్రవర్దీతో కలిసి శాంతి ప్రయత్నాలు చేసే వేళ గాంధీ అతని గురించి ఓ నాలుగు మంచిమాటలు చెప్పివున్నా చెప్పవచ్చు. ఆశ్చర్యం లేదు.

ఇక మిగతా విషయాల గురించి - '...అప్పుడు గాంధీ పెద్ద ఆడంబరంతో నవ్‌ఖాలీ జిల్లాలో ఒంటరిగా పర్యటన చేయడానికి పూనుకున్నాడు. కానీ ఆయన ఎక్కడకు పోయినా గట్టి రక్షణను సుహ్రవర్దీ ఏర్పాటు చేయడం బహిరంగ రహస్యమే. అంత రక్షణ ఏర్పాట్లలో కూడా గాంధీ ఆ నవ్‌ఖాలీ జిల్లాలో ప్రవేశించడానికి సాహసించ లేకపోయాడు.' అన్నది తప్పు. 1946 అక్టోబరు 30 న గాంధీ కలకత్తాలోని సోడేపూర్‌కు వెళ్లాడు. అక్కణ్నుంచి నవంబరు 6 న బయలుదేరి, నవ్‌ఖాలీ జిల్లాకు వెళ్లి  ప్రయాణం కట్టాడు. అల్లర్లు బాగా జరిగిన శ్రీరాంపూర్‌ అనే ఊరిలో మకాం పెట్టి నాలుగు నెలలపాటు అక్కడే వున్నాడు. తిప్పెరా జిల్లాలో కూడా తిరిగి 1947 మార్చి 3 న మళ్లీ సోడేపూర్‌కు వచ్చి 4 న కలకత్తా విడిచిపెట్టాడు. నవంబరు 9 నుంచి 7 వారాల పాటు నవఖాళీ జిల్లాలోని 47 గ్రామాల్లో 116 మైళ్లు కాలికి చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ, అల్లర్లలో సగం కాలిన యిళ్లల్లో రాత్రుళ్లు బస చేస్తూ ద్వేషభావాన్ని విడనాడమని అందరికీ చెప్పాడు. జనాలు ఆయన మాట వినసాగారు కూడా. ముస్లిం లీగు నాయకులకు యిది మంట పుట్టించింది. 1947 ఫిబ్రవరి 12న ఫజుల్‌ హక్‌ అనే ముస్లిం లీగు నాయకుడు గాంధీ బెంగాల్‌లో వుండడం వలన ఇస్లాంకు హాని కలుగుతోందని ప్రకటన చేశాడు. గాంధీ వెళ్లే మార్గాన్ని కావాలని కశ్మలమయం చేసేవారని, ఆయన పాలు తాగే మేకను ఎత్తుకుపోయి, కోసుకుని తినేశారనీ కూడా చెప్పుకుంటారు. 

ఇలాటి ముస్లిం లీగు పార్టీకి నాయకుడైన సుహ్రవర్దీ గాంధీకి లోపాయికారీగా సాయపడ్డాడని, బహిరంగంగా రక్షణ కల్పించాడని గోడ్సే ఎలా అనుకున్నాడో తెలియదు. ఆ సమయానికి ముస్లిం లీగుకి కావలసినది అశాంతి, గాంధీ నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నది శాంతి. వాళ్లిద్దరికీ ఎందుకు పొసుగుతుంది? పైగా ముస్లిం లీగు బలవంతంగా చేయించిన మతమార్పిడులు చెల్లవని గాంధీ ప్రకటించాడు. 'ఫోర్స్‌డ్‌ కన్వర్షన్‌ యీజ్‌ నో కన్వర్షన్‌ ఎట్‌ ఆల్‌' అని గాంధీ అంటే దాన్ని వేదవాక్కుగా భావించిన హిందువులు, తమ మతమార్పిడిని తిరస్కరించి హిందువులుగానే వుండిపోయారు. ఇక ముస్లిం లీగు లక్ష్యం ఎలా నెరవేరుతుంది? ఆ సమయంలో గాంధీ ముస్లిం లీగుతో కుమ్మక్కయ్యాడన్నది అర్థరహితం. గోడ్సే 'గాంధీ నవ్‌ఖాళీ జిల్లాలోకి ప్రవేశించే సాహసం చేయలేకపోయాడు' అని ఎందుకు రాశాడు? ఏమో, ఎవరైనా తప్పుడు సమాచారం యిచ్చారేమో! ఈ సీరీస్‌లో 13వ భాగానికి కింద వచ్చిన వ్యాఖ్యలలో ఒక పాఠకుడు 'మోప్లా అల్లర్లలో వేల సంఖ్యలో హిందువులను వూచకోత కోస్తే, అది ముస్లిములు తమ మతాచార ప్రకారము చేసిన పవిత్రకార్యం' అని గాంధీ అన్నాడు - అని రాశారు. దానికి ఆధారం చూపమని కోరితే ఆయన 'యంగ్‌ ఇండియా 1-12-1921 నాటి సంచికలో వుందని దాన్ని కలక్టడ్‌ వర్క్‌స్‌ ఆఫ్‌ మహాత్మా గాంధీ వాల్యూం 25, పేజీ 151 అని రిఫరెన్సు యిచ్చారు ('తీస్తా ఎన్‌జిఓపై మరి కొంత - 4 పై వచ్చిన వ్యాఖ్యల్లో భాగంగా). నేను గాంధీహెరిటేజ్‌పోర్టల్‌ ఆర్గ్‌లో వెతికాను. మోప్లాలపై యంగ్‌ ఇండియా 1-12-1921 సంచికలో రాసిన వ్యాసం యిప్పటి వాల్యూమ్‌ 21లో 512-513 పేజీల్లో దొరుకుతోంది. (లింకు యిదిగో - https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/MjE=#page/540/mode/2up) అది చదివి ఆయన చెప్పిన వాక్యాలకు సంబంధించిన వాక్యాలు వుంటే ఎత్తి చూపిన పాఠకులకు ధన్యవాదాలు.

ఆయనే ఆ వ్యాఖ్యతో బాటే మరొకటి కూడా చేశారు - 'ముస్లిములు హిందువులందరినీ చంపివేసినా మారుమాటాడకుండా చచ్చిపోయి పైకి పోయిన తర్వాత స్వర్గంలో హిందూ సామ్రాజ్యం స్థాపించుకోవాలి' అని గాంధీ అన్నారు' - అని. దానికి రిఫరెన్సుగా ''హరిజన్‌'' పత్రిక 6-4-1947, 23-9-1947 అని యిచ్చారు. అదే పోర్టల్‌లో జర్నల్స్‌ బై గాంధీ సెక్షన్‌లో ఆ పత్రిక సంచికలు కూడా దొరుకుతున్నాయి. హరిజన్‌ 11లో ఏప్రిల్‌ 6 సంచిక వుంది. సెప్టెంబరు 23 సంచిక లేదు, 21, 28 తారీకులవి వున్నాయి. లింకు యిదిగో - https://www.gandhiheritageportal.org/journals-by-gandhiji/harijan. ఆ మూడిటిలో యీ మాటలకు సంబంధించినది ఏమైనా వుంటే నాకు ఎత్తి చూపగోర్తాను. ఈ ప్రయత్నం వలన సమాచారాన్ని సేకరణ, నిర్ధారణల్లో కష్టాలు మీకూ అర్థమవుతాయి. గోడ్సేకు సమాచారం సేకరించి, విడమరిచి చెప్పేవారు ఎవరో మనకు తెలియదు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?