Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : గుడ్డులో తుపాను

ఎమ్బీయస్‌ : గుడ్డులో తుపాను

ఏసుక్రీస్తు శిలువ నుంచి లేచిన మూడోనాడు ఈస్టర్‌ పండుగ జరుపుతారు. ఆ రోజు ఆదివారం కాబట్టి పిల్లలు కూడా పాల్గొనే వేడుకగా దాన్ని మలచారు. గట్టిగా ఉడికించిన గుడ్లకు రంగులేసి, లేదా గుడ్డు ఆకారంలో వున్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో చాక్‌లెట్లు, కాండీలు కుక్కి తోటలోనో, యింట్లోనో ఎక్కడో దాచివేసి పిల్లల్ని వెతుక్కుని రమ్మంటారు. పిల్లల వయసును బట్టి ఆ గుడ్లను చేరడానికి కొన్ని అవరోధాలను కూడా కల్పిస్తారు. పిల్లలు ఒక బుట్ట పట్టుకెళ్లి దానిలో సాధ్యమైనన్ని గుడ్లు వేసుకుని తెస్తారు. చివరిలో ఎవరు ఎక్కువ తెచ్చారో చూసి బహుమతులు యిస్తారు. ఒక్కోప్పుడు ఫలానా రంగు గుడ్డు తెచ్చినవారికి ప్రత్యేక బహుమతి అంటారు. ఈ విధంగా పిల్లలకు సాహస క్రీడలతో పాటు పొలాల, తోటల పరిచయం కూడా అవుతుందని పెద్దల ఆశ.  ఇది తరతరాలుగా సాగుతూ వస్తోంది. అయితే యీసారి బ్రిటన్‌లో యీ ఆట వివాదానికి దారి తీసింది. 

క్యాడ్‌బరీ చాక్లెట్‌ కంపెనీ అందరికీ తెలుసు. అది యీ ఆటను తన మార్కెటింగ్‌కై వాడుకుందామని అనుకుంది. బ్రిటన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలను, తీరప్రాంతాలను, ప్రాచీన కట్టడాలను పరిరక్షించే నేషనల్‌ ట్రస్టుతో కలిసి కో-స్పాన్సరింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం కాడ్‌బరీ చాక్లెట్లు నింపిన ఈస్టర్‌ గుడ్లను ట్రస్టు తాలూకు స్థలాల్లో దాస్తుంది. అక్కడకు వెళ్లిన పిల్లలకు ఆ యా ప్రాంతాల గురించి అవగాహన పెరుగుతుంది, అదే సమయంలో కాడ్‌బరీకి ఎడ్వర్టయిజింగ్‌ జరుగుతుంది. పదేళ్లగా యీ ఏర్పాటు ''ఈస్టర్‌ ఎగ్‌ ట్రైల్‌'' పేరుతో చక్కగా జరిగింది. ఉభయులూ లాభపడ్డారు. లక్షలాది పిల్లలకు తమ సాంస్కృతిక వారసత్వం గురించి తెలిసి వచ్చింది. ఈ ఏడాది 300 చోట్ల యీ హంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈ ఏడాది కాంపెయిన్‌కు పేరు పెట్టినప్పుడు ''కాడ్‌బరీస్‌ గ్రేట్‌ బ్రిటిష్‌ ఎగ్‌ హంట్‌'' అని పెట్టారు తప్ప ఈస్టర్‌ అని చేర్చలేదు. ఇది చర్చిని మండించింది. పండగ ప్రాముఖ్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందంటూ దాడి మొదలుపెట్టింది. నిజానికి 16 వ శతాబ్దం నుంచి ఇంగ్లండుకి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మతవిషయాల్లో మార్గదర్శకత్వం వహిస్తోంది. కానీ పోనుపోను ఇంగ్లండ్‌కు అనేక యితర చర్చిలకు సంబంధించిన క్రైస్తవులు వలస వచ్చారు. జనాభాలో ఇతర మతస్తులు, హేతువాదులు కూడా పెరిగారు. దానాదీనా చర్చి ఆఫ్‌ ఇంగ్లండుకు ప్రాబల్యం తగ్గింది. ఇప్పుడీ అవకాశాన్ని అదనుగా తీసుకుని క్రైస్తవానికి అవమానం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతోంది.

కాడ్‌బరీ కంపెనీని కీర్తిశేషుడైన క్యాడ్‌బరీ అనే ఇంగ్లీషు వ్యక్తి 1824లో స్థాపించాడు. ఆ కంపెనీ చాలా వృద్ధి చెందింది. 2010లో దాన్ని 20 బిలియన్‌ డాలర్లకు క్రాఫ్ట్‌ ఫుడ్స్‌ గ్రూపు అనే అమెరికన్‌ సంస్థ తీసుకుంది. 2012 నాటికి దాని పేరు మెండెలెజ్‌ ఇంటర్నేషనల్‌గా మారింది. బ్రెగ్జిట్‌ తర్వాత బ్రిటన్‌లో ఇంగ్లీషు ఐడెంటిటీ కోసం తపన పెరిగింది. 'కాడ్‌బరీ కంపెనీ యిప్పుడు అమెరికన్ల వశమైంది. డబ్బు తప్ప అమెరికన్లకు మన సెంటిమెంట్లేం తెలుసు? అందుకే యిలా జరుగుతోంది' అనే భావన ప్రజల్లో వ్యాపిస్తోంది. ఆ సెంటిమెంటును ప్రతిబింబించేట్లు యార్క్‌ ఆర్చిబిషప్‌ జాన్‌ సెంటామూ ''ఈ కంపెనీని స్థాపించిన కాడ్‌బరీకి క్రైస్తవ మతాచారాలంటే ఎంతో గౌరవం. ఆయన తన కార్మికుల కోసం యిళ్లు కట్టించడమే కాక, చర్చిలు కూడా కట్టించాడు. ఈస్టర్‌ పండగ జరుపుకోవడానికి ప్రాతిపదిక ఐన మతవిశ్వాసాన్ని వీళ్లు ఎగరగొట్టేస్తున్నారు. దీనిలో 'ఈస్టర్‌' పదాన్ని తొలగించడం కాడ్‌బరీ స్మృతిని అవమానించడమే (స్పిటింగ్‌ ఆన్‌ హిజ్‌ గ్రేవ్‌)'' అన్నాడు. 

దీనికి సమాధానమిస్తూ కాడ్‌బరీ, నేషనల్‌ ట్రస్టు 'మేం ఈస్టర్‌ పేరు తీసేయలేదు. కాంపెయిన్‌ పేరులో మాత్రం ఈస్టర్‌ లేదు కానీ మా వెబ్‌సైట్లలో, పబ్లిసిటీ మెటీరియల్స్‌లో పదేపదే ఈస్టర్‌ గురించి ప్రస్తావించాం. మొత్తం 13 వేల చోట్ల ఈస్టర్‌ పేరు వుంది, గమనించండి. మాకు ఈస్టర్‌పై భక్తి లేక కాదు, కేవలం క్రైస్తవులే కాక అన్ని మతాల వారు దీనిలో పాలుపంచుకోవాలనే సదుద్దేశంతో ఈస్టర్‌ పేరు వాడలేదంతే.' అన్నారు. కానీ ఈ వివరణపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే కూడా సంతృప్తి చెందలేదు. ''నేను ఒక వికార్‌ (పూజారి) కూతుర్నే కాదు, నేషనల్‌ ట్రస్టు సభ్యురాల్ని కూడా. వాళ్లు చేస్తున్న పని అసంబద్ధంగా (రిడిక్యులస్‌) వుంది.'' అంది. నేషనల్‌ ట్రస్టు సభ్యులు కొందరు ఈ అంశంపై అలిగి, తమ సభ్యత్వాలకు రాజీనామా యిచ్చేద్దామనుకుంటున్నారట. ఏప్రిల్‌ 16 న రాబోయే ఈస్టర్‌లోగా యింకేమైనా ప్రకటనలు వస్తాయేమో చూడాలి.

అయితే అసలైన చమత్కారం యింకోటి వుంది. ఏ కాడ్‌బరీ పేరు చెప్పి చర్చి ఆఫ్‌ ఇంగ్లండు యింత రగడ చేస్తోందో, ఆయన క్రైస్తవంలో క్వాకర్‌ తెగకు చెందినవాడు. ఆ మాటకు అర్థం స్నేహితులని. దాన్ని రెలిజియస్‌ సొసైటీ ఆఫ్‌ ఫ్రెండ్స్‌గా వ్యవహరిస్తారు. వాళ్ల దృష్టిలో ప్రతి మానవుడిలో దైవం వుంటాడు. అందువలన ఒకరిని ప్రత్యేకంగా దేవుడు లేదా పూజారి అననక్కరలేదు. విశ్వాసం వున్న ప్రతివాడూ పూజారే. క్రిస్మస్‌, ఈస్టర్‌ వంటి పండుగలు జరపనవసరం లేదు. కాడ్‌బరీ కూడా క్వాకర్‌ కాబట్టి ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఈస్టర్‌ జరపలేదు. ఈ విషయాన్ని ఆయన వారసులు చెపుతున్నారు. ''ఇప్పుడీ కాంపెయిన్‌లో ఈస్టర్‌ పేరు లేకపోవడం చేత ఆయన ఆత్మ శాంతించదనడం అర్థరహితం. అనవసరంగా ఆయన పేరు దీనిలోకి లాగకండి.'' అని ప్రకటించారు. ఒక పరిశీలకుడు 'టీ కప్పులో తుపాను అంటూ వుంటాం కదా, యిది గుడ్డులో తుపాను' అని చమత్కరించాడు కానీ పిల్లల కోసం ఉద్దేశించిన యాడ్‌ కాంపెయిన్‌ పేరు విషయంలో ప్రధాని దగ్గర్నుంచి కలగచేసుకోవాలా? అనే ప్రశ్న మనసులో మెదిలితే పరాయి శక్తుల బూచి చూపించి జాతీయతావాదాన్ని రెచ్చగొట్టడం బ్రిటన్‌లోనూ జరుగుతోందన్నమాట అనే సమాధానం వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?