Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : గుమ్‌నామీ బాబా బోసా? కాదా?

సుభాష్‌ చంద్ర బోసు స్వాతంత్య్రానంతరం భారతదేశం తిరిగి వచ్చి యుపిలోని ఫైజాబాద్‌లో గుమ్‌నామీ బాబా పేరుతో నివసించాడని కథలుకథలుగా చెప్పుకునేవారు. అవునో కాదో తేల్చినవారెవరూ లేరు. తేలకుండానే 1985 లో ఆయన పోయాడు. 30 ఏళ్ల తర్వాత యిప్పుడు ఆయన పుట్టుపూర్వోత్తరాలు తవ్వడానికి పూనుకుంది అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వం. చరిత్రపై యింత ఆసక్తి ఎందుకు పుట్టిందని ఆశ్చర్యపడవద్దు. నెహ్రూ కుటుంబం తప్ప విడిచి తక్కిన పాతకాలం నాయకులందరినీ తన ఖాతాలో వేసుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు చూసి, తామెందుకు వెనకపడాలని సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ప్రయత్నమిది. సుభాష్‌ బోసు పట్ల తమకూ భక్తి వుందని చాటుకోవడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతికింది. బోసుకు, యుపికి వున్న కనక్షన్‌ ఏమీ దొరకలేదు - యీ బాబా లింకు తప్ప! సరే, దీన్నే గట్టిగా పట్టుకుందాం అనుకుని గుమ్‌నామీ బాబా ఎక్కడివాడో, ఏమో తేల్చండి అంటూ ఏప్రిల్‌ 3 న ఒక కమిటీ వేసింది. 'ఇన్నాళ్లూ లేనిది యిప్పుడెందుకు వేశారు, రాజకీయలబ్ధి కోసమా?' అని అడిగితే 'కోర్టు ఆదేశాల మేరకు వేశాం అని జవాబిచ్చాడు అఖిలేశ్‌. గుమ్‌నామీ బాబా నేపథ్యం తేల్చాలని నేతాజీ సోదరుని కూతురు లలితా బోసు 1986లో  అలహాబాదు హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. బాబాకు ఆఖరి దశలో యిల్లు అద్దెకిచ్చిన గురుదత్‌ సింగ్‌ మనుమడైన శక్తి సింగ్‌ అనే బిజెపి నాయకుడు బాబా వస్తువులను మ్యూజియంలో పెట్టాలని కోరుతూ 2010లో మరో పిటిషన్‌ వేశాడు. వాటిపై తీర్పు చెపుతూ 'బాబా వస్తువులను ప్రభుత్వ మ్యూజియంలో ప్రదర్శనకు వుంచి, ఆయనెవరో తేల్చడానికి ఒక ఎంక్వయిరీ కమిషన్‌ వేయండి' అని కోర్టు 2013 జనవరి 31 న ఆదేశించింది. ఇది మూడేళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందంటే రాజకీయ కోణం వుండే వుంటుందని అనుమానం.

బోసుకి రావలసినంత ఖ్యాతి రాకుండా చేయడానికి నెహ్రూ కుట్ర పన్నాడని నిరూపించడానికి బిజెపి ప్రభుత్వం బోసు ఫైళ్లు అంటూ కొన్ని దఫదఫాలుగా విడుదల చేస్తోంది. బెంగాల్‌ ఎన్నికలదాకా వేడి నిలపడానికే దఫదఫాలుగా చేస్తోందనుకున్నారు. మమతా బెనర్జీ అంతకుముందే బోసు ఫైళ్లు విడుదల చేసి బోసు భక్తురాలిగా చాటుకోబోయింది. కానీ బెంగాల్‌ ఎన్నికలలో బోసు గతం ఒక అంశంగా ఎవరూ ప్రస్తావించటం లేదు. ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఫైళ్లలో గట్టిగా చెప్పుకోవడానికి ఏదీ లేదు. బోసు చేసిన రేడియో ప్రసంగం విన్నాను అంటూ బెంగాల్‌ గవర్నరు ఆఫీసులో పని చేసే ఒక బెంగాలీ ఆఫీసరు రాసిన లేఖ గురించి ప్రస్తావన బయటకు వచ్చింది. ఏ రేడియో స్టేషన్‌ నుంచి అది ప్రసారమైంది అన్న వివరాలు దానిలో లేవు. దాని గురించి ఆ ఆఫీసరు రిటైరయ్యాకైనా ప్రయత్నాలు చేసినట్లు, బోసు పేర నడిచే రాజకీయపక్షం ఫార్వార్డ్‌ బ్లాక్‌కైనా తెలిపినట్లు లేదు. బోసు బతికున్నాడని అసత్యాలు కల్పించిన బెంగాలీలలో యితనూ ఒకడమే తెలియదు. తాజాగా జపాన్‌ ప్రభుత్వం బోసు ఫైళ్లు కొన్ని విడుదల చేస్తానంటోంది. వాటిలోనైనా ఏమైనా వుంటుందేమో వేచి చూడాలి. యుపిలో ఎన్నికలు రాబోతున్నాయి. తమ పార్టీకి బోసు పట్ల ప్రేమ లేదని బిజెపి ప్రచారం చేస్తుందేమోనని భయం వేసి కాబోలు, అఖిలేశ్‌ వెంటనే బాబా వస్తువులను అయోధ్యలోని రామ కథా సంగ్రహాలయ అనే ప్రభుత్వ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టమని ఆదేశించాడు. 

ఇంతకీ యీ గుమ్‌నామీ బాబా గురించి యిప్పటిదాకా తెలిసిన విశేషాలేమిటి? ముందుగా తెలుసుకోదగినది - బాబా అనగానే పెద్ద గడ్డం వేసుకుని ఆశ్రమం నడిపాడని, భక్తులను చేరదీసి దేశభక్తి నూరిపోసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడనీ అనుకోకూడదు. ఆయన ఖరీదైన 555 సిగరెట్లు తాగేవాడు. రెండు మూడు పైపులు కూడా దొరికాయి. జేబులో కరెన్సీ నోట్లు బాగా వుండేవిట. మటన్‌ ఖీమా, అన్నా బెంగాలీ స్వీట్లన్నా బాగా యిష్టం. అసలైన సంగతి - తను బోసునని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎవరితో కలిసేవాడు కాదు. ఎవర్నీ తన ఫోటో తీయనిచ్చేవాడు కాదు. తరచుగా యిళ్లు మార్చేవాడు. ఆయన 1974లో యుపిలోని బస్తీ జిల్లా నుంచి ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యకు వచ్చాడు. 1982లో అయోధ్య నుంచి జిల్లా కేంద్రమైన ఫైజాబాద్‌కు మకాం మార్చాడు. గురుదత్‌ సింగ్‌ అనే మేజిస్ట్రేటు తన బంగళా చుట్టూ అనేక వాటాలు కట్టి అద్దెకిచ్చాడు. వాటిలో 300 చ.అ.ల వాటాలో నాలుగు వందల రూపాయల అద్దెకు యీ బాబా వుండేవాడు. ఎప్పుడూ బయటకు వచ్చేవాడు కాదు. ఆయనను చూడడానికి చాలా తక్కువమంది వచ్చేవారు. గుండ్రటి కళ్లద్దాలు పెట్టుకుని, పెద్ద గొంతుకతో మాట్లాడేవాడు. తన మొహం ఎవరికీ చూపేవాడు కాదు. అందరితో కిటికీలోంచే మాట్లాడేవాడు. 1985 అక్టోబరు 18 న ఫైజాబాదులోనే మరణించాడు. అక్కడే ఆయన్ని దహనం చేశారు. వారసులమంటూ ఎవరూ రాకపోవడంతో ఆయన వస్తువులను ఫైజాబాద్‌ జిల్లాలోని జిల్లా ట్రెజరీ ఆఫీసులో డబుల్‌ లాక్‌ సెక్షన్‌లో భద్రపరచారు. వాటిని బయటపెట్టమని ఆ మరుసటి ఏడాదే లలితా బోసు పిటిషన్‌ వేశారు. 

1999లో బోసు మరణంపై 1999లో వేసిన ముఖర్జీ కమిషన్‌ బృందం బాబా వస్తువులను పరిశీలించింది. 2004లో సమర్పించిన నివేదికలో 1945 నాటి విమానప్రమాదంలో కాకపోయినా తర్వాత బోసు మరణించారని ఖాయం చేస్తూ, చేతివ్రాత నిపుణుల, డిఎన్‌ఏ పరీక్షల నివేదికలను చూస్తే బాబా మారువేషంలో వున్న బోసు అనడానికి రుజువేమీ లేదని చెప్పింది. ఆ వస్తువులను యీ మార్చిలో అఖిలేశ్‌ నియమించిన నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. ఇంతకీ అవేమిటి? అనేక ఫోటోలు.. వాటిలో చాలా భాగం బోసు కుటుంబానికి చెందినవే. ఫ్రేమ్‌ చేయించివున్న బోసు తల్లితండ్రుల ఫోటో, బోసు తన సోదరీసోదరులతో దిగిన చిన్ననాటి ఫోటో, పెద్దయ్యాక బోసు ఫోటోలు.. యిలా ఎన్నో. బైనాక్యులర్స్‌, రోలెక్సు వాచ్‌, కాసెట్‌ టేపు ప్లేయరు, పోర్టబుల్‌ టైప్‌రైటరు, రేడియో, వీటితో బాటు ఇంగ్లీషులో, బెంగాలీలో వున్న అనేక పుస్తకాలు. పుస్తకాల్లో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించినవే వున్నాయి. ఆనందబజార్‌ పత్రిక పేపర్ల కట్ట కూడా వుంది. బోసు నడిపిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో యింటెలిజెన్సు ఆఫీసరుగా పనిచేసి పవిత్ర మోహన రాయ్‌కు ఆయనకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలున్నాయి. 1972 సెప్టెంబరులో అప్పటి ఆరెస్సెస్‌ అధినేత గోల్వాల్కర్‌ బాబాకు రాసిన ఉత్తరం దొరికింది. 'పరమ పూజ్యపాద విజయానంద్‌జీ మహరాజ్‌' అని సంబోధిస్తూ 'మీరు గత నెలలో మీరు రాసిన మూడు ప్రదేశాల గురించి నేను కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. వాటిల్లో సరిగ్గా ఎక్కడ వెతకాలో యితమిత్థంగా చెపితే నా పని సులువౌతుంది' అంటూ రాశారాయన.

ఇవన్నీ మ్యూజియంలోని ఒక విభాగంలో భద్రపరచి దాన్ని యీ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించబోతున్నాడు అఖిలేశ్‌. 'ఇదంతా శుద్ధ అనవసరం.గుమ్‌నామీ బాబా సుభాష్‌ బోసు అనుయాయుడెవరైనా అయివుండవచ్చు తప్ప బోసు మాత్రం కాదు. బోసుకు అనేకమంది సోదరులు, సోదరీమణులు, వాళ్ల పిల్లలు.. ఎంతో బంధుబలగం వుంది. ఆయన బతికుండగా ఎవర్నీ కలిసే ప్రయత్నం చేయలేదు. సుభాష్‌ బోసుకు తన అన్నగారు శరత్‌ అంటే ఎంతో గౌరవం, ప్రేమ. ఆయన్నయినా, ఆయన పిల్లలనైనా కలవడమో, ఉత్తరాలు రాయడమో చేయకుండా ఎలా వుంటాడు? అయినా ఆయన తను బోసునని చెప్పుకోనే లేదు కదా, ఎందుకొచ్చిన రగడ యిది?' అంటున్నారు బోసు కుటుంబసభ్యులు. వాళ్లకేం, ఎన్నయినా చెప్తారు? ఓట్ల వేటగాళ్ల కష్టాలు వాళ్లకేం తెలుసు? 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?