Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఇదేం రణనీతి, ముద్రగడా?

ఎమ్బీయస్‌: ఇదేం రణనీతి, ముద్రగడా?

ఆందోళన ప్రారంభించేవారు పాలకుల నుండి ఏదైనా సాధించాలనే ఉద్దేశంతోనే మొదలుపెడతారు. ఎందుకంటే ఏదైనా యివ్వగలిగేది అధికారంలో వున్నవారే తప్ప, ప్రతిపక్షాల్లో వున్నవారు కాదు, మీడియా కాదు, పక్కన నినాదాలు యిచ్చేవారు, కంచాలు సొట్టపరిచేవారు కాదు. ఇప్పుడు కాపుల రిజర్వేషన్‌పై, కాపు కార్పోరేషన్‌ నిధులపై నిర్ణయం తీసుకోవలసినది చంద్రబాబు. ఆయనతో అనునయంగానో, హెచ్చరిస్తూనో, లౌక్యంగానో, యిరకాటంలో పెడుతూనే ఉద్యమం సాగితే ఎంతో కొంతమేరకు విజయం సాధించవచ్చు. కానీ యీ ముద్రగడేమిటి, ఏకంగా చంద్రబాబును డైరక్టుగా నిందించడం మొదలుపెట్టారు! 'రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల స్థాయికి ఎలా ఎదిగారో బాబు చెప్పాలంటూ స్టేటుమెంటు యిచ్చారు. ఆ కిటుకేదో చెప్పి కాపుజాతిని కూడా అభివృద్ధి చేయాలట. కిటుకు చెప్పేస్తే కార్పోరేషన్‌కు నిధులివ్వమని అడగరట.

మొట్టమొదట ముద్రగడ తెలుసుకోవలసినది - కాపులను 'జాతి' అని ప్రస్తావించిన కొద్దీ కాపేతరులకు మండుతుంది. తెలుగుజాతి ఒకటి అంటూ పాటలు పాడుకుంటూ వచ్చాం యిన్నాళ్లూ. ప్రాంతభేదం చూపించి తెలంగాణ జాతి వేరు అంటూ టి-ఉద్యమకారులు వేరు రాగం తీసి, తెలుగు తల్లికి ప్రతిగా తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. తెలంగాణ భాష వేరే అంటున్నారు. ఇప్పుడు ముద్రగడ కాపుల గురించి మొదలెట్టారు. ఇక అతి త్వరలో కాపు తల్లి, కాపు భాష, కాపు సంస్కృతి, కాపు చారిత్రకవారసత్వం వగైరాలు వెలుస్తాయేమో. ఇలా ప్రతి కులమూ తమను తాము జాతిగా ప్రకటించుకుంటే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కనీసం అరవై జాతులు ఏర్పడుతాయి. మా కులానికి... అంటే పోయేదానికి మా జాతి అనడం దేనికి, వ్యవహారం ముదిరితే ఆయన వూరినో, జిల్లానో మా దేశం అని కూడా అనేయవచ్చు. 

ఇక రెండో పాయింటు - బాబు రెండు లక్షల కోట్ల నాయకుడని ముద్రగడకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అఫిడవిట్‌లో వుందా? ఆధారాలున్నాయా? ఏమీ లేకుండా లూజుగా మాట్లాడితే ఎలా? జగన్‌-లక్ష కోట్లు పాట పాడిపాడి టిడిపి పలుచనై పోయింది. సిబిఐ పెట్టిన కేసులు కూడా (వాటి అతీగతీ ఎవరూ చెప్పలేరు, ధిక్కరించినందుకు జగన్‌ను జైల్లో పెట్టేసి సోనియా కసి తీర్చేసుకుని మర్చిపోయింది, అవినీతి తుదముట్టిస్తాననే మోదీ యీ కేసుల విచారణ వేగవంతం చేసి విడిచిపెట్టడమో, జైల్లో పెట్టడమో చేయాలి. కానీ నానుస్తూనే వున్నాడు) ఆ మొత్తానికి చాలా దూరంలో ఆగిపోయాయి. అయినా అసెంబ్లీలో జగన్‌ లేవగానే 'లక్ష కోట్లు' అంటూ లయబద్ధంగా టిడిపి నాయకులు పాట పాడుతూనే వుంటారు. అధికారంలోకి రాగానే లోటస్‌ పాండ్‌పై దాడి చేసి లక్ష కోట్లు లాక్కుని పేదలకు పంచుతామని, రాజధాని కట్టేస్తామని యిలా చాలా ప్రకటనలు చేశారు టిడిపి నాయకులు. ఇప్పుడవేమీ గుర్తుకు రాక, కాపుల కార్పోరేషన్‌కు నిధులు లేవు, వాళ్లు ఓర్చుకోవాలి, రాజధానికి డబ్బు లేదు, స్కూలు పిల్లల దగ్గర్నుంచి పదీ, పరకా యివ్వాలి, యిటికలు కొనుక్కోవాలి అంటూ తంటాలు పడుతున్నారు. అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్లు జగన్‌ లక్ష కోట్లు మిథ్య, వాటిని వడేసి పట్టుకోవడం మిథ్య అన్నట్లుగా తయారైంది. టిడిపి జోకులకే నవ్వలేక ఛస్తూ వుంటే యిప్పుడు మీరూ వారికి తోడవుతే ఎలా ముద్రగడ గారూ! వాళ్లు తమలపాకుతో ఒకటంటే, నేను తలుపుచెక్కతో రెండంటా అన్నట్లు, వాళ్లు లక్ష అన్నారని మీరు రెండు లక్షలన్నారా? ఇలా అయితే మీ మాటకు విలువుంటుందా?

పైగా ఆ కిటుకేదో చెప్పేయాలా? అమ్మా, ఆశ! రెండు లక్షల కోట్లు కాదు, దానిలో 1% రెండు వేల కోట్లు మాత్రమే సంపాదించారనుకోండి. అదైనా ఎలా సంపాదించారో మీకు చెప్పేస్తారా? చెపితే పెద్దపెద్ద వ్యాపారస్తులందరూ ఐఐఎమ్‌లని సలహాదారులుగా పెట్టుకోవడం మానేసి ముఖ్యమంత్రుల వెంట పడరా? మీకు నిజంగా బాబుతో బాటు ఎదగాలని వుంటే వెళ్లి భాగస్వామిగా చేరాలి. లేకపోతే వ్యాపారాల నుంచి, రాజకీయాల నుంచి రిటైరయ్యాక బాబు ఆత్మకథ రాస్తే అది కొనుక్కుని చదువుకోవాలి. బాబే కాదు, ఏ వ్యాపారవేత్తయినా సరే, మాకు లాభాలొస్తున్నాయి, ఆ రహస్యాలేమిటో చెప్తాను పట్టండి అంటూ క్లాసులు పెట్టి చెప్పరు. నష్టాల్లోనే వున్నాం, ఏదో అలవాటు కొద్దీ, మా ఉద్యోగులను రోడ్డు మీద పడేయడం యిష్టం లేక వ్యాపారాన్ని లాక్కువస్తున్నాం అంటారు. ఇతరులు వీళ్ల విధానాలను అధ్యయనం చేసి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో పాఠాలు చెప్పి లక్షల్లో జీతాలు పుచ్చుకుంటారు. మీరు సిన్సియరైతే ఆ క్లాసులకు హాజరై తెలుసుకోవాలి. ఇంకో హెచ్చరిక- కిటుకులు విన్నంత మాత్రాన విద్య పట్టుబడదు. దానికి చేయాల్సిన కృషి చాలా వుంది. మీరెప్పణ్నుంచో రాజకీయాల్లో వున్నారు. మీ కళ్లెదురుగానే మీ కులస్తులతో సహా ఎందరో పైకి వెళ్లారు. వాళ్లను చూసి మీరేం నేర్చుకున్నారు? అప్పుడూ నిరాహారదీక్షలు చేశారు, యిప్పుడూ చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే వుంది. 

బాబు రెండు లక్షల కిటుకేదో చెప్పేస్తే కాపుల కార్పోరేషన్‌కు ఏటా వెయ్యి కోట్లు యివ్వక్కరలేదని చెప్పడానికి మీరెవరు? రిజర్వేషన్‌ సంగతి దేవుడెరుగు, ఆర్థికసాయం అందిస్తే బాగుపడదామని అనేక మంది కాపు యువత, కాపు వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు. కిటుకులతో పని కాదని, కాసులు కావాలని వాళ్లకు తెలుసు. మీరు దీక్షలో వుండి నీరసపడడం చేత యీ విషయం తట్టడం లేదు. కాపులెవ్వరికీ కాసులక్కరలేదు, కిటుకులు చాలు అని డిక్లేర్‌ చేసే దుస్సాహసం చేయకండి. 'నాకు కాదు, బాబుకి వైద్యపరీక్షలు చేయించండి, హామీలు గుర్తొస్తాయి' అంటూ సెటైర్లు ఒకటా? పైగా యిది వ్యంగ్యం కాదు అంటూ తూగోజి మార్కు వెటకారం కూడా జోడించారు. బాబు రాయలసీమవారు. ఆయన భాషలో చమత్కారాలు, వెటకారాలు వుండవు. మీ వెక్కిరింతను అర్థం చేసుకున్నాక ఆయనకు మండుతుంది. ఎందుకంటే రెండు లక్షల కోట్లు అంటూ మీరు ఆయన్ని అవినీతిపరుడిగా చిత్రీకరిస్తున్నారు. జగన్‌ను తిరస్కరించి, ప్రజలు తనకు పట్టం కట్టినది తన యింటిపేరు 'నిప్పు' కాబట్టే అని ఆయన నమ్మి మనల్ని నమ్మమంటున్నారు. అలాటిది మీరు ఆయన్ను జగన్‌కు రెట్టింపు గురువుగా చూపితే ఏమనుకుంటారు? అయినా మీకు యీ ఆరాలన్నీ యిప్పుడే గుర్తుకు వచ్చాయా? '18 నెలల క్రితం మా కాపులందరం మిమ్మల్ని నమ్మి ఓట్లేశాం' అని చెప్తున్నారే, అప్పుడు 'మనకు రిజర్వేషన్‌, నిధులు యిస్తే చాలు, ఆయన అవినీతిపరుడైనా ఫర్వాలేదు' అనుకున్నారా మీ అందరూ..?

ఇప్పుడాయన్ని మండించి మీరేం సాధించబోతున్నారు? ఈ రోజు ఆయనే ముఖ్యమంత్రి. తలచుకుంటే ఆయనే ఏదైనా యివ్వాలి. తలచుకోకపోతే యివాళ రాత్రికే మీ దీక్ష భగ్నం అయిపోతుంది. మీ ఉద్యమం ద్వారా జగన్‌ను అప్రదిష్ఠ పాలు చేసే అవకాశం వుందేమోనని ఆయన చూస్తున్నాడు. ఆందోళనకారుల మొహం కూడా చూడకుండా వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు చెప్పేయగల దిట్ట ఆయన. కావాలనుకుంటే హింస రెచ్చగొట్టారనే నేరంపై మిమ్మల్ని అవేళే అరెస్టు చేయించవచ్చు. మిమ్మల్నేమీ గట్టిగా అనకుండా జగన్‌కు దండన వేద్దామని ఆయన ఓపిక పడుతున్నారు. దాన్ని మీరు అలుసుగా తీసుకుని, బాబును నోటి కొచ్చినట్లు అనేస్తే ఆయన ఓపిక హరిస్తుంది. మీరు నిరాహార దీక్ష కాదు, తపస్సు చేసినా యిప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చలేరు. 2019 తర్వాత రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా - మాట వరసకి మీరే అయినా - కాపు రిజర్వేషన్‌ సమస్య తేల్చడం ఎవరి తరం కాదు. ఇప్పటికిప్పుడు బాబుతో వైరం దేనికి? ఆయన హామీలు మర్చిపోయినందుకా? పోనీ మీకు గుర్తున్నాయి కదా, మీరేం చేశారు? లేఖ రాసి వూరుకోవడమేం? దీక్ష చేస్తే ఎన్నాళ్లు చేస్తారు? ఎన్నాళ్లు చేయనిస్తారు? గతంలో తుపాకీ దగ్గర పెట్టుకుని కూడా చేశారు. ఏమైనా సాధించారా? గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రంలో కాపులు అంత నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకు కాదు. అందుకే కాంగ్రెసు, టిడిపిలు వాగ్దానాలను తుంగలోకి తొక్కినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో సంఖ్యాబలంతో కాపులకు కొత్త శక్తి వచ్చింది. వారి డిమాండ్లు నిర్లక్ష్యం చేయడం పాలకులకు కష్టం. ఏదైనా సాధించదలిస్తే యిదే అదను. 

ఇటువంటి సమయంలో గత 18 నెలలుగా మీరేం చేశారు? బాబుకైతే లక్ష సమస్యలు, కాపు సంక్షేమం తప్ప మీకు వేరే వ్యాపకమేముంది? ఊరూరా తిరిగి, వాడవాడలా కాపు సంఘాలు పెట్టవచ్చుగా, పెట్టారా? మీ డిమాండ్లు సమంజసమో కాదో ఎడ్యుకేట్‌ చేశారా? మీకు రిజర్వేషన్‌ యిస్తే మా మాటేమిటి? అని అడిగే బిసిలకు, ఓసిలకు ఎలా సమాధానం చెప్పాలో తర్ఫీదు యిచ్చారా? కాపుల్లో అనేక తెగలు, ప్రాంతీయ భేదాలు. ముఖ్యంగా యీ రోజు కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రల మధ్య ప్రాంతీయభేదాలు పెరుగుతున్నాయి. వాటిని అధిగమిస్తూ కాపులను ఐక్యం చేసి ఒక శక్తిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత చేపట్టకుండా వూరికి ముందు అన్నం తిననంటూ కూర్చుంటే సరిపోతుందా? గాంధీగారు దక్షిణాఫ్రికా నుంచి వస్తూనే నిరాహారదీక్ష అంటూ కూర్చున్నారా? ఒక పిలుపు యిస్తే దేశం నలుమూలలా స్పందన రగిలి, ప్రభుత్వం వణికేటంత సేవాదళాల్ని సమకూర్చుకుని అప్పుడు దీక్షకు కూర్చునేవారు. అందుకే ప్రభుత్వం ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కునేది. తను ప్రారంభించిన దీక్ష సందర్భంగా దేశంలో ఏ మూలైనా సరే హింస చెలరేగితే గాంధీజీ వెంటనే దీక్ష మానేసేవారు. అందువలన ప్రభుత్వం ఆయనను తప్పుపట్టలేక పోయేది. 

మరి మీరు? రాష్ట్రమంతటా నెట్‌వర్క్‌ ఏర్పరచుకోలేదు, ఒకవేళ మీరు అరెస్టయితే ఉద్యమం ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో కార్యాచరణ సిద్ధం చేయలేదు, మీ ఉద్యమవారసులెవరో ప్రకటించలేదు, కాపు గర్జన అంటూ సభకు పిలిచి హఠాత్తుగా అత్యంత నాటకీయంగా రాస్తా రోకో, రైల్‌ రోకో ప్రకటించారు. అది చివరకు విషాదాంత నాటకంగా ముగిసింది. పోలీసు స్టేషన్‌ దహనాలు అవీ జరిగినప్పుడు మీరు చింతించి దీక్ష ఆపలేదు, సరే, ఉద్యమం నా చేయి దాటిపోయింది అనైనా గ్రహించాలి కదా. ఆ హింస మీ ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చిందన్న విషయం గ్రహించి కాస్త విరామం తర్వాత మొదలుపెట్టాలి కదా. ఇప్పుడు దీక్ష అంటారు, తలుపులు మూసేస్తారు, వైద్యుల్ని రానీయరు, సెటైర్లు వేస్తారు. సరే మీ వ్యక్తిగత శైలి అలాటిది, మీ యిష్టం. ఈ ధోరణి వలననే మీరు ఏకో నారాయణగా మిగిలిపోయారు. అందరూ దూరం నుంచే దణ్ణం పెట్టి వెళ్లిపోతారు. ఈ రోజు మీరు కాపుల నాయకుడిగా చూపుకుంటూ బాబుతో కయ్యం పెట్టుకుంటే నష్టం ఎవరికి? మీకు సంఘీభావం తెలిపే కాంగ్రెసు, వైకాపా ఏ ఉపకారమైనా చేయగలవా? బాబును బెల్లించి, బెదిరించి, లాలించి, అడలుగొట్టి పనులు సాధిస్తే కాపులకు మేలు చేసినవారవుతారు. 

బాబును అడగాలంటే మీకు ప్రశ్నలే లేవా? కమిషన్‌ వేయడానికి 18 నెలలెందుకు పట్టింది? కమిషన్‌కు చైర్మన్‌ వేసి నెల్లాళ్లవుతోంది, సభ్యుల్ని వేయలేదేం? పని ప్రారంభింప చేయలేదేం? శంకుస్థాపనలకు, పుష్కరాలకు నిధులు కురుస్తున్న మీరు కాపు కార్పోరేషన్‌కు ఎందుకు రాల్చరు? పోనీ రాజధాని కోసం యిటికలమ్మినట్లుగా కార్పోరేషన్‌ నిధుల కోసం యిసుకో, సున్నమో, బాండ్లో అమ్మకానికి పెడితే, కాపుల్లో ధనికులో, కాపు సంక్షేమం కోరే యితరులో అవి కొంటారు కదా? - యిలా అడగవచ్చు. ఏ పనైనా ఓర్పుతో, నేర్పుతో సాధించాలి. తెరాస వాళ్లు అంటున్నారు - మా ఉద్యమం పుష్కరకాలం సాగింది, ఏ నాడైనా రైలు తగలబెట్టామా? కాపులకు ఆ మాత్రం ఓర్పు లేదా? అని. మీ ఉద్యమధోరణి కారణంగా కాపుల యిమేజికి, వారి ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. మీ ప్రసంగాలతో రెచ్చగొట్టబడిన కాపు యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఆ మేరకు మీరు వారికి, వారి కుటుంబాలకు ద్రోహం చేసినట్లే. కాపు రిజర్వేషన్‌ జటిలమైన సమస్య. ఇప్పట్లో తేలదు. 'మా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కాపులను బిసిల్లో ఎలా చేరుస్తారో 72 గంటల్లో మాకు వివరణ యివ్వండి' అంటూ బిసిలు బాబును అడుగుతున్నారు. ఆయన దగ్గర సమాధానం ఏముంది? మరో కమిషనో, కమిటోనో వేస్తాను అని తప్ప! 'కాపులకు కూడా రిజర్వేషన్‌ యిస్తే చిరంజీవి కొడుక్కి, ఆదికేశవులు నాయుడు మనుమడికి కూడా రిజర్వేషన్‌ సౌకర్యం వస్తుంది. ఇదెక్కడి సామాజిక న్యాయం?' అని అడిగే యితర కులాల యువతకు సమాధానం చెప్పడం కష్టం. దీనికి సమాజంలో అన్ని వర్గాల వారు కూర్చుని మేధోమథనం చేసి, ఒక పరిష్కారం కనిపెట్టాలి. రమణగారి భాషలో 'యిదంతా అర్రీబుర్రీగా తేలే యవ్వారం కాదు' అని మీరే కాపు యువతకు చెప్పి సంయమనంతో వుండమని చెప్పాలి. దానికి ముందు మీరు సంయమనంతో వుండి ముఖ్యమంత్రిని రెచ్చగొట్టి వ్యవహారం చెడగొట్టవద్దు. మీకు వచ్చే నష్టాన్ని మీరు భరించగలరు కానీ మీ తప్పుడు స్ట్రాటజీల కారణంగా తమ ప్రయోజనాలకు కలిగే నష్టాన్ని యితర కాపులు భరించలేరు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?