Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: నేపాలి ప్రధాని మార్పులో భారత్‌ హస్తం?

ఎమ్బీయస్‌: నేపాలి ప్రధాని మార్పులో భారత్‌ హస్తం?

ఆగస్టు మొదటివారంలో నేపాల్‌కి కొత్త ప్రధానిగా ప్రచండ మళ్లీ వచ్చారు. గద్దె దిగుతూ మాజీ ప్రధాని కెపి ఓలి తన పదవీభ్రష్టత్వంలో భారత్‌ హస్తం వుందని ఆరోపించాడు. పొరుగు దేశాల వ్యవహారాలలో కలగచేసుకుంటోందన్న ఆరోపణ రావడం ఏ దేశానికీ మంచిది కాదు. కానీ 338 పార్లమెంటు సభ్యుల అంటే 57% మంది సమర్థనతో 2015 అక్టోబరులో ఎన్నికైన ఓలి, తొమ్మిది నెలల్లోనే దిగిపోవడం, అతను పదవిలో వున్నంతకాలం భారత్‌ ఘర్షణ వైఖరి అవలంబించడం, భారత్‌కు పాఠం చెప్పడానికి అతను చైనాకు మరింత సన్నిహితం కావడం - యివన్నీ చూస్తే అతని ఆరోపణలో వాస్తవం వుందేమోనన్న సందేహం కలుగుతుంది. 

64 ఏళ్ల ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌) పార్టీ నాయకుడు. ఇటీవలి ఎన్నికలలో అతని పార్టీకి 175 సీట్లు వచ్చాయి. ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు-సెంటర్‌)కు 80 వచ్చాయి. నేపాలీ కాంగ్రెసుకు 196 సీట్లు వచ్చాయి.  దాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఓలి, ప్రచండ చేతులు కలిపారు. వాళ్లకు నేపాల్‌ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (24), మాధేశీ  రైట్స్‌ ఫోరమ్‌-డెమోక్రాటిక్‌ (14) లతో పాటు మరో 13 చిన్న పార్టీలు కూడా - సమర్థించాయి. 9 నెలల తర్వాత 2016 జులైలో ప్రచండ పార్టీ తన మద్దతు ఉపసంహరించడంతో ఓలి సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. భారత్‌ ఉద్బోధకు లొంగే ప్రచండ యిలా వ్యవహరించాడని ఓలి అంటున్నాడు. నిజానికి విదేశీ వ్యవహారాల మంత్రిగా వున్నపుడు ఓలిని నేపాల్‌లో ''ఇండియా పక్షపాతి''గా చూసేవారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం వచ్చాక 26 ఏళ్లల్లో 23 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత తొమ్మిదేళ్లలో ఎనిమిది ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఈ అస్థిరతకు ఇండియా, చైనాల జోక్యం కూడా కారణమని నేపాల్‌ ప్రజల నమ్మకం. 2001లో రాజవంశీకుల మూకుమ్మడి హత్య తర్వాత అధికారంలోకి వచ్చిన రాజు గ్యానేంద్ర షా రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టిస్తూన్నపుడు అతను చైనాతో చేతులు కలుపుతున్నాడని, నేపాల్‌  సైన్యానికి చైనా ఆయుధాలు సమకూరుస్తున్నాడని ఇండియా ఆరోపించి, అతనికి వ్యతిరేకంగా ఏడు ప్రజాస్వామ్య పార్టీలకు, మావోయిస్టులకు మధ్య 2015 నవంబరులో రాజీ కుదిర్చింది. అటు చైనా కూడా నేపాల్‌లో వున్న 20 వేల మంది టిబెట్‌ శరణార్థులపైనే కా నేపాల్‌ రాజకీయాలపై కూడా కన్నేసి వుంచింది. తమకు అనుకూలంగా వుండేవారు అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తూ వచ్చింది. 

2008లో ప్రచండ నెగ్గి ప్రధాని అయినప్పుడు ఓలి సహించలేకపోయాడు. 1996 నుండి పదేళ్లపాటు మావోయిస్టులు ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేసిన రోజుల్లో ఆర్మీ చీఫ్‌గా వున్న రుక్మాంగద కట్వాల్‌ 17 వేల మంది దాకా మావోయిస్టులు మరణించారు. గత్యంతరం లేక ప్రచండ శాంతి ఒప్పందం చేసుకుని ఎన్నికలలో పాల్గొన్నాడు. తను ప్రధాని కాగానే పాత పగను గుర్తు పెట్టుకుని రుక్మాంగదను పదవిలోంచి తొలగించాడు. అదే అదనని ఓలి ప్రతిపక్షాలన్నిటినీ కూడగట్టి ప్రచండ 2009 మేలో గద్దె దిగేట్లా చేశాడు. దానికి ఇండియా సాయపడిందంటారు. చైనా మావోయిస్టు పార్టీ భావాలతో ఎదిగిన ప్రచండ ఇండియాకు వ్యతిరేకి. అతను ప్రధాని కావడంతో ఇండియా అతన్ని మచ్చిక చేసుకోవాలని చూసింది. అయినా అతను కరగకపోవడంతో ఓలిని దువ్వి ప్రచండ స్థానంలో మాధవ కుమార్‌ నేపాల్‌ తెచ్చి వుండవచ్చు. 

పదవి పోయిన తర్వాత ప్రచండ పరపతి తగ్గి, 2015 అక్టోబరు వచ్చేసరికి అతని పార్టీకి మూడో స్థానమే దక్కింది. ఓలి పార్టీతో పోలిస్తే సగం కంటె తక్కువ సీట్లు వచ్చాయి. ఓలికి మద్దతు యిస్తే అంతర్యుద్ధ సమయంలో తనపై మోపిన కేసులు ఎత్తివేస్తాడని, తను రాజకీయంగా బలపడవచ్చనే ఊహతో అతను ప్రధాని అయ్యేందుకు సహకరించాడు. ఈసారి యిద్దరూ కలిసి ఇండియాపై ధ్వజమెత్తారు. ఎందుకంటే నేపాల్‌ కొత్త రాజ్యాంగం తమకు అనువుగా లేదనే వాదనతో భారత్‌ మూలాలున్న మాధేశీ గ్రూపులు రహదారుల బంద్‌ నిర్వహించాయి. వారికి భారతదేశం మద్దతు యిస్తోందన్నది బహిరంగ రహస్యం. ఈ ఆందోళన కారణంగా నాలుగు నెలల పాటు నేపాల్‌కు చమురు, యితర ముఖ్యమైన సరుకులు రవాణా కావడం మానేశాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో నేపాల్‌లో భూకంపం వచ్చి సర్వనాశనమైంది. పునరావాస కార్యక్రమాలు యీ నిరసనల కారణంగా దెబ్బ తిన్నాయి. భూకంప సమయంలో భూరిసహాయం చేసినా, 2015 సెప్టెంబరులో ప్రకటించిన నేపాల్‌ రాజ్యాంగాన్ని ఆహ్వానించకపోవడం, మాధేశీలకు పౌరహక్కులు యివ్వాలని వాదించడం యివన్నీ ఇండియాపై అపనమ్మకాన్ని పెంచాయి. తమ మాట విననందుకు మాధేశీల ద్వారా తమ నడుం విరుస్తోందని నేపాలీయులు విశ్వసించసాగారు. ఓలి, ప్రచండ వాళ్లను మరింత రెచ్చగొట్టారు. ఇదే అదనని చైనా రంగంలోకి దిగి నేపాల్‌కు అనేక విధాలుగా సాయపడింది. ఓలిని మరింత ఇండియా వ్యతిరేకిగా మార్చింది. 2016 మార్చిలో నేపాల్‌లోని పొఖారాలో అంతర్జాతీయ విమానాశ్రయం, రెండు హైడెల్‌ ప్రాజెక్టులు నిర్మించేందుకు చైనాతో ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాదు, చైనాతో ట్రేడ్‌ అండ్‌ ట్రాన్సిట్‌ ఒప్పందం కూడా చేసుకున్నాడు.

చైనా సాయంతో ఓలి తన పదవిలో బలపడిపోతున్నాడని అనుకున్న ప్రచండ వ్యూహరచన చేశాడు. ఇండియా సాయం కోరి వుంటాడని, ఓలికి బుద్ధి చెప్పడానికి ఇండియా అతనికి హామీ యిచ్చి వుంటుందని అంచనా. 2016 మేలో ప్రచండ, ఓలికి తన మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ చైనా రంగంలోకి దిగి ప్రచండను వారించింది. ఒకప్పుడు తనను ఆదుకున్న చైనా మాట కొట్టివేయలేక ప్రచండ 24 గంటల్లోపుగా తన స్టేటుమెంటు వెనక్కి తీసుకున్నాడు. ప్రచండ, అతని సహచరులపై కేసులు ఎత్తివేస్తానని ఓలి, ప్రచండతో సయోధ్య కుదుర్చుకున్నాడు. కానీ రెండు నెలల్లోనే ఆ హామీలు అమలు చేయలేదంటూ ప్రచండ తిరగబడ్డాడు. ఈ సారి 196 సీట్లున్న నేపాలీ కాంగ్రెసుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి మద్దతుతో రాజకీయ సంక్షోభం సృష్టించాడు. బలం కోల్పోయిన ఓలి రాజీనామా చేయవలసి వచ్చింది. దిగిపోయే ముందూ, తర్వాత ప్రచండ ఇండియా చేతిలో కీలుబొమ్మ అని, తనపై పగ బట్టిన ఇండియా ప్రచండను తనకు వ్యతిరేకంగా ఎగదోసిందని ఆరోపించాడు. ప్రచండకు నేపాలీ కాంగ్రెసుతో బాటు 42 మంది సభ్యులున్న 28 పార్టీల కూటమి కూడా మద్దతిస్తోంది. వారిలో మాధేశీలు కూడా వున్నారు. మాధేశీ సమస్య తీర్చడానికి త్రిసభ్య కమిటీ ఒకటి వేశాడు ప్రచండ. ఏం చేసినా ప్రచండ చైనాకు పూర్తిగా వ్యతిరేకమై, ఇండియా చెప్పినట్లు ఆడతాడని భావించలేం. చైనా యిప్పటికే నేపాల్‌లో చాలా పెట్టుబడులు పెట్టింది. పైగా ప్రచండ మావోయిస్టు కూడా. చైనా సహాయసంపదలతోనే నేపాల్‌పై దశాబ్దాల తరబడి యుద్ధం సలిపాడు. అతను ప్రధాని కాగానే చైనా రాయబారి అతన్ని కలిసి పాత ఒప్పందాలన్నీ గౌరవిస్తాననే హామీ ప్రచండ నుంచి తీసుకున్నాడు. చివరకు ప్రచండ ఎలా తేలతాడో కొన్నాళ్లకు గాని తెలియదు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?