Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఇరికించడంలో ఘనులు

నెలాఖరులో ట్రాఫిక్‌ పోలీసులు అన్యాయంగా కేసులు బుక్‌ చేయడం చూస్తూనే వుంటాం. మావోయిస్టు ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు అమాయకులపై కూడా మావోయిస్టు ముద్ర కొట్టడమూ చూశాం. పొరపాటున మామూలు పౌరుడిపై ఉగ్రవాది ముద్ర కొట్టి వేధించిన సంఘటనలు ''మనోహరం'' వంటి సినిమాలుగా కూడా వచ్చాయి. గత నెలలో బయటకు వచ్చిన లియాఖత్‌ షా కథా అలాటిదే అంటోంది నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఏ)! కశ్మీరు యువకులు చాలామంది చాలాకాలంగా ఆక్రమిత కశ్మీరులోకి పారిపోయి పాకిస్తాన్‌ చేత తర్ఫీదు పొంది తీవ్రవాదులుగా మారుతున్నారు. కొన్నాళ్లకు ఆ జీవితంతో విసుగుచెంది జనజీవితంలోకి తిరిగివద్దామని చూస్తున్నారు. మావోయిజం వదిలి వచ్చి లొంగిపోయినవారికి మన దగ్గర పునరావాసం కల్పిస్తున్నట్లే వీరికీ కల్పించాలని జమ్మూ, కశ్మీరు ప్రభుత్వం సంకల్పించింది. 1989-2009 మధ్య ఆక్రమిత కశ్మీర్‌లోకి పారిపోయి తిరిగి వద్దామనుకుంటున్న భారతీయ కశ్మీర్‌ పౌరులు వెనక్కి రావాలనుకుంటే వారి బంధువులు జిల్లా సూపరింటెండెంట్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చు. వాళ్లు విచారణ జరిపి తమ సిఫార్సుతో సిఐడి (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌)కి పంపిస్తారు. వాళ్లు సదరు వ్యక్తి కార్యకలాపాల గురించి డొసైర్‌ తయారుచేసి రాష్ట్రం హోం శాఖకు పంపిస్తారు. అతడు క్షమాపణకు తగిన వ్యక్తి అవునా కాదా అని వారు నిర్ణయం తీసుకుని తెలియపరుస్తారు. అనుమతి యిచ్చినవారు వాఘా సరిహద్దు ద్వారా కానీ, ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుద్వారా కానీ దేశంలో ప్రవేశించవచ్చు అని ప్రభుత్వం చెపుతుంది. కానీ ఒకసారి ఉగ్రవాద సంస్థల్లో పనిచేసిన తర్వాత పారిపోవడం రావడం కూడా కష్టమే. అందుచేత వారి కన్నుగప్పడానికి యిలా తిరిగి వచ్చే మాజీ తీవ్రవాదులు నేపాల్‌ ద్వారా భారత్‌లోకి వస్తున్నారు.

సయ్యద్‌ లియాఖత్‌ షా అనే వ్యక్తి అలా తిరిగి వద్దామనుకున్నాడు. అతను కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నివాసి. భార్య పిల్లలు వున్నారు. 1995 ప్రాంతంలో అతను ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిపోయి అల్‌-బరాక్‌ అనే సంస్థలో చేరాడు. పాకిస్తాన్‌లో నసీం బీబీ అనే మహిళను మళ్లీ పెళ్లి చేసుకుని ఆమె ద్వారా ఒక బిడ్డను కన్నాడు. ఆ తర్వాత అఖ్తర్‌ నిసా అనే ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా కూతుర్ని కన్నాడు. కశ్మీర్‌ ప్రభుత్వం యీ పునరావాస పథకం ప్రకటించాక అతని మొదటి భార్య అమీనా బేగం లొంగిపోమని అతనిపై ఒత్తిడి చేసింది. అతను సరేనన్నాడు. అతని తరఫున ఆమె 2011 ఫిబ్రవరిలో అప్లికేషన్‌ పెట్టుకుంది. కశ్మీర్‌ ప్రభుత్వం ఎప్పుడు అనుమతి యిచ్చిందో ఆ వివరాలు పేపర్లో రాలేదు కానీ లియాఖత్‌ నేపాల్‌ ద్వారా ఇండియాకు వచ్చేద్దామని 2013లో నిశ్చయించుకున్నాడు. అతని రెండో భార్య నాకు అనారోగ్యం రానంది, మూడో భార్య, కూతురు వెంటరాగా తనలాగే లొంగిపోతున్న మంజూర్‌ అనే అతనితో కలిపి మొత్తం 12 మంది 2013 మార్చిలో నేపాల్‌ చేరి ఖట్మండూలో రెండు రోజులు హోటల్లో వున్నారు. మార్చి 20న నేపాల్‌-భారత్‌ సరిహద్దు దాటుతూండగా వారిని సహస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బి) అధికారులు ఆపారు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ (డిపిఎస్‌సి) తాలూకు ధర్మేంద్ర కుమార్‌ అనే యిన్‌స్పెక్టర్‌ అక్కడే వున్నాడు. వారిని మాకు అప్పగించండి అన్నాడు. గోరఖ్‌పూర్‌ నుండి సనౌలీకి వస్తూండగా తక్కినవారిని వదిలేసి లియాఖత్‌ను ఢిల్లీకి తీసుకుని వచ్చాడు. 

అతను సభ్యుడుగా వున్న అల్‌-బరాక్‌ నిషిద్ధ సంస్థ కాదు. పాకిస్తాన్‌లో కాని, ఇండియాలో కానీ అతను పాల్గొన్న తీవ్రవాద కార్యకలాపం ఏమీ లేదు. అతనిపై కేసు పెట్టాలంటే కష్టం. అందుకని మనమే కష్టపడి ఓ కథ రాసి పెట్టి సాక్ష్యాన్ని తయారుచేయాలి అనుకుంది స్పెషల్‌ సెల్‌. అది దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం - 'నిషిద్ధ టెర్రరిస్టు సంస్థ హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, కొంతమంది పాకిస్తాన్‌ జాతీయులతో కలిసి ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలపై దాడులు చేయాలని విస్తృతంగా ప్రణాళికలు రచించారని మాకు ఒక 'ఇన్‌ఫార్మర్‌' చెప్పాడు. (అతనెవరో మేం చెప్పలేము). మాకందిన సమాచారం ప్రకారం యిద్దరు, ముగ్గురు ముజాహిదీన్‌ సభ్యులు జమ్మూ కశ్మీర్‌ నుండి ఢిల్లీ వచ్చి జామా మసీదు ప్రాంతంలో ఒక హోటల్లో వున్నారు. మరి కొందరు నేపాల్‌ సరిహద్దుల ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కి కానీ, ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్‌కి కానీ వచ్చి అక్కణ్నుంచి ఢిల్లీ చేరి వీళ్లను కలవాలి. వారిలో ఒకడైన లియాఖత్‌ను ధర్మేంద్ర కుమార్‌ గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నాడు. అరెస్టు చేసిన 24 గంటల్లో న్యూఢిల్లీలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరిచి, 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకున్నాం. అతన్ని విచారించగా అతను ఢిల్లీకి రాగానే ఒక నెంబరుకు ఫోన్‌ చేయాలన్న ఆదేశాలున్నాయని ఒప్పుకున్నాడు. అప్పుడు జామా మసీదు ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ దత్‌ మొబైల్‌ ద్వారా ఆ పాకిస్తానీకి ఫోన్‌ చేయించాం. దానికి సాక్షి కూడా వున్నాడు. అప్పుడు  ఆ పాకిస్తాన్‌ వ్యక్తి జామా మసీదు ప్రాంతంలోని హాజీ ఆరాఫత్‌ గెస్ట్‌ హౌస్‌లో 304 నెంబరు రూముకి వెళ్లి అక్కడున్న అన్వర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నుండి ఆదేశాలు తీసుకోవాలని చెప్పాడు. మేము లియాఖత్‌ను పోలీసు స్టేషన్‌కు పంపేసి, ఆ రూముపై మార్చి 21 అర్ధరాత్రి దాడి చేశాం. అక్కడ ఎకె 56, 60 రౌండ్ల మ్యాగజైన్లు, మూడు హేండ్‌గ్రెనేడ్లు, మారణ సామగ్రి, మ్యాప్‌లు దొరికాయి. అందుచేత కేసు పెట్టాం.' 

 ఇంటికి రావలసిన లియాఖత్‌ యిలా పోలీసుల చేతిలో పడి కేసులో యిరుక్కోవడంతో కంగారు పడిన అతని భార్య జమ్మూ, కశ్మీర్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. లొంగిపోదామనుకునేవాడు యిలా ఎందుకు చేస్తాడు అని ఆలోచనలో పడిన కేంద్ర హోం శాఖ మార్చి 28 న యీ కేసును ఎన్‌ఐఏకు అప్పగించి, స్పెషల్‌ సెల్‌ ఆరోపణలు నిజమో కాదో పరిశీలించమంది. ఎన్‌ఐఏ లియాఖత్‌తో బాటు తిరిగి వచ్చిన మంజూర్‌ నుండి వివరాలు సేకరించి జరిగినదేమిటో తెలుసుకుంది. ధర్మేంద్ర కుమార్‌ లియాఖత్‌ను గోరఖ్‌పూర్‌ స్టేషన్‌లో అరెస్టు చేయలేదని, ఎస్‌ఎస్‌బి నుంచి నేపాల్‌ సరిహద్దుల్లోనే స్వాధీన పరుచుకున్నాడని తెలుసుకుంది. అది కూడా ముందే వేసుకున్న పథకమని అర్థమైంది. స్పెషల్‌ సెల్‌లో డిసిపిగా పనిచేసే యాదవ్‌ అనే అతను మహమ్మద్‌ అస్లాం హక్లా అనే కశ్మీరు నివాసితో ఎప్పణ్నుంచో టచ్‌లో వున్నాడు. అతనికి నాలుగు సెల్‌ఫోన్లు యిచ్చాడు. లియాఖత్‌ను రిసీవ్‌ చేసుకోవడానికి కశ్మీర్‌ నుంచి మార్చి 15 న బయలుదేరే ముందు హక్లా యాదవ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత నేపాల్‌ వెళ్లి వాళ్లందరినీ తీసుకుని భారత్‌లోకి అడుగుపెట్టగానే వాళ్లను పట్టించాడు. ఇవన్నీ ఎన్‌ఐఏ కనుగొంది. 

ఆ హోటల్‌ రూములో ఆయుధాలు దొరికాయి బాగానే వుంది కానీ అక్కడ రెండు రోజులు బస చేసిన అన్వర్‌ అహ్మద్‌ ఎందుకు దొరకలేదు, స్పెషల్‌ సెల్‌ అతని గురించి ఎందుకు గట్టిగా ప్రయత్నించలేదు అనే విషయంపై దృష్టి సారించింది. హోటల్‌ రిసెప్షన్‌లో అన్వర్‌ అహ్మద్‌ పేరుతో యిచ్చిన మొబైల్‌ నెంబరు, డ్రైవింగ్‌ లైసెన్సు కాపీ రెండూ బోగస్‌వే అని తేలింది. అతని పోలికలు చూద్దామని సిసిటివి డిస్కులు పరిశీలించబోయారు. అవి డామేజి అయిపోయాయని స్పెషల్‌ సెల్‌ చెప్పింది. అప్పుడు ఎన్‌ఐఏ కెమెరాలు సప్లయి చేసిన ఇసిఐఎల్‌కు పంపి ఫుటేజ్‌ రిట్రీవ్‌ చేసి (పునరుద్ధరించి) యిమ్మన్నారు. 'దానికి ఓ టెక్నిక్‌ వుంది, స్పెషల్‌ సెల్‌ వాళ్లకు చెప్తే గతంలో రెండు కేసుల్లో అలా చేశారు కూడా' అంది ఇసిఐఎల్‌. మరి ఆ పద్ధతి యీ కేసులో ఎందుకు అవలంబించలేదు అని అడిగితే స్పెషల్‌ సెల్‌ 'మేం పద్ధతుల ప్రకారం వెళ్లాం' అంటూ సమాధానం దాటవేసింది. అంటే ఆ ఫుటేజి బయటకు రావడం స్పెషల్‌ సెల్‌కు యిష్టం లేదన్నమాట అని ఎన్‌ఐఏ అనుమానించి, హోటల్‌ స్టాఫ్‌ సహాయంతో ఆ రూములో వున్నతని చిత్రాలు గీయించారు.

లోతుగా విచారించగా తేలిందేమిటంటే అతను సబీర్‌ ఖాన్‌ పఠాన్‌ అనే లోఢీ కాలనీ నివాసి. స్పెషల్‌ సెల్‌లోని సంజయ్‌ దత్‌ టీములో పని చేసే పోలీసు యిన్‌ఫార్మర్‌. రెండేళ్లగా మిస్సింగ్‌. హోటల్‌ రూము నుండి సేకరించిన దుస్తులపై వున్న డిఎన్‌ఏను అతని తండ్రి డిఎన్‌ఏతో పోల్చి చూడగా సరిపోయింది కూడా. అతని సెల్‌ నెంబరు నుంచి మార్చి 21 రాత్రి దాడికి ముందూ, వెనుకా టీములో వున్నవారితో అనేక సంభాషణలు జరిగినట్లు కాల్‌ రికార్డు బయటపెట్టింది. పోలీసుల ఆదేశాలపై అతనే ఆయుధాలు కొన్ని ఆ గదిలో పెట్టాడని తేలిపోయింది. ఇప్పుడు ఎన్‌ఐఏ స్పెషల్‌ సెల్‌లోని సంజయ్‌ దత్‌, రాహుల్‌ కుమార్‌ అనే యిన్‌స్పెక్టర్ల మీద, మొహమ్మద్‌ ఇక్బాల్‌ దర్‌, మనీష్‌ అనే హెడ్‌ కానిస్టేబుళ్లపైన, కృష్ణకుమార్‌, గుల్వీర్‌ సింగ్‌ అనే కానిస్టేబుళ్ల పైన కేసు పెట్టింది. లియాఖత్‌ను బెయిల్‌పై విడిచి పెట్టమని కోరింది. ఈ లియాఖత్‌ను పట్టుకుని దేశంలో పెద్ద టెర్రరిస్టు కుట్రను భగ్నం చేసినట్లు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ 2013లో గొప్పగా చెప్పుకుంది. అదంతా బోగస్‌ అనీ, ఇలా అన్యాయంగా అమాయకులను యిరికించేస్తున్నారని తెలిస్తే పోలీసుల పరువు పోతుందని భయపడ్డారో ఏమో, కేసు విచారిస్తున్న జిల్లా జడ్జి 2015 జనవరి 31 న ఎన్‌ఐఏతో ''మీ వెబ్‌సైట్‌ నుండి యీ చార్జిషీటు వివరాలు తొలగించేయండి. లేకపోతే దేశభద్రతకు ముప్పు.'' అన్నారు.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?