Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు - 23

గుమ్మడి పని పట్టాక పద్మనాభం గదికి వెళ్లి అతన్ని హడలు కొట్టాడు.చివరగా మహారాజు మందిరంలోకి వెళ్లాడు. బయట అందరూ గుమిగూడారు. గదిలో రెండు గొంతుకలతోటీ హీరో నాటకమాడాడు. నల్లత్రాచు మహారాజుని హింసిస్తున్నట్లు, చివరకు మాయమై పోయినట్టు. తలుపులు నెట్టుకుని లోపలికి వచ్చి చూస్తే కిటికీయైనా లేదు. ఎలా మాయమయ్యాడు? అంటే ఆ ఆచార్యులవారు, అంటే వంగర, నల్లత్రాచు హఠయోగి ఏదైనా చేయగలడు అని తను అనుకుని అందరికీ అదే చెప్పాడు. నల్లత్రాచురూపంలో పరదేశి చేసిన సహాయానికి విప్లవసంఘంలో అతని పరపతి పెరిగిపోయింది. సన్మానం చేశారు. నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పటివరకు నాయకుడిగా వ్యవహరించిన రాజనాల యితనికి సహాయకుడిగా వుంటానన్నాడు. అంతవరకూ బాగానే వుంది కానీ రాజసులోచన ఈ పరదేశితో తలమునకలా ప్రేమలో పడింది. 'ఊరేది, పేరేది ఓ చందమామ?' అని అడుగుతూనే ఊరూ, పేరూ తెలుసుకోకుండా అతన్ని వలచింది. అది చూసి రాజనాల అసూయతో భగ్గుమన్నాడు. అతను రాజసులోచనను అంతకుముందునుండీ ప్రేమిస్తున్నాడు. తనని కాదని కొత్తగా వచ్చిన యితనితో ప్రేమలో పడడం అతనికి రుచించలేదు. పళ్లు నూరుకున్నాడు.

విప్లవసంఘం కొండల మధ్య అర్ధరాత్రి సమావేశమైంది. మహారాజును మట్టుపెట్టాలి అని రాజనాల ప్రతిపాదన. హీరో అడ్డు చెప్పాడు. ఈ మహారాజు పోతే మరొకడు వస్తాడు, ప్రజాబలం కూడగట్టుకున్నాకనే మనం తిరుగుబాటు చేయాలి తప్ప వ్యక్తిగత హత్యల వల్ల ప్రయోజనం లేదని అతని వాదన. రాజసులోచన విషయంలో అతని మీద గుర్రుగా వున్న రాజనాల అతనితో అడ్డంగా వాదించాడు. అది తక్కినవాళ్లు కూడా గమనించారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడకు శూరసేనా! అని హెచ్చరించారు. ఇంతలో గుమ్మడికి ఈ సమావేశం గురించి ఉప్పందింది. అతను సైన్యంతో చుట్టుముట్టాడు. వీళ్ల బలం తక్కువ కాబట్టి హీరో ఉపాయంతో సైన్యాన్ని తరిమికొట్టాలనుకున్నాడు. నల్లత్రాచు వేషంలో కొండ చరియమీద కనబడి సైన్యాన్ని డైవర్ట్‌ చేశాడు. తర్వాత సంకుల సమరం జరిగింది. గుమ్మడిని రాజసులోచనను ఎత్తుకుపోతూవుంటే హీరో ప్రాణాలకు తెగించి పోట్లాడాడు. చివరికి గుమ్మడిని కట్టిపడేసి ఆమెను రక్షించాడు. ఆమె హీరోని తన యింటికి తీసుకెళ్లి గాయాలకు మందు రాసి, అతి మనోహరమైన పాట పాడింది - 'సడి సేయకో గాలి' అని. ఖర్మకాలి యిది రాజనాల కంట పడింది. ఇంకా భగ్గుమన్నాడు.

విప్లవకారులతో ఓటమితో గుమ్మడికి ఓ విషయం బోధపడింది. నల్లత్రాచుకు ప్రజల అండ వుంది. ప్రజలను హింసిస్తే నల్లత్రాచే బయటపడతాడు అని. ఆ ఆదేశాని కనుసారంగా ప్రజలను సైన్యం పీడించసాగింది. ప్రజలు హాహాకారాలు చేయడంతో హీరో మనసు కరిగిపోయింది. తను వేస్తున్నది పిరికినాటకమని తోచిందతనికి. ఈ నాటకానికి తెర దింపుదామని నిశ్చయించుకుని రాజు దుస్తులు ధరించి, ప్రజలపై హింస ఆపేయాలని రాజాజ్ఞగా ఆదేశం రాసి, గంట మోగించి 'సేనాధిపతిని రమ్మనమను' అని ఆజ్ఞాపించాడు. పిచ్చివాడనుకున్న మహారాజు సడన్‌గా యింత స్పృహతో మాట్లాడడంతో వాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్లాడు. ఇతని హంగామా చూసి రాజమాత యిష్టసఖి బిరాన పోయి రాజమాతకు చెప్పింది. కన్నాంబ వచ్చి డైలాగులు చెప్తుంది - బాప్‌రే, అవి డైలాగులా? మాటల తూటాలు. 'ఇన్నాళ్లూ పిచ్చి పట్టినట్టు నటిస్తున్నావనుకున్నాను. కానీ నిజంగానే పిచ్చిపట్టింది. పరిస్థితి ఏమంత కుదుటపడిందని నువ్వు బయటపడుతున్నావ్‌?' అని అడుగుతుంది. 'నేటితో పిరికినాటకానికి భరతవాక్యం' అంటాడు రామారావు. ఇక భరతవాక్యం అన్న థీమ్‌ మీద కన్నాంబ డైలాగులు కురిపిస్తుంది. 'పగసాధిస్తావని కన్నతల్లి పెట్టుకున్న ఆశకు భరతవాక్యం, ప్రజల ఆశయాలకు భరతవాక్యం..,' యిలా కన్నాంబ వాయిస్‌లో చెప్తూంటే అద్దిరిపోతుంది.

హీరో 'ఆ సేనాపతికి బుద్ధి చెపుతాను' అని గర్జిస్తూండగా అది అక్కడకు వస్తున్న గుమ్మడి చెవిన పడింది. అతని అనుచరులు అప్పుడే కత్తుల మీద చేతులు వేసి రెడీగా వున్నారు. ఇతను ఊ అనడమే తరువాయి. గుమ్మడి వస్తూనే వినయం నటిస్తూ 'మహారాజా, రమ్మన్నారట' అన్నాడు. అప్పుడు కన్నాంబ 'నేనే రమ్మన్నాను నాయనా, పిచ్చిముదిరింది. ఏదేదో మాట్లాడుతున్నాడు' అంటూ దుఃఖం నటించింది. హీరో కత్తి చర్రున తీశాడు. గుమ్మడి భటులు అలర్ట్‌ అయిపోయి మీదకు ఉరకడానికి సిద్ధంగా వున్నారు. హీరో వెంటనే గ్రహించాడు తను వంటింటి కుందేలునని. తక్షణం ప్లేటు ఫిరాయించాడు - పిచ్చివాడిలా నటిస్తూ పాటలు పాడాడు - 'సేనాధిపతి వాని తలదరగ, సేనాధిపతి వాని..' అంటూ. గుమ్మడి రిలాక్సయ్యాడు. అప్పటికప్పుడు రాజును నరికేస్తే అతను ప్రజలకు సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. ఇదంతా పిచ్చిలో భాగమేనన్నమాట అనుకుని ఊరడిల్లాడు. ఆగ్రహం తమాయించుకుని వెనక్కి మళ్లాడు.ఇది చాలా గొప్ప ఘట్టం. ప్రజల కష్టాలకు హీరో ఎలా స్పందించాడో, ఆవేశంలో ఎలా విచక్షణ మర్చిపోయాడు, కానీ రాజమాత ఎంత తెలివిగా వ్యవహరించి పరిస్థితిని కాపాడింది అన్న విషయాలు చక్కగా చిత్రీకరించబడ్డాయి. 

ఇక్కడ విప్లవసంఘంలో లవ్‌ట్రయాంగిల్‌ వల్ల విషయాలు కాంప్లికేట్‌ అయ్యాయి. రామారావుమీద అసూయతో, వ్యక్తిగతద్వేషంతో రాజనాల ప్రజలను రెచ్చగొట్టాడు - ఇదిగో మీ కష్టాలన్నిటికీ కారణం వీడే, ఈ నల్లత్రాచే నంటూ వాళ్లని రామారావు వద్దకు తీసుకుని వచ్చాడు. తక్కిన విప్లవకారులు రాజనాలను తిట్టారు - నువ్వు యిలా ఎందుకు చేస్తున్నావో మాకు తెలుసులే అని. అతను ఎదురు తిరిగి 'మహారాజుని చంపాలంటే నల్లత్రాచు ఎందుకు ఒప్పుకోవటం లేదు?' అని మడతపేచీ వేశాడు. తన నిబద్ధత చూపుకోవాలంటే పదిరోజుల్లో మహారాజుని చంపాలి అని షరతు పెట్టాడు. పరిస్థితి ముంచుకు వస్తోందని గ్రహించిన రామారావు సరేనన్నాడు. పదిరోజులు గడువు పూర్తి కావస్తున్న తరుణంలో ఆ రాత్రి రామారావు నల్లత్రాచు వేషం ధరించి గుమ్మడిని ఎటాక్‌ చేశాడు, 'మహారాజుని కాళికాదేవికి బలియిస్తాను' అని చెప్పాడు, 'సింహాసనం ఎక్కావో నీకూ అదే గతి' అని పద్మనాభాన్ని బెదిరించాడు. తర్వాత రామారావు గదిలో ప్రవేశించి గడియ వేసేశాడు. బయట కన్నాంబ హడావుడి - నా కొడుకు ఏమయిపోయాడో ఏమో అంటూ. లోపల రామారావు రెండు గొంతుకలతో మాట్లాడి గందరగోళం సృష్టించి తన సొరంగమార్గం ద్వారా ఊరి బయటకు వెళ్లిపోయాడు. తలుపు తెరిచి చూసిన భటులకు రాజూ కనబడలేదు, నల్లత్రాచూ కనబడలేదు. ఎలా మాయమయ్యారు అనుకున్నాడు గుమ్మడి. 'చెప్పానుగా, నల్లత్రాచు కాళీభక్తుడు, హఠయోగి, ఇట్టే మాయమవ్వగలడు' అన్నాడు వంగర. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?